సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో యాసంగి ధాన్యాన్ని మరపట్టిస్తే సాధారణంగా వచ్చే 25 శాతం నూకలకు అదనంగా మరో 25 శాతం నూకలు వచ్చే అవకాశం ఉండటంతో ఆ నష్టాన్ని భరించే మిల్లర్లకు ఎంత పరిహారం ఇవ్వాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. క్వింటాల్ ధాన్యానికి నూకల పరిహారంగా రూ. 300 ఇస్తే నష్టం ఉండదని మిల్లర్లు ఇటీవల మంత్రి గంగుల కమలాకర్‌తో భేటీలో కోరగా ఆయా జిల్లాల్లో వాతావరణ పరిస్థితులనుబట్టి పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది.
సీఎస్ సోమేశ్‌కుమార్ నేతృత్వంలోని కమిటీ కూడా అదే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. జిల్లాలవారీగా టెస్ట్ మిల్లింగ్ చేసి ఆయా జిల్లాల వాతావరణ పరిస్థితులు, నూకల శాతాన్ని లెక్కించి మిల్లర్లకు క్వింటాల్‌కు ఇచ్చే పరిహారాన్ని నిర్ణయించాలని కమిటీ భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై సీఎస్ కమిటీ 2–3 రోజుల్లో సమావేశమై తుది నిర్ణయం తీసుకోనుంది. జిల్లాల పరిస్థితులకు అనుగుణంగా గరిష్టంగా క్వింటాల్‌కు రూ. 150–200 వరకు పరిహారం ఇవ్వాలని కమిటీ నిర్ణయించినట్లు సమాచారం.
ధాన్యాన్ని మిల్లింగ్ చేసేటప్పుడు బియ్యంతోపాటు వచ్చే అనుబంధ సరుకు (బియ్యపు పిండి, తౌడు, ఊక)ను కూడా పరిగణనలోకి తీసుకొని మిల్లింగ్ చార్జీల పేరిట నూకల నష్టాన్ని చెల్లించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. ఇతర రాష్ట్రాల్లో నూకలకు పరిహారం కింద మిల్లర్లకు అక్కడి ప్రభుత్వాలు ఏమైనా చెల్లింపులు చేస్తున్నాయా అనే కోణంలో అన్ని రాష్ట్రాల నుంచి సమాచారం సేకరించినట్లు తెలిసింది. కాగా, రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్ల కోసం ఇప్పటికే ప్రారంభమైన 1,565 కొనుగోలు కేంద్రాల్లో 94 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించగా 85 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు పంపించారు.
Comments
Please login to add a commentAdd a comment