భువనగిరి మండలం బొల్లేపల్లి రైతు వేదిక సంబురాలలో అయిల్ ఫెడ్ చైర్మన్, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డితో డీసీసీ అధ్యక్షుడు అనిల్ కుమార్‌రెడ్డి వాగ్వాదం
సాక్షి నెట్‌వర్క్: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం శనివారం చేపట్టిన రైతు దినోత్సవ కార్యక్రమం పలుచోట్ల రసాభాసగా మా రింది. ధాన్యం కొనుగోళ్లు సరిగా చేపట్టక ఇబ్బందుల పాలయ్యామని.. అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోయి నష్టపోయామని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. పంట నష్టపోయిన వారికి ఇస్తామన్న పరిహారం ఏమైపోయిందని ప్రశ్నించారు. కాంగ్రెస్, ఇతర పార్టీల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు కూడా రైతు దినోత్సవ కార్యక్రమాల వద్ద నిరసనలు వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదని.. రూ.లక్ష రుణమాఫీ చేయలేదేమని నిలదీశారు.
రైతు వేదికపై వడ్లు కుమ్మరించి..
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లిలో రైతువేదికపై భిక్షపతి అనే రైతు మొలకెత్తిన వడ్లను కుమ్మరించి నిరసన వ్యక్తం చేశారు. తన ధాన్యాన్ని సమీపంలోని సర్దార్‌నగర్ మార్కెట్‌కు తీసుకెళ్లినా.. కొనుగోలు కేంద్రం తెరుచుకోలేదని, వ్యాపారులు తక్కువ ధరకు అడిగారని వాపోయారు. మరికొందరు రైతులు కూడా అకాల వర్షాలకు పంట నష్టం, పరిహారం అందని తీరు, కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలపై నిలదీశారు.
మంత్రి క్యాంపు ఆఫీసు ఎదుట ధాన్యం పోసి..
తేమ, తాలు పేరిట ఇటు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, అటు మిల్లర్లు దోచుకుంటున్నారన్న ఆవేదనతో జగిత్యాల జిల్లా కమలాపూర్‌కు చెందిన రైతు సట్టంశెట్టి రాజన్న ధర్మపురిలోని మంత్రి కొప్పుల ఈశ్వర్ క్యాంపు కార్యాలయం ఎదుట ధాన్యం కుప్పపోసి నిరసన తెలిపాడు.
రైతులకు ఏం చేశారని సంబురాలు?
యాదాద్రి జిల్లా భువనగిరి మండలం బొల్లేపల్లి రైతు వేదిక వద్ద కాంగ్రెస్ నేతలు, రైతులు రైతు దినోత్సవ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. ధాన్యం కొనుగోలు చేయకుండా, రైతు రుణమాఫీ పూర్తి చేయకుండా.. ఏం చేశారని రైతు సంబరాలు జరుపుతున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ శ్రేణుల మధ్య తోపులాట జరిగాయి.
ఎంపీ కవితను నిలదీసిన రైతులు
మహబూబాబాద్ జిల్లా జంగిలిగొండలో రైతు దినోత్సవ కార్యక్రమానికి హాజరైన ఎంపీ కవితను పలువురు రైతులు ధాన్యం కొనుగోళ్లపై నిలదీశారు. ఎంపీ ప్రసంగిస్తుండగా లేచి.. కొనుగోళ్లు సరిగా జరగడం లేదని, కొన్నా లారీలు రాక బస్తాలు కేంద్రాల్లోనే ఉండిపోతున్నాయని.. వానలకు తడిసి నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
రుణమాఫీ చేసేదెప్పుడు?
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం మండ్రాజుపల్లిలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డిని రుణమాఫీపై రైతులు నిలదీశారు. ‘రైతుబంధు వస్తోంది కదా..’అని ఎమ్మెల్యే పేర్కొనగా రుణాలపై తాము కట్టే వడ్డీకే ఆ డబ్బులు సరిపోవడం లేదని రైతులు మండిపడ్డారు. ధాన్యం కొ నుగోళ్లలో అక్రమాలనూ ప్రస్తావించారు. దీనితో ఎ మ్మెల్యే అసహనంతో వెళ్లిపోయారు.
కార్యక్రమాలను బహిష్కరించి నిరసన
ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం, పంట నష్టపరిహారం అందకపోవడానికి నిరసనగా సిరిసిల్ల జిల్లాలో పలుచోట్ల రైతులు నిరసనలు తెలిపారు. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌లో సభను బహిష్కరించగా, ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్‌లో రైతువేదికకు తాళం వేశారు. చందుర్తి మండల వ్యాప్తంగా రైతు సభలను బహిష్కరించారు.
నష్టపరిహారం అందేదెప్పుడు?
వరంగల్ తూర్పుకోటలో జరిగిన కార్యక్రమంలో మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ ప్రసంగిస్తుండగా.. రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. పంటనష్టంపై పరిహారం ఏదంటూ నిలదీశారు.
రైతుబంధు రావట్లేదా? సిగ్గు లేదా?
రైతుపై ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి ఆగ్రహం
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని అబాది జమ్మికుంట రైతు దినోత్సవ కార్యక్రమంలో ఓ రైతుపై ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ పాడి కౌశిక్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట నష్టపరిహారం ఇస్తామని మూడు నెలలైనా.. ఇంకా ఎందుకు ఇవ్వడం లేదని బుర్ర కుమార్ అనే రైతు ప్రశ్నించారు. ధాన్యం కొనుగోళ్లలో బస్తాకు రెండు కిలోలు కోత పెడుతున్నారని పేర్కొన్నాడు. దీనిపై స్పందించిన కౌశిక్‌రెడ్డి.. ‘నీకు రైతుబంధు రావడం లేదా? నీకు సిగ్గు, శరం లేదా?’అంటూ తీవ్ర పదజాలంతో మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment