
ఆ‘పరేషాన్’!
– బాలింతకు నరకయాతన
– సిజేరియన్ చేశాక ఆగని రక్తస్రావం
– మళ్లీ ఆపరేషన్ చేసినా మెరుగుపడని ఆరోగ్యం
– సర్వజన్పాత్రిలో మృత్యువుతో పోరాడుతున్న వైనం
– సీనియర్ రెసిడెంట్ తీరుపై బాధితుల మండిపాటు
అనంతపురం మెడికల్: వైద్యుల నిర్లక్ష్యానికి ఓ బాలింత మృత్యువుతో పోరాడుతోంది. సిజేరియన్ చేసినా రక్తస్రావం ఆగకపోవడంతో మళ్లీ ఆపరేషన్ చేశారు. అయినా ఆరోగ్య పరిస్థితిలో మార్పు రాలేదు. ఈ సమయంలో మనోధైర్యం నింపాల్సిన వైద్యులు నిర్లక్ష్యంగా మాట్లాడుతుండడంతో కుటుంబ సభ్యులు ఆవేదనకు అంతు లేకుండా పోతోంది. కుటుంబసభ్యుల కథనం మేరకు.. తలుపుల మండలం ఎస్.రెడ్డివారిపల్లికి చెందిన శివలక్ష్మి (28), హరిబాబు దంపతులకు ఇద్దరు ఆడపిల్లలున్నారు. మూడో కాన్పు కోసం ఆరు రోజుల క్రితం జిల్లా సర్వజనాస్పత్రికి శివలక్ష్మిని పిలుచుకువచ్చారు. సాధారణ ప్రసవం అయ్యే పరిస్థితి లేకపోవడంతో సోమవారం ఉదయం డాక్టర్ విజయలక్ష్మి సిజేరియన్ చేసి మగ బిడ్డను తీశారు. ఆ తర్వాత శివలక్ష్మికి రక్తస్రావం ఎక్కువైంది. భరించలేని కడుపు నొప్పితో నరకయాతన అనుభవించింది. దీంతో అదే రోజు మరోసారి సర్జన్‌తో కలిసి ఆపరేషన్ చేశారు. అయితే మంగళవారం ఉదయం కూడా ఆమెకు రక్తస్రావం ఆగలేదు. పైగా ఆరోగ్యం క్షీణించడంతో అక్యూర్డ్ మెడికల్ కేర్ (ఏఎంసీ)లో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.
సీనియర్ రెసిడెంట్ ఓవరాక‌్షన్
ఓ వైపు శివలక్ష్మి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంటే ఏఎంసీలో విధులు నిర్వర్తిస్తున్న సీనియర్ రెసిడెంట్ (ఎస్‌ఆర్) డాక్టర్ ప్రదీప్ వ్యవహార శైలి విమర్శలకు తావిచ్చింది. శివలక్ష్మి ఆరోగ్య పరిస్థితిపై ‘మీడియా’ ఆరా తీస్తుండగా అక్కడకు వచ్చిన ఆయన ‘ఇలాంటివి రాయడం వల్ల మీకేం వస్తుంది.. హాస్పిటల్ అన్నాక బ్యాడ్ కేసులు వస్తాయి.. ఏదో ఒకటి జరుగుతుంది.. ఎందుకు ఫొటోలు తీస్తున్నారు’ అని చెప్పడంతో అక్కడే ఉన్న బాలింత కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శివలక్ష్మి మేనత్త రామలక్ష్మి కల్పించుకుని ‘రాత్రి నుంచి ఇలాగే ఉంది.. ఎవరూ పట్టించుకోవడం లేదు. బీపీ పెరుగుతోందని వస్తారు.. వెళ్తారు.. తగ్గుతుందిలే అంటున్నారు.’ అని ఆవేదన వ్యక్తం చేసింది. పెద్ద డాక్టర్లు వచ్చి వాళ్లలో వాళ్లే మాట్లాడుకుని వెళ్తున్నారు..బ్లడ్ ఎక్కువగా పోతోంది.. వీళ్లు (సీనియర్ రెసిడెంట్‌ను చూపిస్తూ) చూస్తే ఇలా మాట్లాడతారు’ అంటూ మండిపడింది. అప్పటికే శివలక్ష్మి కేస్‌షీట్‌ను పరిశీలిస్తున్న డాక్టర్ ప్రదీప్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువు
సర్వజనాస్పత్రిలోని గైనిక్ విభాగంలో తరచూ గర్భిణులు, బాలింతలు నరకయాతన అనుభవిస్తున్నారు. ఇటీవల విడపనకల్లు మండలానికి చెందిన ఓ బాలింత సైతం నిర్లక్ష్య వైద్యం కారణంగా మృతి చెందింది. గర్భిణుల పరిస్థితి మరీ ఘోరం. పరిస్థితి ఇంత అధ్వానంగా తయారవుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకుంటున్న దాఖలాల్లేవు. కేవలం చాంబర్‌కు పిలిపించి విచారణ పేరుతో కాలయాపన చేయడం మినహా కఠిన చర్యలు తీసుకోకపోవడంతో అమాయక ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్న సందర్భాలున్నాయి. పైగా వైద్య సేవలు అందించే సమయంలో బాధితుల్లో మనోస్థైర్యాన్ని నింపాల్సిన వైద్యులే ప్రాణమంటే ‘లెక్క’ లేకుండా మాట్లాడుతుండడంతో బాధిత కుటుంబ సభ్యుల ఆవేదనకు అంతు లేకుండా పోతోంది.
ఆరోగ్య పరిస్థితిపై ఆరా
శివలక్ష్మి ఆరోగ్య పరిస్థితిపై ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ కేఎస్‌ఎస్ వెంకటేశ్వరరావు ఆరా తీశారు. మంగళవారం మధ్యాహ్నం ఏఎంసీ ఇన్‌చార్జ్ డాక్టర్ భీమసేన ఆచార్‌కు ఫోన్ చేసి ఆపరేషన్ జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు.