Goparaju Narayanarao
-
సమరకవి
‘ఈ స్వాతంత్య్ర కాంక్ష తీరేదెన్నడు?బానిసత్వం మీద మన మమకారం చచ్చేదెన్నడు? మాతృభూమి సంకెళ్లు తెగిపడేదెన్నడు?మన కష్టాలు తీరేదెన్నడు?’‘స్వాతంత్య్రం’ అన్న తమిళ కవితలోని తొలి పాదాలివి. రాసినవారు ‘మహాకవి’ సుబ్రహ్మణ్య భారతి.అక్షరాన్నీ, అలజడినీ సమంగా ప్రేమించినవారు భారత స్వాతంత్య్రోద్యమంలో ఎందరో ఉన్నారు. వాళ్లందరి చరిత్రనీ గుదిగుచ్చితే సుబ్రహ్మణ్య భారతి తొలి ఐదారుగురు కవుల మధ్యన నిలుస్తారు. సుబ్రహ్మణ్య భారతి సహజ కవి. ఆయన పేరు చివర ఉన్న ‘భారతి’ ఇందుకు సాక్ష్యం పలుకుతుంది. ఆ ఘట్టం ఏదో పురాణంలో చదివినట్టు ఉంటుంది. చిన్నస్వామి, లక్ష్మమ్మ కుమారుడు సుబ్రహ్మణ్యం. వారిది తిరునల్వేలి జిల్లా ఎట్టయాపురం. ఇప్పుడు తూత్తుకుడి. తండ్రి ప్రభుత్వోద్యోగి. పేద కుటుంబమనే చెప్పాలి. అయినా కొడుకును ఇంగ్లిష్ చదివించి, ఇంజనీర్‌ను చేయాలని ఆ తండ్రి ఆశ. కానీ ఆ కొడుకు చిన్నతనం నుంచి సంగీతమంటే ఇష్టపడుతూ ఉండేవాడు. కొంచెం వయసు వచ్చాక సాహిత్యం అంటే ఆసక్తి చూపడం ఆరంభించాడు. భారతి ప్రాథమిక విద్య అంతా ఆ గ్రామంలోనే జరిగింది. అనుకోకుండా ఐదో ఏటనే తల్లిని పోగొట్టుకున్నారు సుబ్రహ్మణ్య భారతి. అప్పటి నుంచి తండ్రే అన్నీ అయి పెంచారు. ఆయన క్రమశిక్షణకి ప్రాధాన్యం ఇచ్చే మనిషి. సుబ్రహ్మణ్యం పదకొండో ఏట ఎట్టయాపురం సంస్థానంలో ఆశుకవితా గానం జరిగింది. అందులో చిన్నారి సుబ్రహ్మణ్యం కూడా పాల్గొన్నాడు. అతడి ధారను చూసి నాటి పండితులు ఆయనకి ‘భారతి’ అని బిరుదు ఇచ్చారు.అంటే సరస్వతి అనే. అప్పటి నుంచి సుబ్రహ్మణ్యం పేరు చివఱ భారతి వచ్చి చేరింది. చిన్న వయసులోనే ‘వివేక భాను’ అన్న పత్రికలో ఆయన తొలి కవిత అచ్చయింది కూడా. సుబ్రహ్మణ్య భారతి (డిసెంబర్ 11,1882–సెప్టెంబర్ 12, 1921)లోని సహజ కవిలో మరొకరు కూడా ఉన్నారు. ఆ మరొకరు సమర కవి. అతడు నిరంతరం స్వేచ్ఛ కోసం పరితపించేవాడు. అదే సమయంలో ఆయన చదువుల కోసం వారణాసి వెళ్లారు. అదే ఆయన జీవితంలో పెద్ద మలుపు అయింది. భారతీయ ఆధ్యాత్మిక చింతన, జాతీయ భావాలు ఆ గంగాతీరంలోనే ఆయనను ముంచెత్తాయి, ఆలోచనలను మలిచాయి. ఆయన జీవితం మీదే కాదు, కవిత్వం మీద కూడా అవే ప్రతిబింబించాయి. వారణాసిలో ప్రధానంగా సంస్కృతం చదువుకున్నారు. అదే సమయంలో హిందుస్తానీ కూడా బాగా నేర్చుకున్నారు.ఫ్రెంచ్ నేర్చుకున్నారు. ఇక ఇంగ్లిష్ సరేసరి. బెనారస్ విద్య తరువాత 1901లో స్వగ్రామం వచ్చారాయన. వేషం పూర్తిగా మారిపోయింది. బెనారస్‌లో ఆయనకు ఒక సిక్కు మిత్రుడు ఉండేవాడు. అతడి ప్రభావంతో తలపాగా మీద మక్కువ పెంచుకుని తాను కూడా ధరించడం ఆరంభించారు. మీసాలు కూడా అలా పెంచుకున్నవే. చిన్నతనంలో తనకు భారతి అన్న బిరుదు ఇచ్చిన ఎట్టయాపురం సంస్థానాధీశుడు మరచిపోకుండా భారతి రాగానే ఆస్థాన కవిగా నియమించారు. కానీ ఆయన ఎక్కువ కాలంలో అక్కడ ఉండలేదు. 1904లో మధురై వచ్చి సేతుపతి ఉన్నత పాఠశాలలో తమిళ ఉపాధ్యాయునిగా చేరారు. అప్పుడే ఈ ప్రపంచంలో ఏం జరుగుతున్నదో తెలుసుకోవాలన్న ఒక తపన ఆయనలో బయలుదేరింది. ఒక జ్ఞానతృష్ణ. అందుకు ఆయన పత్రికా రచయితగా అవతారం ఎత్తారు. ‘ది హిందు’ పత్రిక వ్యవస్థాపకులలో ఒకరు, ‘స్వదేశీమిత్రన్’ పత్రిక సంపాదకులు జి. సుబ్రహ్మణ్య అయ్యర్ భారతి ప్రతిభా పాటవాలను గురించి విన్నారు. ఆయన్ను పిలిచి ‘స్వదేశీమిత్రన్’లో సహాయ సంపాదకునిగా నియమించుకున్నారు. తన వివేకం, విజ్ఞత, రాజనీతిజ్ఞతల మీద భారత జాతీయ కాంగ్రెస్ పెట్టుకున్న నమ్మకాన్ని బ్రిటిష్‌జాతి తొలిసారి భగ్నం చేసిన సందర్భం బెంగాల్ విభజన. ఆసేతు శీతాచలం అంటే రామేశ్వరంలోని సేతువు మొదలు హిమాలయాల మధ్య ఉన్న భారతం మొత్తం బెంగాల్ విభజన చర్యకు స్పందించింది. వేలాది మంది తొలిసారి స్వరాజ్య సమరంలోకి అడుగుపెట్టారు. అందులో భారతి కూడా ఉన్నారు.తాత్కాలికంగానే కావచ్చు, కానీ విన్నపాల మితవాదుల నుంచి జాతీయ కాంగ్రెస్ అప్పుడే తొలిసారి అతివాదుల చేతికి వచ్చింది. అలాంటి చారిత్రక సందర్భంలోనే భారతి స్వాతంత్య్రోద్యమంలో ప్రవేశించారు. ‘దీర్ఘకాలం వర్ధిల్లేది సమైక్య బంగాళమే’ అనే శీర్షికతో ఆయన రాసిన కవిత ‘స్వదేశీమిత్రన్’లోనే ప్రచురించారు. ఆ సంవత్సరం వారణాసిలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలకు భారతి హాజరయ్యారు. మళ్లీ 1906లో కలకత్తా సభలకు కూడా వెళ్లారు. బ్రిటిష్ జాతిని తీవ్రంగా ద్వేషిస్తూ ‘స్వరాజ్యం నా జన్మహక్కు’ అన్న నినాదం ఇచ్చిన తిలక్‌నూ, ఆయన వర్గీయులను దారుణంగా అవమానించిన 1907 నాటి సూరత్ కాంగ్రెస్ సమావేశాలను కూడా భారతి చూశారు. జాతీయ కాంగ్రెస్‌కే చెందిన తిరుమలాచారి 1906 లో ‘ఇండియా’ అనే తమిళ పత్రికను నెలకొల్పారు. ఆయనే ‘బాలభారతి’ పేరుతో ఆంగ్ల పత్రిక కూడా స్థాపించారు. ఈ రెండింటికీ సంపాదకునిగా సుబ్రహ్మణ్య భారతినే తిరుమలాచారి ఎంపిక చేశారు. కలకత్తా సమావేశాలకు భారతి హాజరైనప్పుడు ఒకరు పరిచయమయ్యారు. అప్పటి నుంచి ఆ వ్యక్తిని గురువుగా ఆయన భావించారు. రెండు గేయా సంకలనాలను భారతి వెలువరించారు. ‘స్వదేశ’, ‘జన్మభూమి’ అని వాటికి పేర్లు పెట్టారు. ఆ రెండింటినీ కూడా భారతి ఆ గురువుకే అంకితం చేశారు. అయితే ఆ గురువు పురుషుడు కాకపోవడమే విశేషం. పైగా ఈ దేశానికి కూడా చెందరు. కానీ భారత స్వాతంత్య్రోద్యమాన్ని విశేషంగా అభిమానించారు. భారతీయత గొప్పతనాన్ని భారతీయులకు కూడా బోధించారు. ఆమె సిస్టర్ నివేదిత. ఇండియా పత్రికకు నిజమైన సంపాదకుడు భారతి అయినప్పటికీ పేరు మాత్రం ఎన్ శ్రీనివాసన్ అనే వ్యక్తిది ఉండేది. ఆ పత్రికలో భారతి రాసిన రాతలకు మొదట పోలీసులు శ్రీనివాసన్‌ను అరెస్టు చేసి తీసుకుపోయారు. తరువాత సుబ్రహ్మణ్య అయ్యర్‌పై అరెస్టు వారంట్లు జారీ అయ్యాయి. ఇక మిగిలింది భారతి. కొందరు మిత్రుల సలహాతో ఆయన మద్రాసు విడిచిపెట్టి పుదుచ్చేరి వెళ్లిపోయారు. ఫ్రెంచ్ పాలనలో ఉన్న పుదుచ్చేరి ఎందరో భారత స్వాతంత్య్ర సమరయోధులకి ఆశ్రయం కల్పిస్తూ ఉండేది. అప్పటికే అరవింద్ ఘోష్ అక్కడికి చేరుకున్నారు. అలాగే వీవీఎస్ అయ్యర్ కూడా బ్రిటిష్ పోలీసుల బాధలు తట్టుకోలేక అక్కడికే వలస వెళ్లారు. ఈ మహామహులు ఇద్దరితోను భారతి తరచూ మాట్లాడేవారు. పుదుచ్చేరి చేరుకునే సరికి భారతికి ఒక కూతురు. ఆమెను అప్పటికే బెనారస్‌లో ఉన్న తన బంధువు ఇంటికి పంపేశారు. భార్య చెల్లమ్మాళ్ మాత్రం ఎట్టయాపురం దగ్గర ఒక గ్రామంలో ఉండేవారు. పుదుచ్చేరిలో ఉన్నప్పటికీ భారతి రచనా వ్యాసంగం విరమించలేదు. ఇండియా పత్రికతో పాటు, విజయ, సూర్యోదయం, కర్మయోగి, చిత్రావళి అనే పత్రికలకి కూడా రచనలు అందించేవారు. ఇందులో చిత్రావళి వ్యంగ్య చిత్ర పత్రిక. దానికి భారతి వ్యంగ్య చిత్రాలు రచించి పంపేవారు. ఒక సందర్భంలో మద్రాసులో ఉన్న ఇండియా పత్రిక కార్యాలయాన్ని బ్రిటిష్ పోలీసులు ధ్వంసం చేస్తారన్న అనుమానం వచ్చింది. అందుకే శ్రీనివాసన్ తన పత్రిక ప్రెస్నీ, ఇతర సామగ్రిని రహస్యంగా పుదుచ్చేరికే తరలించారు. మళ్లీ పుదుచ్చేరి నుంచి ఇండియా, బాలభారతి పత్రికల ప్రచురణ ఆరంభమయింది. ఈసారి మరిన్ని ఆంక్షలు విధించారు బ్రిటిష్ పోలీసులు. అసలు ఆ పత్రికలు పుదుచ్చేరి బయటకు రాకుండా కట్టుదిట్టం చేశారు. పోస్టల్ సౌకర్యం ఆపేశారు. చందాదారులను నిరోధించారు. గతిలేని స్థితిలో పత్రిక ప్రచురణ ఆపేశారు. అప్పుడే చెల్లమ్మాళ్ భర్తను ఎట్టయాపురం వచ్చేయవలసిందిగా గట్టిగా కోరింది. అప్పటికే పదేళ్లు గడిచాయి. మొత్తానికి మళ్లీ బ్రిటిష్ ఇండియాలో అడుగు పెట్టడానికి భారతి అంగీకరించారు. కానీ పుదుచ్చేరి విడిచిపెట్టి మద్రాసు ప్రెసిడెన్సీలోని కడలూరుకు రాగానే పోలీసులు అరెస్టు చేశారు. నెల రోజుల పాటు తమ నిర్బంధంలోనే ఉంచారు. ఆ సమయంలో అనీబిసెంట్, సీపీ రామస్వామి అయ్యర్ జోక్యం చేసుకుని ఆయనను విడిపించారు. మద్రాసు వచ్చిన తరువాత స్వదేశీమిత్రన్ యాజమాన్యం మళ్లీ పిలిచి సహాయ సంపాదకుని ఉద్యోగం తిరిగి ఇచ్చింది. అప్పటి నుంచి రాజకీయ ఉద్యమానికి కొంచెం దూరంగా ఉన్నప్పటికీ సంఘ సంస్కరణోద్యమానికి ఆయన దగ్గరయ్యారు. ముఖ్యంగా మహిళల పరిస్థితి మీద ఆయన పోరాటం చేశారు. మహిళలను గౌరవించాలన్న ఆశయాన్ని ఆయన ఆచరణలో పెట్టడానికి ప్రధాన కారణం సిస్టర్ నివేదిత. భారతి కవిత్వం మొత్తం అచ్చులో ఆరువందల పేజీలు. అది కాకుండా 60 కథలు రాశారు. కానీ ఆయన జీవితంలో ఎక్కువ భాగం పత్రికా రచనకు కేటాయించారు. ఆధునిక తమిళ సాహిత్యానికి ఆయన సేవలు నిరుపమానమైనవి. హైకూ కవితను తమిళానికి పరిచయం చేసినవారు భారతి. పుదుచ్చేరిలో ఉండగా లభించిన వెసులుబాటుతో భగవద్గీతకు, పతంజలి యోగ సూత్రాలకు ఆయన వ్యాఖ్యానాలు రాశారు. భారతి పేరును తమిళ సాహిత్యంలో చిరస్థాయిగా నిలిపిన ‘కణ్ణన్ పట్టు’, కూయిల్ పట్టు’ కావ్యాలు కూడా పుదుచ్చేరిలో ఉండగానే రాశారు. పాంచాలి శపథం ఆయన దీర్ఘ కవిత.దీనికి కూడా ఎంతో ఖ్యాతి ఉంది. మద్రాస్‌లోనే ట్రిప్లికేన్‌లో ఉన్న పార్థసారథి ఆలయానికి భారతి తరచు వెళుతూ ఉండేవారు. వెళ్లిన ప్రతిసారీ అక్కడ ఉండే ఏనుగుకు పళ్లు తినిపించేవారు. 1921 ఆగస్టులో అలాగే ఆలయానికి వెళ్లారాయన.అదే ఏనుగుకు అరటిపండు తినిపిస్తూ ఉండగా అది భారతిని తొండంతో చుట్టి నేలకేసి కొట్టేసింది. ఆలయంలో చాలామందే ఉన్నా భయంతో ఎవరూ దగ్గరకు పోయే సాహసం చేయలేదు. బాగా గాయపడ్డారాయన. ఈ సంగతి తెలిసి ఆయన ఆప్తమిత్రుడు కువాలై కణ్ణన్ ఆలయానికి వచ్చి భారతిని ఆస్పత్రికి తీసుకువెళ్లారు. తరువాత దాదాపు నెలరోజులు బాగానే ఉన్నారు. సెప్టెంబర్ రెండో వారంలోనే మళ్లీ ఆరోగ్యం చెడిపోయింది. సెప్టెంబర్ 12న తుదిశ్వాస విడిచారు. ఆ మహాకవి అంత్యక్రియలు మరో విషాదం. పోలీసులకు కోపం వస్తుందన్న అనుమానంతో అంత్యక్రియల దగ్గరకి మొత్తం 13 మంది మాత్రమే వచ్చారు. చితికి ఎవరు నిప్పుపెట్టాలన్న మీమాంస కూడా వచ్చింది. పోలీసుల భయం. నిజానికి భారతికి మహాకవి పీఠం ‘మరణానంతర’ పురస్కారమే. ఆయన కవిత్వం మీద, పుస్తకాల మీద బ్రిటిష్ ప్రభుత్వం నిషే«ధం విధించింది. పత్రికా రచయితగా ఆయన కలం సత్తా ఏమిటో తెలిసే అవకాశం కూడా పెద్దగా లేకపోయింది. అంతా పుదుచ్చేరికి పరిమితమైపోయింది. నిజం చెప్పాలంటే ఆ మారుమూల సముద్ర తీరంలో ఆయన సాహిత్యం కూడా అజ్ఞాతవాసం చేసింది. మరణించేనాటికి భారతి వయసు 39 సంవత్సరాలు. అందులో పదేళ్లు అజ్ఞాతంలోనే గడిచాయి. కానీ ఆయన కవిత్వానికి ఒక వెలుగునిచ్చిన ఘనత భారతి సహధర్మ చారిణి చెల్లమ్మాళ్‌దే. తన సోదరుడు, మరొక దగ్గర బంధువు సాయంతో ఆమె మద్రాసులో ఒక ఆశ్రమం స్థాపించి, భారతి రచనలను సంకలనాలుగా వెలువరించింది.భర్తతో కలసి ఉన్నది తక్కువే. కానీ ఆయనను ఆమె ఎంతో ప్రేమించింది. చాలామంది కవులు మరణించిన తరువాత జీవించడం ఆరంభించారు. భారతి కూడా అందులో ఒకరు. - ∙డా. గోపరాజు నారాయణరావు -
ఏదీ భిన్నత్వంలో ఏకత్వం?
ఇప్పుడు ఈశాన్య భారతవాసుల సమస్య కూడా అదే. మిగిలిన భారతదేశం వారి పట్ల వివక్ష చూపుతున్నదన్న ఆరోపణ వాస్తవికమైనదే. చాలా దేశాల చరిత్ర మలుపు తిరగడానికి కారణమైన వర్ణ వివక్ష జాడే ఇందులోనూ ఉందని కొన్ని ఉదాహరణలతో చెప్పవచ్చు. పదేళ్ల క్రితం నలభై మంది ప్రౌఢ స్త్రీలు మణిపూర్ రాజధాని ఇంపాల్‌లో ఉన్న అసోం రైఫి ల్స్ ప్రధాన కార్యాలయం ముందు నగ్నంగా నిలబడ్డారు. ‘భారతీయ సైనికులారా! మా మీద అత్యాచారాలు చేయం’డంటూ నినాదాలు చేశారు. దేశం మొత్తాన్ని కదిపి కుదిపే ఒక అమానవీయ ఘటన, దురంతం జరిగి తేనే ఈశాన్య భారతం మీద దేశం దృష్టి పడుతుంది. ఈ పరిణామమే చాలా ప్రశ్నలను సంధిస్తుంది. వాటిలో ఈశాన్య భారతవాసుల పట్ల, మిగిలిన భారతావని వివక్ష చూపుతున్నదా? అన్న ప్రశ్న పదునెక్కుతోంది. నిడో టానిమమ్ అనే అరుణాచల్‌ప్రదేశ్ విద్యార్థిని ఈ జనవరి 29న ఢిల్లీలోని లజపతినగర్ ప్రాంతంలో(నిజానికి జలంధర్‌లో చదువుకుంటున్నాడు) కొందరు హేళన చేయడంతో గొడవ మొదలై, ఆ కుర్రాడి హత్యకు దారి తీసింది. నిడో అరుణాచల్ ప్రదేశ్ కాం గ్రెస్ ఎంఎల్ఏ నిడో పవిత్ర కుమారుడు. 2012లో జరిగిన ఇంకో రెండు ఇలాంటి సం ఘటనలను కూడా గుర్తుకొస్తాయి. చండీఘడ్‌లో ఎంబీఏ చదువుతూ దానా సిల్వా సంగ్మా (మేఘాలయ ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మా కూతురు) ఆత్మహత్య చేసుకుంది. పరీక్షా కేం ద్రంలో సెల్‌ఫోన్‌తో పట్టుబడిన తరువాత ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఆ ఏడాదే బెంగళూరులో చదువుతున్న రిచర్డ్ లాయిటామ్ అనే విద్యార్థి హాస్టల్ గదిలో హత్యకు గురయ్యా డు. ఈ దుర్ఘటన తరువా త బెంగళూరు పరిసరాల లో నివశిస్తున్న ఈశాన్య భారతీయులు స్వస్థలాల కు వెళ్లడానికి ప్రత్యేక రైళ్లనే నడపవలసి వచ్చింది. ఎస్ఎంఎస్లతో ఆ ప్రాం తం వారిని బీభత్సానికి గురిచేశారు. ఇవన్నీ వెలు గు చూసిన సంఘటనలు. ఈశాన్య భారతవాసులకీ, మిగిలిన భారతదేశ వాసులకీ మధ్య భౌతికరూపంలో తేడా నిజమే. అయినా వారంతా శతాబ్దాలుగా భారతీయులే. కానీ రూపం కారణంగా వారు మిగిలిన భారతదేశంలో హేళనలకు గురి కావలసి రావడం విషాదమే. అమెరికాలో నల్లజాతీయులని ఈ కారణంగానే ద్వేషించడం ఎక్కువ. నిజానికి రంగు కారణంగానే వివక్ష పరిఢవిల్లుతూ ఉంటుంది. ఇప్పుడు ఈశాన్య భారతవాసుల సమస్య కూడా అదే. మిగిలిన భారతదేశం వారి పట్ల వివక్ష చూపుతున్నదన్న ఆరోపణ వాస్తవికమైనదే. చాలా దేశాల చరిత్ర మలు పు తిరగడానికి కారణమై న వర్ణ వివక్ష జాడే ఇందులోనూ ఉందని కొన్ని ఉదాహరణలతో చెప్పవచ్చు. ఈశాన్యవాసుల రూపం తో పాటు భాష, సం స్కృతి కూడా భిన్నమే. మనదేశంలో చాలాచోట్ల ఈశాన్య వాసులను చిం కీలు అని హేళనగా పిలు స్తూ ఉంటారు. కొన్ని శతాబ్దాలుగా వర్ణ వివక్షకు గురవుతున్న ఆఫ్రికా నల్లవారు ఆంగ్లేయుల కంటె భారతీయులకే వర్ణ వివక్ష ఉందని ఎందుకు భావిస్తున్నారో దీనినిబట్టి సుల భంగానే గ్రహించగలం. ఉత్తర భారతీయులు దక్షిణ భారతీయుల పట్ల ఇలాంటి వివక్షే చూపుతూ ఉంటారన్న విమర్శ కూడా వాస్తవదూరమైనది కాదు. దేశంలో అక్షరాస్యత గణనీయంగా ఉన్న ఈశాన్య ప్రాంత వాసులు ఇలాంటి పరిస్థితికి లోను కావడం ఒక వైచిత్రి. 2001 ప్రకారం ఏడు ఈశాన్య రాష్ట్రాలలో అక్షరాస్యత శాతం 64.3 శాతం (అసోం) నుంచి 88.5 శాతం (మిజోరం) ఉంది. ఇంత అక్షరాస్యత ఉన్నా, దశాబ్దాలుగా నివశిస్తున్న సొంత దేశ ంలోనే వివక్షకు గురికావడం విషాదమే. ఇదే భారత సాంస్కృతిక భిన్నత్వం మీద ప్రశ్నలు కురిపిస్తున్నది. ఈశాన్య భారత వాసుల మీద మొద టి దశలో మాటల దాడులు జరిగేవి. ఈ మాటలన్నీ మిగిలిన భారతీయుల కంటె భిన్నంగా ఉండే వారి రూపు రేఖల మీద వ్యం గ్యాస్త్రాలే. ఇతర ప్రాంతాలకు వెళ్లినపుడు ఆడపిల్లల మీద అత్యాచారాలు మరో అంశం. భాష సమస్యను అలుసుగా తీసుకుని చాలాచోట్ల టాక్సీ డ్రైవర్లు, ఇతర రవాణా వ్యవస్థలు దోపిడీ చేయడం, ఇళ్లు అద్దెకు దొరకకపోవడం వంటి సమస్యలూ వారు ఎదుర్కొంటున్నారు. ఇవన్నీ చూస్తే మనం ఘనంగా చెప్పుకునే సాంస్కృతిక ఏకత్వం, భిన్నత్వంలో ఏకత్వం మీద ప్రశ్నలు రేకెత్తక తప్పదు. దేశ సమగ్రతకు సంబంధించిన ఈ విషయంలో అయి నా, రాజ్యాంగం నిర్ద్వంద్వంగా ఉద్ఘాటించిన ఈ ఏకత్వం గురించి అయినా ఢిల్లీ నిబద్ధత చూపేటట్టు చేయడంలో అన్ని రాజకీయ పార్టీ లు విఫలమైనాయి. భారతదేశంలో ఎక్కడైనా నివశించగలగడం గురించి చెప్పే హక్కు హుళక్కి అని ఈ పరిణామమే చాటి చెబుతోంది. అక్కడ జరిగే విషాదాలతోనే వారిని గురించి స్మరించుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. టాగూర్ కథలలో ఒకపాత్ర తాను బతికున్న సంగతి లోకానికి ఎరుకపరచడానికి ఆత్మహత్యను ఆశ్రయిస్తుం ది. ఈశాన్య భారత జనజీవనం పరిస్థితి ఇలాగే ఉంది. డాక్టర్ గోపరాజు నారాయణరావు -
టిబెటన్ల పయనం ఎటువైపు?
దలైలామా ఒకవైపు చైనా ఆధిపత్యంలోనే ఉండాలనుకుంటున్నట్టు చెబుతున్నారు. మరోవైపు కమ్యూనిస్టు పార్టీని తప్పు పడుతున్నారు. చైనా ప్రభుత్వం-చైనా కమ్యూనిస్టుపార్టీ వేర్వేరు కాదు. అందుకే దలైలామా పోకడ టిబెట్ స్వాతంత్య్ర పోరాటయోధులకు మింగుడుపడదు. టిబెట్ ఆధ్యాత్మిక గురుపీఠం తన తరువాత ఒక మహిళకు దక్కే అవకాశం ఉందని పద్నాలుగో దలైలామా ఆ మధ్య ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. డెబ్భై ఎనిమిదేళ్ల దలైలామా ఈ ఫిబ్రవరి రెండున మన గౌహతిలో చేసిన ప్రకటన ప్రపంచం చేత, ముఖ్యంగా భారత్ చేత కనుబొమలు ముడివేయించేదే. చైనా నుంచి టిబెట్ స్వాతంత్య్రాన్ని కోరుకోవడం లేదన్నదే ఆ ప్రకటన సారాంశం. చైనా నుంచి టిబెట్‌కు రాజకీయ స్వాతంత్య్రం కావా లంటూ ప్రవాసం నుంచి, టిబెట్‌లోనూ పోరాడుతున్న వారికి ఈ ప్రకటన బాధ కలిగించక మానదు. 1950లో ఆధ్యాత్మిక గురుపీఠం అధిరోహించిన నాటి నుంచి దలైలామా సంపూర్ణ స్వాతంత్య్రం కోసం జరుగుతున్న ఉద్యమాన్ని సమర్ధించడంలేదు. అయినా చైనాకు వ్యతిరేకంగా టిబెల్‌లో పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతూనే ఉంది. ఈ ప్రకటనతో పాటు అహిం సా విధానం గురించి దలైలామా చేసిన వ్యా ఖ్య కూడా ప్రశ్నలు రేకెత్తించేదిగా ఉంది. ‘వ్యక్తి,శాంతి- మానవాళి దృష్టి’ అన్న అంశంపై ఏర్పాటైన గోష్టిలో ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా ఆధిపత్యం నుంచి స్వాతంత్య్రం కోరుకోవడంలేదని దలైలామా చెప్పినా, కమ్యూనిస్టు పార్టీని మాత్రం ఆయన విడిచి పెట్టలేదు. చైనా కమ్యూనిస్టు పార్టీలోని కొం దరు అతివాదుల వల్ల టిబెట్ సంస్కృతికి తీవ్ర నష్టం జరుగుతోందనీ, వాళ్ల వల్ల బౌద్ధం పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నదనీ కూడా ఆరోపించారు. దలైలామా ఒకవైపు చైనా ఆధిపత్యంలోనే ఉండాలనుకుంటున్న ట్టు చెబుతున్నారు. మరోవైపు కమ్యూనిస్టు పార్టీని తప్పు పడుతున్నారు. చైనా ప్రభుత్వం - చైనా కమ్యూనిస్టుపార్టీ వేర్వేరు కాదు. అందుకే దలైలామా పోక డ టిబెట్ స్వాతంత్య్ర పోరాటయోధులకు మింగుడుపడదు. మూడురోజుల తరువాత ధర్మశాలలోని టిబెట్ ప్రవాస ప్రభుత్వ ప్రధా ని డాక్టర్ లోబ్సంగ్ సాంగే దలైలామా ప్రకట నను సమర్ధించారు కూడా. చైనా నుంచి వేరు కావాలని టిబెట్ భావించడం లేదని, భవిష్యత్తులో తగిన రీతిలో స్వయం ప్రతిపత్తి ఇవ్వడానికి చైనా సుముఖంగా ఉంటే చర్చల ప్రక్రియ ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చునని కూడా లోబ్సంగ్ అభిప్రాయపడ్డారు. తమ దేశం చైనా నీడలోనే ఉండాలని టిబెటన్లందరూ భావిస్తున్నారా? జరిగిన, జరుగుతున్న పరిణామాలను బట్టి చైనా ఆధిపత్యంలోనే మనుగడ సాగించడానికి ఆ హిమాలయ రాజ్యవాసులు ఇప్పటికీ సిద్ధంగా లేరనే చెప్పాలి. 2002 నుంచి దలైలామా ప్రతినిధులకీ, చైనా ప్రభుత్వ ప్రతినిధులకీ మధ్య తొమ్మిది దఫాలు చర్చలు జరిగా యి. కానీ 2012లో దలైలామా ప్రతినిధులంతా రాజీనామాలు చేశారు. టిబెట్‌లో పరిస్థితులు తీవ్రరూపం దాల్చడం, చైనా నుంచి సానుకూల స్పందన లేకపోవడమే ఇందుకు కారణం. చర్చలు సఫల మైతే దలైలామా టిబెట్‌లో తిరిగి ప్రవేశిస్తారని ప్రధాని లోబ్సంగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. మంచిదే. కానీ పరిస్థితులు ఇందుకు అనుకూలిస్తాయా అన్నదే ప్రశ్న. టిబెట్ చైనా అంతర్భాగమని వాదించేవారు, చైనాది దురాక్రమణ అని చెప్పేవారు సమానంగా ఉంటారు. దలైలామా తిరిగి టిబెట్ రావాలనీ, దేశానికి స్వాతంత్య్రం కావాలని 2009లో 124 మంది టిబెటన్లు ఆత్మాహుతికి పాల్పడ్డారు. అక్కడి చైనా ఆధిపత్యంలో దుర్లభంగా మారిన పౌరహక్కుల గురించి కూడా ఎన్నో విమర్శలు ఉన్నాయి. నిజానికి ఇప్పుడు చైనా ఆధిపత్యంలోనే టిబెట్ ఉన్నా, ఒకప్పుడు రష్యా, 1950 దశకంలో సీఐయే కూడా ఆ చిన్న రాజ్యంలో చక్రం తిప్పడానికి తమ వంతు ప్రయత్నాలు చేశాయి. టిబెట్‌లోని ఖంపా ప్రాంతంలో 1956 ప్రాంతంలో తిరుగుబాట్లు జరిగినపుడు సీఐయే ప్రవేశించిందని సాక్షాత్తు దలైలామాయే ఒకసారి ప్రకటించారు. అయి తే అది టిబెటన్ల మీద ప్రేమతో కాదనీ, చైనా విస్తరణ, కమ్యూనిస్టు వ్యతిరేకతతోనే అమెరికా రంగ ప్రవేశం చేసిందని వాస్తవం చెప్పా రు. 1959లో కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకుంటున్న టిబెన్ల మీద జన చైనా సైన్యం దాడి చేసినపుడు పద్నాలుగో దలైలామా భారతదేశానికి వలస వచ్చారు. అందుకు ఆయనకు సీఐయే సహాయం చేసింది. నిక్సన్ వచ్చి న తరువాత చైనాతో అమెరికా విదేశాంగ విధానంలో మార్పులు వచ్చాయి. టిబెట్‌పై బిగించిన తన పట్టును సడలించకుండా కొనసాగించేందుకు యాభై ఏళ్ల క్రితం కంటె ఇప్పుడు చైనాకు మరిన్ని అనుకూల పరిస్థితులు ఉన్నాయి. చైనా ప్రపంచం లో బలీయ శక్తి. చైనా సృష్టిస్తున్న సమస్యలతో భారత్ పడుతున్న తిప్పలు అన్నీ ఇన్నీ కావు. ఈ అంశాలు ఎంతో శక్తిమంతమైనవే అయి నా, వాటితోనే దలైలామా పూర్తిగా చైనా వైపు మొగ్గుతున్నారని అనుకోలేం. కానీ టిబెట్ డ్రాగన్ నాలుకకు అందితే, రెండు పెద్ద దేశాల మధ్య ఉన్న బఫర్ స్టేట్ అంతర్థానమవుతుంది. అప్పుడు రష్యా నుంచో, అమెరికా నుంచో ప్రమాదం ఉండదు. కానీ డ్రాగన్‌తో పేచీ అనివార్యం. ‘ఆసియాలోని రెండు దిగ్గజాలు (చైనా, భారత్) ఏదో ఒకరోజు డీకొనే పరిస్థితి వస్తుంది’ అని ప్రథమ ప్రధాని నెహ్రూ చెప్పేవారు. టిబెట్‌లో పెద్ద పరిణామాలు చోటు చేసుకుంటున్న ప్రతి పర్యాయం నెహ్రూ వ్యాఖ్య గుర్తుకు వస్తూనే ఉంటుంది. డా. గోపరాజు నారాయణరావు -
తెగల మధ్య ఆరని సెగ
1953 నుంచి ఈశాన్య భారతం ఉద్యమాలతో మండుతూనే ఉంది. ఆ ఏడు జిల్లాలలో కనిపించే అన్ని రకాల తెగల వారు ఈ ప్రాంతంలో ఉన్నారు. దీనితో మొత్తం ఈశాన్య భారతం వేడి ఈ కొండ మీద కేంద్రీకరించి ఉంటుంది. వేర్పాటువాదం, తెగల మధ్య రక్తపాతం ఈశాన్య భారతానికి కొత్త కాదు. దూరంగా విసిరేసినట్టు ఉండే ‘సెవెన్ సిస్టర్స్’ వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైనప్పటికీ ఢిల్లీ పాలకులు అక్కడి వ్యవహారాల పట్ల చూపవలసిన శ్రద్ధ ఎప్పుడూ చూపించలేదు. మొన్న డిసెంబర్ 27 నుంచి అసోం-నాగాలాండ్ సరిహద్దులలోని కర్బీ అంగ్లాంగ్ కొం డలలో సాగుతున్న హింస దేశం దృష్టిని ఆకర్షించింది. ఈ హింసాకాండలో ఇంతవరకు 20 మంది గిరిజనులు చని పోయారు. కనిపిస్తే కాల్చివేతకు ఆదేశించారు. 3 వేలకు పైగా ప్రజలు ప్రత్యేక శిబిరాలకు చేరుకున్నారు. డిసెంబర్ 27న తాజా ఘర్షణలు మొదలయ్యాయి. పదిహేను మంది కర్బీ పీపుల్స్ లిబరేషన్ టైగర్స్ (కేపీఎల్‌టీ) ఉగ్రవాదులు ఖొవానిగావ్ అనే గ్రామం మీద దాడి చేయగా ముగ్గురు ఉగ్రవాదులు సహా, ఏడుగురు చనిపోయారు. తరువాత గృహదహనాలు జరిగాయి. ఈ గ్రామం లో నాగా రెంగ్మా తెగ ప్రజలు ఎక్కువ. ఇది కేపీఎల్‌టీ దళాలకూ, నాగా రెంగ్మాహిల్స్ ప్రొటెక్షన్ ఫోర్సుకూ మధ్య ఘర్షణ అని పోలీసులు చెబుతున్నారు. కేపీఎల్‌టీ గెరి ల్లాలు దాడికి దిగిన తరువాత, నాగా రెంగ్మా ఫోర్సు ప్రతిచర్యకు దిగింది. అప్పటి నుంచి ఆ కొండ ప్రాంతమంతా ఉద్రిక్తంగా మారిపోయింది. ఈ నెల ఆరున నాగాలాండ్‌లోని దిమాపూర్ దగ్గర తొమ్మిది శవాలు బయటపడడంతో ఆ ఉద్రిక్తతలు మరింత తీవ్రమైనాయి. ఇందులో ఒకటి కర్బీ విద్యార్థి సంఘం నాయకుడి శవం. డిసెంబర్ 27 నాటి ఘర్షణల తరువాత అపహరణకు గురైన యువకుడు ఇతడేనని పోలీసులు గుర్తించారు. మిగిలిన మృతులు కూలీలు. అంతా కర్బీ తెగ వారే. చేతులు వెనక్కి బిగించి, గంతలు కట్టి, దగ్గర నుంచి తుపాకీతో కాల్చారు. అసలే మండుతున్న పరిస్థితికి ఇది ఆజ్యం పోసింది. ఈ హింస ప్రతిహింసలలో మొత్తం ఇరవై మంది బలయ్యారు. కేపీఎల్‌టీ ప్రత్యేక రాష్ట్రం నినాదంతో పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ. కర్బీ అంగ్లాంగ్, దిమా హసావా గిరిజన జిల్లాలతో కర్బీ తెగ కోసం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలంటూ 2010 నుంచి ఇది ఉద్యమిస్తున్నది. నాగా రెంగ్మా హిల్స్ ప్రొటెక్షన్ ఫోర్సు 2012లో ప్రారంభమైంది. కేపీఎల్‌టీ దాడుల నుంచి నాగా రెంగ్మాలను రక్షించడమే దీని ధ్యేయం. దీనితో పాటు కర్బీ అంగ్లాంగ్‌లోనే రెంగ్మా నాగా తెగ వారి కోసం ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేయాలని కూడా కోరుతోంది. కర్బీ అంగ్లాం గ్, దిమా హసావా జిల్లాలలో పట్టుసాధించి, అక్కడ ఉన్న నాగా రెంగ్మా ప్రజల మద్దతు సాధించాలని నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలిమ్ (ఐజాక్ ముయివా) ఎప్పటి నుంచో చేస్తున్న ప్రయత్నాలను సాగనివ్వరాదన్న ఉద్దేశంతోనే కేపీఎల్‌టీ ఈ దాడులు చేసిందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. అంటే కేపీఎల్‌టీ, నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలిమ్ (ఐజాక్ ముయివా) ఆధిపత్య పోరులో నాగా రెంగ్మాలు నలిగిపోతున్నారు. కర్బీ అంగ్లాంగ్ అలజడికి ఉన్న భూమిక విస్తృతమైనది. 1953 నుంచి ఈశాన్య భారతం ఉద్యమాలతో మం డుతూనే ఉంది. ఆ ఏడు జిల్లాలలో కనిపించే అన్ని రకాల తెగల వారు ఈ ప్రాంతంలో ఉన్నారు. దీనితో మొత్తం ఈశాన్య భారతం వేడి ఈ కొండ మీద కేంద్రీకరించి ఉంటుంది. బ్రిటిష్ కాలంలో కర్బీ అంగ్లాంగ్ కొండలను మికిర్ హిల్స్ అనేవారు. మికిర్లు అంటే కర్బీలే. ఉత్తర కచార్ జిల్లాతో పాటు, కర్బీ అంగ్లాంగ్ చారిత్రక, సాంస్కృతిక పరిస్థితులు కూడా ప్రత్యేకమైనవి. ఇక్కడ కర్బీ తెగవారే ఎక్కువ. ఇంకా దిమాసా, జెమే నాగా, కుకీ, హమర్, లుషాయి, రంగ్‌ఖోల్, ఖాసీ, జైంతియా, బోడో, తివా తెగల వారూ ఉన్నారు. ఈ తెగలన్నీ ఈశాన్య భారత రాష్ట్రాలంతటా కనిపిస్తాయి. వీరందరి ప్రధాన పోరాటం బెంగాల్ నుంచి వలస వచ్చిన వారి మీదే. ఆయా తెగల మధ్య ఉన్న విభేదాలు ఇక్కడ కూడా ప్రతిఫలిస్తూ ఉంటాయి. అన్ని తెగలలోనూ గెరిల్లా ఉద్యమాలు ఉన్నాయి. అందుకే కర్బీ అంగ్లాంగ్ జిల్లాకు ఎంతో ప్రత్యేకత ఉంది. చొరబాటుదారుల సమస్యతో పాటు, నీటి సమస్య కూడా వీరి మధ్య చిచ్చురేపింది. ఆధిపత్యం కోసం వివిధ వర్గాలు చేసిన ప్రయత్నాలు హింసకు దారి తీస్తున్నాయి. 2003లో కుకీలకు చెందిన కుకీ రివల్యూషనరీ ఆర్మీకీ, యునెటైడ్ పీపుల్స్ డెమాక్రటిక్ సాలిడారిటీ (దీని నుంచి విడవడిన ముక్కే కేపీఎల్‌టీ) మధ్య ఘర్షణలు జరిగి యాభయ్ మంది వరకు చనిపోయారు. సింఘ్సన్ కొండలలో జరిగిన ఈ రక్తపాతానికి కారణం, ఎరువులతో అల్లం పంట పండించడాన్ని సాలిడారిటీ సంస్థ ‘పర్యావరణ పరిరక్షణ’ కోసం నిషేధించింది. ఈ రకం సేద్యం కుకీలు చేసేవారు. ఈశాన్యంలో వేర్పాటువాద హింసకు తోడు ఆధిపత్యం కోసం సాగే హింస కూడా ఉంది. - డా॥గోపరాజు నారాయణరావు -
భారతంలో ‘అనంత’ కీర్తి
కొద్ది కాలం ప్రధానిగా ఉన్న చరణ్‌సింగ్ కొన్ని నిముషాలలో బల నిరూపణ జరగవలసి ఉండగా రాజీనామా చేసి, లోక్‌సభ రద్దుకు సిఫారసు చేశారు. ఈ సిఫారసును నీలం ఆమోదించకుండా, జనతా పార్టీ నేత బాబూ జగ్జీవన్‌రామ్‌ను లేదా పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌ను పిలిచి ఉంటే ఉప ఎన్నిక తప్పేదని ఒక వాదన ఉంది. కానీ ప్రధాని, మంత్రిమండలి ఇచ్చిన సలహాను రాష్ట్రపతి పాటించడమనే విధిని నీలం నిర్వహించారన్న ఖ్యాతి కూడా ఉంది. స్వాతంత్య్రానంతర భారతచరిత్రలో, ఆంధ్రుల చరి త్రలో ఐదారు కీలక ఘట్టాలు పరిశీలిస్తే వాటిలో ప్రధాన పాత్రధారిగా కనిపించే నాయకుడు డాక్టర్ నీలం సంజీవరెడ్డి (మే 19, 1913-జూన్1, 1996). ఆయన మహోద్య మం నుంచి వచ్చారు. మహోన్నతుల మధ్య ఎదిగారు. గాంధీజీ, నెహ్రూ, పట్టాభి, ప్రకాశం, మద్దూరి అన్నపూర్ణయ్య, బులుసు సాంబమూర్తి, కొండా వెంకటప్పయ్య, అయ్యదేవర కాళేశ్వరరావు, కళా వెంకటరావు, కామరాజ్ నాడార్, బెజవాడ గోపాలరెడ్డి వంటి వారితో నీలం భుజం భుజం కలిపి నడిచారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ, ఆంధ్రప్రదేశ్ అవతరణ- రెండు చారిత్రక ఘట్టాలలోను ఆయన పేరు చిరస్మరణీయం. ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి ఆయనే. లాల్ బహదూర్‌శాస్త్రి, ఇందిరాగాంధీ ప్రభుత్వాలలో సభ్యుడు. రాయలసీమ వంటి కరవు ప్రాంతం దేశానికి అందించిన ఆరవ రాష్ట్రపతి. భూస్వాముల కుటుంబం నుంచి వచ్చిన నీలం సంజీవరెడ్డిని 1929 నాటి గాంధీజీ అనంతపురం యాత్ర సామాజిక కార్యకర్తగా మార్చింది. ఉప్పు సత్యాగ్రహం దేశాన్ని ఉర్రూతలూగిస్తున్న వేళ, 18 ఏళ్ల వయసులో నీలం ఉద్యమంలో ప్రవేశించారు. పాతికేళ్ల వయసులో 1938 లోనే ప్రాంత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా ఎంపికయ్యా రు. అక్కడ నుంచి సాగిన ఆయన ప్రయాణం సంభ్రమంగానే ఉంటుంది. ప్రథమ ప్రధాని నెహ్రూ కాలంలో 1959 లో నీలం అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడయ్యారు. 1967 లో లోక్‌సభ స్పీకర్‌గా ఎంపికయ్యారు. అంతరాత్మ ప్రబోధం చైనా దాడితో మొదలైన 60వ దశకం ‘అంతరాత్మ ప్రబో ధం’ వివాదంతో ముగిసింది. ఈ రెండూ భారతీయ సమాజానికి కుదుపులే. నెహ్రూ, లాల్‌బహదూర్ శాస్త్రి అకాల మరణాల తరువాత ఇందిరాగాంధీ ప్రధాని అయ్యారు. బ్యాంకుల జాతీయకరణ, రాజభరణాల రద్దు వంటివి అప్పుడు ఇందిర తీసుకున్న సంచలన నిర్ణయాలు. కానీ అప్పటికే భారత జాతీయ కాంగ్రెస్‌లో చీలికకు సంకేతాలు పొడసూపుతున్నాయి. ఇలాంటి తరుణంలో భారత రాజకీయాలలో వచ్చిన కీలక పరిణామానికి నీలం కేంద్ర బిందువయ్యారు. 1969 మే మాసంలో జాకీర్ హుస్సేన్ హఠాన్మరణంతో రాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది. సిండికేట్‌గా పేరుపడిన వర్గం పార్టీ సమావేశంలో నీలం సంజీవరెడ్డిని అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఇది ముమ్మాటికీ పార్టీ నిర్ణయ మే. నీలం స్పీకర్ పదవికి రాజీనామా చేసి, పోటీ చేశారు. కానీ ఇందిర ఉప రాష్ట్రపతి వీవీ గిరి పేరును రంగం మీద కు తెచ్చారు. అప్పుడే ఆమె ‘అంతరాత్మ ప్రబోధం’ పిలుపునిచ్చారు. ఇందిర తీసుకున్న ఈ నిర్ణయం, ఆ ధోరణి ఇప్పటికీ దేశ రాజకీయాలలో వివాదాస్పదమే. పార్టీ అధికారిక అభ్యర్థి నీలం (4,18,169 ఓట్లు), ఇండిపెండెంట్ అభ్యర్థి గిరి (4,20,077 ఓట్లు) చేతిలో ఓడిపోయారు. దీనితో పార్టీ వ్యతిరేక కార్యకలాపాల ఆరోపణలతో ఇందిరకు నోటీసు ఇచ్చారు. నిజానికి పార్టీలో ఇందిర హవా ఏమిటో పార్టీ అభ్యర్థి ఓటమితోనే రుజువైంది. నోటీసుకు జవాబు ఇవ్వకుండా సిండికేట్‌లోని కామరాజ్ నాడార్, మొరార్జీదేశాయ్, ఎస్. నిజలింగప్ప, అత్యుల ఘోష్, ఎస్కె పాటిల్, హితేంద్రనాథ్ దేశాయ్, జీకే మూపనార్, రామకృష్ణ హెగ్డే, సికిందర్ భ క్త్ వంటి వారిని పార్టీ నుంచి నవంబర్ 12, 1969న ఇందిరే బహిష్కరించారు. పార్టీ చీలిపోయింది. వీరే తరువాత వ్యవస్థా కాంగ్రెస్‌ను స్థాపించుకున్నారు. నీలం మాత్రం రాజకీయాలు విరమించి స్వస్థలం ఇల్లూరు చేరుకున్నారు. సాక్షాత్తు ప్రధాని అనుసరించిన అనుచిత వైఖరి వల్ల దేశం ఎంతటి మూల్యం చెల్లించిందో పీవీ నరసింహారావు ‘లోపలి మనిషి’లో అంచనా వేశారు. భారత నాయకత్వంలో వచ్చిన ఈ స్ఫుటమైన చీలికను చూసిన పాకిస్థాన్, ప్రజానీకంలో కూడా ఈ చీలిక ఉందని నమ్మి, అది లాభిస్తుందనే ఆశతోనే 1971 యుద్ధానికి దిగిందని పీవీ అంటారు. రాష్ట్రపతిగా నీలం 1969 ఎన్నికలో ఓడినా, 1977లో నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతి పదవిని చేపట్టారు. ఈ పదవిలోకి రావడం, నిర్వహణ రెండూ సున్నితంగా సాగలేదు. 1974లో లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ‘సంపూర్ణ విప్లవం’ ప్రారంభించారు. నాటి అవినీతి, ఆశ్రీత పక్షపాతాలకు వ్యతిరేకంగా బీహార్ నుంచి ప్రారంభమైన ఉద్యమమిది. ఇందిర ఎన్నిక (1971, రాయ్‌బరేలీ) చెల్లదంటూ అలహాబాద్ హైకోర్టులో తీర్పునివ్వడం, దీనిపై సుప్రీంలో వీఆర్ కృష్ణయ్యర్ షరతులతో కూడిన స్టే ఇవ్వడం, దరిమిలా తొలిసారిగా అత్యవసర పరిస్థితి విధించడం వరసగా జరిగిపోయాయి. ఈ పరిణామాల పరాకాష్ట జనతా ప్రభుత్వ ఏర్పాటు. అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా పెల్లుబికిన నిరసనోద్యమం ద్వారానే నీలం మళ్లీ రాజకీయాలలోకి వచ్చారు. దేశమంతా జనతా హవా వీచగా, రాష్ట్రంలో నీలం (నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం) ఒక్కరే ఎన్నికయ్యారు. రాష్ట్రపతి పదవి ఆయనను వరించింది. అయితే, రెండున్నర సంవత్సరాల తరువాత జనతా పార్టీలో ద్వం ద్వ సభ్యత్వం వంటి సమస్యలతో మొరార్జీ ప్రభుత్వం కూలింది. నాటి ఆరోగ్యమంత్రి రాజ్నారాయణ్తో కలిసి హోంమంత్రి, ఉపప్రధాని చరణ్‌సింగ్ కూలదోశారు. కానీ కొద్ది కాలం ప్రధానిగా ఉన్న చరణ్‌సింగ్ కొన్ని నిముషాలలో బల నిరూపణ జరగవలసి ఉండగా రాజీనామా చేసి, లోక్‌సభ రద్దుకు సిఫారసు చేశారు. ఈ సిఫారసును నీలం ఆమోదించకుండా, జనతా పార్టీ నేత బాబూ జగ్జీవన్‌రామ్‌ను లేదా పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌ను పిలిచి ఉంటే ఉప ఎన్నిక తప్పేదని ఒక వాదన ఉంది. కానీ ప్రధాని, మంత్రిమండలి ఇచ్చిన సలహాను రాష్ట్రపతి పాటించడమనే విధిని నీలం నిర్వహించారన్న ఖ్యాతి కూడా ఉంది. చాలా అంశాలను నీలం తన ఆత్మకథ ‘వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్’లో నమోదు చేశారు. నీలం రాజకీయ చతురత, రాజనీతిజ్ఞత కలగలసిన కాలంలో రాణించారు. తన ముం దుకాలం నాటి రాష్ట్రపతులు మూటకట్టుకున్న ‘రబ్బరు స్టాంపు’ అపఖ్యాతిని ఒదిలించుకోగలిగారు. వ్యవస్థలో గ్రామీణ ప్రాతినిధ్యానికి నీలం నిలువెత్తు నిదర్శనం. డా॥గోపరాజు నారాయణరావు (నీలం శత జయంతి సభ కోసం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రేపు అనంతపురం వస్తున్న సందర్భంగా...)