రూ.44 కోట్ల విలువైన గోల్డ్‌ కార్డు ‍ప్రదర్శించిన ట్రంప్‌ | Donald Trump Unveils First Look Of Gold Card Visa Worth 5 Million USD, Here's All You Need To Know | Sakshi

US Gold Card First Look: రూ.44 కోట్ల విలువైన గోల్డ్‌ కార్డు ‍ప్రదర్శించిన ట్రంప్‌

Apr 4 2025 10:25 AM | Updated on Apr 4 2025 12:16 PM

Donald Trump showed off Gold Card worth 5 million USD

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఐదు మిలియన్ డాలర్ల(సుమారు రూ.44 కోట్లు) విలువైన కొత్త గోల్డ్ కార్డును ప్రదర్శించారు. ఇది మరో రెండు వారాల్లో అందుబాటులోకి వస్తుందని చెప్పారు. దాని మొదటి కొనుగోలుదారు ఎవరని విలేకరుల సమావేశంలో రిపోర్టర్‌ అడిగిన సమాధానానికి బదులిస్తూ ట్రంప్ తానేనన్నారు. ఐదు మిలియన్‌ డాలర్లు వెచ్చిస్తే గోల్డెన్‌ కార్డు మీది కూడా అవ్వొచ్చని చెప్పారు.

సంపన్న విదేశీయులకు గోల్డ్ కార్డులను అందించడానికి ట్రంప్ ఈ కొత్త ప్రణాళికను ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టారు. ఇది వారికి యూఎస్ రెసిడెన్సీ, పౌరసత్వానికి అవకాశం కల్పిస్తుంది. దాంతోపాటు అమెరికా ఖజానాకు ట్రిలియన్ల ఆదాయాన్ని సృష్టించగలదని, ఇది దేశ రుణాన్ని తగ్గించడానికి దోహదం చేస్తుందని గతంలో తెలిపారు. కొత్త గోల్డెన్‌ కార్డు కొంత వరకు గ్రీన్ కార్డు మాదిరి వెసులుబాటు అందిస్తున్నా ప్రధానంగా సంపన్నులపై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తుంది.

గోల్డెన్‌ కార్డులు

అమెరికాలో పెట్టుబడిదారుల కోసం 35 ఏళ్ల క్రితం ప్రవేశపెట్టిన వీసా(ఈబీ-5 వీసా) పాలసీని ట్రంప్‌ మార్చాలని యోచించారు. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులకు ‘గోల్డ్ కార్డ్’ వీసాను మంజూరు చేశారు. ఈ వీసాను ఐదు మిలియన్‌ డాలర్లను వెచ్చించి పొందాల్సి ఉంటుంది. ఈ వీసాను పొందే వ్యక్తులు అమెరికాలో ధనవంతులై ప్రభుత్వానికి పన్నులు చెల్లించే అవకాశం ఉందని వ్యాఖ్యలు చేశారు. ఇది గ్రీన్ కార్డు తరహా సౌలభ్యాలను ఇస్తుందని, ఇది అమెరికన్ పౌరసత్వానికి ఒక మార్గం కాబోతుందన్నారు. ఈ కార్డును కొనుగోలు చేయడం ద్వారా సంపన్నులు తన దేశంలోకి వస్తారని ఆయన అన్నారు.

ఈ తరహా ‘గోల్డెన్‌ వీసా’లు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 100 కంటే ఎక్కువ దేశాలు జారీ చేస్తున్నాయి. యూకే, స్పెయిన్‌, గ్రీస్‌, మాల్టా, ఆస్ట్రేలియా, కెనడా, ఇటలీ వంటి దేశాలు పెట్టుబడులను ఆకర్షించేందుకు సంపన్నులకు ఈ వీసాలు ఇస్తున్నాయి. తాజాగా ట్రంప్‌ కూడా ఇదే తరహా విధానాన్ని అమలు చేస్తున్నారు.

ఈబీ-5 వీసాలు

యూఎస్ సిటిజెన్​షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్​సీఐఎస్) వెబ్‌సైట్‌ ప్రకారం, ఈబీ-5 వీసా విధానాన్ని.. ఉద్యోగ కల్పన-విదేశీ పెట్టుబడిదారుల మూలధన పెట్టుబడుల ద్వారా యూఎస్ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి 1990లో కాంగ్రెస్​ ఆమోదించింది. 2021 సెప్టెంబరు నుంచి 2022 సెప్టెంబరు 30వ తేదీ వరకు దాదాపు 8వేల మంది ఈ వీసాలను పొందారు.

ఈబీ-5 ద్వారా పెట్టుబడిదారులు, వారి జీవిత భాగస్వాములు.. 21 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న అవివాహిత పిల్లలు నాన్-టార్గెటెడ్ ఎంప్లాయిమెంట్ ఏరియా (టీఈఏ) ప్రాజెక్టులో 1.8 మిలియన్ డాలర్లు లేదా టీఈఏ ప్రాజెక్టులో కనీసం 8,00,000 డాలర్లు పెట్టుబడి పెడితే శాశ్వత నివాసానికి అర్హులు. అయితే, ఈ వీసా విధానంతో మోసాలు జరుగుతున్నాయని, కొందరు అక్రమంగా నిధులు పొందుతున్నారని అధికారులు గుర్తించారు.

ఇదీ చదవండి: వజ్రాల వ్యాపారం గతి తప్పుతుందా..?

రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ అధికారం చేపట్టిన తర్వాత జన్మతః పౌరసత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. అక్రమ వలసదారులకు, తాత్కాలిక వీసాపై అమెరికాకు వచ్చిన వారికి పుట్టే పిల్లలకు లభించే జన్మతః పౌరసత్వాన్ని తమ ఫెడరల్‌ ప్రభుత్వం గుర్తించబోదని ట్రంప్‌ తెలిపారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ జారీ చేశారు. 1868లో చేసిన 14వ రాజ్యాంగ సవరణ ప్రకారం అప్పటి నుంచి ఈ జన్మతః పౌరసత్వ విధానం కొనసాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement