టిబెటన్ల పయనం ఎటువైపు? | What is Tibetans root? | Sakshi
Sakshi News home page

టిబెటన్ల పయనం ఎటువైపు?

Published Sun, Feb 9 2014 12:25 AM | Last Updated on Sat, Sep 2 2017 3:29 AM

టిబెటన్ల పయనం ఎటువైపు?

టిబెటన్ల పయనం ఎటువైపు?

దలైలామా ఒకవైపు చైనా ఆధిపత్యంలోనే ఉండాలనుకుంటున్నట్టు చెబుతున్నారు. మరోవైపు కమ్యూనిస్టు పార్టీని తప్పు పడుతున్నారు. చైనా ప్రభుత్వం-చైనా కమ్యూనిస్టుపార్టీ వేర్వేరు కాదు. అందుకే దలైలామా పోకడ టిబెట్ స్వాతంత్య్ర పోరాటయోధులకు మింగుడుపడదు.
 
 టిబెట్ ఆధ్యాత్మిక గురుపీఠం తన తరువాత ఒక మహిళకు దక్కే అవకాశం ఉందని  పద్నాలుగో దలైలామా ఆ మధ్య ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. డెబ్భై ఎనిమిదేళ్ల దలైలామా  ఈ ఫిబ్రవరి రెండున మన గౌహతిలో చేసిన ప్రకటన ప్రపంచం చేత, ముఖ్యంగా భారత్ చేత కనుబొమలు ముడివేయించేదే. చైనా నుంచి టిబెట్ స్వాతంత్య్రాన్ని కోరుకోవడం లేదన్నదే ఆ ప్రకటన సారాంశం. చైనా నుంచి టిబెట్‌కు రాజకీయ స్వాతంత్య్రం కావా లంటూ ప్రవాసం నుంచి, టిబెట్‌లోనూ పోరాడుతున్న వారికి ఈ ప్రకటన బాధ కలిగించక మానదు. 1950లో ఆధ్యాత్మిక గురుపీఠం అధిరోహించిన నాటి నుంచి దలైలామా సంపూర్ణ స్వాతంత్య్రం కోసం జరుగుతున్న ఉద్యమాన్ని సమర్ధించడంలేదు. అయినా చైనాకు వ్యతిరేకంగా టిబెల్‌లో పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతూనే ఉంది. ఈ ప్రకటనతో పాటు అహిం సా విధానం గురించి దలైలామా చేసిన వ్యా ఖ్య కూడా ప్రశ్నలు రేకెత్తించేదిగా ఉంది. ‘వ్యక్తి,శాంతి- మానవాళి దృష్టి’ అన్న అంశంపై ఏర్పాటైన గోష్టిలో ఈ వ్యాఖ్యలు చేశారు.  
 
 చైనా ఆధిపత్యం నుంచి స్వాతంత్య్రం కోరుకోవడంలేదని దలైలామా చెప్పినా, కమ్యూనిస్టు పార్టీని మాత్రం ఆయన విడిచి పెట్టలేదు. చైనా కమ్యూనిస్టు పార్టీలోని కొం దరు అతివాదుల వల్ల టిబెట్ సంస్కృతికి తీవ్ర నష్టం జరుగుతోందనీ,  వాళ్ల వల్ల బౌద్ధం పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నదనీ కూడా ఆరోపించారు. దలైలామా ఒకవైపు చైనా ఆధిపత్యంలోనే ఉండాలనుకుంటున్న ట్టు చెబుతున్నారు. మరోవైపు కమ్యూనిస్టు పార్టీని తప్పు పడుతున్నారు.  చైనా ప్రభుత్వం - చైనా కమ్యూనిస్టుపార్టీ వేర్వేరు కాదు. అందుకే దలైలామా పోక డ టిబెట్ స్వాతంత్య్ర పోరాటయోధులకు మింగుడుపడదు. మూడురోజుల తరువాత ధర్మశాలలోని టిబెట్ ప్రవాస ప్రభుత్వ ప్రధా ని డాక్టర్ లోబ్సంగ్ సాంగే దలైలామా ప్రకట నను సమర్ధించారు కూడా. చైనా నుంచి వేరు కావాలని టిబెట్ భావించడం లేదని, భవిష్యత్తులో తగిన రీతిలో స్వయం ప్రతిపత్తి ఇవ్వడానికి చైనా సుముఖంగా ఉంటే  చర్చల ప్రక్రియ ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చునని కూడా లోబ్సంగ్ అభిప్రాయపడ్డారు.
 
 తమ దేశం చైనా నీడలోనే ఉండాలని టిబెటన్లందరూ భావిస్తున్నారా? జరిగిన, జరుగుతున్న పరిణామాలను బట్టి చైనా ఆధిపత్యంలోనే మనుగడ సాగించడానికి ఆ హిమాలయ రాజ్యవాసులు  ఇప్పటికీ సిద్ధంగా లేరనే చెప్పాలి. 2002 నుంచి దలైలామా ప్రతినిధులకీ, చైనా ప్రభుత్వ ప్రతినిధులకీ మధ్య తొమ్మిది దఫాలు చర్చలు జరిగా యి. కానీ 2012లో దలైలామా ప్రతినిధులంతా రాజీనామాలు చేశారు. టిబెట్‌లో పరిస్థితులు తీవ్రరూపం దాల్చడం, చైనా నుంచి సానుకూల స్పందన లేకపోవడమే ఇందుకు కారణం. చర్చలు సఫల మైతే దలైలామా టిబెట్‌లో తిరిగి ప్రవేశిస్తారని ప్రధాని లోబ్సంగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. మంచిదే. కానీ పరిస్థితులు ఇందుకు అనుకూలిస్తాయా అన్నదే  ప్రశ్న. టిబెట్ చైనా అంతర్భాగమని వాదించేవారు, చైనాది దురాక్రమణ అని చెప్పేవారు సమానంగా ఉంటారు. దలైలామా తిరిగి టిబెట్ రావాలనీ, దేశానికి స్వాతంత్య్రం కావాలని 2009లో 124 మంది టిబెటన్లు ఆత్మాహుతికి పాల్పడ్డారు. అక్కడి చైనా ఆధిపత్యంలో దుర్లభంగా మారిన పౌరహక్కుల గురించి కూడా ఎన్నో విమర్శలు ఉన్నాయి. నిజానికి ఇప్పుడు చైనా ఆధిపత్యంలోనే టిబెట్ ఉన్నా, ఒకప్పుడు రష్యా, 1950 దశకంలో సీఐయే కూడా ఆ చిన్న రాజ్యంలో చక్రం తిప్పడానికి తమ వంతు ప్రయత్నాలు చేశాయి. టిబెట్‌లోని ఖంపా ప్రాంతంలో 1956 ప్రాంతంలో తిరుగుబాట్లు జరిగినపుడు సీఐయే ప్రవేశించిందని సాక్షాత్తు దలైలామాయే ఒకసారి ప్రకటించారు. అయి తే అది టిబెటన్ల మీద ప్రేమతో కాదనీ, చైనా విస్తరణ, కమ్యూనిస్టు వ్యతిరేకతతోనే అమెరికా రంగ ప్రవేశం చేసిందని వాస్తవం చెప్పా రు. 1959లో కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకుంటున్న టిబెన్ల మీద జన చైనా సైన్యం దాడి చేసినపుడు పద్నాలుగో దలైలామా భారతదేశానికి వలస వచ్చారు. అందుకు ఆయనకు సీఐయే సహాయం చేసింది. నిక్సన్ వచ్చి న తరువాత చైనాతో అమెరికా విదేశాంగ విధానంలో మార్పులు వచ్చాయి.
 
 టిబెట్‌పై బిగించిన తన పట్టును సడలించకుండా కొనసాగించేందుకు యాభై ఏళ్ల క్రితం కంటె ఇప్పుడు చైనాకు మరిన్ని అనుకూల పరిస్థితులు ఉన్నాయి. చైనా ప్రపంచం లో బలీయ శక్తి. చైనా సృష్టిస్తున్న సమస్యలతో భారత్ పడుతున్న తిప్పలు అన్నీ ఇన్నీ కావు. ఈ అంశాలు ఎంతో శక్తిమంతమైనవే అయి నా, వాటితోనే దలైలామా పూర్తిగా చైనా వైపు మొగ్గుతున్నారని అనుకోలేం. కానీ టిబెట్ డ్రాగన్ నాలుకకు అందితే, రెండు పెద్ద దేశాల మధ్య ఉన్న బఫర్ స్టేట్ అంతర్థానమవుతుంది. అప్పుడు రష్యా నుంచో, అమెరికా నుంచో ప్రమాదం ఉండదు. కానీ డ్రాగన్‌తో పేచీ అనివార్యం. ‘ఆసియాలోని రెండు దిగ్గజాలు (చైనా, భారత్) ఏదో ఒకరోజు డీకొనే పరిస్థితి వస్తుంది’ అని ప్రథమ ప్రధాని నెహ్రూ చెప్పేవారు. టిబెట్‌లో పెద్ద పరిణామాలు చోటు చేసుకుంటున్న ప్రతి పర్యాయం నెహ్రూ వ్యాఖ్య గుర్తుకు వస్తూనే ఉంటుంది.
 
 డా. గోపరాజు నారాయణరావు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement