చెన్నైలో టిబెటన్ల టెన్షన్‌.. అరెస్ట్‌లు | Tibetans Arrest in Tamil Nadu Protest While Xi jingping Visit | Sakshi
Sakshi News home page

చెన్నైలో టిబెటన్ల టెన్షన్‌

Published Sat, Oct 12 2019 8:42 AM | Last Updated on Sat, Oct 12 2019 8:51 AM

Tibetans Arrest in Tamil Nadu Protest While Xi jingping Visit - Sakshi

సాక్షి, చెన్నై : జిన్‌పింగ్‌ పర్యటనకు వ్యతిరేకంగా టిబెటన్లు చెన్నైలో నిరసనలకు యత్నించడం అధికారుల్ని టెన్షన్‌లో పెట్టింది. శుక్రవారం పలు చోట్ల నక్కి ఉన్న టిబెటన్లను గుర్తించడం కష్టతరంగా మారింది. చైనీయుల ముసుగులో ఉన్న అనేక మంది టిబెటన్లను అతి కష్టం మీద అరెస్టు చేయాల్సి వచ్చింది. ఐటీసీ గ్రాండ్‌ చోళా హోటల్‌ చుట్టూ వున్న భద్రతా వలయాన్నిఛేదించి ఆరుగురు చొరబడడం ఉత్కంఠకు దారి తీసింది.తమ దేశం మీద చైనా ఆధిపత్యాన్ని నిరసిస్తూ టిబెటన్లు పోరాటాలు సాగిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. చైనా మీద భగ్గుమనే టిబెటన్లు, చెన్నైకు వస్తున్న జిన్‌ పింగ్‌కు వ్యతిరేకంగా నిరసనలకు వ్యూహ రచన చేశారని గత వారం నిఘా వర్గాలు పసిగట్టాయి. దీంతో చెన్నై శివారులోని తాంబరంలో తిష్ట వేసి ఉన్న ఆరుగుర్ని అరెస్టు చేశారు. అలాగే, ఓకళాశాల ప్రొఫెసర్‌ను కూడా అరెస్టు చేశారు. మరికొన్ని చోట్ల టిబెటన్లు తిష్ట వేసి ఉన్న సమాచారంతో ఆయా ప్రాంతాల్ని నిఘావలయంలోకి తెచ్చారు. టిబెటన్లు చెన్నైలో ఎక్కువగా ఉన్న చోట్ల పోలీసులు డేగ కళ్ల నిఘా వేశారు. వారి కదలికల మీద దృష్టి పెట్టారు. టిబెటన్ల నిరసనలకు ఆస్కారం ఇవ్వని రీతిలో భద్రతా చర్యలు తీసుకున్నారు.

కళ్లు గప్పి...
మరో గంటన్నరలో జిన్‌పింగ్‌ విమానం చెన్నైలో ల్యాండ్‌ కానున్న నేపథ్యంలో ఒక్క సారిగా ఉత్కంఠ అన్నది బయలు దేరింది. డేగ కళ్ల నిఘాతో వ్యవహరిస్తున్న పోలీసులకే ముచ్చమటలు పట్టించే రీతిలో కొందరు టిబెట్‌ యువతీ,యువకులు వ్యవహరించారు. జిన్‌పింగ్‌ స్వాగతం పలికేందుకు వచ్చిన చైనీయుల ముసుగులో కొందరు టిబెటన్లు చొరబడడం టెన్షన్‌ రేపింది. సరిగ్గా 11.30 గంటల సమయంలో జిన్‌పింగ్‌ బస చేయనున్న గిండి స్టార్‌ హోటల్‌ వైపుగా ఇద్దరు యువతులు, నలుగురు యువకులు రావడాన్ని పోలీసులు గుర్తించారు. డిఐజీ ప్రదీప్‌కుమార్, కమిషనర్‌ ఏకే విశ్వనాథ్‌ పర్యవేక్షణలో  ఆ మార్గాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్న నేపథ్యంలో వారు అటు వైపుగా వస్తుండడాన్ని గుర్తించిన భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. తాము చైనీయులుగా పేర్కొంటూ, తమ నేతకు ఆహ్వానం పలికేందుకు వచ్చినట్టు నమ్మ బలికే యత్నం చేశారు.

అయితే, పోలీసులకు అనుమానాలు రావడంతో అందులో ఓ యువకుడు నేరుగా హోటల్‌ ముందుకు పరుగులు తీసి, తన వద్ద ఉన్న టిబెట్‌ జెండాను ప్రదర్శిస్తూ నినాదాల్ని హోరెత్తించారు. జిన్‌  పింగ్‌కు వ్యతిరేకంగా అతడు నినదించడంతో క్షణాల్లో ఉత్కంఠ నెలకొంది. అతడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆటోలో గిండి పోలీసు స్టేషన్‌కు తరలించారు. అదే సమయంలో అక్కడే ఉన్న ఇద్దరు యువతులతో పాటుగా మరో ముగ్గురు యువకుల్ని బలవంతంగా అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. దీంతో టిబెటన్లు నిరసనకు కొన్ని చోట్ల వ్యూహ రచన చేసిన సమాచారంతో అక్కడ ఉత్కంఠ పెరిగింది. ఇంత కష్ట పడ్డా టిబెటన్ల రూపంలో  భద్రతా  వైఫల్యం అన్నది వెలుగులోకి వస్తుందన్న ఆందోళన తప్పలేదు.

ఎక్కడికక్కడ అరెస్టులు
ఈ ఆరుగురు ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చినట్టు విచారణలో తేలింది. అక్కడి ఓ వర్సిటీలో చదువుకుంటున్న ఈ విద్యార్థులు పథకం ప్రకారం నిరసనకు వ్యూహ రచన చేసి ఉండటంతో ఉత్కంఠ పెరిగింది. మరి కొందరు విద్యార్థులు సైతం చెన్నైలోకి వస్తున్న సమాచారంతో రైల్వే స్టేషన్లు, విమానాశ్రయంలో భద్రతను పెంచారు. బెంగళూరు నుంచి వచ్చిన విమానంలో మరో నలుగురు విద్యార్థులను అరెస్టు చేశారు. అలాగే, తిరుప్పోరూర్‌ సమీపంలో తిష్ట వేసి ఉన్న బెంగళూరు, జమ్ము, లడాక్‌ల నుంచి వచ్చి ఉన్నజియాల్, సోర్, డెన్జిన్, సరాబ్, పంకజ్, కెలిన్‌లను అరెస్టు చేశారు. వీరు కారులో వచ్చి ఉండడంతో ఆ కారును నడిపిన కడలూరుకు చెందిన యాదవ్‌ అనే డ్రైవర్‌ను సైతం అరెస్టు చేశారు. ఇక, టిబెటన్ల మీద నిఘా మరింత పటిష్టం చేశారు. కొన్ని చోట్ల చైనీయులను సైతం పోలీసులు విచారించినానంతరం అనుమతించాల్సి వచ్చింది. ఈసీఆర్‌ మార్గంలో అయితే, అనుమానంతో నలుగురు చైనా యువకులను అదుపులోకి తీసుకోక తప్పలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement