పోర్టబుల్ మినీ రైస్ మిల్లుతో లావణ్య
మూడు అడుగుల ఎత్తు ఉండే చిన్న రైస్ మిల్లు గ్రామీణ యువతకు ఉపాధి మార్గంగా మార్గం చూపుతోంది. బీఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ తన శ్రీకాకుళం జిల్లా మారుమూల గ్రామంలోని తన సోదరికి ఈ మిల్లును కొని ఇచ్చారు. ఆమె ఈ మిల్లు ద్వారా ధాన్యాన్ని స్వయంగా మరపట్టి బియ్యం విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న నిర్మల్ జిల్లాకు చెందిన యువ రైతు కూడా దీని ద్వారా ఉపాధి పొందుతుండటం విశేషం. సన్న, చిన్న రైతులకు, దేశీ వంగడాలను సాగు చేసే రైతులకు, గ్రామీణ యువతకు ఈ చిట్టి రైస్ మిల్లు ఉపయోగకరమని చెబుతున్నారు.
మినీ రైస్ మిల్లులో వడ్లను పోస్తున్న శ్రీధర్.. బియ్యం
దేశీ వరి రైతులకూ ఉపయోగకరం
నిర్మల్ జిల్లా నిర్మల్ రూరల్ మండలం తల్వేద గ్రామానికి చెందిన ఎలిశెట్టి శ్రీధర్ సోషల్ వర్క్‌లో ఎమ్మే చదివారు. వ్యవసాయంపైనే ఆధారపడిన కుటుంబం కావడంతో తనకూ చిన్నప్పటి నుంచి సాగుపైనే ఆసక్తి. ఇంటర్నెట్, సోషల్ మీడియాలో సాగుకు సంబంధించిన కొత్త విషయాల గురించి వెదుకుతూ ఉంటారు. రెండు నెలల క్రితం ఫేస్‌బుక్‌లో ఎక్కడికైనా తీసుకెళ్లదగిన అతి చిన్న రైస్ మిల్లుకు సంబంధించిన పోస్టు శ్రీధర్‌ను ఆకట్టుకుంది. ‘పల్లెసృజన’ సంస్థలో గతంలో వలంటీర్‌గా పనిచేసిన అనుభవం ఉండటం వల్ల దీని ప్రత్యేకతను చప్పున గుర్తించారు. తమ వంటి సన్న, చిన్న రైతులకు ఈ మినీ రైస్‌మిల్లు చాలా ఉపయోగపడుతుందనిపించింది. ఆ పోస్టు పెట్టిన శ్రీకాకుళం జిల్లా వాసితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఛత్తిస్‌ఘడ్‌లోని రాయ్‌పూర్‌లో తయారైన ఈ మినీ రైస్ మిల్లును కొద్ది రోజుల్లోనే తానూ కొనుగోలు చేశారు శ్రీధర్.
ఎత్తు మూడు అడుగులు. బరువు 65 కిలోలు. అడుగున నాలుగు వైపులా చక్రాలున్నాయి. ఎక్కడికంటే అక్కడికి సులువుగా తీసుకెళ్లవచ్చు. దీన్ని ఇంటి దగ్గరే పెట్టుకొని గంటకు 100–150 కిలోల ధాన్యాన్ని మరపడుతూ ఉపాధి పొందుతున్నారు శ్రీధర్. 5 గంటల పాటు నిరంతరాయంగా మర ఆడించవచ్చు. వంద కిలోల ధాన్యానికి 55–60 కిలోల బియ్యం పొందుతున్నానని, వడ్ల నాణ్యతను బట్టి హెచ్చు తగ్గులు ఉంటాయన్నారు. ఇందులో ఒకేసారి ఎనిమిది కిలోల వడ్లను పోయొచ్చు. 3 హెచ్‌పీ మోటార్‌తో పనిచేస్తోంది. సింగిల్ ఫేజ్ విద్యుత్ కనెక్షన్ ఉన్నా సరిపోతుంది. విద్యుత్ ఖర్చు బాగా తక్కువేనన్నారు. కాబట్టి, మారుమూల గ్రామంలో కూడా దీనితో ధాన్యం మరపట్టుకోవచ్చని శ్రీధర్ చెబుతున్నారు.
3 రకాల జాలీలు ఉంటాయి. వడ్లు పొడవు, లావును బట్టి జాలీని మార్చి సెట్ చేసుకోవాలి. సాధారణ రకాలు సాగు చేసే రైతులతో పాటు.. రకరకాల సైజుల్లో ఉండే దేశీ వరి రకాలను చిన్న మడుల్లో సాగు చేసే తన వంటి రైతుల మిల్లింగ్ కష్టాలు తొలగిపోయినట్లేనని ఆయన సంతోషపడుతున్నారు. దీన్ని రూ. 39 వేలకు కొన్నానని, రూ. 3 వేలు రవాణా ఖర్చులు అయ్యాయని శ్రీధర్ తెలిపారు.
ధాన్యం మరపట్టించుకున్న వారు తవుడు తనకే వదిలేస్తే ఉచితంగా మర పడుతున్నానని, లేదంటే కిలో వడ్లకు రూ.2 చొప్పున తీసుకుంటున్నానని తెలిపారు. అర కిలో ధాన్యం ఉన్నా దీనితో మర పట్టుకోవచ్చని, దీన్ని నిర్వహించడానికి నైపుణ్యం పెద్దగా అవసరం లేదని శ్రీధర్ (98480 88428) అంటున్నారు.
– రాసం శ్రీధర్, సాక్షి, నిర్మల్
ఫొటో జర్నలిస్ట్ : బాతూరి కైలాష్
సోదరికి అన్నయ్య కానుక..
శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం వేములవాడకు చెందిన బొడ్డ గంగాధర్ సరిహద్దు భద్రతా దళంలో బంగ్లాదేశ్–పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో పనిచేస్తున్నారు. అమ్మమ్మ, తల్లితోపాటు వేములవాడలో ఉంటున్న ఆయన చెల్లెలు లావణ్య ఇంటర్ పూర్తి చేశారు. చెల్లెలికి ఏదైనా ఉపాధి మార్గం చూపదగిన యంత్ర పరికరాల కోసం ఇంటర్‌నెట్‌లో వెదుకుతున్న గంగాధర్‌కు ఓ మినీ రైస్ మిల్లు కనిపించింది. దీన్ని తయారు చేసిన చత్తిస్‌ఘఢ్‌లోని కంపెనీని సంప్రదించారు. మూడు అడుగుల ఎత్తులో ఉన్న చిన్న మిల్లుకు కొన్ని సవరణలు సూచించారు. అవసరమైతే ఎక్కడికైనా తీసుకెళ్లడానికి వీలుగా చక్రాలు కూడా పెట్టించి ఏడాది క్రితం రూ. 40 వేలకు కొనుగోలు చేశారు. వేములవాడలోనే లావణ్య చిన్న రేకుల షెడ్డులో ఈ మినీ రైస్ మిల్లును, దానితోపాటు చిన్న పిండి మరను కూడా ఏర్పాటు చేసుకొని, తల్లి తోడ్పాటుతో తానే నిర్వహిస్తూ ఉపాధి పొందుతున్నారు.
80 కిలోల సాంబ మసూరి ధాన్యం మరపడితే 51 కిలోల బియ్యం వస్తున్నాయని, 3 హెచ్‌పి మోటారు కావడంతో విద్యుత్తు ఖర్చు కూడా తక్కువగానే ఉందని లావణ్య తెలిపారు. తొలుత సింగిల్ ఫేజ్ విద్యుత్తుతో సమస్యలు రావటంతో టూ ఫేజ్ విద్యుత్ వాడుతున్నామన్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యంతో మరపట్టించిన బియ్యాన్ని కిలో రూ. 40కి అమ్ముతూ మంచి ఆదాయం పొందుతున్నానని లావణ్య ‘సాక్షి’తో సంతోషంగా చెప్పారు. వేరే ఊళ్లో దూరాన ఉండే పెద్ద రైస్ మిల్లు దగ్గరకు వ్యయప్రయాసలకు ఓర్చి వెళ్లాల్సిన అవసరం ఇక లేదని, గ్రామంలోనే కొన్ని కిలోల ధాన్యాన్ని సైతం మరపట్టుకోవచ్చని ఈ మినీ మిల్లు చూశాక అర్థమైందన్నారు. చిన్న రైతులు, గ్రామాల్లో మహిళలు, యువతులు ఈ మిల్లు ద్వారా తన మాదిరిగా ఉపాధి పొందవచ్చని లావణ్య (70325 65474) సూచిస్తున్నారు.
– లింగూడు వెంకట రమణ,
సాక్షి, టెక్కలి, శ్రీకాకుళం జిల్లా
Comments
Please login to add a commentAdd a comment