tibetans
-
టిబెట్‌పై చైనా కొత్త కుట్రలు.. లక్ష మందిని..!
బీజింగ్: టిబెట్‌ను బల ప్రయోగంతో ఆక్రమించుకున్న డ్రాగన్ దేశం చైనా ఇప్పుడు మరో కుతంత్రానికి తెరతీస్తోంది. 2030 నాటికి లక్ష మందికిపైగా టిబెట్ ప్రజలను వారి సంప్రదాయ జీవన విధానం నుంచి దూరం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంటే టిబెట్ పౌరులను వారి సొంత గ్రామాల నుంచి దూరంగా తరలిస్తారు. ఇందుకోసం చైనా చెబుతున్న సాకు పర్యావరణ పరిరక్షణ. సముద్ర మట్టానికి 4,800 మీటర్లకుపైగా ఎత్తున్న ప్రాంతాల్లో నివసించే వారిని ఇతర ప్రాంతాలకు తరలించనున్నట్లు చెబుతోంది. జనావాసాల కారణంగా పర్యావరణం దెబ్బతింటోందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నమ్మబలుకుతోంది. జనాన్ని తరలించడానికి చైనా ప్రభుత్వం తన సైనికులకు శిక్షణ ఇస్తున్నట్లు సమాచారం. వివాదాస్పద సరిహద్దుల్లో కొత్త గ్రామాలను చైనా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అవి తమ భూభాగాలే అని వాదిస్తోంది. వివాదాస్పద హిమాలయ ప్రాంతాల్లో 624 గ్రామాలను నిర్మించాలని చైనా లక్ష్యంగా పెట్టుకున్నట్లు హాంకాంగ్‌కు చెందిన ఓ పత్రిక ఇటీవల వెల్లడించింది. చైనా కుట్రల కారణంగా కనీసం 2 లక్షల మంది టిబెట్ ప్రజలు సహజ ఆవాసాల నుంచి దూరమయ్యే ప్రమాదం పొంచి ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదీ చదవండి: ముదిరిన రాజకీయ సంక్షోభం.. పార్లమెంటులోకి ప్రవేశించిన ఆందోళనకారులు -
China: జగమొండి డ్రాగన్
ఒకటి కాదు... రెండు కాదు. తాజాగా ఆదివారం భారత, చైనా సైనిక కమాండర్ల మధ్య జరిగినవి – ఏకంగా 13వ విడత చర్చలు. తొమ్మిది గంటల పాటు ఉన్నతస్థాయి చర్చల తర్వాత రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదంలో ఒక్క అంగుళమైనా పురోగతి లేదు. తప్పంతా అవతలివాళ్ళదే అన్నది ఇరుపక్షాల వాదన. వివాదాస్పదమైన కొన్ని కీలక ప్రాంతాలపై పరిష్కారం కోసం ‘నిర్మాణాత్మక సూచన’లిచ్చామనీ, చైనా ‘అంగీకరించలేద’నీ భారత సైన్యం సోమవారం ఉదయం ప్రకటించింది. చైనా మటుకు భారత్ ‘అసంబద్ధమైన, అవాస్తవిక డిమాండ్లు చేస్తోంద’ని ఆదివారం రాత్రే ఆరోపించింది. వెరసి ప్రతిష్టంభన కొనసాగుతోంది. గమనిస్తే, డ్రాగన్ మంకుపట్టుతో వరుసగా రెండో ఏడాది, ఈ రానున్న చలికాలంలోనూ తూర్పు లద్దాఖ్‌లోని పర్వత ప్రాంతాల్లో భారీ సైనిక మోహరింపులు తప్పవు. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంట ఆక్సిజన్ కూడా అందని చోట, మైనస్ 30 డిగ్రీల గడ్డ కట్టే చలిలో 50 వేల మంది భారతీయ సైనికులు ప్రాణాలకు తెగించి, పహారా కాయక తప్పదు. శత్రువుల చొరబాట్లు లేకుండా కళ్ళలో ఒత్తులేసుకొని, సరిహద్దులను కాపాడకా తప్పదు. 2020 మే నెలలో చైనా బలగాలు తమ వార్షిక విన్యాసం కోసం టిబెటన్ పీఠభూమి ప్రాంతానికి వచ్చాయి. కానీ, చైనా ఆ బలగాలను తూర్పు లద్దాఖ్ ప్రాంతంలోని వాస్తవాధీన రేఖ వైపు మళ్ళించింది. దాంతో, సరిహద్దు వెంట కీలకమైన పీపీ15, పీపీ17ఏ అనే రెండు గస్తీ పాయింట్లలోనూ రెండు దేశాల సైనికులు ఎదురుబొదురయ్యాయి. భారత్‌తో ప్రతిష్టంభన నెలకొంది. అప్పటికే గాల్వన్ లోయలోని పీపీ14, పాంగ్‌గాంగ్ త్సో సరస్సు ఉత్తరపు ఒడ్డున కూడా ఘర్షణ వాతావరణం నెలకొంది. మొత్తం ఈ 4 గస్తీ పాయింట్లలోనూ చైనా బలగాలు వాస్తవాధీన రేఖను దాటి వచ్చి, మోహరించాయి. ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, 1976లో చైనాపై ఉన్నతస్థాయి నిర్ణాయక బృందం ‘చైనా స్టడీ గ్రూప్’ (సీఎస్జీ) ఏర్పాటైంది. ఆ బృందమే ఈ గస్తీ పాయింట్లను నిర్ణయిస్తుంది. భారత, చైనాల మధ్య ఇప్పటికీ అధికారికంగా సరిహద్దులు నిర్ణయం కాని నేపథ్యంలో ఎల్ఏసీని చైనా బలగాలు దాటడం మునుపటి ఒప్పందానికి తూట్లు పొడవడమే! ఈ వివాద పరిష్కారం కోసం గత ఏడాది మే నుంచి ఇప్పటికి సంవత్సరం పైగా భారత, చైనాల మధ్య రాజకీయ, దౌత్య, సైనిక స్థాయుల్లో వరుసగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. కానీ, నేటికీ అనేక సమస్యలకు పరిష్కారం సాధ్యం కాలేదు. ఆ మధ్య ఫిబ్రవరిలో పాంగాంగ్ త్సో ప్రాంతంలో, అలాగే ఆగస్టులో జరిగిన 12వ విడత చర్చల్లో గోగ్రా ప్రాంతంలోనూ బలగాల ఉపసంహరణకు అంగీకారం కుదిరింది. రెండు పక్షాలూ కలసి సంయుక్త ప్రకటన ఇచ్చాయి. కానీ, ఈసారి చర్చల్లో అలాంటి ఏ పురోగతీ లేదు. సంయుక్త ప్రకటనా లేదు. హాట్‌స్ప్రింగ్స్, దెమ్చోక్, దెప్సాంగ్ లాంటి అనేక ఘర్షణాత్మక ప్రాంతాలపై అంగుళమైనా ముందడుగు పడలేదు. పైపెచ్చు, రెండు వర్గాల మధ్య విభేదాలూ బాహాటంగా బయటపడ్డాయి. సరిహద్దుల్లో ఇటీవలి ఘటనలూ ఆ విభేదాలను స్పష్టం చేశాయి. తాజా విడత చర్చలకు రెండు రోజుల ముందే అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ సెక్టార్లో జరిగిన సైనిక ఘర్షణ – చైనా సైనికులను కొన్ని గంటలు నిర్బంధించడం లాంటివి బయటకొచ్చాయి. చైనా వైపు నుంచి గతంలో గాల్వన్ లోయలో భారత సైనికుల నిర్బంధ చిత్రాలు లీకయ్యాయి. అలాగే, మరో విషయం. చర్చల తర్వాత అటువైపు నుంచి చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటనలు చేయడం సాధారణం. కానీ, గత కొన్ని విడతల చర్చల్లో చైనా సైన్యం ‘పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ’కి చెందిన వెస్ట్రన్ థియేటర్ కమాండ్ ఈ ప్రకటనలు చేస్తుండడం గమనార్హం. అంటే, చైనా ఈ చర్చలకు పెద్ద ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న మాట. చర్చలు నత్తనడకన సాగుతున్నా డ్రాగన్ పట్టించుకోవడం లేదన్న మాట. ఘర్షణ కొనసాగినా సరే ఆ అగ్రరాజ్యానికి కావాల్సింది ఆధిపత్యమే తప్ప, సమస్యకు పరిష్కారం కాదన్న మాట. తాజా చర్చల్లో వైఫల్యంతో భారత భూభాగంపై చైనా కొనసాగుతోందనే మాట మళ్ళీ పైకొచ్చింది. సరిహద్దులోని వాస్తవ పరిస్థితిని దాచకుండా దేశానికి చెప్పాలంటూ కాంగ్రెస్ లాంటి ప్రతిపక్షాలు భారత ప్రధాని మోదీని ప్రశ్నించాయి. మరోపక్క భారత – చైనా సరిహద్దు ప్రాంతాల్లో అతి కష్టంపై ఈ మాత్రమైనా వెసులుబాటు దక్కినందుకు భారత్ సంతోషించాలంటూ చైనా కటువుగా మాట్లాడుతోంది. సైనిక అధికార ప్రతినిధి చేసిన ఆ అహంభావపూరిత ప్రకటనలో సామరస్యం కన్నా బెదిరింపు ధోరణే కనిపిస్తోంది. రాజు కన్నా మొండివాడు బలవంతుడట. మరి, ఏకంగా రాజులు, రాజ్యాలే మొండివాళ్ళయితే? చైనా అనుసరిస్తున్న వైఖరి అలాంటిదే. అగ్రరాజ్యం ఆ వైఖరిని మార్చుకుంటే... భారత సరిహద్దులో, తద్వారా ఉపఖండంలో శాంతి వెల్లివిరుస్తుంది. కానీ, చైనా లక్ష్యం మాత్రం వాస్తవాధీన రేఖను తమకు అనుకూలంగా ఏకపక్షంగా మార్చేసుకోవడమే. మరీ ముఖ్యంగా, దెప్సాంగ్ మైదానప్రాంతాల్లో ఆ పని చేయాలన్నది పొరుగు దేశం లోలోపలి ఆకాంక్ష. డ్రాగన్ అనుసరిస్తున్న వైఖరే అందుకు సూచిక. ఈ విషయంలో భారత్ అప్రమత్తంగా ఉండాలి. మూసుకుపోని చర్చల ద్వారాన్ని తెరిచే ఉంచాలి. మలి విడత చర్చలకు సిద్ధమవుతూనే, చైనా ఆటలకు అడ్డుకట్ట వేసే వ్యూహరచన చేయాలి. మన భూభాగం అంగుళమైనా వదలకుండా అన్ని వైపుల నుంచి ఒత్తిడి తెచ్చే మార్గాలూ అన్వేషించాలి. కానీ, జగమొండి డ్రాగన్‌కు ముకుతాడు వేయడం మాటలు చెప్పినంత సులభమేమీ కాదు. అదే ఇప్పుడు అతి పెద్ద సవాలు. -
కుటుంబానికొక్కరు సైన్యంలోకి
న్యూఢిల్లీ: భారత్‌కు దీటుగా సరిహద్దుల్లో బలాన్ని పెంచుకునేందుకు ఉన్న ప్రతి అవకాశాన్ని డ్రాగన్ దేశం చైనా వినియోగించుకుంటోంది. వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంట మోహరించడమే లక్ష్యంగా టిబెట్ యువతను సైన్యంలోకి తీసుకుంటోంది. టిబెట్‌లోని ప్రతి కుటుంబం నుంచి ఒక్కరు చొప్పున సైన్యంలో చేరాల్సిందేనని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ, చైనా సైన్యం) ఆదేశాలిచ్చింది. ఈ మేరకు ఈ ఏడాది జనవరి–ఫిబ్రవరి నుంచి టిబెట్‌లోని యువతకు పీఎల్ఏ వివిధ విధేయత పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తమకు సమాచారం ఉందని భారత నిఘావర్గాలు తెలిపాయి. వారికి మాండరిన్ బోధించడం, మిగతా అన్నిటి కంటే చైనా కమ్యూనిస్టు పార్టీయే మిన్న అని వారిలో నూరిపోయడం వంటివి చేపట్టిందని పేర్కొన్నాయి. ఎంపికైన వారికి కొండ ప్రాంతాల్లో, కఠిన శీతల పరిస్థితుల్లో విధి నిర్వహణపై శిక్షణ అందిస్తోందని వెల్లడించాయి. టిబెటన్లను సైన్యంలోకి తీసుకోవడం ద్వారా అనేక అనుకూలతలను సాధించాలని చైనా భావిస్తోంది. మొదటగా, చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం, పీఎల్ఏ పట్ల యువతలో విధేయతను సాధించడం, టిబెట్ అటానమస్ రీజియన్‌లోని ప్రజల్లో వ్యతిరేకతను తగ్గించడం. రెండోది..లద్దాఖ్ వంటి కఠిన పరిస్థితులుండే ప్రాంతంలో పీఎల్ఏకు భద్రత విధుల భారం తగ్గించడం. మూడోది, ముఖ్యమైంది.. కఠిన పరిస్థితులుండే లద్దాఖ్, హిమాచల్‌ప్రదేశ్‌లోని ఎల్ఏసీ వెంట భారత్‌లోని ప్రవాస టిబెటన్లు విధులను సమర్థవంతంగా నిర్వహిస్తుండటంతో వారికి దీటుగా టిబెటన్లను అంతే స్థాయిలో ఎల్ఏసీ వెంట శాశ్వత ప్రాతిపదికన రంగంలోకి దించడం అని నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. గత ఏడాది పాంగాంగో సో సరస్సు దక్షిణం వైపు ఎల్ఏసీ వెంట పీఎల్ఏ చొచ్చుకు వచ్చే అవకాశాలున్నాయని అనుమానించిన భారత్ టిటెటన్లతో కూడిన స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్‌ను మొఖపరి, బ్లాక్ టాప్, ఇతర కొండ ప్రాంతాల్లో ఆక్రమించి చైనాకు షాకిచ్చింది. అప్పటి ఈ పరిణామమే చైనాను టిబెటన్ యువత వైపు మొగ్గేలా చేసిందని భావిస్తున్నారు. నేడు భారత్–చైనా 12వ రౌండ్ చర్చలు సరిహద్దుల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభనను తొలగించే లక్ష్యంతో దాదాపు మూడున్నర నెలల తర్వాత ఈనెల 31వ తేదీన భారత్, చైనాల సైనికాధికారులు చర్చలు జరపనున్నారు. తూర్పు లద్దాఖ్‌లోని కొన్ని ప్రాంతాలు, ముఖ్యంగా హాట్ స్ప్రింగ్స్, గోగ్రాల నుంచి సైనికబలగాల ఉపసంహరణలో కొంత పురోగతి సాధించడంపై రెండు వర్గాలు దృష్టి పెడతాయని సైనిక వర్గాలు తెలిపాయి. శనివారం ఉదయం 10.30 గంటలకు తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంట చైనా భూభాగంలోని మోల్దో బోర్డర్ పాయింట్లో కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు మొదలు కానున్నాయి. రెండు దేశాల సైనికాధికారుల మధ్య భారత్ భూభాగంలోని చుషుల్ వద్ద ఏప్రిల్ 9వ తేదీన 11వ విడత చర్చలు జరిగాయి. 11వ విడత చర్చల తర్వాత ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణపై చైనా సానుకూలంగా లేకపో వడంతో చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. గత ఏడాది మే నెల నుంచి తూర్పు లద్దాఖ్‌లో రెండు దేశాలు పెద్ద సంఖ్యలో బలగాలను మోహరించిన విషయం తెలిసిందే. -
చైనాకు మరో షాకిచ్చిన అమెరికా
వాషింగ్టన్: రెండు ఆధిపత్ యరాజ్యాల మధ్య పోరు రోజురోజుకు మరింత ముదురుతోంది. తాజాగా అమెరికా చైనాకు షాకిచ్చే మరో బిల్లును పాస్ చేసింది. ఆధ్యాత్మిక గురువు దలైలామా వారసుడిని ఎంచుకునే హక్కు టిబెటన్లకే కల్పించే బిల్లుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. ద టిబెటన్ పాలసీ అండ్ సపోర్ట్ యాక్ట్ ఆఫ్ 2020 (టీపీఎస్ఏ) ప్రకారం టిబెట్ ప్రధాన నగరమైన లాసాలో యుఎస్ కాన్సులేట్ ఏర్పాటు చేయనుంది. అలాగే దలైలామాకు వారసుడిని ఎన్నుకునే సంపూర్ణ హక్కు టిబెటన్లకు దక్కనుంది.మరోవైపు ఇదొక చారిత్రాత్మక చర్యగా, చైనాకు స్పష్టమైన సందేశంగా ధర్మశాల అభివర్ణించింది. ఈ నిర్ణయం ప్రస్తుత దలైలామా, టిబెటన్ బుద్ధిస్ట్ లీడర్లు, టిబెట్ ప్రజలదే అని టీపీఎస్ఏ స్పష్టం చేస్తోందని సెంట్రల్ టిబెటన్ అడ్మినిస్ట్రేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే ఈ బిల్లుకు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఆమోదం తెలిపింది. అంతేకాదు ఈ వ్యవహారంలో చైనా ప్రభుత్వ అధికారులు జోక్యం చేసుకుంటే, తీవ్రమైన ఆంక్షలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని కూడా హెచ్చరించింది. దీనిపై స్పందించిన చైనా అమెరికాపై మండిపడుతోంది. అమెరికా తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుందని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆరోపించింది. దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. ఈ నిర్ణయం ద్వైపాక్షిక సంబంధాలను మరింత దెబ్బతీసుందని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ మంగళవారం బీజింగ్‌లోని ఒక సమావేశంలో చెప్పారు. దీనిపై సంతకం చేయకూడదని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ డిమాండ్ చేసింది. టీపీఎస్ఏ చట్టం టిబెటన్ స్వాతంత్ర్య పోరాటంలో సాధించిన విజయంగా సెంట్రల్ టిబెటన్ అడ్మినిస్ట్రేషన్ అధ్యక్షుడు లాబ్సాంగ్ సాంగాయ్ పేర్కొన్నారు. దీని కోసం తాము రెండేళ్లుగా డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. చైనా ఇప్పటికే తరువాతి దలైలామాను నియమించే ప్రక్రియను మొదలుపెట్టిన నేపథ్యంలో అమెరికా ఈ చట్టాన్ని తీసుకురావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కాగా తొమ్మిదేళ్ల క్రితం టిబెట్‌పై దాడి చేసి, చైనాకు వ్యతిరేకంగా జరుగుతున్న తిరుగుబాటును దారుణంగా అణచివేసిన చైనా టిబెట్ బౌద్ధమతాన్నికూల్చివేసేందుకు ప్రయత్నిస్తోంది. భారతదేశంలో 80 వేల మంది టిబెటన్లు ప్రవాసంలో ఉండగా, ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా అమెరికా, ఐరోపాలో 150,000 మంది ఉన్నారు. -
చెన్నైలో టిబెటన్ల టెన్షన్.. అరెస్ట్‌లు
సాక్షి, చెన్నై : జిన్‌పింగ్ పర్యటనకు వ్యతిరేకంగా టిబెటన్లు చెన్నైలో నిరసనలకు యత్నించడం అధికారుల్ని టెన్షన్లో పెట్టింది. శుక్రవారం పలు చోట్ల నక్కి ఉన్న టిబెటన్లను గుర్తించడం కష్టతరంగా మారింది. చైనీయుల ముసుగులో ఉన్న అనేక మంది టిబెటన్లను అతి కష్టం మీద అరెస్టు చేయాల్సి వచ్చింది. ఐటీసీ గ్రాండ్ చోళా హోటల్ చుట్టూ వున్న భద్రతా వలయాన్నిఛేదించి ఆరుగురు చొరబడడం ఉత్కంఠకు దారి తీసింది.తమ దేశం మీద చైనా ఆధిపత్యాన్ని నిరసిస్తూ టిబెటన్లు పోరాటాలు సాగిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. చైనా మీద భగ్గుమనే టిబెటన్లు, చెన్నైకు వస్తున్న జిన్ పింగ్‌కు వ్యతిరేకంగా నిరసనలకు వ్యూహ రచన చేశారని గత వారం నిఘా వర్గాలు పసిగట్టాయి. దీంతో చెన్నై శివారులోని తాంబరంలో తిష్ట వేసి ఉన్న ఆరుగుర్ని అరెస్టు చేశారు. అలాగే, ఓకళాశాల ప్రొఫెసర్‌ను కూడా అరెస్టు చేశారు. మరికొన్ని చోట్ల టిబెటన్లు తిష్ట వేసి ఉన్న సమాచారంతో ఆయా ప్రాంతాల్ని నిఘావలయంలోకి తెచ్చారు. టిబెటన్లు చెన్నైలో ఎక్కువగా ఉన్న చోట్ల పోలీసులు డేగ కళ్ల నిఘా వేశారు. వారి కదలికల మీద దృష్టి పెట్టారు. టిబెటన్ల నిరసనలకు ఆస్కారం ఇవ్వని రీతిలో భద్రతా చర్యలు తీసుకున్నారు. కళ్లు గప్పి... మరో గంటన్నరలో జిన్‌పింగ్ విమానం చెన్నైలో ల్యాండ్ కానున్న నేపథ్యంలో ఒక్క సారిగా ఉత్కంఠ అన్నది బయలు దేరింది. డేగ కళ్ల నిఘాతో వ్యవహరిస్తున్న పోలీసులకే ముచ్చమటలు పట్టించే రీతిలో కొందరు టిబెట్ యువతీ,యువకులు వ్యవహరించారు. జిన్‌పింగ్ స్వాగతం పలికేందుకు వచ్చిన చైనీయుల ముసుగులో కొందరు టిబెటన్లు చొరబడడం టెన్షన్ రేపింది. సరిగ్గా 11.30 గంటల సమయంలో జిన్‌పింగ్ బస చేయనున్న గిండి స్టార్ హోటల్ వైపుగా ఇద్దరు యువతులు, నలుగురు యువకులు రావడాన్ని పోలీసులు గుర్తించారు. డిఐజీ ప్రదీప్‌కుమార్, కమిషనర్ ఏకే విశ్వనాథ్ పర్యవేక్షణలో ఆ మార్గాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్న నేపథ్యంలో వారు అటు వైపుగా వస్తుండడాన్ని గుర్తించిన భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. తాము చైనీయులుగా పేర్కొంటూ, తమ నేతకు ఆహ్వానం పలికేందుకు వచ్చినట్టు నమ్మ బలికే యత్నం చేశారు. అయితే, పోలీసులకు అనుమానాలు రావడంతో అందులో ఓ యువకుడు నేరుగా హోటల్ ముందుకు పరుగులు తీసి, తన వద్ద ఉన్న టిబెట్ జెండాను ప్రదర్శిస్తూ నినాదాల్ని హోరెత్తించారు. జిన్ పింగ్‌కు వ్యతిరేకంగా అతడు నినదించడంతో క్షణాల్లో ఉత్కంఠ నెలకొంది. అతడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆటోలో గిండి పోలీసు స్టేషన్‌కు తరలించారు. అదే సమయంలో అక్కడే ఉన్న ఇద్దరు యువతులతో పాటుగా మరో ముగ్గురు యువకుల్ని బలవంతంగా అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. దీంతో టిబెటన్లు నిరసనకు కొన్ని చోట్ల వ్యూహ రచన చేసిన సమాచారంతో అక్కడ ఉత్కంఠ పెరిగింది. ఇంత కష్ట పడ్డా టిబెటన్ల రూపంలో భద్రతా వైఫల్యం అన్నది వెలుగులోకి వస్తుందన్న ఆందోళన తప్పలేదు. ఎక్కడికక్కడ అరెస్టులు ఈ ఆరుగురు ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చినట్టు విచారణలో తేలింది. అక్కడి ఓ వర్సిటీలో చదువుకుంటున్న ఈ విద్యార్థులు పథకం ప్రకారం నిరసనకు వ్యూహ రచన చేసి ఉండటంతో ఉత్కంఠ పెరిగింది. మరి కొందరు విద్యార్థులు సైతం చెన్నైలోకి వస్తున్న సమాచారంతో రైల్వే స్టేషన్లు, విమానాశ్రయంలో భద్రతను పెంచారు. బెంగళూరు నుంచి వచ్చిన విమానంలో మరో నలుగురు విద్యార్థులను అరెస్టు చేశారు. అలాగే, తిరుప్పోరూర్ సమీపంలో తిష్ట వేసి ఉన్న బెంగళూరు, జమ్ము, లడాక్ల నుంచి వచ్చి ఉన్నజియాల్, సోర్, డెన్జిన్, సరాబ్, పంకజ్, కెలిన్లను అరెస్టు చేశారు. వీరు కారులో వచ్చి ఉండడంతో ఆ కారును నడిపిన కడలూరుకు చెందిన యాదవ్ అనే డ్రైవర్‌ను సైతం అరెస్టు చేశారు. ఇక, టిబెటన్ల మీద నిఘా మరింత పటిష్టం చేశారు. కొన్ని చోట్ల చైనీయులను సైతం పోలీసులు విచారించినానంతరం అనుమతించాల్సి వచ్చింది. ఈసీఆర్ మార్గంలో అయితే, అనుమానంతో నలుగురు చైనా యువకులను అదుపులోకి తీసుకోక తప్పలేదు. -
టిబెటన్లపై మరోసారి చైనా ఉక్కుపాదం
న్యూఢిల్లీ: చైనా వేలమంది టిబెటన్లను అడ్డుకుంటోంది. బోధ్ గయలో జరుగుతున్న కార్యక్రమానికి హాజరుకాకుండా వారిని నిలువరిస్తోంది. ఈ కార్యక్రమానికి చైనాకు బద్ధ విరోధి అయిన ప్రముఖ బౌద్ధమత గురువు దలై లామా హాజరు అవుతుండటమే అందుకు ప్రధాన కారణం. ఈ విషయాన్ని నేపాల్, చైనా మీడియా వర్గాలు ధ్రువీకరించాయి. ప్రత్యేకవాదం, ఉగ్రవాదం మితిమీరుతుందనే కారణంతో ఇటీవల చైనా పలు ట్రావెలింగ్ పరిమితులు ప్రవేశపెట్టినట్లు చైనా పత్రిక గ్లోబల్ టైమ్స్ చెప్పింది. ఇలాంటి నిబంధనలు గతంలో ఒక్కసారి కూడా ఉండేవి కావని, ఇటీవల ఉన్న పలంగా ప్రవేశపెట్టారని కూడా అది పేర్కొంది. అంతేకాకుండా ఇప్పటికే చైనా ఆధీనంలోని టిబెట్ వాసుల దగ్గర నుంచి పాస్‌పోర్ట్‌లను చైనా అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారని కూడా తెలిసింది. గత ఏడాది (2016) నవంబర్ నుంచే ఈ ప్రక్రియ ప్రారంభించినట్లు చైనా మీడియానే స్వయంగా తెలిపింది. 'ప్రత్యేకంగా నేపాల్‌కు టిబెటన్లు చేసే ప్రయాణాలపై తాత్కాలికంగా పరిమితులు విధించారు. జనవరి 10 వరకు ఎలాంటి టికెట్ బుకింగ్‌లు చేయవద్దని ఉన్నపలంగా తమ ఆదేశాలు అమలు చేయాలని ఎయిర్‌లైన్స్, ఇతర మార్గాలకు సంబంధించిన ప్రయాణ సౌకర్యాలు ఏర్పాటుచేసే సంస్థలకు ఆదేశాలు ఇచ్చింది' అని నేపాల్ మీడియా వర్గాలు తెలిపాయి. -
టిబెటన్ల పయనం ఎటువైపు?
దలైలామా ఒకవైపు చైనా ఆధిపత్యంలోనే ఉండాలనుకుంటున్నట్టు చెబుతున్నారు. మరోవైపు కమ్యూనిస్టు పార్టీని తప్పు పడుతున్నారు. చైనా ప్రభుత్వం-చైనా కమ్యూనిస్టుపార్టీ వేర్వేరు కాదు. అందుకే దలైలామా పోకడ టిబెట్ స్వాతంత్య్ర పోరాటయోధులకు మింగుడుపడదు. టిబెట్ ఆధ్యాత్మిక గురుపీఠం తన తరువాత ఒక మహిళకు దక్కే అవకాశం ఉందని పద్నాలుగో దలైలామా ఆ మధ్య ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. డెబ్భై ఎనిమిదేళ్ల దలైలామా ఈ ఫిబ్రవరి రెండున మన గౌహతిలో చేసిన ప్రకటన ప్రపంచం చేత, ముఖ్యంగా భారత్ చేత కనుబొమలు ముడివేయించేదే. చైనా నుంచి టిబెట్ స్వాతంత్య్రాన్ని కోరుకోవడం లేదన్నదే ఆ ప్రకటన సారాంశం. చైనా నుంచి టిబెట్‌కు రాజకీయ స్వాతంత్య్రం కావా లంటూ ప్రవాసం నుంచి, టిబెట్‌లోనూ పోరాడుతున్న వారికి ఈ ప్రకటన బాధ కలిగించక మానదు. 1950లో ఆధ్యాత్మిక గురుపీఠం అధిరోహించిన నాటి నుంచి దలైలామా సంపూర్ణ స్వాతంత్య్రం కోసం జరుగుతున్న ఉద్యమాన్ని సమర్ధించడంలేదు. అయినా చైనాకు వ్యతిరేకంగా టిబెల్‌లో పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతూనే ఉంది. ఈ ప్రకటనతో పాటు అహిం సా విధానం గురించి దలైలామా చేసిన వ్యా ఖ్య కూడా ప్రశ్నలు రేకెత్తించేదిగా ఉంది. ‘వ్యక్తి,శాంతి- మానవాళి దృష్టి’ అన్న అంశంపై ఏర్పాటైన గోష్టిలో ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా ఆధిపత్యం నుంచి స్వాతంత్య్రం కోరుకోవడంలేదని దలైలామా చెప్పినా, కమ్యూనిస్టు పార్టీని మాత్రం ఆయన విడిచి పెట్టలేదు. చైనా కమ్యూనిస్టు పార్టీలోని కొం దరు అతివాదుల వల్ల టిబెట్ సంస్కృతికి తీవ్ర నష్టం జరుగుతోందనీ, వాళ్ల వల్ల బౌద్ధం పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నదనీ కూడా ఆరోపించారు. దలైలామా ఒకవైపు చైనా ఆధిపత్యంలోనే ఉండాలనుకుంటున్న ట్టు చెబుతున్నారు. మరోవైపు కమ్యూనిస్టు పార్టీని తప్పు పడుతున్నారు. చైనా ప్రభుత్వం - చైనా కమ్యూనిస్టుపార్టీ వేర్వేరు కాదు. అందుకే దలైలామా పోక డ టిబెట్ స్వాతంత్య్ర పోరాటయోధులకు మింగుడుపడదు. మూడురోజుల తరువాత ధర్మశాలలోని టిబెట్ ప్రవాస ప్రభుత్వ ప్రధా ని డాక్టర్ లోబ్సంగ్ సాంగే దలైలామా ప్రకట నను సమర్ధించారు కూడా. చైనా నుంచి వేరు కావాలని టిబెట్ భావించడం లేదని, భవిష్యత్తులో తగిన రీతిలో స్వయం ప్రతిపత్తి ఇవ్వడానికి చైనా సుముఖంగా ఉంటే చర్చల ప్రక్రియ ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చునని కూడా లోబ్సంగ్ అభిప్రాయపడ్డారు. తమ దేశం చైనా నీడలోనే ఉండాలని టిబెటన్లందరూ భావిస్తున్నారా? జరిగిన, జరుగుతున్న పరిణామాలను బట్టి చైనా ఆధిపత్యంలోనే మనుగడ సాగించడానికి ఆ హిమాలయ రాజ్యవాసులు ఇప్పటికీ సిద్ధంగా లేరనే చెప్పాలి. 2002 నుంచి దలైలామా ప్రతినిధులకీ, చైనా ప్రభుత్వ ప్రతినిధులకీ మధ్య తొమ్మిది దఫాలు చర్చలు జరిగా యి. కానీ 2012లో దలైలామా ప్రతినిధులంతా రాజీనామాలు చేశారు. టిబెట్‌లో పరిస్థితులు తీవ్రరూపం దాల్చడం, చైనా నుంచి సానుకూల స్పందన లేకపోవడమే ఇందుకు కారణం. చర్చలు సఫల మైతే దలైలామా టిబెట్‌లో తిరిగి ప్రవేశిస్తారని ప్రధాని లోబ్సంగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. మంచిదే. కానీ పరిస్థితులు ఇందుకు అనుకూలిస్తాయా అన్నదే ప్రశ్న. టిబెట్ చైనా అంతర్భాగమని వాదించేవారు, చైనాది దురాక్రమణ అని చెప్పేవారు సమానంగా ఉంటారు. దలైలామా తిరిగి టిబెట్ రావాలనీ, దేశానికి స్వాతంత్య్రం కావాలని 2009లో 124 మంది టిబెటన్లు ఆత్మాహుతికి పాల్పడ్డారు. అక్కడి చైనా ఆధిపత్యంలో దుర్లభంగా మారిన పౌరహక్కుల గురించి కూడా ఎన్నో విమర్శలు ఉన్నాయి. నిజానికి ఇప్పుడు చైనా ఆధిపత్యంలోనే టిబెట్ ఉన్నా, ఒకప్పుడు రష్యా, 1950 దశకంలో సీఐయే కూడా ఆ చిన్న రాజ్యంలో చక్రం తిప్పడానికి తమ వంతు ప్రయత్నాలు చేశాయి. టిబెట్‌లోని ఖంపా ప్రాంతంలో 1956 ప్రాంతంలో తిరుగుబాట్లు జరిగినపుడు సీఐయే ప్రవేశించిందని సాక్షాత్తు దలైలామాయే ఒకసారి ప్రకటించారు. అయి తే అది టిబెటన్ల మీద ప్రేమతో కాదనీ, చైనా విస్తరణ, కమ్యూనిస్టు వ్యతిరేకతతోనే అమెరికా రంగ ప్రవేశం చేసిందని వాస్తవం చెప్పా రు. 1959లో కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకుంటున్న టిబెన్ల మీద జన చైనా సైన్యం దాడి చేసినపుడు పద్నాలుగో దలైలామా భారతదేశానికి వలస వచ్చారు. అందుకు ఆయనకు సీఐయే సహాయం చేసింది. నిక్సన్ వచ్చి న తరువాత చైనాతో అమెరికా విదేశాంగ విధానంలో మార్పులు వచ్చాయి. టిబెట్‌పై బిగించిన తన పట్టును సడలించకుండా కొనసాగించేందుకు యాభై ఏళ్ల క్రితం కంటె ఇప్పుడు చైనాకు మరిన్ని అనుకూల పరిస్థితులు ఉన్నాయి. చైనా ప్రపంచం లో బలీయ శక్తి. చైనా సృష్టిస్తున్న సమస్యలతో భారత్ పడుతున్న తిప్పలు అన్నీ ఇన్నీ కావు. ఈ అంశాలు ఎంతో శక్తిమంతమైనవే అయి నా, వాటితోనే దలైలామా పూర్తిగా చైనా వైపు మొగ్గుతున్నారని అనుకోలేం. కానీ టిబెట్ డ్రాగన్ నాలుకకు అందితే, రెండు పెద్ద దేశాల మధ్య ఉన్న బఫర్ స్టేట్ అంతర్థానమవుతుంది. అప్పుడు రష్యా నుంచో, అమెరికా నుంచో ప్రమాదం ఉండదు. కానీ డ్రాగన్‌తో పేచీ అనివార్యం. ‘ఆసియాలోని రెండు దిగ్గజాలు (చైనా, భారత్) ఏదో ఒకరోజు డీకొనే పరిస్థితి వస్తుంది’ అని ప్రథమ ప్రధాని నెహ్రూ చెప్పేవారు. టిబెట్‌లో పెద్ద పరిణామాలు చోటు చేసుకుంటున్న ప్రతి పర్యాయం నెహ్రూ వ్యాఖ్య గుర్తుకు వస్తూనే ఉంటుంది. డా. గోపరాజు నారాయణరావు