
ఖమ్మం మయూరిసెంటర్: ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆరోపించారు. శనివారం ఖమ్మంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణలో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయాలని రాష్ట్ర మంత్రులు, ఎంపీల బృందం ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కోరినా స్పందించలేదని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ రాష్ట్ర ఎంపీలు పార్లమెంట్ సమావేశాల్లో ఒక ప్రశ్న కూడా లేవనెత్తకపోవడం గమనిస్తే రైతులపై వారికి ఎంత శ్రద్ధ ఉందో తెలిసిపోతోందన్నారు.
రాష్ట్రంలో బండి సంజయ్ నిరుద్యోగ దీక్ష చేపడతానని చెప్పడం గర్హనీయమన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేస్తూ, ఉద్యోగాలు ఊడగొడుతున్నందుకు సంజయ్ దీక్ష చేపడుతున్నారా అని ప్రశ్నించారు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని, రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక 1.3 లక్షల ఉద్యోగాలు కల్పించిందని మంత్రి వెల్లడించారు. కాగా, బీజేపీ నాయకులు కలుషిత రాజకీయాలు చేస్తున్నారని, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షుపై సామాజిక మాధ్యమాల్లో చేసిన వ్యాఖ్యలతో బీజేపీ నేతల సంస్కారం బయటపడిందన్నారు.