బోనకల్‌లో పాదయాత్ర చేస్తున్న భట్టివిక్రమార్క
బోనకల్: యాసంగిలో ధాన్యం కొనుగోళ్ల అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలు ఆడుతున్నాయని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఆయన ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో పీపుల్స్‌మార్చ్ పేరిట చేపట్టిన పాదయాత్ర సోమవారం పునఃప్రారంభమైంది. ఈ సందర్భంగా బోనకల్ మండలంలో భట్టి మాట్లాడారు.
రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వాలు.. తమ బాధ్యతను విస్మరించి రోడ్లపైకి ఎక్కి ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఓ పక్క వరి కోతలు మొదలైనా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో దళారుల చేతిలో రైతులు మోసపోతున్నారని విచారం వ్యక్తంచేశారు. ముందుగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుల వద్ద ఉన్న ధాన్యం కొన్నాక కేంద్రంతో యుద్ధం చేయాలని సూచించారు.
ఏదిఏమైనా రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేసే వరకు తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. రైతులు, నిరుద్యోగులు, డ్వాక్రా మహిళల సమస్యలు తెలుసుకుని పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఈ పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment