వరిని కోస్తున్న మెషిన్
పంటను కంటికి రెప్పలా కాపాడుకుని వరి పండించడం ఒక ఎత్తు. దానికి మద్దతు ధర పొందటం మరో ఎత్తు. ఈ నేపథ్యంలో రైతులు తగిన జాగ్రత్తలు పాటిస్తేనే మద్దతు ధర లభిస్తుందని మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండల వ్యవసాయ అధికారి రమేష్ పేర్కొంటున్నారు. మరి అవేంటో చూద్దాం.
సాక్షి, శామీర్‌పేట్: రైతులు తాము పండించిన వరి గింజలపై తీసుకునే జాగ్రత్తల మేరకు మద్దతు ధర లభిస్తుంది. రైతులు పండించిన ధాన్యాన్ని సేకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం మండలాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. సాధారణ ధాన్యం రకం కనీసం మద్దతు ధర క్వింటాకు రూ.1940, ఎ–గ్రేడ్ రకం రూ.1960 రూపాయలుగా ప్రభుత్వం ప్రకటించింది. రైతులు తమ పంట తాలుకు వరి ధాన్యాన్ని దిగువ ఇచ్చిన సలహాలు, సూచనలు పాటించి వాటిని ఆచరిస్తే మద్దతు ధర పొందవచ్చని వ్యవసాయ అధికారి సూచిస్తున్నారు. (చదవండి: ధాన్యం కొనుగోలులో కేంద్రం విఫలం)
నాణ్యతాప్రమాణాలు...
► మట్టి, రాళ్లు, ఇసుక వంటి వ్యర్థాలు ఉండకూడదు.
► గడ్డి, చెత్త, తప్ప, కలుపు, విత్తనాలు ఒక్క శాతం మించకూడదు.
► చెడిపోయిన, రంగుమారిన, మొలకెత్తిన, పురుగుపట్టిన ధాన్యపు గింజలు 5శాతం మించకూడదు.
► వరిపక్వం గాని, ముడుచుకుపోయిన, వంకర తిరిగిన ధాన్యపు గింజలు 3శాతంలోపే ఉండాలి.
► తక్కువ శ్రేణి ధాన్యపు గింజలు లేక కేళీలు ఎ–గ్రేడ్ రకంలో 6శాతం మించకూడదు.
► తేమ లేక నిమ్ము 17 శాతం మించితే కొనుగోలు చేయరు.
రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు...
► ఒక రకం ధాన్యాన్ని మరోక రకం ధాన్యంతో కలపరాదు.
► పంట కోసిన తర్వాత ఆరబెట్టక పోతే గింజలు రంగుమారి నాణ్యత కోల్పోతాయి. పూర్తిగా ఆరబెట్టిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలి.
► నూర్చేటప్పుడు ధాన్యంలో రాళ్లు, మట్టి గడ్డలు కలపకుండా నేల మీద పరదాలు లేదా టార్పాలిన్లు వేసి, వాటిపై నూర్పిడి చేయాలి.
► పంటలో తాలు, తప్ప, పొల్లు, చెత్తాచెదారం పోయేటట్టు తూర్పారబట్టాలి.
► ధాన్యం ముక్కిపోయి రంగుమారి నాణ్యత పడిపోకుండా తేమ బాగా తగ్గాకే బస్తాల్లో నింపి లాటు కట్టాలి.
► నిల్వ ఉంచిన ధాన్యాన్ని ఎలుకలు నాశనం చేయకుండా బస్తాల మధ్యన జింకు సల్ఫేట్ మాత్రలు, పురుగు నివారణకు లీటరు నీటికి 5 మిల్లీ లీటర్లు మలాథియాన్ మందును బస్తాలపై పిచికారి చేయాలి.
► రైతులు ధాన్యపు పంట నుంచి సుమారు కిలో ధాన్యం మచ్చు (శాంపిల్) కింద ప్రాథమిక పరిశీలన కోసం కొనుగోలు కేంద్రానికి ముందుగా తీసుకొచ్చి నాణ్యత పరీక్ష అధికారికి చూపించి తగు సలహ పొందాలి.
► ధాన్యం కొనుగోలు కేంద్రంలో శాంపిల్ తీసుకున్న అధికారి ధాన్యం నాణ్యతకు ఆమోదం తెలిపిన తర్వాత మాత్రమే సరుకు కొనుగోలు కేంద్రానికి తెచ్చుకోవాలి.
► మొదట తెచ్చిన ధాన్యం శాంపిల్ మాదిరిగానే మొత్తం సరుకు ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.
► సదరు ధాన్యం కోనుగోలు కేంద్రాలను ఉచిత నాణ్యత, తేమ పరీక్ష కేంద్రంగా కూడా రైతులకు ఉపయోగపడుతుంది.
► రైతు తనే పంట పండించిన భూమి సర్వే నంబర్ విస్తీర్ణ వివరాలు తెలియజేస్తూ అధికారి నుంచి గుర్తింపు పత్రం తీసుకుని ధాన్యం కోనుగోలు కేంద్రానికి దాఖలు చేయాలి.
► దళారులు, మధ్యవర్తులు, కమీషన్ ఏజెంట్లు చొరబాటు లేకుండా నివారించేందుకు నేరుగా పంట పండించిన రైతులకే ప్రభుత్వం గిట్టుబాటు ధర వర్తింపజేసేందుకే ఈ నిబంధనలు పాటించాలి.
► రైతులకు నాణ్యత ప్రమాణాలపై ఏమైనా సందేహాలుంటే సంబంధిత ఏఓ లేక ఏఈఓలను సంప్రదించాలి.
దళారులను నమ్మొద్దు
కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించే రైతులు ఏమైనా సందేహాలుంటే ఏఈఓలను సంప్రదించండి. అధికారుల సూచనలను పాటిస్తూ, తగు జాగ్రత్తలు తీసుకోవాలి. దళారులు, మధ్యవర్తులు, కమీషన్ ఏజెంట్ల ప్రమేయం నివారించేందుకే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. నేరుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని అమ్మాలి.
– రమేష్, శామీర్‌పేట వ్యవసాయ అధికారి
Comments
Please login to add a commentAdd a comment