కాకినాడ రూరల్: రైతు చెంతకే వెళ్లి రబీ ధాన్యం కొనుగోలు చేయనున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. రైతులు తమ పంటల వివరాలను గ్రామ సచివాలయాల్లోని అగ్రికల్చర్ అసిస్టెంట్ల వద్ద నమోదు చేసుకోవాలని, ఆ వివరాల ఆధారంగా నేరుగా రైతుల వద్దకే వెళ్లి కొనుగోలు చేస్తామని వివరించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు (పీపీసీ), మార్క్‌ఫెడ్ ద్వారా ధాన్యం, ఇతర పంటలు కొనుగోలు చేస్తామని తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని తన నివాసంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఈ–క్రాప్‌లో ఉన్న ప్రతి పంటనూ కొనుగోలు చేయడంతో పాటు వెబ్‌ల్యాండ్‌లో లేని భూములను కూడా పరిశీలించి, వాటిలో వరి సాగు ఉంటే ఆ పంట కొనుగోలు చేయాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. ధాన్యం కొనుగోలుకు ప్రతి జిల్లాలో వ్యవసాయ శాఖ జేడీ ఆధ్వర్యంలో బృందాలు ఏర్పాటు చేశామన్నారు. వరి కోత యంత్రాలకు కొరత లేకుండా చూడటం, వాటికి అద్దెను నిర్ణయించడంతో పాటు పర్యవేక్షణ బాధ్యతలను జాయింట్ కలెక్టర్లకు అప్పగించామన్నారు.
మంత్రి ఇంకా ఏమన్నారంటే..
► గత నెల 27 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 57 వేల మెట్రిక్ టన్నుల అరటి కొనుగోళ్లు జరిగాయి.
► మామిడికి స్థానికంగా తక్కువ ధర వస్తే కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాం.
► గుంటూరు జిల్లాలో మిర్చికి సంబంధించి కూలీలు, రవాణా సమస్యలు లేకుండా చర్యలు తీసుకున్నాం. సమస్యలు ఉంటే 1902 నంబర్‌కు రైతులు ఫిర్యాదు చేయాలి.
► వచ్చే ఖరీఫ్‌కు అన్ని రకాలూ కలిపి 8 లక్షల క్వింటాళ్ల విత్తనాలు కావాలి. ఇప్పటికే 6 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉన్నాయి.
► ఏయే జిల్లాల్లో ఏయే పంటలు ఏయే కాలాల్లో దిగుబడికి వస్తాయనే దానిపై పంటల దిగుబడి కేలండర్ రూపొందిస్తున్నాం.
► పశ్చిమ గోదావరి జిల్లాలో కొందరు వ్యాపారులు కరోనా సాకుతో రైతుల నుంచి తక్కువ ధరలకు ధాన్యం కొనుగోలు చేస్తున్నట్టు తెలిసింది. వారిపై చర్యలు తీసుకుంటాం. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం కొనుగోలు చేసి లెవీ చూపేందుకు కొందరు మిల్లర్లు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. వీటికి వారు స్వస్తి చెప్పాలి.
► పట్టుగూళ్లకు సంబంధించి హిందూపురం, ధర్మవరం, కదిరి మార్కెట్లలో కిలోకు రూ. 250 నుంచి రూ. 300 పలుకుతుండగా చేబ్రోలులో రూ.130 మాత్రమే వస్తోంది. దీనిపై ఉద్యానవన కమిషనర్‌తో మాట్లాడి, ఆన్‌లైన్ ట్రేడింగ్ ద్వారా కర్ణాటక, ఇతర రాష్ట్రాల బయ్యర్లను రప్పించాలని కోరాం.
► రాష్ట్రంలో 101 రైతుబజార్లు, 402 డీసెంట్రలైజ్డ్ రైతుబజార్లు, 260 మొబైల్ రైతుబజార్లు, 926 టేక్ హోమ్ డోర్ డెలివరీ, 38,440 కిరాణా, నిత్యావసర సరుకుల దుకాణాలు అందుబాటులో ఉన్నాయి.
► ఆక్వా రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోంది. కుంటి సాకులతో రైతులను వ్యాపారులు నష్టపరిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.
► నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయని, కేంద్ర సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తమదిగా ప్రచారం చేసుకుంటోందనే చౌకబారు ఆరోపణలను టీడీపీ నాయకులు మానుకోవాలి.
రైతు చెంతకే వెళ్లి ధాన్యం కొనుగోలు
Published Mon, Apr 6 2020 3:43 AM | Last Updated on Mon, Apr 6 2020 3:43 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment