![Piyush Goel Statement On Telangana Paddy Procurement - Sakshi](/styles/webp/s3/article_images/2022/03/22/Untitled-12.jpg.webp?itok=I26g1fOi)
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత యాసంగి సీజన్‌కు సంబంధించి గతంలో చెప్పిన మేరకు రా రైస్ (ముడి బియ్యం) ఎంతైనా కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మళ్లీ పేర్కొన్నట్లు తెలిసింది. బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని తెలంగాణ ప్రభుత్వమే సంతకం చేసి కేంద్రానికి లేఖ ఇచ్చిన తర్వాత దేనిని ఆశించి రాజకీయం చేస్తున్నారని ఆయన అసహనం వ్యక్తం చేసినట్లు బీజేపీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. సోమవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కుమార్ ఆధ్వర్యంలో ఎంపీలు ధర్మపురి అరవింద్, సోయం బాపూరావు పార్లమెంటులో గోయల్‌ను కలిశారు.
యాసంగి ధాన్యం కొనుగోలు చేయకుండా కేంద్రం తెలంగాణకు అన్యాయం చేస్తోందంటూ టీఆర్‌ఎస్ ప్రభు త్వం చేస్తున్న ఆరోపణలను కేంద్ర మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి కీలక వ్యాఖ్యలు చేసినట్లు చెబుతున్నారు. ‘అసలు రా రైస్ కొనబో మని చెప్పిందెవరు? దేశవ్యాప్తంగా బియ్యం కొనుగోలు చేస్తున్నప్పుడు తెలంగాణలో ఎందుకు ఆపుతాం? పక్కాగా రా రైస్ కొంటాం. రైతులకు ఇబ్బంది కాకుండా చూడటం మా బాధ్యత. అసలు గతంలో ఇస్తామన్న బియ్యాన్నే తెలంగాణ ప్రభు త్వం ఇంతవరకు ఇవ్వలేదు. అయినా దేశంలో ఎక్కడాలేని సమస్య తెలంగాణలోనే ఎందుకు వస్తోంది? పార్లమెంటు సాక్షిగా గతంలోనే టీఆర్‌ఎస్ లేవనెత్తిన అంశాలన్నింటికీ సమాధానమిచ్చా.
ఇకపై భవిష్యత్తులో తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్ పంపబోమని రాష్ట్ర ప్రభుత్వమే సంతకం చేసింది. ఈ పరిస్థితుల్లో మళ్లీ కొత్తగా డ్రామాలు ఎందుకు?’ అని ఆయన పేర్కొన్నట్లు తెలిసింది. సమావేశానంతరం సంజయ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. కేంద్రం రా రైస్ కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర మంత్రి స్పష్టం చేశారని చెప్పారు. రాజకీయ లబ్ధి కోసమే రాష్ట్ర ప్రభుత్వం బీజేపీని బద్నాం చేయడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు.
పసుపు రైతులను ఆదుకోండి...: అరవింద్
అకాల వర్షాలతో గతేడాది పసుపు పంటను నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించే విషయం పై ఎంపీ అరవింద్ కేంద్రమంత్రి గోయల్‌తో చర్చించారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనను అమలు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని గుర్తుచేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి సైతం ఫసల్ బీమా అమలులో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. పసుపు రైతులకు పరిహారం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపితే పరిశీలిస్తామని గోయల్ హామీ ఇచ్చినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment