ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్న గవర్నర్ తమిళిసై
యాదాద్రి దర్శనానికి వెళ్లినప్పుడు నేనేమైనా బీజేపీ జెండా పట్టుకున్నానా? నేను నా భర్తతో కలసి ఒక సామాన్య భక్తురాలిగా గుడికి వెళ్లాను. ఈవో, కలెక్టర్ ప్రొటోకాల్ ప్రకారం వచ్చారా లేదా అనేది పట్టించుకోలేదు.
సీఎం, మంత్రులు, సీఎస్ రాజ్‌భవన్‌లో అడుగుపెట్టకుండా ఉండేందుకు వారికి ఉన్న సమస్యలు ఏమిటో చెప్పాలి. మీడియాలో చెప్పడానికి ఇష్టపడకపోతే నేరుగా వచ్చి సమస్యలు ఏమిటో చర్చిస్తే సమాధానం చెబుతా.
నేను ఎక్కడికైనా ప్రయాణించాలంటే రెండు మార్గాలే అందుబాటులో ఉన్నాయి. కొంతకాలంగా కేవలం రోడ్డు లేదా రైలు మార్గంలోనే ప్రయాణిస్తున్నా. హెలికాప్టర్‌లో ఎందుకు ప్రయాణించట్లేదన్న విషయాన్ని మీడియానే తెలుసుకోవాలి.
– గవర్నర్ తమిళిసై
సాక్షి, న్యూఢిల్లీ: తాను బీజేపీకి అనుకూలంగా ఎన్నడూ వ్యవహరించలేదని, ప్రజలకు సేవకురాలిగానే ఉన్నానని, రాజ్యాంగ బద్ధంగా బాధ్యతలను నిర్వర్తిస్తున్నానని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పష్టం చేశారు. బీజేపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారంటూ టీఆర్‌ఎస్ నేతలు తనపై చేసిన విమర్శలను ఆమె తీవ్రస్థాయిలో తిప్పికొట్టారు. తాను కేవలం స్వామి దర్శనం చేసుకోవడానికి మాత్రమే యాదాద్రికి వెళ్ళానని, అయితే మరుసటి రోజు ప్రొటోకాల్ పాటించలేదని, ఎవరూ రాలేదని మీడియా రిపోర్ట్ చేసిందని చెప్పారు. ఎలాంటి ఆధారాలు లేకుండా రాజకీయం చేస్తున్నానంటూ ఏవిధంగా మాట్లాడతారని ప్రశ్నించారు.
రాష్ట్ర గవర్నర్‌గా చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించే తాను యాదాద్రి ఆలయానికి వెళ్తే.. బీజేపీ వ్యక్తిగా వెళ్ళానని ఎలా ఆరోపిస్తారని పరోక్షంగా మంత్రి జగదీశ్‌రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఢిల్లీ పార్లమెంట్ భవన్‌లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో గవర్నర్ భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై సుమారు 50 నిమిషాల పాటు చర్చించారు.
గురువారం ఢిల్లీలో అమిత్ షాకు జ్ఞాపికను అందిస్తున్న తమిళిసై
ఇటీవల హైదరాబాద్‌లో బయటపడ్డ డ్రగ్స్ అంశాన్ని ఆమె హోంమంత్రితో ప్రత్యేకంగా చర్చించారని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని సమగ్ర విచారణ చేయాల్సిన అవసరం ఉందని కోరినట్లు తెలిసింది. ఈ భేటీ అనంతరం తెలంగాణ భవన్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. టీఆర్‌ఎస్ నేతలు చేసిన విమర్శలను ప్రస్తావించగా వాటిని తీవ్రంగా ఖండిం చారు. ముఖ్యాంశాలు ఆమె మాటల్లోనే..
కలిసేందుకు అందరికీ అవకాశం ఇచ్చా..
నేను చాలా ఫ్రెండ్లీ (స్నేహపూర్వకంగా మెలిగే) వ్యక్తిని. తెలంగాణ ప్రజలకు ఏదైనా మేలు చేయాలని మాత్రమే కోరుకుంటున్నాను. నేను ఏమైనా బీజేపీ వారిని తరచుగా కలుస్తున్నానా..? మీకు కావాలంటే గత రెండేళ్ళ అపాయింట్ మెంట్లను బహిరంగపరుస్తా. ఎన్ని రోజులు ఏ పార్టీ నాయకులను కలిశానో తెలుస్తుంది. అన్ని రాజకీయపార్టీల నాయకులు కలిసేందుకు నేను అవకాశమిచ్చా. బీజేపీ నేతలకు ఒకటి, రెండుసార్లు మాత్రమే అవకాశం ఇచ్చా. ఏదో మాట వరుసకు ఆరోపించడం సరికాదు. ఈ అన్ని విషయాలను రాష్ట్ర ప్రజల ముందు ఉంచుతున్నా. తెలంగాణలో జరుగుతున్నది ఓపెన్ సీక్రెట్. నేను దాచేదేమీ లేదు. సమ్మక్క సారక్క జాతర సమయంలో ప్రొటోకాల్ పాటించలేదని నేనేం మీడియాకు చెప్పలేదు. స్థానిక ఎమ్మెల్యే సీతక్క అక్కడ జరిగిన విషయాలను మీడియాకు బహిరంగపరిచారు. కలెక్టర్, ఎస్పీ ఎవరూ అక్కడికి రానప్పుడు ప్రొటోకాల్ పాటిస్తున్నట్లు ఎలా చెప్తారు?
గణతంత్ర, ఉగాది వేడుకలకు ఎందుకు రాలేదు?
ఏదైనా కార్యక్రమానికి ఆహ్వానించినప్పుడు ఎవరూ రాకపోవడం అనేదే అసలు సమస్య. రాజ్‌భవన్‌ని ఈ విధంగా అవమానించడం, విస్మరించడం ఎందుకు? గణతంత్ర వేడుకలకు, ఉగాది సంబరాలకు ఎవరూ ఎందుకు రాలేదు? నేను గవర్నర్ అనే విషయం పక్కన పెట్టండి. రాజ్‌భవన్‌లో ఉన్న ఒక సోదరిగా నేను చూపించే ఆప్యాయతను గౌరవించాల్సిన బాధ్యత ఉందా లేదా? ఒక సోదరికి మర్యాద ఇవ్వాలా వద్దా..? అనేదే నా ప్రశ్న.
గ్యాప్‌పై సీఎం, మంత్రులనే అడగండి..
తెలంగాణలో అందరం అన్నాచెల్లెళ్ళలా కలిసి ముందుకు వెళ్తున్నాం. అలాంటప్పుడు నాలాంటి ఒక మహిళను అవ మానించడం, విస్మరించడం ఎంతవరకు కరెక్ట్? నేను సీఎంతో మాట్లాడేందుకు చాలాసార్లు ప్రయత్నించాను. కానీ ఆయన మాట్లాడేందుకు ముందుకు రావాలి కదా. రాజ్‌భవన్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి గ్యాప్ ఎందుకు వచ్చిందనేది సీఎం, మంత్రులనే అడగాలి.
రాజ్‌భవన్ రాజకీయ పార్టీ కార్యాలయం కాదు
గవర్నర్‌గా నేను రాజకీయం చేస్తున్నానని టీఆర్‌ఎస్ నేతలు ఎలా అంటారు? చాలా బాధ్యతాయుతంగా ఉండే నన్ను రాజకీయం చేస్తున్నానని ఎందుకు అంటున్నారో చెబితే వారికి సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా. రాజ్‌భవన్ రాజకీయ పార్టీ కార్యాలయం కాదు. అక్కడ జరిగే కార్యక్రమాల వెనుక పోస్టర్‌లో రాష్ట్రపతి, ప్రధాని ఫొటోలు ఉంటా యి. ఇటీవల జరిగిన ఉగాది కార్యక్రమంలో నా ఫొటో వాడాల్సిన అవసరం లేదని కూడా చెప్పా. అందులో సీఎం ఫోటో వాడకపోవడం యాధృచ్ఛికమే. అంతకుముందు జరిగిన రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమం బ్యాక్‌డ్రాప్ పోస్టర్‌లో సీఎం ఫొటో ఉంచాం. ఆయనను ఆహ్వానించినా రాలేదు. ఇదేనా గవర్నర్‌కు మీరిచ్చే గౌరవం?
ప్రజల కోసం పనిచేస్తూనే ఉంటా..
కొన్ని నెలలుగా రాష్ట్రంలో పర్యటించే సమయంలో రోడ్డు లేదా రైలు మార్గంలోనే ప్రయాణిస్తున్నా. సమ్మక్క సారక్క జాతరకు, నాగర్‌కర్నూల్‌కి రోడ్డు మార్గంలోనే వెళ్ళాను. భద్రాచలం శ్రీరామకల్యాణానికి.. దూరం ఎక్కువగా ఉన్నం దున రైలు మార్గం ద్వారానే వెళ్తున్నాను. అక్కడ రెండ్రోజుల పాటు గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తా. ప్రభుత్వం నుంచి సహాయం అందినా, అందకపోయినా ప్రజల కోసం పనిచేస్తూనే ఉంటా. ఏ అవాంతరం నా ప్రయాణాన్ని ఆపబోదు.
చదవండి: ట్రైనింగ్ విద్యార్థిని.. రికార్డులపై సంతకాలు కావాలంటే ఇంటికి రావాలంటూ..
Comments
Please login to add a commentAdd a comment