తెలంగాణ మంత్రుల చలో ఢిల్లీ  | Telangana Ministers Chalo Delhi On Paddy Procurement | Sakshi
Sakshi News home page

తెలంగాణ మంత్రుల చలో ఢిల్లీ 

Mar 23 2022 4:33 AM | Updated on Mar 23 2022 9:57 AM

Telangana Ministers Chalo Delhi On Paddy Procurement - Sakshi

యాసంగి వరి ధాన్యం కొనుగో లు విషయంలో కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది.

సాక్షి, హైదరాబాద్‌: యాసంగి వరి ధాన్యం కొనుగో లు విషయంలో కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. సీఎం కె.చంద్రశేఖర్‌రావు ముందే ప్రకటించినట్టుగా రాష్ట్ర మంత్రుల బృందం ఢిల్లీకి బయలుదేరి వెళ్లింది. సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి నేతృత్వంలో గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్, వేముల ప్రశాంత్‌రెడ్డి మంగళవారం రాజధానికి పయనమైవెళ్లారు. రాష్ట్రానికి చెందిన పార్టీ ఎంపీలతో పాటు బుధవారం కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ను కలవాలని నిర్ణయించుకున్నారు. పంజాబ్, హరియాణా తరహాలో రైతులు పండించిన పంటను కేంద్రం కొనుగోలు చేయాల్సిందేనన్న డిమాండ్‌తో మంత్రులు కేంద్ర మంత్రితో సమావేశం కావాలని భావిస్తున్నారు.

కనీస మద్దతు ధరతో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసిన తరువాత కేంద్రం తన అవసరాలకు అనుగుణంగా ఎలా ఉపయోగించుకున్నా తమకు అభ్యంతరం లేదనే వాదనను ఈసారి తెరపైకి తెచ్చారు. సోమవారం టీఆర్‌ఎస్‌ విస్తృతస్థాయి భేటీలో కేసీఆర్‌ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా కనీస మద్దతు ధర, ధాన్యం కొనుగోలు.. అంశాల పైనే కేంద్రంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. బుధవారం గోయల్‌ ఇచ్చే అపాయింట్‌మెంట్‌ను బట్టి ఢిల్లీలో మంత్రులు, ఎంపీల కార్యాచరణ ఉండనుంది. ఇదే విషయాన్ని ఢిల్లీకి బయలుదేరుతూ మంత్రులు మీడియా సమావేశంలో వెల్లడించారు. 

గోధుమలు, పత్తి తరహాలోనే.. 
‘దేశంలో పండిన గోధుమలు, పత్తిని కనీస మద్దతు ధరకు కేంద్రం కొనుగోలు చేస్తోంది తప్ప గోధుమను పిండి చేసి, పత్తిని బేల్‌ చేసి కొనడం లేదు. మరి వరి ధాన్యం విషయంలో ఈ తేడా ఎందుకు? రైతు పండించిన ధాన్యాన్ని బియ్యంగా సేకరించే ఎఫ్‌సీఐ కేంద్రం చేతుల్లోనే ఉంది. బాయిల్డ్‌ రైస్‌ను పరిచయం చేసిందే ఈ ఎఫ్‌సీఐ. బాయిల్డ్‌ రైస్, రా రైస్‌ అనే దానితో మాకు సంబంధం లేదు. పంజాబ్‌ తరహాలో రైతులు ఏది పండిస్తే అది కొనాలి..’అని గంగుల కమలాకర్‌ డిమాండ్‌ చేశారు.  

ప్రధానికి సమస్యను వివరిస్తాం.. 
కేంద్రంతో తాడోపేడో తేల్చుకునే వస్తామని, సానుకూలంగా స్పందన రాకపోతే ఏం చేయాలో సీఎం ఇప్పటికే నిర్ణయించారని తెలిపారు. దానికి అనుగుణంగా తమ కార్యాచరణ ఉంటుందని చెప్పారు. కేంద్రం తెలంగాణపై కక్షపూరితంగా వ్యవహరిస్తోం దని శంషాబాద్‌ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ గంగుల విమర్శించారు. కేంద్రం తీరుతో రైతాంగం అయోమయంలో ఉందన్నారు. ప్రధానిని కలిసి సమస్యను వివరిస్తామని చెప్పారు. 

బియ్యం తీసుకోకుండా నిందలు..
‘యాసంగి ధాన్యం కొనుగోలుపై మాకు స్పష్టమైన వైఖరి ఉంది. రైతులు పండించిన పంటను కేంద్రం కొనుగోలు చేయాలన్నదే మా డిమాండ్‌. ధాన్యం కొనుగోలు విషయంలో వాస్తవాలకు విరుద్ధంగా కేంద్ర మంత్రి మాట్లాడుతున్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలి. కేంద్రం సేకరించేందుకు ఒప్పుకుంటే ధాన్యాన్ని బియ్యంగా మార్చి అప్పగిస్తాం. గత సీజన్‌లో వచ్చిన ధాన్యాన్ని బియ్యం పట్టిస్తే ఎఫ్‌సీఐ తీసుకోకుండా మా మీద నిందలు వేస్తున్నారు. ఈ విషయాలన్నీ కేంద్ర మంత్రులు, అధికారులతో చర్చిస్తాం..’అని నిరంజన్‌రెడ్డి తెలిపారు. ‘వరి ధాన్యం కొనుగోలుపై ఏమైనా మాట్లాడితే ఆ శాఖ మంత్రి మాట్లాడాలి.. లేదంటే సంబంధిత అధికారులు మాట్లాడాలి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి ఏం సంబంధం?’అని ప్రశ్నించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement