‘ఈ స్వాతంత్య్ర కాంక్ష తీరేదెన్నడు?బానిసత్వం మీద మన మమకారం చచ్చేదెన్నడు? మాతృభూమి సంకెళ్లు తెగిపడేదెన్నడు?మన కష్టాలు తీరేదెన్నడు?’‘స్వాతంత్య్రం’ అన్న తమిళ కవితలోని తొలి పాదాలివి. రాసినవారు ‘మహాకవి’ సుబ్రహ్మణ్య భారతి.అక్షరాన్నీ, అలజడినీ సమంగా ప్రేమించినవారు భారత స్వాతంత్య్రోద్యమంలో ఎందరో ఉన్నారు. వాళ్లందరి చరిత్రనీ గుదిగుచ్చితే సుబ్రహ్మణ్య భారతి తొలి ఐదారుగురు కవుల మధ్యన నిలుస్తారు. సుబ్రహ్మణ్య భారతి సహజ కవి. ఆయన పేరు చివర ఉన్న ‘భారతి’ ఇందుకు సాక్ష్యం పలుకుతుంది. ఆ ఘట్టం ఏదో పురాణంలో చదివినట్టు ఉంటుంది. చిన్నస్వామి, లక్ష్మమ్మ కుమారుడు సుబ్రహ్మణ్యం. వారిది తిరునల్వేలి జిల్లా ఎట్టయాపురం. ఇప్పుడు తూత్తుకుడి. తండ్రి ప్రభుత్వోద్యోగి. పేద కుటుంబమనే చెప్పాలి. అయినా కొడుకును ఇంగ్లిష్ చదివించి, ఇంజనీర్‌ను చేయాలని ఆ తండ్రి ఆశ. కానీ ఆ కొడుకు చిన్నతనం నుంచి సంగీతమంటే ఇష్టపడుతూ ఉండేవాడు. కొంచెం వయసు వచ్చాక సాహిత్యం అంటే ఆసక్తి చూపడం ఆరంభించాడు. భారతి ప్రాథమిక విద్య అంతా ఆ గ్రామంలోనే జరిగింది. అనుకోకుండా ఐదో ఏటనే తల్లిని పోగొట్టుకున్నారు సుబ్రహ్మణ్య భారతి. అప్పటి నుంచి తండ్రే అన్నీ అయి పెంచారు. ఆయన క్రమశిక్షణకి ప్రాధాన్యం ఇచ్చే మనిషి. సుబ్రహ్మణ్యం పదకొండో ఏట ఎట్టయాపురం సంస్థానంలో ఆశుకవితా గానం జరిగింది. అందులో చిన్నారి సుబ్రహ్మణ్యం కూడా పాల్గొన్నాడు. అతడి ధారను చూసి నాటి పండితులు ఆయనకి ‘భారతి’ అని బిరుదు ఇచ్చారు.అంటే సరస్వతి అనే. అప్పటి నుంచి సుబ్రహ్మణ్యం పేరు చివఱ భారతి వచ్చి చేరింది. చిన్న వయసులోనే ‘వివేక భాను’ అన్న పత్రికలో ఆయన తొలి కవిత అచ్చయింది కూడా.
సుబ్రహ్మణ్య భారతి (డిసెంబర్ 11,1882–సెప్టెంబర్ 12, 1921)లోని సహజ కవిలో మరొకరు కూడా ఉన్నారు. ఆ మరొకరు సమర కవి. అతడు నిరంతరం స్వేచ్ఛ కోసం పరితపించేవాడు. అదే సమయంలో ఆయన చదువుల కోసం వారణాసి వెళ్లారు. అదే ఆయన జీవితంలో పెద్ద మలుపు అయింది. భారతీయ ఆధ్యాత్మిక చింతన, జాతీయ భావాలు ఆ గంగాతీరంలోనే ఆయనను ముంచెత్తాయి, ఆలోచనలను మలిచాయి. ఆయన జీవితం మీదే కాదు, కవిత్వం మీద కూడా అవే ప్రతిబింబించాయి. వారణాసిలో ప్రధానంగా సంస్కృతం చదువుకున్నారు. అదే సమయంలో హిందుస్తానీ కూడా బాగా నేర్చుకున్నారు.ఫ్రెంచ్ నేర్చుకున్నారు. ఇక ఇంగ్లిష్ సరేసరి. బెనారస్ విద్య తరువాత 1901లో స్వగ్రామం వచ్చారాయన. వేషం పూర్తిగా మారిపోయింది. బెనారస్‌లో ఆయనకు ఒక సిక్కు మిత్రుడు ఉండేవాడు. అతడి ప్రభావంతో తలపాగా మీద మక్కువ పెంచుకుని తాను కూడా ధరించడం ఆరంభించారు. మీసాలు కూడా అలా పెంచుకున్నవే. చిన్నతనంలో తనకు భారతి అన్న బిరుదు ఇచ్చిన ఎట్టయాపురం సంస్థానాధీశుడు మరచిపోకుండా భారతి రాగానే ఆస్థాన కవిగా నియమించారు. కానీ ఆయన ఎక్కువ కాలంలో అక్కడ ఉండలేదు. 1904లో మధురై వచ్చి సేతుపతి ఉన్నత పాఠశాలలో తమిళ ఉపాధ్యాయునిగా చేరారు. అప్పుడే ఈ ప్రపంచంలో ఏం జరుగుతున్నదో తెలుసుకోవాలన్న ఒక తపన ఆయనలో బయలుదేరింది. ఒక జ్ఞానతృష్ణ. అందుకు ఆయన పత్రికా రచయితగా అవతారం ఎత్తారు. ‘ది హిందు’ పత్రిక వ్యవస్థాపకులలో ఒకరు, ‘స్వదేశీమిత్రన్’ పత్రిక సంపాదకులు జి. సుబ్రహ్మణ్య అయ్యర్ భారతి ప్రతిభా పాటవాలను గురించి విన్నారు. ఆయన్ను పిలిచి ‘స్వదేశీమిత్రన్’లో సహాయ సంపాదకునిగా నియమించుకున్నారు.
తన వివేకం, విజ్ఞత, రాజనీతిజ్ఞతల మీద భారత జాతీయ కాంగ్రెస్ పెట్టుకున్న నమ్మకాన్ని బ్రిటిష్‌జాతి తొలిసారి భగ్నం చేసిన సందర్భం బెంగాల్ విభజన. ఆసేతు శీతాచలం అంటే రామేశ్వరంలోని సేతువు మొదలు హిమాలయాల మధ్య ఉన్న భారతం మొత్తం బెంగాల్ విభజన చర్యకు స్పందించింది. వేలాది మంది తొలిసారి స్వరాజ్య సమరంలోకి అడుగుపెట్టారు. అందులో భారతి కూడా ఉన్నారు.తాత్కాలికంగానే కావచ్చు, కానీ విన్నపాల మితవాదుల నుంచి జాతీయ కాంగ్రెస్ అప్పుడే తొలిసారి అతివాదుల చేతికి వచ్చింది. అలాంటి చారిత్రక సందర్భంలోనే భారతి స్వాతంత్య్రోద్యమంలో ప్రవేశించారు. ‘దీర్ఘకాలం వర్ధిల్లేది సమైక్య బంగాళమే’ అనే శీర్షికతో ఆయన రాసిన కవిత ‘స్వదేశీమిత్రన్’లోనే ప్రచురించారు. ఆ సంవత్సరం వారణాసిలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలకు భారతి హాజరయ్యారు. మళ్లీ 1906లో కలకత్తా సభలకు కూడా వెళ్లారు. బ్రిటిష్ జాతిని తీవ్రంగా ద్వేషిస్తూ ‘స్వరాజ్యం నా జన్మహక్కు’ అన్న నినాదం ఇచ్చిన తిలక్‌నూ, ఆయన వర్గీయులను దారుణంగా అవమానించిన 1907 నాటి సూరత్ కాంగ్రెస్ సమావేశాలను కూడా భారతి చూశారు.
జాతీయ కాంగ్రెస్‌కే చెందిన తిరుమలాచారి 1906 లో ‘ఇండియా’ అనే తమిళ పత్రికను నెలకొల్పారు. ఆయనే ‘బాలభారతి’ పేరుతో ఆంగ్ల పత్రిక కూడా స్థాపించారు. ఈ రెండింటికీ సంపాదకునిగా సుబ్రహ్మణ్య భారతినే తిరుమలాచారి ఎంపిక చేశారు. కలకత్తా సమావేశాలకు భారతి హాజరైనప్పుడు ఒకరు పరిచయమయ్యారు. అప్పటి నుంచి ఆ వ్యక్తిని గురువుగా ఆయన భావించారు. రెండు గేయా సంకలనాలను భారతి వెలువరించారు. ‘స్వదేశ’, ‘జన్మభూమి’ అని వాటికి పేర్లు పెట్టారు. ఆ రెండింటినీ కూడా భారతి ఆ గురువుకే అంకితం చేశారు. అయితే ఆ గురువు పురుషుడు కాకపోవడమే విశేషం. పైగా ఈ దేశానికి కూడా చెందరు. కానీ భారత స్వాతంత్య్రోద్యమాన్ని విశేషంగా అభిమానించారు. భారతీయత గొప్పతనాన్ని భారతీయులకు కూడా బోధించారు. ఆమె సిస్టర్ నివేదిత. ఇండియా పత్రికకు నిజమైన సంపాదకుడు భారతి అయినప్పటికీ పేరు మాత్రం ఎన్ శ్రీనివాసన్ అనే వ్యక్తిది ఉండేది. ఆ పత్రికలో భారతి రాసిన రాతలకు మొదట పోలీసులు శ్రీనివాసన్‌ను అరెస్టు చేసి తీసుకుపోయారు. తరువాత సుబ్రహ్మణ్య అయ్యర్‌పై అరెస్టు వారంట్లు జారీ అయ్యాయి. ఇక మిగిలింది భారతి. కొందరు మిత్రుల సలహాతో ఆయన మద్రాసు విడిచిపెట్టి పుదుచ్చేరి వెళ్లిపోయారు. ఫ్రెంచ్ పాలనలో ఉన్న పుదుచ్చేరి ఎందరో భారత స్వాతంత్య్ర సమరయోధులకి ఆశ్రయం కల్పిస్తూ ఉండేది. అప్పటికే అరవింద్ ఘోష్ అక్కడికి చేరుకున్నారు. అలాగే వీవీఎస్ అయ్యర్ కూడా బ్రిటిష్ పోలీసుల బాధలు తట్టుకోలేక అక్కడికే వలస వెళ్లారు. ఈ మహామహులు ఇద్దరితోను భారతి తరచూ మాట్లాడేవారు. పుదుచ్చేరి చేరుకునే సరికి భారతికి ఒక కూతురు. ఆమెను అప్పటికే బెనారస్‌లో ఉన్న తన బంధువు ఇంటికి పంపేశారు. భార్య చెల్లమ్మాళ్ మాత్రం ఎట్టయాపురం దగ్గర ఒక గ్రామంలో ఉండేవారు. పుదుచ్చేరిలో ఉన్నప్పటికీ భారతి రచనా వ్యాసంగం విరమించలేదు. ఇండియా పత్రికతో పాటు, విజయ, సూర్యోదయం, కర్మయోగి, చిత్రావళి అనే పత్రికలకి కూడా రచనలు అందించేవారు. ఇందులో చిత్రావళి వ్యంగ్య చిత్ర పత్రిక. దానికి భారతి వ్యంగ్య చిత్రాలు రచించి పంపేవారు. ఒక సందర్భంలో మద్రాసులో ఉన్న ఇండియా పత్రిక కార్యాలయాన్ని బ్రిటిష్ పోలీసులు ధ్వంసం చేస్తారన్న అనుమానం వచ్చింది. అందుకే శ్రీనివాసన్ తన పత్రిక ప్రెస్‌నీ, ఇతర సామగ్రిని రహస్యంగా పుదుచ్చేరికే తరలించారు. మళ్లీ పుదుచ్చేరి నుంచి ఇండియా, బాలభారతి పత్రికల ప్రచురణ ఆరంభమయింది. ఈసారి మరిన్ని ఆంక్షలు విధించారు బ్రిటిష్ పోలీసులు. అసలు ఆ పత్రికలు పుదుచ్చేరి బయటకు రాకుండా కట్టుదిట్టం చేశారు. పోస్టల్ సౌకర్యం ఆపేశారు. చందాదారులను నిరోధించారు. గతిలేని స్థితిలో పత్రిక ప్రచురణ ఆపేశారు.
అప్పుడే చెల్లమ్మాళ్ భర్తను ఎట్టయాపురం వచ్చేయవలసిందిగా గట్టిగా కోరింది. అప్పటికే పదేళ్లు గడిచాయి. మొత్తానికి మళ్లీ బ్రిటిష్ ఇండియాలో అడుగు పెట్టడానికి భారతి అంగీకరించారు. కానీ పుదుచ్చేరి విడిచిపెట్టి మద్రాసు ప్రెసిడెన్సీలోని కడలూరుకు రాగానే పోలీసులు అరెస్టు చేశారు. నెల రోజుల పాటు తమ నిర్బంధంలోనే ఉంచారు. ఆ సమయంలో అనీబిసెంట్, సీపీ రామస్వామి అయ్యర్ జోక్యం చేసుకుని ఆయనను విడిపించారు. మద్రాసు వచ్చిన తరువాత స్వదేశీమిత్రన్ యాజమాన్యం మళ్లీ పిలిచి సహాయ సంపాదకుని ఉద్యోగం తిరిగి ఇచ్చింది. అప్పటి నుంచి రాజకీయ ఉద్యమానికి కొంచెం దూరంగా ఉన్నప్పటికీ సంఘ సంస్కరణోద్యమానికి ఆయన దగ్గరయ్యారు. ముఖ్యంగా మహిళల పరిస్థితి మీద ఆయన పోరాటం చేశారు. మహిళలను గౌరవించాలన్న ఆశయాన్ని ఆయన ఆచరణలో పెట్టడానికి ప్రధాన కారణం సిస్టర్ నివేదిత. భారతి కవిత్వం మొత్తం అచ్చులో ఆరువందల పేజీలు. అది కాకుండా 60 కథలు రాశారు. కానీ ఆయన జీవితంలో ఎక్కువ భాగం పత్రికా రచనకు కేటాయించారు. ఆధునిక తమిళ సాహిత్యానికి ఆయన సేవలు నిరుపమానమైనవి. హైకూ కవితను తమిళానికి పరిచయం చేసినవారు భారతి. పుదుచ్చేరిలో ఉండగా లభించిన వెసులుబాటుతో భగవద్గీతకు, పతంజలి యోగ సూత్రాలకు ఆయన వ్యాఖ్యానాలు రాశారు. భారతి పేరును తమిళ సాహిత్యంలో చిరస్థాయిగా నిలిపిన ‘కణ్ణన్ పట్టు’, కూయిల్ పట్టు’ కావ్యాలు కూడా పుదుచ్చేరిలో ఉండగానే రాశారు. పాంచాలి శపథం ఆయన దీర్ఘ కవిత.దీనికి కూడా ఎంతో ఖ్యాతి ఉంది.
మద్రాస్‌లోనే ట్రిప్లికేన్‌లో ఉన్న పార్థసారథి ఆలయానికి భారతి తరచు వెళుతూ ఉండేవారు. వెళ్లిన ప్రతిసారీ అక్కడ ఉండే ఏనుగుకు పళ్లు తినిపించేవారు. 1921 ఆగస్టులో అలాగే ఆలయానికి వెళ్లారాయన.అదే ఏనుగుకు అరటిపండు తినిపిస్తూ ఉండగా అది భారతిని తొండంతో చుట్టి నేలకేసి కొట్టేసింది. ఆలయంలో చాలామందే ఉన్నా భయంతో ఎవరూ దగ్గరకు పోయే సాహసం చేయలేదు. బాగా గాయపడ్డారాయన. ఈ సంగతి తెలిసి ఆయన ఆప్తమిత్రుడు కువాలై కణ్ణన్ ఆలయానికి వచ్చి భారతిని ఆస్పత్రికి తీసుకువెళ్లారు. తరువాత దాదాపు నెలరోజులు బాగానే ఉన్నారు. సెప్టెంబర్ రెండో వారంలోనే మళ్లీ ఆరోగ్యం చెడిపోయింది. సెప్టెంబర్ 12న తుదిశ్వాస విడిచారు. ఆ మహాకవి అంత్యక్రియలు మరో విషాదం. పోలీసులకు కోపం వస్తుందన్న అనుమానంతో అంత్యక్రియల దగ్గరకి మొత్తం 13 మంది మాత్రమే వచ్చారు. చితికి ఎవరు నిప్పుపెట్టాలన్న మీమాంస కూడా వచ్చింది. పోలీసుల భయం. నిజానికి భారతికి మహాకవి పీఠం ‘మరణానంతర’ పురస్కారమే. ఆయన కవిత్వం మీద, పుస్తకాల మీద బ్రిటిష్ ప్రభుత్వం నిషే«ధం విధించింది. పత్రికా రచయితగా ఆయన కలం సత్తా ఏమిటో తెలిసే అవకాశం కూడా పెద్దగా లేకపోయింది. అంతా పుదుచ్చేరికి పరిమితమైపోయింది. నిజం చెప్పాలంటే ఆ మారుమూల సముద్ర తీరంలో ఆయన సాహిత్యం కూడా అజ్ఞాతవాసం చేసింది. మరణించేనాటికి భారతి వయసు 39 సంవత్సరాలు. అందులో పదేళ్లు అజ్ఞాతంలోనే గడిచాయి. కానీ ఆయన కవిత్వానికి ఒక వెలుగునిచ్చిన ఘనత భారతి సహధర్మ చారిణి చెల్లమ్మాళ్‌దే. తన సోదరుడు, మరొక దగ్గర బంధువు సాయంతో ఆమె మద్రాసులో ఒక ఆశ్రమం స్థాపించి, భారతి రచనలను సంకలనాలుగా వెలువరించింది.భర్తతో కలసి ఉన్నది తక్కువే. కానీ ఆయనను ఆమె ఎంతో ప్రేమించింది. చాలామంది కవులు మరణించిన తరువాత జీవించడం ఆరంభించారు. భారతి కూడా అందులో ఒకరు.
- ∙డా. గోపరాజు నారాయణరావు
సమరకవి
Published Sun, Mar 3 2019 12:23 AM | Last Updated on Sun, Mar 3 2019 12:23 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment