
YSRCP MP Vijayasai Reddy: కేంద్ర కార్యదర్శుల బృందంతో ఏపీ ప్రతినిధుల బృందం భేటీ ముగిసింది. సుమారు రెండున్నర గంటలపాటు ఈ సమావేశం కొనసాగింది. సమావేశం అనంతరం , వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ... ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చిన వినతిపత్రం లోని అన్ని అంశాలను ఈ సమావేశంలో చర్చించామని,పరిష్కార మార్గాలను అన్వేషించామన్నారు.
సమావేశం మొత్తం సానుకూలంగా జరిగిందని, త్వరలోనే మంచి సమాచారం వస్తుందని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి 20 మంది ఉన్నతాధికారులు, ప్రధానమంత్రి కార్యాలయ అధికారులు సమావేశంలో పాల్గొన్నారని, దీనికి కొనసాగింపుగా సంబంధిత అధికారులు నిరంతరం సంప్రదింపులు చేసి, ఈ అంశాలన్నింటినీ ముందు తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. పోలవరం సవరించిన అంచనాలను యధావిధిగా ఆమోదించేందుకు ఒక అవగాహనకు వచ్చినట్లు తెలిపారు. పునరావాసం సహా అన్ని అంశాలపై రాష్ట్రానికి ప్రయోజనం కలిగే విధంగా చర్చలు జరిగాయని అన్నారు. ముఖ్యమంత్రికి, రాష్ట్రానికి ప్రధానమంత్రి ఇస్తున్న ప్రాధాన్యత కు ఈ సమావేశం నిదర్శనమని ఆయన అన్నారు.