సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వడ్ల పంచాయితీకి తెరపడలేదు. వారం రోజులు ఢిల్లీలో ఉన్న రాష్ట్ర మంత్రులు కేంద్రం నుంచి ఎలాంటి హామీ పొందకుండానే వెనుదిరిగారు. వడ్లపై ఎవరి వాదన వారిదిగానే సాగింది. రాష్ట్రంలో వానాకాలంలో ముడి బియ్యం ఎంత కొంటామనేది కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టతనివ్వలేదు. ప్రకటన వచ్చే వరకు ఢిల్లీ నుంచి కదిలేది లేదని మంత్రులు తేల్చి చెప్పారు.
కానీ కేంద్రం స్పష్టతనిచ్చే పరిస్థితి లేకపోవడంతో శుక్రవారం రాత్రి హైదరాబాద్‌కు తిరిగి పయనమయ్యారు. రాష్ట్ర రైతాంగం పట్ల కేంద్రం కక్ష సాధింపు ధోరణితో ఉందని, సీఎం కేసీఆర్‌తో చర్చించాక తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ‘సాక్షి’కి తెలిపారు. రైతుల పక్షాన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
లక్ష్యాన్ని చేరుకున్న కొనుగోళ్లు
రాష్ట్రంలో వానాకాలంలో 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సేకరిస్తామని కేంద్రం గత జులైలోనే ప్రకటించింది. 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కోసం సుమారు 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలి. తాజా లెక్కల ప్రకారం రాష్ట్రంలో శుక్రవారం నాటికి 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తయింది. కానీ అటు ఇటుగా 10 జిల్లాల్లో మినహా మిగతా అన్ని జిల్లాల్లో ధాన్యం సేకరణ ఇంకా సాగుతోంది. ఈ లెక్కన సంక్రాంతి నాటికి మరో 20 లక్షల నుంచి 30 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం సేకరించే అవకాశం ఉంటుందని వ్యవ సాయ శాఖ అంచనా వేసింది.
ఈ పరిస్థితుల్లో కేంద్రం విధించిన 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం పూర్తవగా అదనంగా వచ్చే ధాన్యం పరిస్థితి ఏంటనేది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన చేస్తోంది. దీనిపైనే వారం రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన మంత్రులు మంత్రి గోయల్‌ను ఒప్పించేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. మంత్రులతో సమావేశమైన సమయంలో ఎంత కొనుగోలు చేస్తామనే విషయంపై రెండ్రోజుల్లో స్పష్టతనిస్తామని ఆయన చెప్పినా తరువాత బదులివ్వలేదు. అదే సమయంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ‘దేశంలో తెలంగాణకు మాత్రమే వానాకాలంలో ఎంత అదనపు ధాన్యం కొనుగోలు చేస్తారని ఎలా చెబుతారు?’అని ప్రశ్నించడం గమనార్హం.
యాసంగి పంటలపై మూణ్నెళ్లుగా..
2020–21 యాసంగి (రబీ)కి సంబంధించి మూడు, నాలుగు నెలలుగా కేంద్రం, రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. యాసంగిలో సెంట్రల్ పూల్ కింద 24.75 లక్షల మెట్రిక్ టన్నుల ఉప్పుడు బియ్యమే ఎఫ్‌సీఐ సేకరిస్తుందని గత జూలైలోనే కేంద్రం స్పష్టం చేసింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తూ గత యాసంగిలో 92.33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని, 64 ఎల్‌ఎంటీ కస్టం మిల్లింగ్ బియ్యం వస్తుందని, దానిలో నుంచి 50 లక్షల మెట్రిక్ టన్నులు కొనాలని కేంద్రానికి పలు మార్లు లేఖలు రాసింది. అయితే కేంద్రం నుంచి స్పందన రాకపోవడంతో గత సెప్టెంబర్ ఆఖరులో సీఎం కేసీఆర్ స్వయంగా వెళ్లి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను కలవగా భవిష్యత్తులో ఉప్పుడు బియ్యం పంపించబోమని హామీ ఇస్తేనే అదనంగా కొనుగోలుకు వెసులుబాటు ఇస్తామనడంతో సరేనన్నారు.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తులో ఉప్పుడు బియ్యం ఎఫ్‌సీఐకి పంపబోమని లిఖిత పూర్వకంగా లేఖ రాసింది. దీంతో 2020–21 యాసంగి ఉప్పుడు బియ్యం సేకరణ లక్ష్యాన్ని మరో 20 లక్షల మెట్రిక్ టన్నులు (మొత్తంగా 44.75 ఎల్‌ఎంటీ) సేకరించనున్నట్లు కేంద్రం చెప్పింది. ఇటీవల సీఎం కేసీఆర్‌తో సహా మంత్రులు, ప్రజా ప్రతినిధులంతా యాసంగిలో వచ్చే ఉప్పుడు బియ్యం కొనాలని డిమాండ్ చేస్తూ ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేసినా కేంద్రం తన వాదనకే కట్టుబడి ససేమిరా అంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో యాసంగిలో వరి సాగు చేయొద్దని సర్కారు చెప్పినా చాలా వరకు సాగవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment