China: జగమొండి డ్రాగన్‌ | Sakshi Editorial Article On Chaina India And Chaina Border Issue | Sakshi
Sakshi News home page

China: జగమొండి డ్రాగన్‌

Published Wed, Oct 13 2021 12:56 AM | Last Updated on Wed, Oct 13 2021 9:50 AM

Sakshi Editorial Article On Chaina India And Chaina Border Issue

ఒకటి కాదు... రెండు కాదు. తాజాగా ఆదివారం భారత, చైనా సైనిక కమాండర్ల మధ్య జరిగినవి – ఏకంగా 13వ విడత చర్చలు. తొమ్మిది గంటల పాటు ఉన్నతస్థాయి చర్చల తర్వాత రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదంలో ఒక్క అంగుళమైనా పురోగతి లేదు. తప్పంతా అవతలివాళ్ళదే అన్నది ఇరుపక్షాల వాదన. వివాదాస్పదమైన కొన్ని కీలక ప్రాంతాలపై పరిష్కారం కోసం ‘నిర్మాణాత్మక సూచన’లిచ్చామనీ, చైనా ‘అంగీకరించలేద’నీ భారత సైన్యం సోమవారం ఉదయం ప్రకటించింది. చైనా మటుకు భారత్‌ ‘అసంబద్ధమైన, అవాస్తవిక డిమాండ్లు చేస్తోంద’ని ఆదివారం రాత్రే ఆరోపించింది. వెరసి ప్రతిష్టంభన కొనసాగుతోంది. గమనిస్తే, డ్రాగన్‌ మంకుపట్టుతో వరుసగా రెండో ఏడాది, ఈ రానున్న చలికాలంలోనూ తూర్పు లద్దాఖ్‌లోని పర్వత ప్రాంతాల్లో భారీ సైనిక మోహరింపులు తప్పవు. వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంట ఆక్సిజన్‌ కూడా అందని చోట, మైనస్‌ 30 డిగ్రీల గడ్డ కట్టే చలిలో 50 వేల మంది భారతీయ సైనికులు ప్రాణాలకు తెగించి, పహారా కాయక తప్పదు. శత్రువుల చొరబాట్లు లేకుండా కళ్ళలో ఒత్తులేసుకొని, సరిహద్దులను కాపాడకా తప్పదు. 

2020 మే నెలలో చైనా బలగాలు తమ వార్షిక విన్యాసం కోసం టిబెటన్‌ పీఠభూమి ప్రాంతానికి వచ్చాయి. కానీ, చైనా ఆ బలగాలను తూర్పు లద్దాఖ్‌ ప్రాంతంలోని వాస్తవాధీన రేఖ వైపు మళ్ళించింది. దాంతో, సరిహద్దు వెంట కీలకమైన పీపీ15, పీపీ17ఏ అనే రెండు గస్తీ పాయింట్లలోనూ రెండు దేశాల సైనికులు ఎదురుబొదురయ్యాయి. భారత్‌తో ప్రతిష్టంభన నెలకొంది. అప్పటికే గాల్వన్‌ లోయలోని పీపీ14, పాంగ్‌గాంగ్‌ త్సో సరస్సు ఉత్తరపు ఒడ్డున కూడా ఘర్షణ వాతావరణం నెలకొంది. మొత్తం ఈ 4 గస్తీ పాయింట్లలోనూ చైనా బలగాలు వాస్తవాధీన రేఖను దాటి వచ్చి, మోహరించాయి. ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, 1976లో చైనాపై ఉన్నతస్థాయి నిర్ణాయక బృందం ‘చైనా స్టడీ గ్రూప్‌’ (సీఎస్జీ) ఏర్పాటైంది. ఆ బృందమే ఈ గస్తీ పాయింట్లను నిర్ణయిస్తుంది. భారత, చైనాల మధ్య ఇప్పటికీ అధికారికంగా సరిహద్దులు నిర్ణయం కాని నేపథ్యంలో ఎల్‌ఏసీని చైనా బలగాలు దాటడం మునుపటి ఒప్పందానికి తూట్లు పొడవడమే! 

ఈ వివాద పరిష్కారం కోసం గత ఏడాది మే నుంచి ఇప్పటికి సంవత్సరం పైగా భారత, చైనాల మధ్య రాజకీయ, దౌత్య, సైనిక స్థాయుల్లో వరుసగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. కానీ, నేటికీ అనేక సమస్యలకు పరిష్కారం సాధ్యం కాలేదు. ఆ మధ్య ఫిబ్రవరిలో పాంగాంగ్‌ త్సో ప్రాంతంలో, అలాగే ఆగస్టులో జరిగిన 12వ విడత చర్చల్లో గోగ్రా ప్రాంతంలోనూ బలగాల ఉపసంహరణకు అంగీకారం కుదిరింది. రెండు పక్షాలూ కలసి సంయుక్త ప్రకటన ఇచ్చాయి. కానీ, ఈసారి చర్చల్లో అలాంటి ఏ పురోగతీ లేదు. సంయుక్త ప్రకటనా లేదు. హాట్‌స్ప్రింగ్స్, దెమ్‌చోక్, దెప్సాంగ్‌ లాంటి అనేక ఘర్షణాత్మక ప్రాంతాలపై అంగుళమైనా ముందడుగు పడలేదు. పైపెచ్చు, రెండు వర్గాల మధ్య విభేదాలూ బాహాటంగా బయటపడ్డాయి. 

సరిహద్దుల్లో ఇటీవలి ఘటనలూ ఆ విభేదాలను స్పష్టం చేశాయి. తాజా విడత చర్చలకు రెండు రోజుల ముందే అరుణాచల్‌ ప్రదేశ్‌ తవాంగ్‌ సెక్టార్‌లో జరిగిన సైనిక ఘర్షణ – చైనా సైనికులను కొన్ని గంటలు నిర్బంధించడం లాంటివి బయటకొచ్చాయి. చైనా వైపు నుంచి గతంలో గాల్వన్‌ లోయలో భారత సైనికుల నిర్బంధ చిత్రాలు లీకయ్యాయి. అలాగే, మరో విషయం. చర్చల తర్వాత అటువైపు నుంచి చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటనలు చేయడం సాధారణం. కానీ, గత కొన్ని విడతల చర్చల్లో చైనా సైన్యం ‘పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ’కి చెందిన వెస్ట్రన్‌ థియేటర్‌ కమాండ్‌ ఈ ప్రకటనలు చేస్తుండడం గమనార్హం. అంటే, చైనా ఈ చర్చలకు పెద్ద ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న మాట. చర్చలు నత్తనడకన సాగుతున్నా డ్రాగన్‌ పట్టించుకోవడం లేదన్న మాట. ఘర్షణ కొనసాగినా సరే ఆ అగ్రరాజ్యానికి కావాల్సింది ఆధిపత్యమే తప్ప, సమస్యకు పరిష్కారం కాదన్న మాట. 

తాజా చర్చల్లో వైఫల్యంతో భారత భూభాగంపై చైనా కొనసాగుతోందనే మాట మళ్ళీ పైకొచ్చింది. సరిహద్దులోని వాస్తవ పరిస్థితిని దాచకుండా దేశానికి చెప్పాలంటూ కాంగ్రెస్‌ లాంటి ప్రతిపక్షాలు భారత ప్రధాని మోదీని ప్రశ్నించాయి. మరోపక్క భారత – చైనా సరిహద్దు ప్రాంతాల్లో అతి కష్టంపై ఈ మాత్రమైనా వెసులుబాటు దక్కినందుకు భారత్‌ సంతోషించాలంటూ చైనా కటువుగా మాట్లాడుతోంది. సైనిక అధికార ప్రతినిధి చేసిన ఆ అహంభావపూరిత ప్రకటనలో సామరస్యం కన్నా బెదిరింపు ధోరణే కనిపిస్తోంది. రాజు కన్నా మొండివాడు బలవంతుడట. మరి, ఏకంగా రాజులు, రాజ్యాలే మొండివాళ్ళయితే? చైనా అనుసరిస్తున్న వైఖరి అలాంటిదే. 

అగ్రరాజ్యం ఆ వైఖరిని మార్చుకుంటే... భారత సరిహద్దులో, తద్వారా ఉపఖండంలో శాంతి వెల్లివిరుస్తుంది. కానీ, చైనా లక్ష్యం మాత్రం వాస్తవాధీన రేఖను తమకు అనుకూలంగా ఏకపక్షంగా మార్చేసుకోవడమే. మరీ ముఖ్యంగా, దెప్సాంగ్‌ మైదానప్రాంతాల్లో ఆ పని చేయాలన్నది పొరుగు దేశం లోలోపలి ఆకాంక్ష. డ్రాగన్‌ అనుసరిస్తున్న వైఖరే అందుకు సూచిక. ఈ విషయంలో భారత్‌ అప్రమత్తంగా ఉండాలి. మూసుకుపోని చర్చల ద్వారాన్ని తెరిచే ఉంచాలి. మలి విడత చర్చలకు సిద్ధమవుతూనే, చైనా ఆటలకు అడ్డుకట్ట వేసే వ్యూహరచన చేయాలి. మన భూభాగం అంగుళమైనా వదలకుండా అన్ని వైపుల నుంచి ఒత్తిడి తెచ్చే మార్గాలూ అన్వేషించాలి. కానీ, జగమొండి డ్రాగన్‌కు ముకుతాడు వేయడం మాటలు చెప్పినంత సులభమేమీ కాదు. అదే ఇప్పుడు అతి పెద్ద సవాలు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement