సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పెద్ద ఎత్తున వరి పంట సాగైన నేపథ్యంలో వానాకాలం సీజన్‌కు సంబంధించి సుమారు కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకొచ్చే ప్రతి ధాన్యం గింజను సేకరించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని చెప్పారు. రాబోయే వానాకాలం సీజన్ ధాన్యం కొనుగోళ్లపై గురువారం ఆయన హైదరాబాద్‌లోని ఎంసీహెచ్‌ఆర్‌డీలో సమీక్ష నిర్వహించారు.
పౌరసరఫరాల శాఖతో పాటు వ్యవసాయ, పోలీస్, మార్కెటింగ్, సహకార శాఖలకు చెందిన అధికారులు, అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వానాకాలం ధాన్యం సేకరణపై మంత్రి స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు. 24 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే పండించిన స్థితి నుంచి ఏకంగా కోటీ నలభై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించే స్థాయికి తెలంగాణ రైతు ఎదిగాడని ఆయన అన్నారు. ఈ సారి 65 లక్షల ఎకరాల్లో వరి పంట సాగైందని తెలిపారు. ధాన్యం సేకరణకు అవసరమైన గన్ని బ్యాగులు, తేమ కొలిచే మిషన్లు, ప్యాడీ క్లీనర్లు, టార్పాలిన్లతో సహా సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
17 జిల్లాల సరిహద్దుల్లో పటిష్ట నిఘా
తెలంగాణలోని 17 జిల్లాలకు ఇతర రాష్ట్రాలతో ఉన్న సరిహద్దులను దృష్టిలో ఉంచుకొని ధాన్యం అక్రమ దిగుమతిని అడ్డుకొనేందుకు పటిష్ట చర్యలు చేపట్టినట్లు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడి కొనుగోలు కేంద్రాలలో విక్రయించేందుకు తెచ్చే ధాన్యాన్ని విజిలెన్స్‌తో పాటు పోలీస్ శాఖ అడ్డుకోవాలని ఆదేశించారు. కాగా, ఎట్టి పరిస్థితుల్లోనూ రేషన్ బియ్యం రీసైక్లింగ్ జరగకుండా పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.
ధాన్యం నిల్వకు ఏర్పాట్లు
మిల్లర్ల వద్ద ఇప్పటికే దాదాపు 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలు ఉన్న నేపథ్యంలో వానాకాలం సీజన్‌లో వచ్చే ధాన్యానికి తగిన నిల్వ సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని జిల్లాల యంత్రాంగాన్ని మంత్రి గంగుల ఆదేశించారు. మిల్లుల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని వీలైనంత త్వరగా సీఎంఆర్ కింద అప్పగించి, తగినంత స్టోరేజీ కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రాలలో రైతులు పంటను అమ్ముకున్న తర్వాత మిల్లర్లతో ఎలాంటి సంబంధం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రైతులు భారత ఆహార సంస్థ నిర్దేశించిన ప్రమాణాలతో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని మంత్రి సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment