సాక్షి, హైదరాబాద్: కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) చెల్లించి రైతుల నుంచి వరిని కొనుగోలు చేసేలా ఆదేశించాలంటూ నగరానికి చెందిన న్యాయవిద్యార్థి బొమ్మగాని శ్రీకర్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు శ్రీకర్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. ఈ వానాకాలంలో 40 లక్షల మెట్రిక్ టన్నుల వరి కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐతో ఒప్పందం చేసుకుందని పిటిషనర్ తరఫు న్యాయవాది నివేదించారు.
లక్షలాది టన్నుల వరిని రైతులు పండించినా ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారని, వరి కొనుగోలు కేంద్రాల దగ్గర పడిగాపులు పడి కొందరు రైతు లు చనిపోయారని తెలిపారు. వేలాది టన్నుల వరిని రోడ్లపై పోస్తున్నారని, అప్పులు భరించలేక మరికొందరు రైతులు ఆత్మహత్యలు చేసు కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వరిని కొంటామని ముందు హామీ ఇచ్చినా రాజకీయ కారణాలతో ప్రభుత్వం తన హామీని వెనక్కు తీసుకుందని వివరించారు.
ఎంఎస్‌పీ చెల్లించి రైతుల నుంచి వరిని కొనుగోలు చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరారు. ఈ మేరకు స్పందించిన ధర్మాసనం ప్రతివాదులుగా ఉన్న కేంద్ర, రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల విభాగం ముఖ్య కార్యదర్శులతోపాటు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ విచారణను వచ్చే నెల 6వ తేదీకి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment