సాక్షి, హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్ల అంశంతోపాటు ఏడేళ్లుగా టీఆర్‌ఎస్, బీజేపీలు ఆడుతున్న రాజకీయ నాటకాన్ని ప్రజల్లో ఎండగట్టాలని కాంగ్రెస్‌పార్టీ నిర్ణయించింది. ఈ పార్టీల గుట్టువిప్పి ఎండగట్టేందుకు క్షేత్రస్థాయిలో పోరాటాలు చేయాలని నిర్ణయించింది. శుక్రవారం గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఆ పార్టీ ముఖ్యనేతల సమావేశం జరిగింది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, యాసంగి ధాన్యం కొనుగోళ్లు, పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, విద్యుత్ ధరలకు వ్యతిరేకంగా పార్టీ చేపట్టిన ఆందోళనలు, విద్యుత్‌సౌధ ముట్టడిపై చర్చించారు. అనంతరం పలు నిర్ణయాలు తీసుకున్నారు.
రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ఈ నెలాఖరున రాష్ట్రంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ పర్యటన ఉంటుందని, ఈలోపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ప్రజాసమస్యలపై పోరాటాలు చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. ధాన్యం కొనుగోళ్లపై క్షేత్రస్థాయిలో మరింతగా ఉద్యమించాలని సూచించారు. అనంతరం టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, ఏఐసీసీ కార్యదర్శి జి.చిన్నారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు.
‘ధాన్యం కొనుగోలుకు ఈ నెల 11లోపు ఐకేపీ కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా 12న అన్ని మండల కేంద్రాల్లో రైతులతో కలసి ధర్నాలు చేస్తాం. రైస్‌మిల్లర్లతో కుమ్మక్కయిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాం. ఏప్రిల్ 15 తర్వాత బృందాలుగా విడిపోయి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి రైతుల సమస్యలపై పోరాడుతాం’అని మధుయాష్కీ అన్నారు.
సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు గీతారెడ్డి, అంజన్‌కుమార్‌యాదవ్, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు ఎం. కోదండరెడ్డి, టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్ షబ్బీర్‌అలీ, పార్టీ సీనియర్ నేతలు దాసోజు శ్రవణ్, మల్లు రవితోపాటు మాజీ మంత్రులు, ఇతర నేతలు పాల్గొన్నారు.
మహిళల సమస్యలపై క్షేత్రస్థాయి పోరాటాలు
రాష్ట్రంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై క్షేత్రస్థాయిలో పోరాటాలు చేయాలని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నిర్ణయించింది. గాంధీ భవన్‌లో శుక్రవారం జరిగిన ఆ విభాగం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర నేతలతోపాటు జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు. భేటీ తర్వాత గాంధీ భవన్ నుంచి ర్యాలీగా వచ్చిన మహిళా కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో కిందపడిపోవడంతో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావుకు గాయాలయ్యాయి. చికిత్స కోసం ఆమెను నాంపల్లిలోని కేర్ ఆసుపత్రికి తరలించారు. ఇతర నేతలను అరెస్టు చేసి నారాయణగూడ పీఎస్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment