సాక్షి ప్రతినిధి, చెన్నై: రాజకీయ సన్యాసం పుచ్చుకున్నట్లుగా నటుడు రజనీకాంత్ వ్యవహరించడం ఆయన అభిమానులకు నచ్చలేదు. కటిక చేదైన ఈ వాస్తవాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒత్తిడి తెచ్చైనా రాజకీయాల్లోకి దింపాలని ఎడతెగని ప్రయత్నాలు చేస్తున్నారు. చెన్నై వళ్లువర్‌కోట్టం వద్ద ఆదివారం మరోసారి ఆందోళన చేపట్టి రావయ్యా తలై వా అంటూ నినాదాలు చేశారు. ఎంజీ రామచంద్రన్, జయలలిత తరహాలో రజనీకాంత్ రాజకీయాల్లో రావాలని అభిమానులు మూడు దశాబ్దాలుగా కలలుకంటున్నారు. మూడేళ్ల క్రితం రజనీసైతం సుముఖుత వ్యక్తం చేశారు. రాజకీయాలోకి రావడం ఖాయమని 2017 డిసెంబర్ 31వ తేదీన అభిమాన జనసందోహం మధ్య ప్రకటించారు. అభిమానులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బుయ్యారు. (చదవండి: ఐదు నిమిషాల్లో 2 కోట్ల రూపాయలు..)
అయితే రాజకీయాల్లోకి రజనీ రాక ప్రకటనకే పరిమితమైంది. మూడేళ్లుగా ఎదురుచూసి గత ఏడాది చివర్లో అభిమానులు మళ్లీ జోరుపెంచారు. అసెంబ్లీ ఎన్నికలు వస్తున్న తరుణంలో పార్టీ మాటేమిటని అన్నివర్గాలు ఆసక్తిచూపాయి. దీంతో దిగివచ్చిన రజనీకాంత్ డిసెంబర్ 31న పార్టీ ప్రకటన, జనవరిలో పార్టీ స్థాపన అని ప్రకటించారు. ‘ఇప్పుడు కాకుంటే మరెప్పుడూ వీలుకాదు’ అని కూడా ఆయన వ్యాఖ్యానించడంతో అందరూ గట్టిగా నమ్మారు. రజనీ ప్రకటనతో రజనీ మక్కల్ మన్రం నిర్వాహకులు, అభిమానులు పండగ చేసుకున్నారు. అన్నాత్తే చిత్రం షూటింగ్ ముగించుకు వస్తానని హైదరాబాద్ వెళ్లిన రజనీ అనారోగ్యం పాలై చెన్నైకి చేరుకున్నారు.(చదవండి: ‘నష్ట పరిహారం అడిగితే అత్యాచారం చేశారు’)
ఆరోగ్యం సహకరించడం లేదు, రాజకీయ పార్టీ పెట్టడం లేదని గతనెల 29న రజనీ ప్రకటించడంతో రజనీ మక్కల్ మన్రం నిర్వాహకులు హతాశులయ్యారు. చెన్నై పోయెస్‌గార్డెన్‌లోని ఆయన ఇంటి ముందు పోరాటాలు సాగించినా రజనీ స్పందించలేదు. ఆందోళనలకు పూనుకుంటే క్రమశిక్షణ చర్య తీసుకుంటామని రజనీ మక్కల్ మన్రం నేతల్లో కొందరు హెచ్చరించినా అభిమానులు ఖాతరు చేయలేదు. ముందుగా తీసుకున్న నిర్ణయం ప్రకారం చెన్నై నుంగంబాక్కంలోని వల్లువర్‌కోట్టం వద్దకు ఆదివారం ఉదయం పెద్దసంఖ్యలో అభిమానులు చేరుకున్నారు. ‘ఇప్పుడు కాకుంటే మరెప్పుడూ కుదరదు..రాజకీయాల్లో రా నాయకుడా’ అంటూ నినా దాలు చేశారు. ఆందోళన ముగిసిన తరువాత కొందరు అభిమానులు మయిలం మురుగన్ ఆలయానికి వెళ్లి గుండు కొట్టించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment