
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏడున్నర సంవత్సరాలుగా ధాన్యం కొనుగోలు చేస్తున్నది కేంద్ర ప్రభుత్వమేనని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ధాన్యం విషయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేసిన హడావుడి వల్ల ఈ సంగతి రైతాంగానికి తెలియడం శుభపరిణామమని ఆయన వాఖ్యానించారు. ఇన్నాళ్లుగా సీఎం కేసీఆర్ తానే ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారని, తాజా పరిణామాలతో ధాన్యం కొనుగోలుపై రైతాంగానికి స్పష్టత వచ్చిందన్నారు.
వానాకాలం దిగుబడులతో పాటు యాసంగి సీజన్‌లో కూడా ధాన్యం కొనుగోలు చేస్తామని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘వానాకాలం దిగుబడుల కొనుగోలు గడువు డిసెంబర్ 31వరకు ఉంది. ఈ సీజన్‌కు సంబంధించి 44.75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం.
కానీ ఇప్పటివరకు రాష్ట్రంలోని ఏజెన్సీలు కేవలం 30.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే ఎఫ్‌సీఐకి అందించాయి. మరో 14.25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అందించా ల్సి ఉంది. గడువులోగా లక్ష్యాన్ని చేరుకోకుంటే మరికొంత సమయం ఇచ్చేందుకు ప్రయత్నిస్తాం. ఇక జనవరి రెండో వారం తర్వాత రబీ దిగుబడుల కొనుగోలు మొదలై జూ లై 31వరకు కొనసాగుతుంది’అని తెలిపారు.
రాష్ట్రం కూడా కొనవచ్చు..
ధాన్యం కొనుగోలుపై సీఎం కేసీఆర్ అసత్య ప్రచారం చేస్తున్నారని, అటు రైతాంగాన్ని మోసం చేస్తూ.. ఇటు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని, హుజూరాబాద్ ఫలితం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కేసీఆర్ శతవిధాలా ప్రయత్నిస్తున్నప్పటికీ చారిత్రక తీర్పును అంత త్వరగా మర్చిపోరని, అందుకే ధాన్యం కొనుగోలు డ్రామాను తెరపైకి తెచ్చారని కిషన్‌రెడ్డి అన్నారు. ‘నిజంగా రైతులపై ప్రేమ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ధాన్యం కొనుగోలు చేసుకోవచ్చు, దానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరం చెప్పదు’అని స్పష్టంచేశారు.
కేసీఆర్ మాటలు సబబుకాదు..
‘హుజూరాబాద్‌లో బీజేపీ గెలుపు తర్వాత మా పార్టీపై కేసీఆర్ మరింత అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇలా సభ్యత లేకుండా మాట్లాడడం సమంజసం కాదు. సాధారణ పౌరుడు మొదలు ప్రధానమంత్రి మోదీ వరకు అందర్నీ అడ్డగోలుగా విమర్శించడం అలవాటుగా మారింది’అని కిషన్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు.