సాక్షి, అమరావతి: ఖరీఫ్‌కు సంబంధించి రైతుల నుంచి ఇప్పటివరకు 44 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు ఆహార, పౌర సరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్ వెల్లడించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ధాన్యం సేకరణలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసేందుకు ప్రతి వారం సమీక్ష నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ధాన్యం కొనుగోలు అంశంపై కొన్ని మీడియా సంస్థల్లో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రెండవ, మూడవ త్రైమాసికాలకు సంబంధించి ధాన్యం నిధులు విడుదల కాకపోవడం వల్ల చెల్లింపుల్లో స్వల్ప జాప్యం జరిగిందన్నారు.
ఈ పరిస్థితిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పటికప్పుడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారని తెలిపారు. బ్యాంకులు, నాబార్డ్ నుంచి అడ్వాన్సులు తీసుకుని రైతులకు ఇబ్బంది లేకుండా చెల్లింపులు జరపాలని ఆదేశించారని చెప్పారు. రైతులకు చెల్లించాల్సిన ధాన్యం బకాయిలను బుధవారం చెల్లిస్తామని పౌర సరఫరాల శాఖ కమిషనర్ చెప్పారు. ఈ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తప్పుడు వార్తలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. రైతులకు ఎలాంటి సందేహాలు ఉన్నా 1902కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవాలన్నారు.
ఏప్రిల్ 1నుంచి రబీ ధాన్యం కొనుగోళ్లు
ఉభయ గోదావరి జిల్లాల్లో ఏప్రిల్ కు1వ తేదీ నుంచి రబీ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమవుతాయని కోన శశిధర్ చెప్పారు. కృష్ణా జిల్లాలో మినునులు, పెసలు పంట వేయడం వల్ల ధాన్యాన్ని ముందుకు తీసుకురాలేకపోతున్నట్లు రైతులు చెబుతున్నారన్నారు. ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రైతులకు ఎప్పుడు వీలైతే అప్పుడే ధాన్యాన్ని తీసుకొచ్చి విక్రయించవచ్చన్నారు.
Comments
Please login to add a commentAdd a comment