independence movement
-
ఆయన భారతదేశానికి ప్రతీక
• ధ్రువతారలు ఏప్రిల్ 10, 1917. చంపారన్ రైతు నాయకుడు రాజ్‌కుమార్ శుక్లా ఒక వ్యక్తిని తీసుకుని తమ కేసును వాదిస్తున్న న్యాయవాది ఇంటికి వెళ్లారు. నీలిమందు పంటనే పండించాలంటూ ఆంగ్ల ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘిస్తూ బిహార్‌లోని ఆ ప్రాంత రైతాంగం ఉద్యమిస్తున్నది. పట్నాలో ఉన్న న్యాయవాది ఇంటికి శుక్లా తీసుకువెళ్లిన ఆ నల్లటి వ్యక్తి రైతు ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడానికి ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నారు. చూడ్డానికి రైతులాగే ఉన్నారు. తీరా న్యాయవాది పొరుగూరు వెళ్లారు. మహారాష్ట్ర నుంచి మూడో తరగతి పెట్టెలో ప్రయాణించి బిహార్ వచ్చిన ఆ నల్లటి వ్యక్తి తమ బావి వద్ద స్నానం చేయడానికి న్యాయవాది నౌకర్లు అంగీకరించలేదు. పాయఖానాలు ఉపయోగించడానికి కూడా అనుమతించలేదు. శుక్లా, ఆ నల్లటి వ్యక్తి, వీరి వెంటే ఉన్న రైతు బృందం మరొకరి ఇంటికి వెళ్లిపోయారు. ఆ నల్లటి వ్యక్తి మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ. అప్పటికే దైవంతో సమానంగా ఆరాధిస్తున్న గాంధీజీ తన ఇంటిని సందర్శించినప్పుడు పొరుగూరు వెళ్లిన ఆ న్యాయవాది బాబూ రాజేంద్రప్రసాద్. బాబూ రాజేంద్రప్రసాద్ (డిసెంబర్ 3, 1884–ఫిబ్రవరి 28, 1963) స్వతంత్ర భారత తొలి రాష్ట్రపతి (1950–1962). స్వాతంత్య్రోద్యమంలో గాంధీజీతో ఏ విషయంలోను విభేదించకుండా ఉన్న అనుచరుడు బహుశా రాజేంద్రప్రసాద్ (రాజేన్‌బాబు) కావచ్చు. స్వరాజ్య సమరయోధులలో ప్రముఖులంతా గాంధీజీతో ఏదో ఒక అంశంలో విభేదించినవారేనన్నది చారిత్రక సత్యం. అందుకు రాజేంద్రప్రసాద్ రాసిన ‘గాంధీజీ పాదాల వద్ద’ అన్న పుస్తకమే నిదర్శనం. మనసా వాచా గాంధీజీ సిద్ధాంతాన్ని పాటించిన నాయకుడు రాజెన్‌బాబు. ఆయన మేధస్సు, ఆదర్శవంతమైన జీవితం ఎందరినో ప్రభావితులను చేశాయి. వారిలో రాహుల్ సాంకృత్యాయన్ కూడా ఒకరు. రాజెన్‌బాబు బిహార్‌లోని జెరదాయి అనే చోట పుట్టారు. సంపన్న కుటుంబం వారిది. తండ్రి మహదేవ సాహే, తల్లి కమలేశ్వరీదేవి. ఈమెకు రాజెన్‌బాబు ఆఖరి సంతానం. ఆయన చిన్నతనంలోనే కన్నుమూశారు. దీనితో పెద్దక్క పెంపకంలో పెరిగారు. ఆనాటికి వారి స్వగ్రామంలో పాఠశాల లేదు. ఒక ముస్లిం మత గురువును నియమించి పర్షియన్, హిందీ, అర్థమేటిక్ ఇంటి దగ్గరే తండ్రి చెప్పించారు. సాహే కూడా మంచి పండితుడు. ప్రాథమిక విద్య పూర్తయిన తరువాత చాప్రా జిల్లా పాఠశాలలో చేరారు. కలకత్తా విశ్వవిద్యాలయం ప్రవేశ పరీక్ష రాసి ప్రథమ స్థానంలో నిలిచారు. దీనితో నెలకి రూ. 30 విద్యార్థి వేతనం కూడా లభించేది. 1902లో కలకత్తా ప్రెసిడెన్సీ కళాశాలలో చేరారు. 1904లో ఎఫ్ఏలో ఉత్తీర్ణులయ్యారు. 1905లో ప్రథమ శ్రేణితో పట్టభద్రుడయ్యారు. రాజేన్‌బాబు సైన్స్ విద్యార్థి. అప్పటి ఆయన గురువులు జగదీశ్చంద్ర బోస్, ప్రఫుల్లచంద్ర రాయ్. పరీక్షలలో రాజేన్‌బాబు ఇచ్చిన జవాబు పత్రాన్ని చూసి ఒక పరీక్షకుడు ఇచ్చిన కితాబు ఇది, ‘పరీక్షకుని కంటే పరీక్ష రాసిన విద్యార్థే మెరుగ్గా ఉన్నారు.’ అప్పుడే బెంగాల్ విభజన వ్యతిరేకోద్యమం మొదలయింది. రాజేన్‌బాబు, ఆయన సోదరుడు ఈడెన్ హిందూ విద్యార్థి వసతిగృహంలో ఉండేవారు. అక్కడ ఒక విద్యార్థి విదేశీ వస్తు దహనం నిర్వహించాడు. ఆ రోజున తన వద్ద వెతికితే ఒక్క విదేశీ వస్తువు కూడా రాజేన్‌కు దొరకలేదు. అది ఆ కుటుంబానికి ఉన్న నిబద్ధత. తరువాత అక్కడే ఎంఏ అర్థశాస్త్రం చదువుకున్నారు. గోఖలే స్థాపించిన సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ, డాన్ సొసైటీ ఆఫ్ ఇండియా (దీనిని ఆంగ్లేయులకు విశ్వవిద్యాలయాల మీద అసాధారణ అధికారాలు కట్టబెట్టే 1902 చట్టానికి వ్యతిరేకంగా సతీశ్‌చంద్ర ముఖర్జీ స్థాపించిన ఉద్యమ సంస్థ)లలో కూడా ఆయన పనిచేశారు. డాన్ సొసైటీలో రవీంద్రనాథ్ టాగోర్, అరవింద్ ఘోష్, రాజా సుబోద్ చంద్రమల్లిక్, రాయ్‌చౌదరి వంటివారు సభ్యులుగా ఉండేవారు. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీలో చేరవలసిందని స్వయంగా గోఖలే ఆయనను కోరారు. నిజానికి రాజేన్‌బాబు నాయకత్వ జీవితానికి ప్రెసిడెన్సీ కళాశాలలోనే బీజాలు పడినాయి. అక్కడ విద్యార్థి సంఘానికి ఆయన కార్యదర్శిగా ఎంపికయ్యారు. 1906లో న్యాయశాస్త్రం మీద దృష్టి పెట్టినప్పుడు బెంగాల్ విభజన వ్యతిరేకరోద్యమం మొదలైంది. కలకత్తా సిటీ కాలేజీలో అర్థశాస్త్ర ఆచార్యునిగా పనిచేస్తూనే ఆయన నాటి రిప్పన్ కాలేజీలో న్యాయశాస్త్రం చదివారు. 1911లో ఆయన కలకత్తా హైకోర్టులో న్యాయవాదిగా నమోదైన తరువాత విభజన నిర్ణయం వెనక్కి వెళ్లింది. అంటే బెంగాల్ విభజన వ్యతిరేకోద్యమానికి ఆయన ప్రత్యక్షసాక్షి. అదే ఆయన రాజకీయ వ్యక్తిత్వం మీద గట్టి ప్రభావమే కనిపించింది. 1915లో న్యాయశాస్త్రంలోనే పోస్టుగ్రాడ్యుయేషన్ చేశారు. 1916లో న్యాయవాద వృత్తిని స్వీకరించారు. 1937లో అలహాబాద్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలోనే పరిశోధన పూర్తి చేశారు. ఉద్యమం, చదువు రాజేన్‌బాబు జీవితంలో రెండుకళ్లలా కనిపిస్తాయి. బెంగాల్ విభజన వేడి మొదలయ్యాక 1906లో కలకత్తాలో భారత జాతీయ కాంగ్రెస్ సభలు జరిగాయి. ఆ సభలలో ఆయన స్వచ్ఛంద సేవకుడు. మళ్లీ 1911లో కలకత్తాలోనే వార్షిక సమావేశాలు జరినప్పుడు లాంఛనంగా ఆ సంస్థలో సభ్యులయ్యారు. 1916 నాటి లక్నో కాంగ్రెస్ సమావేశాలలో గాంధీజీతో తొలిసారి సమావేశమయ్యారు. అప్పుడే చంపారన్ రైతుల ఉద్యమం కోసం గాంధీజీ ముందుకొచ్చారు. 1920 నాటి సహాయ నిరాకరణ ఉద్యమ తీర్మానం ఆమోదించిన తరువాత రాజేన్‌బాబు అటు ఆచార్య పదవిని, ఇటు న్యాయవాద వృత్తిని విడిచిపెట్టి గాంధీ వెంట ఉండిపోయారు. అప్పటికే ఆ రెండు వృత్తులతో ఆయన విశేషంగా ఆర్జిస్తున్నారు. గాంథీజీ ప్రవచించిన స్వదేశీ విద్య నినాదాన్ని తన కుటుంబంలో అమలు చేశారు. తన కుమారుడు మృత్యుంజయ ప్రసాద్‌ను బిహార్ విద్యాపీఠంలో చేర్పించారు. రెండు పర్యాయాలు రాజేన్‌బాబు జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎంపికయ్యారు. మొదటిసారి 1934 నాటి బొంబాయి కాంగ్రెస్‌కు అధ్యక్షుడు ఆయనే. 1939లో నేతాజీ బోస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తరువాత ఆ పదవిని అలంకరించినవారు రాజేన్‌బాబు. చివరిసారి క్విట్ ఇండియా ఉద్యమంలో అరెస్టయిన రాజేన్‌బాబు 1945లో విడుదలయ్యారు. 1946 లో నెహ్రూ నాయకత్వంలో పన్నెండు మందితో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వంలో ఆయన ఆహార, వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ సంవత్సరం డిసెంబర్ 11న ఆయనకు మరొక ప్రతిష్ఠాత్మక బాధ్యతను భారతదేశం అప్పగించింది. అదే– స్వతంత్ర భారతదేశానికి రాజ్యాంగం నిర్మించడానికి ఏర్పడిన రాజ్యాంగ పరిషత్‌కు అధ్యక్ష పదవి. ఆపై భారత తొలి రాష్ట్రపతి పదవి. తొలి భారత రాష్ట్రపతి ఎంపిక వివాదం కాకుండా ఆ కాలమే జాగ్రత్త పడిందని అనిపిస్తుంది. భారత ఆఖరి వైస్రాయ్ భారతీయుడైన రాజాజీ. ఆయనను రాష్ట్రపతిని చేయాలన్నది ప్రథమ ప్రధాని నెహ్రూ అభిప్రాయం. కానీ రాజాజీ క్విట్ ఇండియా ఉద్యమంలో జాతీయ కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. ఆ పరిణామం చాలామంది ఎంపీలకు గుర్తుంది. దీనితో బాబూ రాజేంద్రప్రసాద్ వైపు మొగ్గారు. ఆయన సర్దార్ అభ్యర్థి అన్న పేరుంది. కాబట్టి మెజార్టీ అభిప్రాయాన్ని అనుసరించి నెహ్రూ కూడా రాజేన్‌బాబు అభ్యర్థిత్వానికి అంగీకరించారు. కానీ వారిద్దరి మధ్య తరువాత ఒక అవాంఛనీయమైన వాతావరణమే కొనసాగింది. జనవరి 26,1950న రాజేన్‌బాబును రాష్ట్రపతిగా ఎన్నికైనట్టు రాజ్యాంగం ధ్రువీకరించింది. ఆ జనవరి 26 శుభదినం కాదని రాజేన్‌బాబు విశ్వాసం. కానీ నెహ్రూ దేశాన్ని నడపవలసింది జ్యోతిష్కులు కాదని కరాఖండిగానే చెప్పేశారు. కానీ దురదృష్టవశాత్తు 25వ తేదీ రాత్రి రాజేన్‌బాబు సోదరి భగవతీదేవి కన్నుమూశారు. రాష్ట్రపతిగా ప్రమాణం చేసిన తరువాత ఆయన చేసిన తొలి కార్యక్రమం సోదరికి అంత్యక్రియలు. సోమనాథ్ దేవాలయం అంశం మరొకటి. జునాగఢ్ సంస్థానం భారత్‌లో విలీనమైన తరువాత సోమనాథ్ దేవాలయం జీర్ణోద్ధరణ చేపట్టాలని కేంద్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. కొన్ని నెలలలోనే ఆ పని పూర్తయింది. ఈ పని కోసం ఏర్పాటు చేసిన ఆధికారిక సంఘానికి అధ్యక్షుడు కెఎం మున్షీ. ఆ సమయంలో లింగ ప్రతిష్ఠాపన కూడా చేయాలని ఆలోచించారు. ఇందుకు రాజేన్‌బాబును ముఖ్య అతిథిగా పిలవాలని మున్షీ ఆకాంక్ష. కానీ ఉన్నత రాజ్యాంగ పదవులలో ఉన్నవారు మత ఉత్సవాలకు వెళ్లరాదన్నది నెహ్రూ నిశ్చితాభిప్రాయం. అయినా మున్షీ ఆహ్వానించడం, నెహ్రూ అభిప్రాయాన్ని పట్టించుకోకుండా రాజేన్‌బాబు హాజరు కావడం జరిగిపోయాయి. రాజేన్‌బాబు నిర్ణయాన్ని సోషలిస్టులు, కమ్యూనిస్టులు విమర్శించారు కూడా. అలాగే హిందూ కోడ్ బిల్లును తీసుకురావడానికి రాజేన్‌బాబు వ్యతిరేకి. అయినా నెహ్రూ ఆ బిల్లును రూపొందించారు. అది రాష్ట్రపతి ఆమోదం కోసం వెళ్లింది. ఈ బిల్లును ఆమోదించిన పార్లమెంట్ ప్రజలు నేరుగా ఎన్నుకున్నది కానందున, ఆ సభ ఆమోదించిన బిల్లు మీద తాను సంతకం చేయబోనని రాజేన్‌బాబు ప్రకటించారు. నెహ్రూ దీని మీద రాష్ట్రపతి కంటే పార్లమెంటే సమున్నతమైనది లేఖ రాశారు. ఇలా విభేదాలు ఇంకా ఎన్నో! 1955లో నెహ్రూ సోవియెట్ రష్యా పర్యటన చరిత్రాత్మకమైనది. ఆయనకు ఘన స్వాగతం లభించింది. తరువాత ఆయనను భారతరత్న పురస్కారానికి ఎంపిక చేశారు. ఈ సందర్భంలో రాజేన్‌బాబు, ‘జవాహర్ అంటేనే వాస్తవంగా భారతరత్నమే. ఇక ఆయనను లాంఛనంగా భారతరత్న ఎందకు చేయకూడదు?’ అని శ్లాఘించారు. అయినా ఇద్దరి మధ్య విభేదాలు ఆగలేదు. రాజేన్‌బాబు పదవీ కాలం పూర్తయిన తరువాత రెండో దఫా అవకాశం ఇవ్వడానికి నెహ్రూ సుముఖంగా లేరు. అప్పుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరును ముందుకు తీసుకువచ్చారాయన. మళ్లీ మెజారిటీ నిర్ణయాన్ని గౌరవించి రెండో దఫా కూడా రాజేన్‌బాబు రాష్ట్రపతి కావడానికి నెహ్రూ అంగీకరించారు. ఆయన హయాంలోనే మొదటిసారి సామాన్యులు రాష్ట్రపతి భవన్‌లోకి వెళే అవకాశం లభించింది. అందులోని ప్రఖ్యాతి వహించిన మొగల్ గార్డెన్స్‌ను చూసేందుకు రాజేన్‌బాబు అనుమతి మంజూరు చేశారు. నిజమే ఆయన విశ్వాసాలు ఆయనకు ఉన్నాయి. వాస్తవానికి ఆయన జీవితం మొగల్ గార్డెన్‌లోని పూల సమాహారమంతా వైవిధ్యమైనది. గాంధీజీని జనవరి 30, 1948న నాథూరామ్ గాడ్సే కాల్చి చంపాడు. కానీ చాలామంది తెలియని ఒక చారిత్రక రహస్యాన్ని రాజేన్‌బాబు తాను రాష్ట్రపతి అయిన తరువాత వెల్లడించారు. ఆనాటి సంఘటనలో ఒక వంటవాడు నిజాయితీగా వ్యవహరించి జరిగిన విష ప్రయోగం గురించి వెల్లడించి ఉండకపోతే భారత చరిత్ర వేరే విధంగా ఉండేది. 1917లోనే ఇది జరిగింది. దీనికి ప్రత్యక్షసాక్షి రాజేన్‌బాబు. చంపారన్ కె స్వతంత్ర సేనాని అనే పుస్తకంలో ఈ ఘటనను నమోదు చేశారు. చంపారన్ సత్యాగ్రహం కోసం ఆ సంవత్సరం ఏప్రిల్‌లో గాంధీజీ అక్కడకు వెళ్లారు. 15వ తేదీన మోతీహరి రైల్వే స్టేషన్ దగ్గర వేలాది మంది ఎదురు చూస్తున్నారు. అందులో కొందరు విద్యార్థులు కూడా ఉన్నారు. వారందరి ఉద్దేశం ఒకటే. తాము తెచ్చిన గుర్రపు బగ్గీలో గాంధీజీని తీసుకువెళ్లాలి. ఆ బండిని గుర్రాలు కాకుండా తాము లాగాలి. అలాగే తీసుకువెళ్లారు. గాంధీకి ఇంతటి ప్రాచుర్యం రావడం, చంపారన్ రైతుల ఉద్యమంలో కలగ చేసుకోవడం ఆంగ్లేయులకు సహజంగానే కన్నెర్రగా ఉంది. ఆ సమయంలోనే ఎడ్విన్ అనే ఆంగ్లేయుడు గాంధీజీని ఒక రాత్రి విందుకు పిలిచాడు. అతడు ఒక నీలిమందు ఎస్టేట్ మేనేజర్. అతడి దగ్గర వంటవాడిగా పనిచేస్తున్న వ్యక్తి బాతక్ మెయిన్. గ్లాసుడు పాలలో అతడి చేత విషం కలిపించాడు. ఇదంతా ఏమీ ఎదిరించకుండానే మెయిన్ చేశాడు. కానీ గాంధీకి విషం కలిపిన ఆ పాలగ్లాసు అందిస్తూ విషయం చెప్పేశాడు. గాంధీజీ విష ప్రయోగం నుంచి బయటపడ్డాడు. తరువాత మెయిన్ నరకం చూశాడు. ఏదో కేసులో ఇరికించి అతడిని ఎడ్విన్ కారాగారం పాల్జేశాడు. స్వగ్రామంలోని అతడి ఇంటిని శ్మశానం కోసం ఇచ్చేశారు. దీనికి సాక్షి రాజేన్‌బాబు. రాజేన్‌బాబు దేశాధ్యక్షుడైన తరువాత చంపారన్ వెళ్లారు. ఒక వ్యక్తి పోలీసు వలయాన్ని తప్పించుకుని తన వద్దకు రావాలని ప్రయత్నిస్తున్న సంగతి రాజేన్‌బాబు గమనించారు. ఆ వచ్చిన వ్యక్తి మెయిన్ అని గుర్తు పట్టి రాజేన్‌బాబు స్వయంగా అతడి దగ్గరకు వెళ్లి ఆలింగనం చేసుకుని, తన వెంటే వేదిక మీదకు తీసుకువెళ్లారు. పక్కనే ఉన్న ఆసనంలో కూర్చోపెట్టారు. అప్పుడు గాంధీజీపై జరిగిన విష ప్రయోగం, మెయిన్ సాహసాల గురించి చెప్పారు. మెయిన్ కోల్పోయినదంతా తిరిగి పొందడానికి వీలుగా 24 ఎకరాలు ఇవ్వమని కలెక్టర్‌ను ఆదేశించారు రాజేన్‌బాబు (ఆ కలెక్టర్ ఆ ఆదేశాన్ని అమలు చేయలేదు. ప్రతిభా పాటిల్ వచ్చిన తరువాత ఆమె కూడా కలగేచేసుకుని తొలి రాష్ట్రపతి ఆదేశాలను గౌరవించాలని చూశారు. ఇప్పటికీ సాధ్యం కాలేదు). బాబూ రాజేంద్రప్రసాద్ భారతదేశ మహోద్యమానికి సాక్షి. మారుతున్న కాలంతో పాటు మారిన మనిషి. స్వతహాగా మానవతావాది. 1914లో వరదలు వచ్చి బెంగాల్, బిహార్ అతలాకుతలమైనప్పుడు కోర్టుకు వెళ్లడం మానేసి కొన్ని లక్షల రూపాయలు వసూలు చేసి బాధితులకు ఇచ్చారాయన. ఒక భూస్వామిక కుటుంబం నుంచి వచ్చి జీవితపు చరమాంకంలో ఆ హోదాను పూర్తిగా మరచిపోయిన కర్మయోగి రాజేన్‌బాబు. గాంధీజీని ఆనాడు ఆయన ఇంటి నౌకర్లు లోపలికి అనుమతించకపోవడానికి కారణం ఆయనను కింది కులాల నుంచి వచ్చిన వ్యక్తి అని భావించడమే. తరువాత సాటి మనిషిని అలాంటి పరిస్థితిలోకి నెట్టివేయడం ఎంత ఘోరమో ఆయన గుర్తించారని అనిపిస్తుంది. అంటరానితనం నిర్మూలన కోసం పనిచేశారు. తన నివాసాన్ని తనే శుభ్రం చేసుకునేవారు. తన వంట తనే చేసుకునేవారు. పాత్రలు శుభ్రం చేసుకునేవారు. ఇదంతా గాంధీ ప్రభావమే. 1962లో రాజేన్‌బాబు సతీమణి రాజవంశీదేవి కన్నుమూశారు. తరువాత ఆయన ఆరోగ్యం క్షీణించింది. నెహ్రూ గురించి రాజేన్‌బాబు అభిప్రాయం 1950లోనే మారడం మొదలయింది. 1962 నాటి చైనా యుద్ధం తరువాత నెహ్రూ అభిప్రాయాలు, దృష్టికోణం మొత్తం మారాయి. అందులో రాజేన్‌బాబు మీద ఆయనకు ఉన్న అభిప్రాయం కూడా మారింది. నిజానికి చైనా దురాక్రమణ తొలి రాష్ట్రపతిని, తొలి ప్రధానిని కూడా కలచివేసింది. రాజేన్‌బాబు కన్నుమూసినప్పుడు నెహ్రూ అన్నమాటే అందుకు నిదర్శనం, ‘ఆయన భారతదేశానికి ప్రతీక. రాజేన్‌బాబు కన్నుల ద్వారా మనం సత్యాన్ని దర్శించవచ్చు.’ - డా. గోపరాజు నారాయణరావు -
సమరకవి
‘ఈ స్వాతంత్య్ర కాంక్ష తీరేదెన్నడు?బానిసత్వం మీద మన మమకారం చచ్చేదెన్నడు? మాతృభూమి సంకెళ్లు తెగిపడేదెన్నడు?మన కష్టాలు తీరేదెన్నడు?’‘స్వాతంత్య్రం’ అన్న తమిళ కవితలోని తొలి పాదాలివి. రాసినవారు ‘మహాకవి’ సుబ్రహ్మణ్య భారతి.అక్షరాన్నీ, అలజడినీ సమంగా ప్రేమించినవారు భారత స్వాతంత్య్రోద్యమంలో ఎందరో ఉన్నారు. వాళ్లందరి చరిత్రనీ గుదిగుచ్చితే సుబ్రహ్మణ్య భారతి తొలి ఐదారుగురు కవుల మధ్యన నిలుస్తారు. సుబ్రహ్మణ్య భారతి సహజ కవి. ఆయన పేరు చివర ఉన్న ‘భారతి’ ఇందుకు సాక్ష్యం పలుకుతుంది. ఆ ఘట్టం ఏదో పురాణంలో చదివినట్టు ఉంటుంది. చిన్నస్వామి, లక్ష్మమ్మ కుమారుడు సుబ్రహ్మణ్యం. వారిది తిరునల్వేలి జిల్లా ఎట్టయాపురం. ఇప్పుడు తూత్తుకుడి. తండ్రి ప్రభుత్వోద్యోగి. పేద కుటుంబమనే చెప్పాలి. అయినా కొడుకును ఇంగ్లిష్ చదివించి, ఇంజనీర్‌ను చేయాలని ఆ తండ్రి ఆశ. కానీ ఆ కొడుకు చిన్నతనం నుంచి సంగీతమంటే ఇష్టపడుతూ ఉండేవాడు. కొంచెం వయసు వచ్చాక సాహిత్యం అంటే ఆసక్తి చూపడం ఆరంభించాడు. భారతి ప్రాథమిక విద్య అంతా ఆ గ్రామంలోనే జరిగింది. అనుకోకుండా ఐదో ఏటనే తల్లిని పోగొట్టుకున్నారు సుబ్రహ్మణ్య భారతి. అప్పటి నుంచి తండ్రే అన్నీ అయి పెంచారు. ఆయన క్రమశిక్షణకి ప్రాధాన్యం ఇచ్చే మనిషి. సుబ్రహ్మణ్యం పదకొండో ఏట ఎట్టయాపురం సంస్థానంలో ఆశుకవితా గానం జరిగింది. అందులో చిన్నారి సుబ్రహ్మణ్యం కూడా పాల్గొన్నాడు. అతడి ధారను చూసి నాటి పండితులు ఆయనకి ‘భారతి’ అని బిరుదు ఇచ్చారు.అంటే సరస్వతి అనే. అప్పటి నుంచి సుబ్రహ్మణ్యం పేరు చివఱ భారతి వచ్చి చేరింది. చిన్న వయసులోనే ‘వివేక భాను’ అన్న పత్రికలో ఆయన తొలి కవిత అచ్చయింది కూడా. సుబ్రహ్మణ్య భారతి (డిసెంబర్ 11,1882–సెప్టెంబర్ 12, 1921)లోని సహజ కవిలో మరొకరు కూడా ఉన్నారు. ఆ మరొకరు సమర కవి. అతడు నిరంతరం స్వేచ్ఛ కోసం పరితపించేవాడు. అదే సమయంలో ఆయన చదువుల కోసం వారణాసి వెళ్లారు. అదే ఆయన జీవితంలో పెద్ద మలుపు అయింది. భారతీయ ఆధ్యాత్మిక చింతన, జాతీయ భావాలు ఆ గంగాతీరంలోనే ఆయనను ముంచెత్తాయి, ఆలోచనలను మలిచాయి. ఆయన జీవితం మీదే కాదు, కవిత్వం మీద కూడా అవే ప్రతిబింబించాయి. వారణాసిలో ప్రధానంగా సంస్కృతం చదువుకున్నారు. అదే సమయంలో హిందుస్తానీ కూడా బాగా నేర్చుకున్నారు.ఫ్రెంచ్ నేర్చుకున్నారు. ఇక ఇంగ్లిష్ సరేసరి. బెనారస్ విద్య తరువాత 1901లో స్వగ్రామం వచ్చారాయన. వేషం పూర్తిగా మారిపోయింది. బెనారస్‌లో ఆయనకు ఒక సిక్కు మిత్రుడు ఉండేవాడు. అతడి ప్రభావంతో తలపాగా మీద మక్కువ పెంచుకుని తాను కూడా ధరించడం ఆరంభించారు. మీసాలు కూడా అలా పెంచుకున్నవే. చిన్నతనంలో తనకు భారతి అన్న బిరుదు ఇచ్చిన ఎట్టయాపురం సంస్థానాధీశుడు మరచిపోకుండా భారతి రాగానే ఆస్థాన కవిగా నియమించారు. కానీ ఆయన ఎక్కువ కాలంలో అక్కడ ఉండలేదు. 1904లో మధురై వచ్చి సేతుపతి ఉన్నత పాఠశాలలో తమిళ ఉపాధ్యాయునిగా చేరారు. అప్పుడే ఈ ప్రపంచంలో ఏం జరుగుతున్నదో తెలుసుకోవాలన్న ఒక తపన ఆయనలో బయలుదేరింది. ఒక జ్ఞానతృష్ణ. అందుకు ఆయన పత్రికా రచయితగా అవతారం ఎత్తారు. ‘ది హిందు’ పత్రిక వ్యవస్థాపకులలో ఒకరు, ‘స్వదేశీమిత్రన్’ పత్రిక సంపాదకులు జి. సుబ్రహ్మణ్య అయ్యర్ భారతి ప్రతిభా పాటవాలను గురించి విన్నారు. ఆయన్ను పిలిచి ‘స్వదేశీమిత్రన్’లో సహాయ సంపాదకునిగా నియమించుకున్నారు. తన వివేకం, విజ్ఞత, రాజనీతిజ్ఞతల మీద భారత జాతీయ కాంగ్రెస్ పెట్టుకున్న నమ్మకాన్ని బ్రిటిష్‌జాతి తొలిసారి భగ్నం చేసిన సందర్భం బెంగాల్ విభజన. ఆసేతు శీతాచలం అంటే రామేశ్వరంలోని సేతువు మొదలు హిమాలయాల మధ్య ఉన్న భారతం మొత్తం బెంగాల్ విభజన చర్యకు స్పందించింది. వేలాది మంది తొలిసారి స్వరాజ్య సమరంలోకి అడుగుపెట్టారు. అందులో భారతి కూడా ఉన్నారు.తాత్కాలికంగానే కావచ్చు, కానీ విన్నపాల మితవాదుల నుంచి జాతీయ కాంగ్రెస్ అప్పుడే తొలిసారి అతివాదుల చేతికి వచ్చింది. అలాంటి చారిత్రక సందర్భంలోనే భారతి స్వాతంత్య్రోద్యమంలో ప్రవేశించారు. ‘దీర్ఘకాలం వర్ధిల్లేది సమైక్య బంగాళమే’ అనే శీర్షికతో ఆయన రాసిన కవిత ‘స్వదేశీమిత్రన్’లోనే ప్రచురించారు. ఆ సంవత్సరం వారణాసిలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలకు భారతి హాజరయ్యారు. మళ్లీ 1906లో కలకత్తా సభలకు కూడా వెళ్లారు. బ్రిటిష్ జాతిని తీవ్రంగా ద్వేషిస్తూ ‘స్వరాజ్యం నా జన్మహక్కు’ అన్న నినాదం ఇచ్చిన తిలక్‌నూ, ఆయన వర్గీయులను దారుణంగా అవమానించిన 1907 నాటి సూరత్ కాంగ్రెస్ సమావేశాలను కూడా భారతి చూశారు. జాతీయ కాంగ్రెస్‌కే చెందిన తిరుమలాచారి 1906 లో ‘ఇండియా’ అనే తమిళ పత్రికను నెలకొల్పారు. ఆయనే ‘బాలభారతి’ పేరుతో ఆంగ్ల పత్రిక కూడా స్థాపించారు. ఈ రెండింటికీ సంపాదకునిగా సుబ్రహ్మణ్య భారతినే తిరుమలాచారి ఎంపిక చేశారు. కలకత్తా సమావేశాలకు భారతి హాజరైనప్పుడు ఒకరు పరిచయమయ్యారు. అప్పటి నుంచి ఆ వ్యక్తిని గురువుగా ఆయన భావించారు. రెండు గేయా సంకలనాలను భారతి వెలువరించారు. ‘స్వదేశ’, ‘జన్మభూమి’ అని వాటికి పేర్లు పెట్టారు. ఆ రెండింటినీ కూడా భారతి ఆ గురువుకే అంకితం చేశారు. అయితే ఆ గురువు పురుషుడు కాకపోవడమే విశేషం. పైగా ఈ దేశానికి కూడా చెందరు. కానీ భారత స్వాతంత్య్రోద్యమాన్ని విశేషంగా అభిమానించారు. భారతీయత గొప్పతనాన్ని భారతీయులకు కూడా బోధించారు. ఆమె సిస్టర్ నివేదిత. ఇండియా పత్రికకు నిజమైన సంపాదకుడు భారతి అయినప్పటికీ పేరు మాత్రం ఎన్ శ్రీనివాసన్ అనే వ్యక్తిది ఉండేది. ఆ పత్రికలో భారతి రాసిన రాతలకు మొదట పోలీసులు శ్రీనివాసన్‌ను అరెస్టు చేసి తీసుకుపోయారు. తరువాత సుబ్రహ్మణ్య అయ్యర్‌పై అరెస్టు వారంట్లు జారీ అయ్యాయి. ఇక మిగిలింది భారతి. కొందరు మిత్రుల సలహాతో ఆయన మద్రాసు విడిచిపెట్టి పుదుచ్చేరి వెళ్లిపోయారు. ఫ్రెంచ్ పాలనలో ఉన్న పుదుచ్చేరి ఎందరో భారత స్వాతంత్య్ర సమరయోధులకి ఆశ్రయం కల్పిస్తూ ఉండేది. అప్పటికే అరవింద్ ఘోష్ అక్కడికి చేరుకున్నారు. అలాగే వీవీఎస్ అయ్యర్ కూడా బ్రిటిష్ పోలీసుల బాధలు తట్టుకోలేక అక్కడికే వలస వెళ్లారు. ఈ మహామహులు ఇద్దరితోను భారతి తరచూ మాట్లాడేవారు. పుదుచ్చేరి చేరుకునే సరికి భారతికి ఒక కూతురు. ఆమెను అప్పటికే బెనారస్‌లో ఉన్న తన బంధువు ఇంటికి పంపేశారు. భార్య చెల్లమ్మాళ్ మాత్రం ఎట్టయాపురం దగ్గర ఒక గ్రామంలో ఉండేవారు. పుదుచ్చేరిలో ఉన్నప్పటికీ భారతి రచనా వ్యాసంగం విరమించలేదు. ఇండియా పత్రికతో పాటు, విజయ, సూర్యోదయం, కర్మయోగి, చిత్రావళి అనే పత్రికలకి కూడా రచనలు అందించేవారు. ఇందులో చిత్రావళి వ్యంగ్య చిత్ర పత్రిక. దానికి భారతి వ్యంగ్య చిత్రాలు రచించి పంపేవారు. ఒక సందర్భంలో మద్రాసులో ఉన్న ఇండియా పత్రిక కార్యాలయాన్ని బ్రిటిష్ పోలీసులు ధ్వంసం చేస్తారన్న అనుమానం వచ్చింది. అందుకే శ్రీనివాసన్ తన పత్రిక ప్రెస్నీ, ఇతర సామగ్రిని రహస్యంగా పుదుచ్చేరికే తరలించారు. మళ్లీ పుదుచ్చేరి నుంచి ఇండియా, బాలభారతి పత్రికల ప్రచురణ ఆరంభమయింది. ఈసారి మరిన్ని ఆంక్షలు విధించారు బ్రిటిష్ పోలీసులు. అసలు ఆ పత్రికలు పుదుచ్చేరి బయటకు రాకుండా కట్టుదిట్టం చేశారు. పోస్టల్ సౌకర్యం ఆపేశారు. చందాదారులను నిరోధించారు. గతిలేని స్థితిలో పత్రిక ప్రచురణ ఆపేశారు. అప్పుడే చెల్లమ్మాళ్ భర్తను ఎట్టయాపురం వచ్చేయవలసిందిగా గట్టిగా కోరింది. అప్పటికే పదేళ్లు గడిచాయి. మొత్తానికి మళ్లీ బ్రిటిష్ ఇండియాలో అడుగు పెట్టడానికి భారతి అంగీకరించారు. కానీ పుదుచ్చేరి విడిచిపెట్టి మద్రాసు ప్రెసిడెన్సీలోని కడలూరుకు రాగానే పోలీసులు అరెస్టు చేశారు. నెల రోజుల పాటు తమ నిర్బంధంలోనే ఉంచారు. ఆ సమయంలో అనీబిసెంట్, సీపీ రామస్వామి అయ్యర్ జోక్యం చేసుకుని ఆయనను విడిపించారు. మద్రాసు వచ్చిన తరువాత స్వదేశీమిత్రన్ యాజమాన్యం మళ్లీ పిలిచి సహాయ సంపాదకుని ఉద్యోగం తిరిగి ఇచ్చింది. అప్పటి నుంచి రాజకీయ ఉద్యమానికి కొంచెం దూరంగా ఉన్నప్పటికీ సంఘ సంస్కరణోద్యమానికి ఆయన దగ్గరయ్యారు. ముఖ్యంగా మహిళల పరిస్థితి మీద ఆయన పోరాటం చేశారు. మహిళలను గౌరవించాలన్న ఆశయాన్ని ఆయన ఆచరణలో పెట్టడానికి ప్రధాన కారణం సిస్టర్ నివేదిత. భారతి కవిత్వం మొత్తం అచ్చులో ఆరువందల పేజీలు. అది కాకుండా 60 కథలు రాశారు. కానీ ఆయన జీవితంలో ఎక్కువ భాగం పత్రికా రచనకు కేటాయించారు. ఆధునిక తమిళ సాహిత్యానికి ఆయన సేవలు నిరుపమానమైనవి. హైకూ కవితను తమిళానికి పరిచయం చేసినవారు భారతి. పుదుచ్చేరిలో ఉండగా లభించిన వెసులుబాటుతో భగవద్గీతకు, పతంజలి యోగ సూత్రాలకు ఆయన వ్యాఖ్యానాలు రాశారు. భారతి పేరును తమిళ సాహిత్యంలో చిరస్థాయిగా నిలిపిన ‘కణ్ణన్ పట్టు’, కూయిల్ పట్టు’ కావ్యాలు కూడా పుదుచ్చేరిలో ఉండగానే రాశారు. పాంచాలి శపథం ఆయన దీర్ఘ కవిత.దీనికి కూడా ఎంతో ఖ్యాతి ఉంది. మద్రాస్‌లోనే ట్రిప్లికేన్‌లో ఉన్న పార్థసారథి ఆలయానికి భారతి తరచు వెళుతూ ఉండేవారు. వెళ్లిన ప్రతిసారీ అక్కడ ఉండే ఏనుగుకు పళ్లు తినిపించేవారు. 1921 ఆగస్టులో అలాగే ఆలయానికి వెళ్లారాయన.అదే ఏనుగుకు అరటిపండు తినిపిస్తూ ఉండగా అది భారతిని తొండంతో చుట్టి నేలకేసి కొట్టేసింది. ఆలయంలో చాలామందే ఉన్నా భయంతో ఎవరూ దగ్గరకు పోయే సాహసం చేయలేదు. బాగా గాయపడ్డారాయన. ఈ సంగతి తెలిసి ఆయన ఆప్తమిత్రుడు కువాలై కణ్ణన్ ఆలయానికి వచ్చి భారతిని ఆస్పత్రికి తీసుకువెళ్లారు. తరువాత దాదాపు నెలరోజులు బాగానే ఉన్నారు. సెప్టెంబర్ రెండో వారంలోనే మళ్లీ ఆరోగ్యం చెడిపోయింది. సెప్టెంబర్ 12న తుదిశ్వాస విడిచారు. ఆ మహాకవి అంత్యక్రియలు మరో విషాదం. పోలీసులకు కోపం వస్తుందన్న అనుమానంతో అంత్యక్రియల దగ్గరకి మొత్తం 13 మంది మాత్రమే వచ్చారు. చితికి ఎవరు నిప్పుపెట్టాలన్న మీమాంస కూడా వచ్చింది. పోలీసుల భయం. నిజానికి భారతికి మహాకవి పీఠం ‘మరణానంతర’ పురస్కారమే. ఆయన కవిత్వం మీద, పుస్తకాల మీద బ్రిటిష్ ప్రభుత్వం నిషే«ధం విధించింది. పత్రికా రచయితగా ఆయన కలం సత్తా ఏమిటో తెలిసే అవకాశం కూడా పెద్దగా లేకపోయింది. అంతా పుదుచ్చేరికి పరిమితమైపోయింది. నిజం చెప్పాలంటే ఆ మారుమూల సముద్ర తీరంలో ఆయన సాహిత్యం కూడా అజ్ఞాతవాసం చేసింది. మరణించేనాటికి భారతి వయసు 39 సంవత్సరాలు. అందులో పదేళ్లు అజ్ఞాతంలోనే గడిచాయి. కానీ ఆయన కవిత్వానికి ఒక వెలుగునిచ్చిన ఘనత భారతి సహధర్మ చారిణి చెల్లమ్మాళ్‌దే. తన సోదరుడు, మరొక దగ్గర బంధువు సాయంతో ఆమె మద్రాసులో ఒక ఆశ్రమం స్థాపించి, భారతి రచనలను సంకలనాలుగా వెలువరించింది.భర్తతో కలసి ఉన్నది తక్కువే. కానీ ఆయనను ఆమె ఎంతో ప్రేమించింది. చాలామంది కవులు మరణించిన తరువాత జీవించడం ఆరంభించారు. భారతి కూడా అందులో ఒకరు. - ∙డా. గోపరాజు నారాయణరావు -
స్వాతంత్య్ర పోరాటంలో కీలకం ఆజాద్ రేడియో
ఐక్యరాజ్యసమితి రేడియో 1846 ఫిబ్రవరి 13న ప్రారంభమైంది. 2012 నుంచి ఆ తేదీన ప్రపంచ రేడియో దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ ఏడాది రేడియో దినోత్సవం సందర్భంగా ‘సంభాషణ, సహిష్ణుత, శాంతి’ అనే అంశాన్ని ఇతివృత్తంగా నిర్దేశించారు. అయితే, సంభాషణ మృగ్యమై, సహిష్ణుత లుప్తమై, శాంతి కరువైన క్విట్ ఇండియా ఉద్యమ వేళ 1942లో ఒక రహస్య వాణి 78 రోజులపాటు ఈ జాతిని ప్రభావితం చేసింది. అప్పటి బ్రిటిష్ పాలకులు దీనిని ‘కాంగ్రెస్ ఇల్లీగల్ రేడియో’అని పిలిచారు. అయితే దాన్ని నిర్వహించిన నాయకులు ‘ఆజాద్ రేడియో’ అన్నారు. ఈ రహస్యవాణికి వ్యూహకర్త రామ్ మనోహర్ లోహియా కాగా, నిర్వహించినది 20 నుంచి 40 ఏళ్ల మధ్యగల ఏడుగురు ధీశాలులు. అతి త్వరలో ఈ విషయం చరిత్ర పుస్తకాల్లో, పాఠశాల విద్యార్థుల పుస్తకాల్లో అంతర్భాగం కానుంది. 1942 ఆగస్టులో గాంధీజీ బ్రిటిష్‌వారి దుష్టపాలనకు మృత్యుగీతం రచిస్తూ ‘కరెంగే యా మారేంగే’అని పిలుపునిచ్చారు. అది మంత్రమై దేశం ఎల్లడెలా పాకింది. బ్రిటిష్ అధికారులు నాయకులను అగ్రస్థాయి నుంచి, బ్లాకు స్థాయి వరకూ చెరసాలల్లో బంధించారు. ఆ సమయంలో చాలామంది సోషలిస్టు నాయకులు తప్పించుకుని, రహస్యంగా ఉద్యమంలోకి సాగారు. 1942 ఆగస్టు 9 నుంచి ఉద్యమం నాయకత్వాన్ని కోల్పోయింది. ఈ సమయంలో దిశానిర్దేశం చేసిన రహస్య మాధ్యమం ‘ఆజాద్ రేడియో’. 1942 ఆగస్టు 27 నుంచి బ్రిటిష్ ప్రభుత్వం కైవశం చేసుకునే వరకు నవంబర్ 12 వరకు గొప్ప సేవలందించింది. 1988 ఫిబ్రవరి 13 సంచిక మరాఠీ పత్రిక సాధనలో సోషలిస్టు నాయకుడు మధులిమాయే రాస్తూ నాసిక్‌లోని శంకరాచార్య మఠంలో ఆజాద్ రేడియో పరికరాలను విఠలరావ్ పట్వర్థన్ తెచ్చి ఉంచారనీ, అక్కడ నుంచి ప్రసారాలు చేయాలని తలంచినా, పోలీసు దాడిని ఎదుర్కోవాల్సి వస్తుందని గోదావరి నదిలో పడేశారని పేర్కొన్నారు. ‘అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ బ్రాడ్ కాస్ట్ డ్యూరింగ్ క్విట్ ఇండియా మూవ్మెంట్’అనే పుస్తకం 2018లో కేంద్ర ప్రభుత్వ సంస్థ పబ్లికేషన్ డివిజన్ ప్రచురించింది. ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్‌ఫర్ ది ఆర్ట్స్, న్యూఢిల్లీకి చెందిన పరిశోధకులు గౌతమ్ చటర్జీ 1984 నుంచి నేషనల్ ఆర్కైవ్స్‌లో గాలించి పరిశోధన చేస్తున్నారు. వీరికి ‘పోలీస్ మానిటరీ రిపోర్ట్’ అనే పోలీసు ఇంటెలిజెన్స్ సీక్రెట్ ఫైల్ తారసపడింది. అప్పట్లో ఆజాద్ రేడియో ప్రసారాలను గమనిస్తూ, బ్రిటిష్ పోలీసులు తయారు చేసిన రహస్య ఫైలు ఇది. ఇందులో అక్టోబర్ 9 నుంచి పోలీసులు నమోదు చేసిన ప్రసారాల వివరాలున్నాయి. ఇవి పోలీసు ఇంటెలిజెన్స్ అధికారులు పరిశీలించిన అంశాలు. వీటిని గమనిస్తే కరాచీ నుంచి బృందావనం దాకా, అలహాబాద్ నుంచి బెంగాల్ దాకా, బిహార్ నుంచి మద్రాసు దాకా, కోయంబత్తూరు నుంచి త్రివేండ్రం దాకా, గుజరాత్ నుంచీ మహారాష్ట్ర దాకా సమాచారాన్ని చేరవేశారని అర్థమవుతుంది. ‘‘..స్కౌట్ సిద్ధం చేసిన నివేదికలు జాగ్రత్తగా పరిశీలించిన కాంగ్రెస్ సోషలిస్టు భావాలతో సాగిన ఈ ప్రసారాలకు కీలకం రామ్ మనోహర్ లోహియా అని తెలి సింది. రైతులు, కార్మికుల కోసమే స్వాతంత్య్ర భారతదేశమని అక్టోబర్ 23వ తేదీ ప్రసారాలలో ప్రకటించడం గమనార్హం. అలాగే అక్టోబర్ 27వ తేదీన స్వాతంత్య్రం కోసం విప్లవం అనేది బీదల కోసం విప్లవం. రైతుల కోసం, కార్మికుల కోసమే ఈ స్వాతంత్య్ర భారతం’’అని బ్రిటిష్ గవర్నమెంట్ అడిషనల్ సెక్రటరీ హెచ్.వి.ఆర్. అయ్యంగార్ ఈ ఆజాద్ రేడియో ప్రసారాల గురించి అప్పటి ప్రభుత్వానికి వివరించారు. సుభాష్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీ ద్వారా నిర్వహించిన ‘ఆజాద్ హింద్ రేడియో’కు భిన్నమైనది ఈ ఆజాద్ రేడియో. అంతరాయం లేకుండా వివిధ ప్రాంతాల నుంచి కనీసం మూడు ట్రాన్స్మీటర్లు నడిచేవి. ఈ 78 రోజుల (అధికారుల రికార్డుల ప్రకారం 71 రోజులు) ప్రసారాలు ఐదారు చోట్ల నుంచి, నాలుగైదు ఫ్రీక్వెన్సీల నుంచి సాగాయి. పరుపులు, సూట్‌కేసులతో ట్రాన్స్మీటర్లను వేర్వేరు ప్రాంతాలకు బ్రిటిష్ వాళ్ల కళ్లుగప్పి తరలించేవారు. 41.78, 42.34, 41.12, 42.12 మీటర్లపై ప్రసారాలు జరిగాయి. ప్రతిరోజూ ఉదయం, రాత్రి 9 గంటల సమయంలో అరగంటసేపు ఈ ప్రసా రాలు సాగేవి. హిందుస్తానీ హమారా అనే పాటతో మొదలై, వందేమాతరంతో ముగిసేవి. 10 వాట్ల ప్రసార శక్తిని, 100 వాట్లు చేయడానికి కృషి చేసి సఫలీకృతులయ్యారు. ఈ ప్రసారాలు వినడానికి 225 రూపాయలు వెచ్చించి రేడియో సెట్టు కూడా నిర్వాహకులు కొన్నారు. ఈ ప్రసారాలు నిర్వహించినవారిలో గుజరాత్‌కు చెందిన 20 సంవత్సరాల బాబూ భాయ్ విఠల్దాస్ మాథవి ఖక్కడ్ అనే పేరుగల యువకుడు ముఖ్యుడు. ముంబ యిలో ఫోర్త్ స్టాండర్డ్ మాత్రమే చదివిన ఈ కుర్రాడు కిరోసిన్‌తో కారు నడిపే యంత్రం కేరో గ్యాస్ తయారీ వ్యాపారంలో ఉండేవాడు. లోహియా ప్రణాళికను విజయవంతంగా నిర్వహించిన ఘనత ఇతనిదే. ఈ రేడియో ప్రసారాలు నిర్వహించినందుకు 1943 మే తీర్పు ప్రకారం ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష అనుభవించాడు. సూరత్‌కు చెందిన 22 ఏళ్ల కుమారి ఉషామెహతా ఈ రేడియో ప్రసారాల విషయంలో బాబూ భాయ్‌కి కుడిభుజంగా ఉండేవారు. ట్రాన్స్‌మీటర్ వాడటం, మైక్రోఫోన్ ద్వారా లోహియా రాసిన ప్రసంగాలు రేడియోలో చదవడంవంటి పనులు చేసేవారు. ఎంఏ చదువుతున్న సమయంలో ఈమె ఈ ప్రసార సేవలు అందించారు. చివర్లో నాలుగేళ్లు కారాగార శిక్ష అనుభవించిన మెహతా స్వాతంత్య్రం వచ్చాక ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఇక నలభై ఏళ్ల పార్సీ నారీమన్ అబరాబాద్ ప్రింటర్ కూడా వీరితో చేతులు కలిపాడు. దాంతో బాబూభాయ్ కేరోగ్యాస్ వ్యాపారంతో చేతులు కలిపారు. దీన్ని నిషేధించాక, ఆజాద్ రేడియో ట్రాన్స్‌మీటర్ తయారు చేసి ఇచ్చాడు ప్రింటర్. ఈ ముగ్గురుతోపాటు గుజరాత్ భావనగర్ ప్రాంతా నికి చెందిన 28 సంవత్సరాల విఠల్ దాస్ కాంతాభాయ్ జవేరీ, బర్కానా సింథ్ ప్రాంతానికి చెందిన 40 సంవత్సరాల వైర్లెస్ నిపుణులు నానక్ ఘర్ చంద్ మోత్వానీ, బొంబాయికి చెందిన 23 సంవత్సరాల చంద్రకాంత్ బాబుభాయ్ జవేరీ, బొంబాయికే చెందిన 27 ఏళ్ల జగన్నాథ రఘునాథ్ ఠాకూర్ కూడా రేడియో ప్రసారాల్లో కీలకపాత్ర పోషించారు. ఇంకా ఎంతోమంది ఇందులో భాగస్వాములయ్యారు. కొందరి పేర్లు మాత్రమే ఇంటెలిజెన్స్ రికార్డులలో ఉన్నాయి. అందువల్ల వారి పేర్లే ఈ పుస్తకంలో పేర్కొనడం జరిగింది. ఇలా స్వాతంత్య్ర పోరాట సమయంలో రేడియో జర్నలిజానికి గొప్ప చారిత్రక సాక్ష్యంగా నిలిచింది ఆజాద్ రేడియో. (రేపు ప్రపంచ రేడియో దినోత్సవం సందర్భంగా) -డా‘‘ నాగసూరి వేణుగోపాల్ వ్యాసకర్త డైరెక్టర్, రీజినల్ అకాడమీ, ఆకాశవాణి, హైదరాబాద్ ‘ మొబైల్ : 94407 32392 -
స్వరాజ్యం నా జన్మహక్కని గర్జించిన తిలక్
స్వరాజ్యం నా జన్మహక్కని గర్జించిన తొలి స్వాతంత్య్ర పోరాటవీరుడు బాలగంగాధర్ తిలక్. ప్రజల చేత లోకమాన్యుడుగా పిలిపించుకొన్న తిలక్ అసలు పేరు కేశవ్ గంగాధర్ తిలక్. 160 ఏళ్ల క్రితం 1856 జూలై 23 న మహారాష్ట్రలోని రత్నగిరిలో ఉపాధ్యాయుడైన గంగాధర్ తిలక్ దంపతులకు జన్మించారు. చిన్ననాటి నుంచే దేశ పరిస్థితులను నిశితంగా గమనిస్తూ తాను కూడా స్వరాజ్య పోరాటంలో ఓ సమిధగా మారాలని నిశ్చయించుకున్నారు. 1890 ప్రాంతంలో స్వరాజ్య పోరాట వేదిక అయిన కాంగ్రెస్‌లో చేరారు. తిలక్ ప్రవేశం నాటికి జాతీయోద్యమంలో గోపాలకృష్ట గోఖలే సారథ్యంలో మితవాదులు పోరాటం చేస్తున్నారు. అయితే అహింస, మితవాదం వల్ల స్వరాజ్యం లభించదని, బిట్రిష్‌వారితో పోరాటం వల్లనే స్వాతంత్య్రం సాధించగలమని విశ్వసించిన తిలక్ అతివాదిగా తన పోరాటాన్ని ప్రారంభించారు. మహాత్మాగాంధీ కంటే ముందే దేశ స్వాతంత్య్రోద్యమంలో కీలక భూమిక పోషించారు. పాత్రికేయునిగా జీవితం ప్రారంభించి నాటి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తన కలం పదునుతో ఎన్నో వ్యాసాలతో అక్షర గర్జన చేసి నాటి సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేశారు. మాతృభాష మరాఠీలో, ఇంగ్లిష్ భాషలలో పత్రికలను ప్రారంభించి స్వరాజ్య పోరాటాన్ని తీవ్రంగా ప్రభావితం చేశారు. 1897లో బొంబాయి పరిసర ప్రాంతలలో ప్లేగు వ్యాధి విజృంబించింది. ఈ వ్యాధి నియంత్రణ పేరుతో బ్రిటిష్ వారు ప్రజల ఇళ్ళపై దాడులు చేస్తూ సోదాలు జరపడంతో ఆ చర్యను తిలక్ వ్యతిరేకించారు. దీనితో బ్రిటిష్ వారు ఆయనపై విప్లవ వాదిగా ముద్ర వేసి జైల్లో పెట్టారు. జైలు నుంచి విడుదల అయ్యాక ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి పోరాడారు. దీంతో ఆయనను రంగూన్ జైలుకు తరలించి 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించారు. 1914లో జైలు నుంచి విడుదలై తిరిగి తన పోరాటం కొనసాగిం చారు. ఆయన రచించిన గీతా రహస్యం పుస్తకం విశేష ప్రాచుర్యం పొందింది. తన జీవితాంతం దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన తిలక్ బొంబాయిలో 1920 ఆగస్టు 1న తన 64వ యేట కన్నుమూశారు. తిలక్ జీవితం ఆదర్శప్రాయం. (నేడు లోకమాన్య బాలగంగాధర్ తిలక్ 88వ వర్ధంతి సందర్భంగా) - యస్.బాబు రావు, జాతీయ కార్యవర్గ సభ్యులు, దళిత జర్నలిస్టులు, రచయితల సంక్షేమ సంఘం, కావలి ‘ 9573011844 -
వీరి సేవను గుర్తుచేసుకుందామా?
భారత స్వాతంత్య్రోద్యమంలో మహిళలు పురుషులతో సమానంగా సేవలందించారు. భరతమాత కోసం వాళ్లు చేసిన సాహసాలలో కొన్నింటిని గుర్తు చేసుకుందాం. 1. బ్రిటిష్ పాలన విధానాలకు వ్యతిరేకంగా పోరాడిన తొలి మహిళ ఝాన్సీలక్ష్మీబాయ్, తర్వాత తరం పోరాటయోధులకు ఆమె స్ఫూర్తి. ఎ. అవును బి. కాదు 2. సరోజినీనాయుడు ఇంగ్లండ్ వెళ్లి, అక్కడి సమావేశంలో బ్రిటిష్ విధానాలను బాహాటంగా విమర్శించారు. ఎ. అవును బి. కాదు 3. బ్రిటిష్ ప్రభుత్వం సీనియర్ నాయకులను అరెస్ట్ చేయడంతో అరుణా అసఫ్ అలీ కాంగ్రెస్ పతాకాన్ని ఎగురవేసి క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారు. ఎ. అవును బి. కాదు 4. ఇందిరాగాంధీ స్వాతంత్య్ర సమరంలో నాయకులకు సహాయం అందించడం కోసం తోటి పిల్లలతో ‘వానరసేన’ అనే బృందాన్ని తయారు చేశారు. ఎ. అవును బి. కాదు 5. కమలానెహ్రూ మద్యానికి వ్యతిరేకంగా పోరాటాలు, ఉద్యమాలు నిర్వహించారని మీరు చదివారు. ఎ. అవును బి. కాదు 6. మేడమ్ సామా మన జెండాని జర్మనీలో ఎగురవేశారు. ఎ. అవును బి. కాదు 7. మొదటి స్వాతంత్య్ర పోరాటం సమయంలో బేగమ్ హజ్రత్ మహల్ – బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బంద్ నిర్వహించినట్లు మీకు తెలుసు. ఆమె గౌరవార్థం ఇండియా 1984లో స్టాంపును విడుదల చేసింది. ఎ. అవును బి. కాదు 8. విదేశీయురాలైన అనిబిసెంట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షత వహించిన తొలి మహిళ. ఎ. అవును బి. కాదు 9. కస్తూర్బా స్వాతంత్రోద్యమంలో గాంధీజీ ఆలోచనలను ఆచరణలో పెట్టడమే తన ఉద్యమం అన్నట్లుగా పనిచేశారనీ, గాంధీజీ జైలుపాలైనప్పుడు ఉద్యమాలను తానే స్వయంగా నడిపించారని తెలుసు. ఎ. అవును బి. కాదు మీ సమాధానాల్లో ‘ఎ’లు ఆరు అంతకంటే ఎక్కువగా వస్తే స్వాతంత్రోద్యమం పైనా, అందులో మహిళల భాగస్వామ్యం పైనా మీకు తగినంత పరిజ్ఞానం ఉంది. -
నాడు ప్రాణమిస్తే నేడు ప్రాణం తీస్తున్నాం!
దేశంలో నానాటికి పెరిగిపోతున్న గోరక్షకుల దౌర్జన్యాలపై పార్లమెంట్లో ప్రస్తావన రాగా, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గోరక్షకులను సమర్థిస్తూ, గోరక్షణ భారత స్వాతంత్య్ర పోరాటంలో అంతర్భాగమన్నారు. ఈ విషయాన్ని ప్రతిపక్షం, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అంగీకరించాలన్నారు. ఆమెకు సరైన సమాధానం చెప్పడంలో కాంగ్రెస్ పార్టీ తడబడగా, స్వాతంత్య్ర పోరాటానికి, గోరక్షణకు సంబంధం లేదంటూ వామపక్షాలు మండిపడ్డాయి. ఇక పార్లమెంట్ వెలుపల తనకు తాను గోరక్షకులుగా చెప్పుకునే సాధ్వీ కమల్ మరో అడుగు ముందుకేసి రాజస్థాన్‌లోని అల్వార్‌లో ఏప్రిల్ 1న పహ్లూ ఖాన్‌ను కొట్టి చంపిన గోరక్షకులను స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, సుఖ్‌దేవ్‌లకు ఆధునిక అనుచరులని పొగిడారు. వారిని అన్ని విధాలా ఆధుకుంటామని, వారిని జైలు నుంచి విడుదల చేసేందుకు అన్ని విధాలా కృషి చేస్తామని బహిరంగంగా ప్రకటించారు. వీరిద్దరి వ్యాఖ్యల తీవ్రతలో ఎంతో వ్యత్యాసం ఉన్నా ఇద్దరూ స్వాతంత్య్ర పోరాటంతో గోరక్షణ ఉద్యమాన్ని ముడిపెట్టారు. గోరక్షణకు, దేశ స్వాతంత్య్ర పోరాటానికి సంబంధం ఉందా? ఉంటే అది ఏ రకమైన సంబంధం? ఢిల్లీని బ్రిటిష్ పాలకులు కైవసం చేసుకోకుండా పోరాడాల్సిన భారతీయులైన హిందువులు, ముస్లింలు కలహాలకు దిగకుండా ఉండేందుకు 1857లోనే అప్పటి మొగల్ రాజు బహదూర్ షా జఫర్ నగరంలో గోవధను నిషేధించారు. అదే శతాబ్దంలో, అంటే 1875లో దయానంద సరస్వతి ఆర్యసమాజ్‌ను స్థాపించడం ద్వారా గోరక్షణను ఓ ఉద్యమంగా చేపట్టారు. ఈ ఉద్యమం పంజాబ్‌తో పాటు హర్యానా, ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాలకు విస్తరించింది. ఆ తర్వాత స్వాతంత్య్ర ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న బాల గంగాధర్ తిలక్ కూడా గోరక్షణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. నాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలామంది గోరక్షక సంఘాల్లో కూడా సభ్యులుగా కొనసాగారు. అనేక గోరక్షణ శాలల్లో కాంగ్రెస్ సమావేశాలు జరిగాయి. కాంగ్రెస్ ప్లీనరీ జరిగిన మైదానాల్లోనే కాంగ్రెస్ సమావేశాలు ముగిశాక గోరక్షకుల సమావేశాలు కొనసాగిన సందర్భాలూ ఉన్నాయి. స్వాతంత్రోద్యమం నాటికి బీజేపీ లాంటి పార్టీలు పుట్టలేదు. ఆరెస్సెస్ లాంటి మాతృసంస్థలు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనలేదు. గోరక్షణ కోసం ఉద్యమాలు జరిపిన ఆర్యసమాజ్ సంస్థాపకులు దయానంద సరస్వతి రాజకీయంగా గానీ, ఆర్థికంగా గానీ దేశానికి స్వాతంత్య్రం కావాలని ఏనాడూ కోరలేదు. నాడు ప్రజల సమీకరణ కోసం కాంగ్రెస్ పార్టీయే గోరక్షణ గురించి ఎక్కువగా మాట్లాడింది. ముఖ్యంగా స్వతహాగా శాకాహారి అయిన మహాత్మాగాంధీ గోవధను వ్యతిరేకించారు. గోమాంసాన్ని స్వతహాగా త్యజించాలని ఇటు దళితులకు, అటు ముస్లింలకు పిలుపునిచ్చారు. నాడు స్వాతంత్య్ర పోరాటానికి అందరి ఐక్యత అవసరం కనుక ఆయన చట్టపరంగా గోవధను నిషేధించాలని కోరలేదు. అన్ని వేళల అహింసను కోరుకునే మహాత్మాగాంధీ గోవుల రక్షణ కోసం ప్రాణాలివ్వని వాడు హిందువే కాదన్నారు. ఇప్పుడు ప్రాణాలు తియ్యని వాడు హిందువే కాదన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. గోరక్షణ పేరిట దేశంలో గత రెండేళ్లలో జరిగిన దాడుల్లో ఆరుగురు అమాయకులు మరణించారు. స్వాతంత్య్ర పోరాటంలో గోరక్షణ ఉద్యమాలకు ప్రత్యక్ష సంబంధం ఉన్నా, లేకున్నా అందులో రాజకీయాలు మాత్రం ఉన్నాయి. గోరక్షణ కోసం 18, 19 శతాబ్దంలో ప్రాణత్యాగం చేసిన వారిని దేవుళ్లుగా పూజించిన చరిత్ర మనదన్న విషయాన్ని మరచిపోతున్నాం. అమానుషత్వాన్ని ఆహ్వానిస్తున్నాం. -
అభివృద్ధికి పునరంకితమవుదాం
మచిలీపట్నం, న్యూస్‌లైన్ : స్వాతంత్య్ర ఉద్యమంలో అసువులు బాసిన మహనీయుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని దేశ అభివృద్ధికి పునరంకితమవ్వాలని కలెక్టర్ బుద్ధప్రకాష్ ఎం.జ్యోతి జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్‌లో గురువారం 67వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకాన్ని ఎగురవేసిన కలెక్టర్ పోలీసులు, సాయుధ దళాల నుంచి గౌరవవందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశ సంస్కృతీ సంప్రదాయాలు ఎంతో గొప్పవన్నారు. వ్యాపారం చేసేందుకు వచ్చిన బ్రిటీష్‌వారు మన సంపదను దోచుకుని, సైనిక బలంతో విభజించు, పాలించు సిద్ధాంతాన్ని అమలు చేశారన్నారు. 200 ఏళ్ల పాటు విదేశీ పాలకుల కబంధ హస్తాల్లో నలిగిపోయిన భారత జాతికి స్వాతంత్య్రం సాధించేందుకు ఝాన్సీలక్ష్మీబాయ్, తాంతియాతోపే, అవద్రాణి, బేగంసాహెబా, మంగళ్‌పాండే, దాదాభాయ్ నౌరోజీ, సురేంద్రనాధ్ బెనర్జీ, బాలగంగాధర తిలక్, లాలా లజపతిరాయ్, రాజా రామ్మోహన్రాయ్, జ్యోతిరావ్‌ఫూలే, ఎంజీ రెనడే, అల్లూరి సీతారామరాజు, మహాత్మాగాంధీ వంటి ఎందరో మహానుభావులు ప్రాణాలను అర్పించారని గుర్తుచేశారు. ముట్నూరి కృష్ణారావు స్థాపించిన కృష్ణాపత్రిక, గాడిచర్ల వారి స్వరాజ్యపత్రిక, కాశీనాథుని నాగేశ్వరరావు ప్రారంభించిన ఆంధ్రపత్రిక జాతీయోద్యమంలో కీలకపాత్ర వహించాయని చెప్పారు. జిల్లాకు ప్రత్యేక స్థానం దేశ స్వాతంత్య్ర పోరాటంలో జిల్లాకు ప్రత్యేక స్థానం ఉందని కలెక్టర్ చెప్పారు. మహాత్మాగాంధీ ఈ జిల్లాలో పర్యటించినప్పుడు ప్రజలు ఆయనకు బాసటగా నిలిచారన్నారు. స్త్రీ సమాజం స్థాపించి మహిళలను చైతన్యపరిచిన నందిగామ వాసి బండారు అచ్చమాంబ, బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా చారిత్రక కోనేరుసెంటరులో భారత జాతీయ జెండా ఎగురవేసిన తోట నరసయ్యనాయుడు వంటి వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. త్యాగం, శాంతి, సత్యం, అహింస, ధర్మాలకు పాడిపంటలు, పరిశ్రమలకు గుర్తుగా మహాత్మాగాంధీ ఆదేశాల మేరకు మూడు గంటల వ్యవధిలోనే జాతీయ జెండాను రూపొందించిన పింగళి వెంకయ్య జిల్లా వాసి కావడం గర్వకారణమన్నారు. జిల్లాకు చెందిన కొండా వెంకటప్పయ్య, అయ్యదేవర కాళేశ్వరరావు, కొమర్రాజు లక్ష్మణరావు, గొట్టిపాటి బ్రహ్మయ్య, వేమూరి రాంజీరావు, కొప్పల్లె హనుమంతరావు, డాక్టర్ బోగరాజు పట్టాభి సీతారామయ్య వంటి మహనీయుల త్యాగాల ద్వారానే స్వాతంత్య్ర ఫలాలు మనం అనుభవిస్తున్నామని వివరించారు. యువత కష్టపడి పనిచేయాలి.. ‘లెండి, మేల్కొనండి, గమ్యాన్ని చేరుకునే వరకు ఆగకండి’ అన్న స్వామి వివేకానంద మాటలను యువత పాటించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ సూచించారు. దేశ అభివృద్ధికి యువత కష్టపడాలన్నారు. జిల్లా అభివృద్ధిలో తోడ్పాటు అందిస్తున్న స్వాతంత్య్ర సమరయోధులకు, ప్రజాప్రతినిధులు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. స్వాతంత్య్ర సమరయోధులను మర్యాదపూర్వకంగా కలుసుకుని సన్మానించారు. ఈ వేడుకల్లో ఎంపీ కొనకళ్ల నారాయణరావు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.చక్రధరరావు, ఎస్పీ జె.ప్రభాకరరావు, జేసీ పి.ఉషాకుమారి, ఏజేసీ ఎన్.రమేష్‌కుమార్, డీఆర్వో ఎల్.విజయచందర్, ఏఎస్పీ శెముషీబాజ్‌పాయ్, అవనిగడ్డ ఉప ఎన్నికల పరిశీలకుడు మనీషీమోహిన్, డీఎంఅండ్ హెచ్‌వో సరసిజాక్షి, డీఈవో దేవానందరెడ్డి, జిల్లా న్యాయమూర్తులు పి.కేశవాచార్యులు, ఎ.నాగశైలజ, ఎం.అనురాధ, ఎ.అనిత, ఎల్.తేజోవతి, చిన్నంశెట్టి రాజు, స్వాతంత్య్ర సమరయోధులు మేకా నరసయ్య, చిల్లర మోహనరావు, కొండపల్లి పాండురంగారావు, ఆర్డీవో సాయిబాబు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.