వాషింగ్టన్: ‘బర్త్ టూరిజం’ను నిరోధించే దిశగా అమెరికా గురువారం సరికొత్త వీసా నిబంధనలను తీసుకువచ్చింది. అమెరికాలో జన్మిస్తే తమ పిల్లలకు ఆ దేశ పౌరసత్వం లభిస్తుందనే ఉద్దేశంతో అమెరికాకు వచ్చే గర్భిణులు లక్ష్యంగా ఈ నిబంధనలను రూపొందించారు. పౌరసత్వం కోసమే అమెరికాలో జన్మనిచ్చేందుకు వస్తున్నారని వీసా అధికారులు నిర్ధారిస్తే.. వారి వీసా దరఖాస్తులను తిరస్కరించేలా ఈ నిబంధనలను రూపొందించారు. అయితే, అమెరికాకు వైద్య చికిత్సకు వస్తున్నారా? లేక పౌరసత్వం కోసమే అమెరికాలో పిల్లలకు జన్మనివ్వాలనుకుంటున్నారా? అనేది నిర్ధారించడం కీలకంగా మారింది. (‘హెచ్1’ దెబ్బ అమెరికాకే..!)
వైద్య చికిత్స కోసం వచ్చేవారైతే.. వారిని అమెరికాలో లభించే ఆధునిక చికిత్స కోసం వచ్చే సాధారణ విదేశీయులుగానే పరిగణిస్తామని తాజా నిబంధనల్లో పొందుపర్చారు. వైద్యం కోసం వస్తున్నామని, అందుకు అవసరమైన డబ్బు తమ వద్ద ఉందని దరఖాస్తుదారులు నిర్ధారించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు శుక్రవారం నుంచి అమల్లోకి వస్తాయని అధికారులు వెల్లడించారు. యూఎస్‌లో పిల్లలకు జన్మనిచ్చేందుకు రావడం చట్టప్రకారం న్యాయమే. అయితే, వీసా మోసాలు, పన్ను ఎగవేతలకు సంబంధించి కొందరు బర్త్ టూరిజం ఏజెంట్లను గతంలో అరెస్ట్ చేసిన దృష్టాంతాలున్నాయి. (‘హెచ్–1బీ’కి ఇక ఇ–రిజిస్ట్రేషన్)
వలస నిబంధనలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే. అందులో అమెరికాలో జన్మించినవారికి పౌరసత్వం కల్పించే నిబంధన కూడా ఒకటి. దీనిని తొలగిస్తామని ఆయన గతంలోనూ హెచ్చరించారు. అయితే, అది అంత సులభం కాదని అధికారులు హెచ్చరించడంతో ఆగిపోయారు. గర్భిణులకు టూరిస్ట్ వీసా ఇచ్చే సమయంలోనే.. వారిని అడ్డుకోవాలనే ప్రతిపాదన వచ్చినా.. అది ఆచరణ సాధ్యం కాదని అప్పట్లో భావించారు. అమెరికా సహా పలు విదేశాల్లో ‘బర్త్ టూరిజం’ లాభదాయక బిజినెస్. ఇందుకు కొన్ని కంపెనీలు ప్రచారం సైతం నిర్వహిస్తుంటాయి. అమెరికాకు రావడం నుంచి డెలివరీ వరకు మొత్తం ప్రక్రియకు 80 వేల డాలర్ల వరకు చార్జ్ చేస్తుంటారు. ఇందుకోసం అమెరికాకు చైనా, రష్యాల నుంచి ఎక్కువగా వస్తుంటారు. 2012లో దాదాపు 36 వేల మంది విదేశీ గర్భిణులు అమెరికాకు వచ్చి, డెలివరీ తర్వాత సొంత దేశానికి వెళ్లారని సమాచారం. (హెచ్1బీ వీసాదారులకు శుభవార్త)
Comments
Please login to add a commentAdd a comment