సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో అనేక చోట్ల బియ్యం దొంగదారి పడుతోందని, కుంభకోణాలు జరుగుతున్నాయని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వానికి రైతులపై ఏమాత్రం ప్రేమలేదని, ధాన్యం సేకరణ అంశంలో ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేస్తున్నారని విమర్శించారు. ధాన్యం సేకరణ విషయంలో దేశంలోని ఏ ఇతర రాష్ట్రానికి ఇవ్వని లేఖను తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం ఎందుకు ఇవ్వాలని ఆయన ప్రశ్నించారు.
బుధవారం ఢిల్లీలోని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. యాసంగిలో వచ్చే ప్రతి గింజను కొంటామని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెబుతున్నప్పటికీ, దేశంలో ఏ రాష్ట్రంలో లేని గొడవ తెలంగాణలో మాత్రమే ఎందుకు వచ్చిందన్న విషయంపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు.
ఢిల్లీలో ఇంకా ఏం పని ఉంది?
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టత ఇచ్చిన తర్వాత కూడా రాష్ట్ర మంత్రులకు ఢిల్లీలో ఇంకా ఏం పని ఉందని ప్రశ్నించారు. రాజకీయాన్ని రక్తి కట్టించే పని చేస్తున్నారా? లేక గల్లీలో పనిలేక ఢిల్లీకి వచ్చారా? అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ సహా టీఆర్‌ఎస్ నాయకులకు రైతులపై కంటే రాజకీ యంపైనే ఎక్కువ శ్రద్ధ ఉందని విమర్శించారు.
కేసీఆర్ డైరెక్షన్‌లోనే పంచాయితీ: అరుణ
టీఆర్‌ఎస్ నాయకులు, మంత్రులు సీఎం కేసీఆర్ దిశానిర్దేశంలో తెలంగాణలోని వరి రాజకీయాన్ని ఢిల్లీకి తీసుకొచ్చారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు. కేసీఆర్ మోసాలు, అబద్ధాలను నమ్మేస్థితిలో ప్రజలు లేరన్నారు. ఢిల్లీకి వచ్చిన రాష్ట్ర మంత్రులు సేద తీరుతున్నారని, పార్టీ ఆఫీస్ నిర్మాణ పనులు చేసేందుకే వారిని కేసీఆర్ ఢిల్లీకి పంపారని విమర్శించారు. రైతుల విషయంలో కేసీఆర్ అబద్ధాలు చెప్పడం మానుకోవాలని అరుణ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment