చెన్నైవాసులకు చుక్కలు చూపించిన ‘సూపర్‌కార్‌’ | China President Xi Jinping Coming Tamil Nadu Today | Sakshi
Sakshi News home page

మహా'బందోబస్తు'పురం

Published Fri, Oct 11 2019 8:48 AM | Last Updated on Fri, Oct 11 2019 9:11 AM

China President Xi Jinping Coming Tamil Nadu Today - Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: ఇటీవలి వరకు అది మహాబలిపురం. కానీ ప్రస్తుతం మహా‘బందోబస్తు’పురంగా మారిపోయింది. మరో రెండురోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ప్రధాని మోదీ, చైనా అధ్యక్షులు జి. జిన్‌పింగ్‌ ఈనెల 11, 12 తేదీల్లో ప్రపంచ ప్రసిద్ధి పర్యాటక కేంద్రమైన మహాబలిపురంలో పర్యటించడమే ఇందుకు కారణం.ఇందులో భాగంగా భారత్‌–చైనా దేశాల మధ్య రెండో శిఖరాగ్ర సమావేశానికి తమిళనాడులోని మహాబలిపురం ముస్తాబైంది.ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు చైనా అధ్యక్షులు జి.జిన్‌పింగ్‌ నేడు మధ్యాహ్నం 1.30 గంటలకు చెన్నై విమానాశ్రయానికి చేరుకుంటారు. చెన్నై గిండిలోని ఐటీసీ గ్రాండ్‌చోళాలో జిన్‌పింగ్, కోవలం బీచ్‌ సమీపంలోని తాజ్‌ హోటల్‌లో ప్రధాని మోదీ బసచేస్తారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు చెన్నైకి సుమారు 50 కిలోమీటర్ల దూరంలోని మహాబలిపురం సముద్రతీర ఆలయంలో ఇరువురు అగ్రనేతలు భేటీ కానున్నారు. దేశాల మధ్య వర్తక, వాణిజ్యపరమైన చారిత్రాత్మక ఒప్పందాలపై సంతకాలు జరుగుతాయని తెలుస్తోంది. 12వ తేదీన ఇరువురు నేతలు మరోసారి సమావేశం అవుతారు.

జిన్‌పింగ్‌ కోసం సూపర్‌కార్‌ 
చైనా దేశాధ్యక్షుని రెండురోజుల పర్యటన నిమిత్తం ఆదేశ జాతీయపతాకాన్ని అమర్చిన రష్యాలో తయారైన హాంగీ అనే బుల్లెట్ర్‌ పూఫ్‌కారు చెన్నైకి చేరుకుంది. సుమారు 18 అడుగుల పొడవు, 6.5 అడుగుల వెడల్పు, 5 అడుగుల ఎత్తుతో 3,152 కిలోల బరువుంటుంది. కళ్లు మిరుమిట్లుగొలిపే కారు చైనా నుంచి చెన్నైకి చేరుకోగా, ఈ కారు ప్రజలను విశేషంగా ఆకర్షిస్తోంది. కేవలం 10 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకునేలా ఈ కారు తయారైంది. చైనా అధ్యక్షుడు రాక సందర్భంగా నగరంలో మాక్‌డ్రిల్, కాన్వాయ్‌ వాహనాల ట్రయల్‌ రన్‌ గురువారం నిర్వహించారు. ట్రయల్‌ రన్‌ కోసం నగరంలో వాహనాలను నిలిపివేయడంతో ప్రజలు అష్టకష్టాలు పడ్డారు. శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు నగరంలో పలు చోట్ల వాహనాల రాకపోకల్లో మార్పులు చేశారు. చిన్నమలై – మీనంబాక్కం మధ్య మెట్రో రైలు సేవలను నిలిపివేయనున్నారు. అగ్రనేతల రాక సందర్భంగా 15వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.

భద్రతా ఏర్పాట్లలో భాగంగా మూడు సబ్‌మెరైన్‌లను సముద్రతీరంలో సిద్ధం చేశారు. చెన్నై గిండిలోని ఐటీసీ గ్రాండ్‌ చోళా హోటల్, మహాబలిపురం మధ్యలోని ఇంజినీరింగ్‌ కళాశాలలకు రెండు రోజులపాటు సెలవు ప్రకటించారు. భద్రతా ఏర్పాట్ల పర్యవేక్షణకు 9 మంది ఐఏఎస్‌ అధికారులను ప్రభుత్వం నియమించింది.మహాబలిపురంలోని బుల్లెట్ర్‌çపూఫ్‌ ఆడిటోరియంలో ఇద్దరు అగ్రనేతలు భేటీ అయ్యే ఏర్పాట్లను చేశారు. వారిద్దరి భేటీ కోసం రెండు ఆడిటోరియంలను సిద్ధం చేశారు. సముద్రతీరంలో ఏడంచల భద్రతా ఏర్పాట్లను, 24 గం టలు నిఘాను పెట్టారు. మహాబలిపురం పరిసరాల్లోని 42 గ్రామాల్లో చేపలవేటను నిషేధించారు. చైనా అధ్యక్షుడు రాక సందర్భం గా రిమాండ్‌ ఖైదీలను కోర్టులో హాజరుపరచడంలో మినహాయింపు ఇవ్వాల్సిందిగా చెన్నై పోలీసు కమిషనర్‌ ఏకే విశ్వనాథన్‌ కోర్టుకు లేఖ రాశారు.


మహాబలిపురంతో చైనా అనుబంధం

తమిళనాడులో అందునా కాంచీపురం జిల్లా మహాబలిపురంలో ఇరుదేశాల అగ్రనేతలు భేటీ కావడం వెనుక ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. రాజేంద్రచోళ మహారాజు చైనాతో వాణిజ్యం సాగించినప్పటి నుంచి భారతదేశంతో స్నేహసంబంధాలున్నాయి. భారత్‌కు చెందిన ప్రఖ్యాత బౌద్ధ్దగురువు చైనాకు వెళ్లి అక్కడ ప్రబలంగా వ్యాపించి ఉన్న ప్రాణాంతకమైన వ్యాధికి మందుకనుగొని ప్రజల ప్రాణాలను కాపాడడంతో ఇరుదేశాల మధ్య సఖ్యత నెలకొంది. భారత్‌ నుంచి వ్యాపించిన బౌద్ధ్దమతం చైనా సంస్కృతికి మారింది. అయితే 1949లో మా చే తుంగ్‌ కమ్‌ యూనిస్ట్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాతనే భారత్‌–చైనా దేశాల మధ్య సంబంధాలు ఏర్పడ్డాయని చరిత్రకారులు చెబుతున్నారు. కొత్త చైనా ప్రభుత్వాన్ని అంగీకరించిన వామపక్షేతర దేశాల్లో భారత్‌ ప్రథమంగా నిలిచింది. అయినా ఆనాటి నుంచే భారత్‌–చైనా దేశాల మధ్య సరిహద్దు సమస్య కొనసాగుతోంది. కశ్మీర్‌లో ఒక భాగమైన అగ్‌సై చిన్‌ చైనా కట్టుబాటులోనే ఉండగా, భారత్‌ హక్కు కోరుతోంది. అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్‌ అనే ప్రాంతాన్ని చైనా కోరుతోంది. ఇలా ఇరుదేశాల మధ్య లెక్కలేనన్ని సమస్యలున్నాయి. ఇలాంటి అనేక సమస్యల పరిష్కారానికి మహాబలిపురంలో జరిగే శిఖరాగ్ర సమావేశం బాటలు వేస్తుందని ఆశిస్తున్నారు.

మోదీ – జిన్‌పింగ్‌ రాక ప్రాధాన్యత గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు బీజేపీ రాష్ట్ర శాఖ తరఫున కేంద్ర మాజీ మంత్రి పొన్‌ రాధాకృష్ణన్‌ ఒక ప్రచార వాహనాన్ని ప్రారంభించారు. చైనా అధ్యక్షుడు రాక పుణ్యమా అని నగరంలో పారిశుధ్యం మెరుగుపడిందని హైకోర్టు న్యాయమూర్తులు ఎస్‌.వైద్యనాధన్, సి.శరవణన్‌ వ్యాఖ్యానించారు. నగరం బాగుపడాలంటే అగ్రనేతలు రాక తప్పదా అంటూ వ్యాఖ్యానించారు. చెన్నై నగరానికి తరచూ ఇలాంటి నేతలు వస్తూ ఉంటే చెన్నై బాగుపడగలదని వారన్నారు.

63 ఏళ్ల తరువాత మహాబలిపురానికి మరోసారి..
చైనా అగ్రనేత 63 ఏళ్ల తరువాత మరోసారి మహాబలిపురానికి రావడం గమనార్హం. 1956, డిసెంబర్‌ 5వ తేదీ అప్పటి చైనా ప్రధాని సూఎన్‌లాయ్‌ రెండు రోజుల పర్యటన నిమిత్తం చెన్నై విమానాశ్రయానికి రాగా అప్పటి తమిళనాడు గవర్నర్‌ శ్రీప్రకాశ్, ముఖ్యమంత్రి కామరాజర్‌ ఆయనకు స్వాగతం పలికారు. చెన్నై కార్పొరేషన్‌ మైదానం, ప్రస్తుత నెహ్రూ స్టేడియంలో ఆయనకు స్వాగత సత్కారాలు జరిగాయి. జెమినీ స్టూడియో అధినేత ఎస్‌ఎస్‌ వాసన్‌ కొందరు పారిశ్రామిక వేత్తలతో కలిసి చైనా ప్రధానికి స్వాగతం పలుకగా, నటి పద్మిని నృత్యప్రదర్శన జరిగింది. ఆ తరువాత పెరంబూరులో ఐసీఎఫ్‌  ప్రాంతాలను సందర్శించారు. తర్వాత రోజు ప్రస్తుత ఈసీఆర్‌ అని చెప్పబడే ఈస్ట్‌కోస్ట్‌ రోడ్డు మార్గంలో మహాబలిపురానికి వెళ్లి అక్కడి పల్లవులనాటి శిల్ప సంపదలను సందర్శించి ఆశ్చర్యానుభూతికిలోనైనారు. దాదాపు 63 ఏళ్ల తర్వాత మరలా చైనా అధ్యక్షుడు మహాబలిపురాన్ని సందర్శించడం విశేషం.

మహాబలిపురానికే ఎందుకంటే...
సహజంగా విదేశీయులు భారతదేశానికి వస్తే ఢిల్లీకి పరిమితమై ప్రధాని, రాష్ట్రపతి, విదేశాంగ మంత్రులను కలవడం సహజంగా వస్తోంది. అయితే, మోదీ ప్రధాన మంత్రి అయిన తర్వాత విదేశీ అతిథుల విషయంలో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. దేశ రాజధాని కంటే పలు రాష్ట్రాల్లో కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ద్వారా అక్కడి సంస్కృతి, సంప్రదాయాలను విదేశీయులు తెలుసుకునే అవకాశం కలుగుతుందని ఆయన ఆలోచించారు. విదేశీ నేతలకు కూడా ఈ మార్పు ఎంతో ఆకర్షణీయంగా మారింది. ముఖ్యంగా విదేశీ ప్రతినిధుల రాకతో  ఆయా రాష్ట్రాలు శోభాయమానంగా మారడం కలిసొచ్చే అంశమైంది. మోదీ ప్రధానిగా ఎంపికైన తరువాత జర్మనీ ప్రధానమంత్రి ఏంజలా మెర్కల్‌ను 2015 అక్టోబర్‌లో ఇండియాకు వచ్చినప్పుడు బెంగళూరులో భేటీ అయ్యారు. 2017 జులైలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఇండియాకు వచ్చినప్పుడు అహ్మదాబాద్‌లో సమావేశమయ్యారు. అదే ఏడాది సెప్టెంబర్‌లో జపాన్‌ ప్రధాని షింజో అబే భారత్‌కు వచ్చినప్పుడు అహ్మదాబాద్‌లోనే భేటీ అయ్యారు. 2018, మార్చిలో ఫ్రాన్స్‌ దేశ అధినేత మెక్రాన్‌ భారత్‌కు వచ్చినప్పుడు వారణాశిలో సమావేశమయ్యారు. 

మోదీ – జిన్‌పింగ్‌ తొలిసారిగా శిఖరాగ్ర సమావేశం చైనాలోని ఊగన్‌ నగర్‌లో గత ఏడాది ఏప్రిల్‌ 27, 28 తేదీల్లో భేటీ అయ్యారు. చైనా – భారత్‌ మధ్య శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోదీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాశిని తొలుత ఎంపిక చేశారు. అయితే, అక్కడి విమానాశ్రయం సౌకర్యవంతం కానందున చెన్నైని ఎన్నుకున్నారు. అంతేకాక, మహాబలిపురానికి చైనాకు మధ్య అనాథిగా చారిత్రాత్మక సంబంధాలు ఉన్నందున ఇది వేదికగా మారింది. ఈ కోవలో ప్రస్తుతం చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మోదీ రెండవ సారి సమావేశాన్ని మహాబలిపురంలో ఏర్పాటుకున్నారు. మహాబలిపురంలో ఇద్దరు అగ్రనేతలు సమావేశం కావడం సంతోషదాయకమైనా తమిళనాడులో అనేక అభివృద్ధి చెందిన జిల్లాలు ఉన్న తరుణంలో కాంచీపురం జిల్లా పరిధిలోని మహాబలిపురాన్నే ఎంచుకోవడం గమనార్హం. మహాబలిపురానికి ఉన్న చారిత్రాత్మక ప్రతిష్ట సాంస్కృతిక ప్రతిష్ట ఉండడమే ఇందుకు ప్రధాన కారణం.  ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పర్యాటక ప్రాంతాలలో మహాబలిపురం కూడా ఒకటిగా 1984లోనే చేరింది. ఇన్ని ప్రత్యేకతలు కూడి ఉన్నందునే ఇద్దరు అగ్రనేతల చర్చలకు మహాబలిపురం వేదికైంది. భారత్‌ – చైనా శిఖరాగ్ర సమావేశాల కారణంగా తమిళనాడు ప్రతిష్ఠ ప్రపంచ స్థాయికి ఎదిగిందని ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి పేర్కొన్నారు. మోదీ – జిన్‌ పింగ్‌లకు ప్రజలను ఘనస్వాగతం పలకాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement