సాక్షి, అమరావతి: ధాన్యం కొనుగోళ్లలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు సంపూర్ణ మద్దతు అందిస్తూ అండగా నిలుస్తోంది. పౌరసరఫరాల సంస్థ తాజాగా గురువారం రూ.1,611.27 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసింది. దీంతో ధాన్యం రైతులకు మొత్తం రూ.6,483.97 కోట్లు అంటే సుమారు 96.29 శాతం మేర నిర్ణీత వ్యవధిలోగా చెల్లింపులు చేయడం విశేషం.
అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఆర్థిక భారాన్ని తగ్గిస్తూ రవాణా ఖర్చులను కూడా అందిస్తోంది. గోనె సంచులు, హమాలీ, రవాణా చార్జీల కింద రూ.79.68 కోట్లను రైతులకు చెల్లించింది. 2022 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ఇప్పటివరకు 6,01,147 మంది రైతుల నుంచి రూ.6,734.02 కోట్ల విలువైన 32,97,735 టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించింది.
ఉత్తరాంధ్రలో వారంలోగా..
ధాన్యం సేకరణలో భాగంగా పౌరసరఫరాల సంస్థ జిల్లాల వారీగా తాత్కాలిక అంచనాలు రూపొందించింది. దీని ప్రకారం చాలా జిల్లాల్లో కొనుగోళ్లు పూర్తయ్యాయి. క్షేత్రస్థాయిలో ఇంకా మిగిలి ఉన్న ధాన్యాన్ని లెక్కించి కొనుగోళ్లకు అనుమతులిస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో మరో వారంలోగా కొనుగోళ్లు పూర్తి చేయాలని నిర్దేశించారు.
కృష్ణా, గోదావరి జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇతర ప్రాంతాలతో పోలిస్తే తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో పంట కోతలు, నూర్పిడులు కొద్దిగా ఆలస్యం అవుతాయి. అందువల్ల అక్కడ వచ్చే నెల నుంచి ధాన్యం కొనుగోళ్లు జరగనున్నాయి.
ధాన్యం రైతులకు రూ.1,611కోట్లు
Published Fri, Feb 24 2023 3:09 AM | Last Updated on Fri, Feb 24 2023 3:13 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment