నార్తురాజుపాళేనికి చెందిన జ్యోతి తోటి స్వయం సహాయక మహిళలు 20 మందితో కలిసి అవిశ్రాంతంగా శ్రమించి 750 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. దళారులతో పోటీపడి మరీ ధాన్యం కొనుగోలు చేశారు. మహిళలైనా ఏ మాత్రం భయపడకుండా ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చినట్టు ఆమె చెప్పింది. ఇంత వరకూ ఫలితం దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు లోనయ్యామని ఆవేదన వ్యక్తం చేసింది. తమకు రూ.18 లక్షలకు పైగా కమీషన్ రావాలని చెబుతోంది. జిల్లా అధికారులు చొరవ తీసుకుని తమకు కమీషన్ ఇప్పించి న్యాయం చేయాలని ఆమె వేడుకుంటోంది.
కోవూరుకు చెందిన వెంకటరమణమ్మ తోటి మహిళలతో కలిసి 800 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. రూ.18 లక్షలకు పైగా కమీషన్‌ను ప్రభుత్వం వారికి చెల్లించాల్సి ఉంది. కొనుగోళ్లకు సంబంధించి రికార్డులను కూడా సక్రమంగా నమోదు చేసినా ఏవేవో సాకులు చెబుతూ కమీషన్‌ను ఇచ్చేందుకు జాప్యం చేస్తున్నారనేది వెంకటరమణమ్మ ఆరోపణ. కలెక్టర్ శ్రీకాంత్ చొరవ తీసుకుని కమీషన్‌ను చెల్లించి తమ శ్రమకు తగిన ఫలితాన్ని దక్కేట్టు చేయాలని విన్నవిస్తున్నారు.
నెల్లూరు(పొగతోట), న్యూస్‌లైన్ : కష్టానికి తగిన ఫలితం దక్కకపోవడంతో స్వయం సహాయక సంఘాల మహిళలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసినా తమకు ప్రతిఫలం అందలేదని నిర్వేదానికి లోనయ్యారు. 2012లో నాటి కలెక్టర్ ఎన్.శ్రీధర్ స్వయం సహాయక మహిళలతో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి కమీషన్ చెల్లిస్తామని ఆర్భాటంగా ప్రకటించారు. మహిళలు పోటీపడి 1,13,461 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు.
మహిళల శ్రమకు ప్రతిఫలంగా కమీషన్ కింద రూ.3.13 కోట్లు చెల్లించాల్సి ఉంది. రికార్డులు సక్రమంగా లేవనే సాకుతో నాలుగు పర్యాయాలు వాటిని పరిశీలించారు. మండల సమాఖ్య కమిటీ సభ్యులు డీఎస్‌ఓ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు.
పలు దఫాలు రికార్డులు పరిశీలించి గత ఏడాది రూ.1.55 కోట్లు చెల్లించారు. మిగిలిన రూ.1.58 కోట్లు చెల్లించడానికి రికార్డులు సక్రమంగా లేవని అధికారులు సాకులు చెబుతూ జాప్యం చేస్తున్నారు. కమీషన్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న స్వయం సహాయక మహిళలు తీవ్ర నిరాశ, నిస్పృహకు లోనయ్యారు. నార్త్‌రాజుపాళేనికి చెందిన జ్యోతి, కోవూరు నివాసి వెంకటరమణయ్య దళారులతో పోటీపడి ధాన్యం కొనుగోలు చేశారు. వారి కష్టానికి ఇంత వరకూ ఫలితం దక్కలేదు.
బిల్లుల చెల్లింపులో అవకతవకలు
బిల్లుల చెల్లింపుల్లో అనేక అవకతవకలు జరిగాయనే ఆరోపణలు
వెల్తువెత్తాయి. సౌత్‌మోపూరు కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయించిన రైతులకు రూ.70 లక్షలు అధికంగా చెల్లించారు. రికార్డుల పరిశీలనలో ఈ వాస్తవం వెల్లడై రైతుల నుంచి అధికారులు రూ.70 లక్షలు రికవరీ చేశారు. బోగోలు, కావలి మండల సమాఖ్యలకు అధికంగా చెల్లించారని డీపీఎం శంకర్ తెలిపారు. రెండు మండలాల రికార్డులు పూర్తి స్థాయిలో పరిశీలించాల్సింది ఉందని ఆయన వెల్లడించారు.
రూ.125 కోట్ల ధాన్యం కొనుగోలు
2012 వ్యవసాయ సీజన్‌లో 63 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. కేంద్రం ఏర్పాటు చేసిన ప్రాంతంలో స్వయం సహాయక సంఘాల మహిళలతో కమిటీ ఏర్పాటు చేశారు. సభ్యులు రైస్ మిల్లర్లు, దళారులతో పోటీపడి కల్లాల్లోకి వెళ్లి రూ.125 కోట్ల ధాన్యం కొనుగోలు చేశారు. ఇది రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసినట్టు. అధికారులు పాల్పడిన అవకతవకలకు మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటి వరకు కమీషన్ చెల్లించకపోవడంతో మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మహిళల్లో కొరవడిన ఉత్సాహం
కమీషన్ దక్కక పోవడంతో ధాన్యం కొనుగోలు చేసేందుకు మహిళలు ఉత్సాహం చూపడం లేదు. గత ఏడాది 50 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. రూ.1.35 లక్షలకు ధాన్యం కొనుగోలు చేశారు. ప్రస్తుతం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు వలన నష్టం వచ్చింది. ధాన్యం కొనుగోలు చేసినా చేయకపోయినా మహిళలకు కూలీ చెల్లించాలి. కేంద్రం నిర్వహణకు ఖర్చు అవుతుంది.
ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం వలన రైస్ మిల్లర్లు, దళారులు మద్దతు ధరకు మించి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు.
దీంతో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెలవెలపోతున్నాయి. ప్రస్తుతం 35 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే రైస్ మిల్లర్లు, దళారులు ధాన్యం ధరలు తగ్గించి కొనుగోలు చేస్తారు. రైతులకు మద్దతు ధర కల్పించేందుకే కేంద్రాలు ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు.
‘ని’స్సహాయకం
Published Fri, Feb 7 2014 3:53 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement