సాక్షి, హైదరాబాద్: యాసంగి వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో అధికార టీఆర్‌ఎస్ శుక్రవారం రాష్ట్ర వ్యాప్తం గా చేపట్టిన మహాధర్నాలో వేలాది మంది రైతులతో కలిసి పార్టీ శ్రేణులు కదం తొక్కాయి. జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో మం త్రులు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలకు పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలిరావడంతో ధర్నా వేదికలు గులాబీమయం అయ్యా యి. రాష్ట్ర అవతరణ తర్వాత అధికార పార్టీగా చేపట్టిన తొలి నిరసన కార్యక్రమం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ యంత్రాంగం సవాలుగా తీసుకుంది. టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ పిలుపు మేరకు జరిగిన మహాధర్నాలో భాగంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు తాను ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గ కేంద్రంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట పార్టీ శ్రేణులతో కలిసి బైఠాయించారు.
సిద్దిపేట ఆర్డీవో కార్యాలయం ఎదుట జరిగిన ధర్నాలో వైద్య, ఆరోగ్యమంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. మంత్రు లు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, జగదీశ్‌రెడ్డి, పువ్వాడ, ఇంద్రకరణ్‌రెడ్డి, దయాకర్‌రావు తమ జిల్లాల్లో పార్టీ కార్యకర్తలు, రైతులతో కలిసి ధర్నాల్లో పాల్గొని కేంద్ర ప్రభుత్వ వైఖరిపై నిరసన తెలి పారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పాదయాత్రగా వచ్చి ధర్నాలో పాల్గొన్నారు. ములుగు జిల్లా కేంద్రంలో జరిగిన ధర్నాకు మంత్రి సత్యవతి రాథోడ్ ఎడ్లబండి మీద ర్యాలీగా వచ్చారు. జిల్లాలు, నియోజకవర్గ కేంద్రాల్లో జరిగిన ధర్నాకు సంఘీభావం తెలుపుతూ గ్రేటర్ హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ మహాధర్నా చేపట్టింది. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. వరి కంకులు, ధాన్యం సంచులను ధర్నా వేదిక వద్ద ప్రదర్శించారు.
యాసంగి వడ్లు కొనేవరకు ఉద్యమ తరహాలో కేంద్రం పై కొట్లాడతామని ధర్నాల్లో పాల్గొన్న నేతలు చెప్పారు. ‘పార్టీ అధ్యక్షుడి పిలుపు మేరకు శుక్రవారం జరిగిన మహాధర్నాలో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి కనిపించింది. ఉద్యమ కాలం నాటి జోష్ మళ్లీ టీఆర్‌ఎస్‌లో కనిపించింది..’అని సిరిసిల్లలో జరిగిన ధర్నాలో కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే వరి ధాన్యం కొనుగోలుపై కేంద్రం వైఖరిని ఈ నెలాఖరులో జరిగే పార్లమెంటు సమావేశాల్లో లేవనెత్తాలని టీఆర్‌ఎస్ నిర్ణయించింది.
ధాన్యం కొల్లగొట్టేందుకు కుట్రలు
పంటను కేంద్రం కొనకుండా, అంబానీ, అదానీలు వచ్చి తక్కువ ధరకే కొల్లగొట్టే కుట్రలకు బీజేపీ జాతీయ నేతలు తెరలేపారు. యాసంగి ధాన్యాన్ని కేంద్రం కొనాల్సిందే. అవసరమైతే మోదీ, పీయూష్ గోయల్, కిషన్‌రెడ్డి ఇళ్ల ముందు ధర్నాలు చేస్తాం. ఊర్లోకి వచ్చే బీజేపీ నాయకుల్ని వేసంగి వడ్లు కొంటరా? లేదా? అని రైతులు నిలదీయాలి.
– కరీంనగర్‌లో మంత్రి గంగుల కమలాకర్
అంబానీ, అదానీలపైనే ప్రేమ
బీజేపీకి రైతులన్నా, వ్యవసాయమన్నా ప్రేమ లేదు. అదాని, అంబానీలపైనే ప్రేమ ఉంది. అందుకే ధాన్యం కొనకుండా కేంద్రం వివక్ష చూపుతోంది. తెలంగాణ రైతుల్ని ఇబ్బందులకు గురి చేస్తోంది. తొండి సంజయ్ అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నాడు. బీజేపీ మెడలు వంచేదాకా పోరాటం చేస్తాం. – ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్
రైతులతో పెట్టుకుంటే నాశనమే
యాసంగి వరి ప్రతి గింజను కేంద్రం కొనాల్సిందే. వరి ధాన్యం కేంద్రం కొనుగోలు చేయాలని రాజ్యాంగంలో ఉన్నప్పటికీ మోదీ ప్రభుత్వం విస్మరిస్తోంది. రైతులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వమైనా నాశనం అవుతుంది. డ్రామాలు ఆడుతున్న బీజేపీకి త్వరలో సినిమా చూపిస్తాం. – హైదరాబాద్‌లో మంత్రి తలసాని
Comments
Please login to add a commentAdd a comment