
సాక్షి, అమరావతి: ధాన్యం కొనుగోలులో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. రైతులకు మద్దతు ధర కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 2019–20 రబీ సీజన్‌లో కొనుగోలు కేంద్రాల ద్వారా రికార్డు స్థాయిలో 31.14 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించింది. గత ఏడాది రబీ సీజన్ కంటే ఈ ఏడాది 3.61 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా అదనంగా పౌరసరఫరాల సంస్థ కొనుగోలు చేసింది.
► దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు మొత్తం 119 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరిస్తే, ఇందులో మొదటి రెండు స్థానాలు తెలుగు రాష్ట్రాలు దక్కించుకున్నాయి.
► తెలంగాణ 64 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించి మొదటి స్థానంలో, ఆంధ్రప్రదేశ్ 31.14 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసి రెండో స్థానంలో నిలిచాయి.
► లాక్‌డౌన్ కారణంగా రాష్ట్రంలో తొలుత ధాన్యం సేకరణ కొంత ఆలస్యమైనా సీఎం జగన్ ఆదేశాల మేరకు ఈ సారి రైతుల కల్లాల వద్దకే వెళ్లి కొనుగోలు చేశారు. దీంతో రైతులకు రవాణా కష్టాలు కూడా తగ్గాయి.
► గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వ చర్యల వల్ల దళారుల మోసాల నుంచి రైతులకు మిముక్తి లభించింది.
► రబీలో 56 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారుల అంచనా. కాగా, 33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ కొనుగోలు చేయాలని నిర్ణయం.
► ఇప్పటి వరకు 31.14 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ.
► గ్రేడ్–ఏ రకం ధాన్యం క్వింటాల్‌కు రూ.1,835, సాధారణ రకం ధాన్యానికి రూ.1,815లను మద్దతు ధరగా నిర్ణయించారు.
► ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల ద్వారా రేపటి (జూన్ 20 శనివారం) వరకే కొనుగోలు చేస్తారు.
► మొత్తం 1,434 కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ.
Comments
Please login to add a commentAdd a comment