AP: రైతన్నకు అండగా ప్రభుత్వం.. తడిసినా ధాన్యం తీసుకుంటాం | AP Government Promised To Farmers For Buy Wet Grain | Sakshi
Sakshi News home page

AP: రైతన్నకు అండగా ప్రభుత్వం.. తడిసినా ధాన్యం తీసుకుంటాం

Published Fri, May 5 2023 10:41 AM | Last Updated on Fri, May 5 2023 11:27 AM

AP Government Promised To Farmers For Buy Wet Grain - Sakshi

సాక్షి, అమరావతి: అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్ద తిరస్కరించకుండా రైతులకు అండగా ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ తెలిపారు. తడిసిన ధాన్యాన్ని చూసి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. మిల్లర్లు, ప్రైవేట్‌ వ్యాపారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రైతులకు ఇబ్బంది కలగకుండా తొలుత తడిసిన ధాన్యాన్ని ఆఫ్‌లైన్‌లో సేకరించేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.

గురువారం సచివాలయంలో వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ‘కొనసాగుతున్న వర్ష సూచనలతో రైతులు బయట ధాన్యాన్ని ఆరబెట్టుకోలేని పరిస్థితి నెలకొంది. అటువంటి ధాన్యాన్ని ఆఫ్‌లైన్‌లో సేకరించి డ్రయర్‌ సౌకర్యం, డ్రయర్‌ ప్లాట్‌ఫారమ్‌ ఉన్న మిల్లులకు తరలిస్తున్నాం. అక్కడ ఆరబోత తర్వాత ఎఫ్‌ఏక్యూ నిబంధనల ప్రకారం కొనుగోలు చేస్తాం’ అని తెలిపారు. రబీలో 30 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని ప్రాథమికంగా అంచనా వేసినట్లు చెప్పారు. దీనికి అదనంగా ఆర్బీకేల వద్దకు ధాన్యం తెచ్చే ప్రతి రైతుకూ  మద్దతు ధర అందిస్తామన్నారు.

ఇప్పటివరకు 5.22 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 55 వేల మంది రైతులకు 21 రోజుల్లోపే రూ.803 కోట్లు చెల్లింపులు చేసినట్లు వెల్లడించారు. ధాన్యాన్ని వేగంగా కల్లాల నుంచి మిల్లులకు తరలించేందుకు రవాణా కోసం ఐదు గోదావరి జిల్లాలకు కలెక్టర్‌ కార్పస్‌ ఫండ్‌ కింద రూ.కోటి చొప్పున కేటాయించామన్నారు. కోటా పూర్తవగానే తిరిగి నిధులు అందిస్తామన్నారు. గత ఖరీఫ్‌లో 6.40 లక్షల మంది రైతుల నుంచి 35.41 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు చెప్పారు. దాదాపు రూ.7,208 కోట్లు (99 శాతం) చెల్లింపులు పూర్తి చేసినట్లు వెల్లడించారు. ధాన్యం సేకరణలో ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే టోల్‌ఫ్రీ నంబర్‌ 1967కు ఫిర్యాదు చేయాలని కోరారు.  

తొలిసారిగా జయ రకానికి మద్దతు ధర 
తొలిసారిగా రాష్ట్రంలో 5 లక్షల టన్నుల బొండాలు (జయ రకం) ధాన్యం మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. ఫలితంగా బయట మార్కెట్‌లో జయ రకం ధాన్యానికి మంచి ధర పలుకుతోందన్నారు. వేసవి ప్రారంభంలో పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా కొన్ని నియోజకవర్గాల్లో ధాన్యంలో నూక శాతం పెరిగినట్లు తెలిపారు. వీటిని బాయిల్డ్‌ రైస్‌    కింద కొనుగోలు చేస్తామన్నారు.  

గోనె సంచులకు కొరత లేదు 
వర్షాల నేపథ్యంలో నిత్యం ప్రతి జిల్లాలో అధికారులతో సమన్వయం చేసుకుంటూ వేగంగా ధాన్యాన్ని తరలిస్తున్నట్లు పౌరసరఫరాల కార్పొరేషన్‌ ఎండీ వీరపాండియన్‌ చెప్పారు. ఎక్కడా గోనె సంచులకు కొరత లేదన్నారు. ధాన్యం సేకరణలో రైతులను ఇబ్బందులకు గురి చేసిన 31 మిల్లులపై చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

8 వరకు వర్షాలు..  తగ్గగానే పంట నష్టం అంచనా 
వర్షాల కారణంగా పంట దెబ్బతిన్న రైతులను వేగంగా ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది చెప్పారు. ఈ నెల 8వ తేదీ వరకు వర్ష సూచన ఉందన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన వెంటనే పంట నష్టం అంచనాలు, ఆర్బీకేల్లో సోషల్‌ ఆడిట్‌ పూర్తి చేసి రెండు వారాల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామన్నారు. ఎక్కువగా జొన్న, మొక్కజొన్న, వరి పంటలు ముంపునకు గురైనట్టు ప్రాథమికంగా తెలుస్తోందన్నారు. మొక్కజొన్నను మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేస్తున్నట్టు చెప్పారు. వర్షాల నుంచి పంటలను రక్షించుకునేందుకు శాస్త్రవేత్తలు, కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా రైతులకు సూచనలు అందిస్తున్నట్లు తెలిపారు. క్షేత్ర స్థాయిలో రైతులకు ఇబ్బందులుంటే వ్యవసాయశాఖ టోల్‌ ఫ్రీ నంబర్‌ 155251కు ఫిర్యాదు చేయాలని కోరారు.

ఖరీఫ్‌ సీజన్‌కు ముందే పరిహారం 
రెండు నెలల క్రితం మార్చిలో కురిసిన అకాల వర్షాలతో 23,473 హెక్టార్లలో వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బ తిన్నట్లు వ్యవసాయ శాఖ స్పెషల్‌ కమిషనర్‌ హరికిరణ్‌ తెలిపారు. దాదాపు రూ.34.22 కోట్ల పంట నష్ట పరిహారాన్ని రైతులకు ఖరీఫ్‌ సీజన్‌కు ముందుగానే జమ చేస్తామన్నారు. వాటితో పాటే ప్రస్తుతం వర్షాలకు దెబ్బతిన్న పంట నష్టాన్ని అంచనా వేసి ఆ పరిహారాన్ని కూడా రైతులకు ఈ నెలాఖరులోగా అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే ఆ సీజన్‌ ముగియక ముందే రైతులకు పరిహారాన్ని చెల్లిస్తున్నట్లు వివరించారు. ఇప్పటివరకు రూ.1,911 కోట్ల మేర పంట నష్టం పరిహారాన్ని అందించినట్లు వెల్లడించారు.

ఇది కూడా చదవండి:  ఆర్టీసీలో మల్టీ సిటీ టికెటింగ్‌ సదుపాయం 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement