ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ప్రశాంత్ రెడ్డి. చిత్రంలో నిరంజన్‌రెడ్డి, కేకే, నామా నాగేశ్వరరావు, గంగుల, ఎర్రబెల్లి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం సేకరించిన మొత్తం బియ్యాన్ని కేంద్రం తీసుకోవాల్సిందేనని మంత్రుల బృందం తేల్చిచెప్పింది. బియ్యం తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం నాటకాలు ఆడుతోందని, ఈ వ్యవహారాన్ని ఇంకా పొడిగిస్తే మంచిది కాదని హెచ్చరించింది. కేంద్రం రైతులను తీవ్రంగా అవమానించేలా వ్యవహరిస్తోందని మండిపడింది.
‘రాష్ట్రం సేకరించిన మొత్తం బియ్యాన్ని తీసుకో కుంటే, మిగిలిన బియ్యాన్ని ఢిల్లీలోని ఇండియాగేట్ వద్ద పారబోసి నిరసన తెలుపుతాం’అని ఆర్‌అండ్‌బీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అల్టిమేటం ఇచ్చారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు ఇంకా కొనసాగుతున్నాయని, ఇప్పటికే 60 లక్షల మెట్రిక్ టన్నుల పైబడి ధాన్యం సేకరించామని చెప్పారు. రైతుల సంక్షేమం దృష్ట్యా ఉన్నఫళంగా ధాన్యం సేకరణను ఆపేయలేమని, రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి పూర్తిగా కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు.
శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణభవన్‌లో మంత్రులు గంగుల కమలాకర్, నిరంజన్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీలు కేశవరావు, నామా నాగేశ్వరరావు, కేఆర్ సురేష్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి, వెంకటేశ్ నేత, మన్నె శ్రీనివాసరెడ్డి, లింగయ్య యాదవ్‌లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్రంలో సేకరించిన పూర్తి బియ్యాన్ని తీసుకుంటామని పార్లమెంట్ సాక్షిగా కేంద్రమంత్రి పీయూష్ గోయల్ మాట ఇచ్చారు. దానికి సంబంధించిన లేఖ రాని పక్షంలో 60 లక్షల మెట్రిక్ టన్నులకు మించి సేకరించిన బియ్యాన్ని ఢిల్లీకి తెచ్చి పారబోస్తాం. ధాన్యం సేకరణ అంశం రాష్ట్ర రైతులకు సంబంధించినది.. అందువల్ల కేంద్రప్రభుత్వం దీనిపై పునరాలోచించి నిర్ణయం తీసుకోవాలి’అని పేర్కొన్నారు.
బియ్యం తీసుకెళ్లకుండా నిందలా: గంగుల
60 లక్షల మెట్రిక్ టన్నులకు మించి సేకరించిన ధాన్యంపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత రాలేదని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. యాసంగిలో బాయిల్డ్ రైస్ కొనబోమని కేంద్రం చెప్పినందున వచ్చే యాసంగిలో కొనుగోలు కేంద్రాలు ఉండబోవని స్పష్టం చేశారు. ‘కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అబద్ధాలు చెబుతున్నారు. రాష్ట్రంలోని రైస్ మిల్లుల్లో సిద్ధంగా ఉన్న బియ్యాన్ని తీసుకెళ్లాలని ఎఫ్‌సీఐకి గతేడాది నుంచి ఇప్పటివరకు 7 లేఖలు రాశాం. వారికి బియ్యం తీసుకెళ్లే ఉద్దేశం లేదు. అందుకే మాపై నిందలు వేస్తున్నారు’అని పేర్కొన్నారు.
3–5 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్: నిరంజన్‌రెడ్డి
ఏటా రూ.90 వేల కోట్లు వెచ్చించి వంట నూనెలు దిగుమతి చేసుకుంటున్నామని చెబుతున్న కేంద్రం.. దేశ రైతులకు వంట నూనెలు పండించే దారి చూపించకపోవడం దౌర్భాగ్యమని వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. అందుకే వచ్చే వానాకాలంలో రాష్ట్రంలో 3–5 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రతినిధులు వచ్చి ఢిల్లీలో ఎదురుచూస్తున్నా పట్టించుకోకుండా కేంద్రం చిన్నచూపు చూస్తోందని అన్నారు. 2022 కల్లా దేశంలోని రైతుల ఆదాయం రెండింతలు చేస్తామన్న ప్రధాని మోదీ, రైతులు పండించిన పంటను ఇండియాగేట్ వద్ద పోసుకోవాల్సిన పరిస్థితికి తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, ధాన్యం సేకరణ అంశంలో పీయూష్ గోయల్‌కు రాష్ట్ర బీజేపీ నేతలు తప్పుడు సమాచారం ఇచ్చారని, తాము వాస్తవ పరిస్థితిని ఆయనకు వివరించామన్నారు. బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు ఇద్దరూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇది రాజకీయం కాదని.. రైతాంగ సమస్య అని వ్యాఖ్యానించారు. కాగా, గత శనివారం ఢిల్లీ వచ్చిన ఐదుగురు మంత్రులు, కేంద్రమంత్రి గోయల్ కార్యాలయం నుంచి లేఖ రాకపోవడంతో, తదుపరి కార్యాచరణ కోసం శుక్రవారం రాత్రి హైదరాబాద్‌కు పయనమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment