
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న రైతు సంక్షేమ చర్యలతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగి ఏటేటా భారీగా ధాన్యం దిగుబడి పెరుగుతోంది. ఇందుకు అనుగుణంగానే పౌరసరఫరాల శాఖ ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడాది ఇప్పటివరకు పౌరసరఫరాల శాఖ 11 లక్షల మంది రైతుల నుండి 62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఇందులో ఖరీఫ్‌లో 3,297 కొనుగోలు కేంద్రాల ద్వారా 8,09,885 మంది రైతుల నుండి 40.41 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసింది. రబీలో ఇప్పటివరకు 3,447 కొనుగోలు కేంద్రాల ద్వారా 3.52 లక్షల మంది రైతుల నుండి 22.31 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిం దని పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ తెలిపారు.
కొనుగోలు కేంద్రాలతో గిట్టుబాటు ధర
పంటకు కనీస గిట్టుబాటు ధర లభిస్తుందన్న భరోసాతో రైతులు ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని అమ్ముకుంటున్నారు. ధాన్యం కొనుగోలు, కొనుగోలు కేంద్రాల సమాచారాన్ని రైతులకు సెల్‌ఫోన్ ద్వారా అందించేలా, కనీస మద్దతు ధర చెల్లింపులతో రైతులకు మరింత ప్రయోజనం కలిగేలా ఆన్‌లైన్ ప్రొక్యూర్‌మెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఓపీఎంఎస్) సాఫ్ట్‌వేర్‌ను పౌరసరఫరాల శాఖ అభివృద్ధి చేసింది. రేషన్ డీలర్ల నుంచి గోనె సంచులను సేకరించింది. ధాన్యం రవాణాలో ఎలాంటి జాప్యం లేకుండా ఏరోజుకారోజు ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తున్నారు. ఫిర్యాదుల స్వీకరణకు పౌరసరఫరాల శాఖ కేంద్ర కార్యాలయంలో ముగ్గురు సీనియర్ అధికారులతో కంట్రోల్ రూంను ఏర్పాటు చేసింది. టోల్ ఫ్రీ నంబర్ 1800 425 00333, వాట్సప్ నంబర్ 7330774444లను అందుబాటులో ఉంచింది. కంట్రోల్ రూంకు 506 ఫిర్యాదులు రాగా 477 పరిష్కరించింది.
ముమ్మర పర్యటనలు
పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ నల్లగొండ, సూర్యాపేట్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో పర్యటించి ధాన్యం కొనుగోళ్లను పరిశీలించారు. అకాల వర్షాలు, మండుటెండల నేపథ్యంలో ధాన్యం సేకరణలో సమస్యలు రాకుండా, రైతులకు ఇబ్బందులు కలగకుండా పౌరసరఫరాల శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి సూచనల మేరకు కమిషనర్ అకున్ సబర్వాల్ ప్రతిరోజూ జిల్లా జాయింట్ కలెక్టర్లు, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్, టెలీ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment