dalilama
-
నా వ్యాఖ్యల్లో తప్పుంటే క్షమించండి
సాక్షి, బెంగళూరు: భారత తొలి ప్రధాని నెహ్రూ స్వార్థపరుడంటూ చేసిన వ్యాఖ్యలపై టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామా క్షమాపణ చెప్పారు. మహ్మద్ అలీ జిన్నాను ప్రధాని చేయడానికి గాంధీ అనుకూలంగా ఉన్నా, నెహ్రూ స్వార్థపూరితంగా ఆలోచించారని బుధవారం దలైలామా అన్నారు. గాంధీ కోరుకున్నట్లు జిన్నా ప్రధాని అయ్యుంటే దేశ విభజన జరిగేది కాదన్నారు. ఆ వ్యాఖ్యలు వివాదాస్పదమవడంతో క్షమాపణ చెప్పారు. ‘నేనేదైనా తప్పు మాట్లాడి ఉంటే క్షమించండి. గాంధీ దేశ విభజనను వ్యతిరేకించారని విని నమ్మలేకపోయా. పాక్ కన్నా భారత్‌లో ముస్లింల జనాభా ఎక్కువ. గడిచిందేదో గడిచిపోయింది’ అని శుక్రవారం బెంగళూరులో ఓ కార్యక్రమంలో అన్నారు. పాక్, భారత్ మధ్య ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు దురదృష్టకరమని, భారత్ ఈ విషయంలో పెద్దన్న పాత్ర పోషిస్తూ సమస్య పరిష్కారానికి చొరవచూపాలన్నారు. తమ మాతృభూమి నుంచి వేలాదిగా వలసొచ్చిన టిబెటన్లను అక్కున చేర్చుకుని సొంత మనుషుల్లా చూస్తున్నందుకు భారత్ కృతజ్ఞతలు తెలిపారు. టిబెటన్ల సంస్కృతి పరిరక్షణకు నెహ్రూ ప్రాధాన్యమిచ్చారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక సీఎం కుమారస్వామి పాల్గొన్నారు. -
‘ఏమైనా తప్పుంటే నన్ను క్షమించండి’
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ వంటి వ్యక్తులే తప్పులు చేశారన్న తన వ్యాఖ్యల్లో ఎదైనా తప్పు ఉంటే తనని క్షమించాలని టిబెట్ బౌద్ధ గురువు దలైలామా కోరారు. ప్రతీ ఒక్కరు జీవితంలో ఎప్పుడో ఒకసారి తప్పుచేస్తారని, నెహ్రూ వంటి వ్యక్తులే తప్పులు చేశారని ఇటీవల పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తన వ్యాఖ్యలు ఉద్దేశ పూరితంగా చేసినవి కావని, ఏమైనా తప్పుంటే తనని క్షమించాలని శుక్రవారం ట్వీట్ చేశారు. గోవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఇటీవల దలైలామా మాట్లాడుతూ.. దేశ తొలి ప్రధానిగా మహ్మద్ అలీ జిన్నాను చేయాలని మహాత్మ గాంధీ భావించారని, దానిని నెహ్రూ తీవ్రంగా వ్యతిరేకించారని దలైలామా పేర్కొన్నారు. దేశ ప్రధానిగా తనకు అవకాశం ఇవ్వాలని నెహ్రూ పట్టుబట్టినట్లు కూడా ఆయన తెలిపారు. మహ్మద్ అలీ జిన్నాను గనుక ప్రధాని చేసి ఉంటే అవిభాజ్య భారత్ ముక్కలైయ్యేది కాదని దలైలామా ఇటీవల పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దలైలామా వ్యాఖ్యలపై బీజేపీ-కాంగ్రెస్ నేతలు తీవ్రంగా స్పందించిన నేపథ్యంలో దలైలామా క్షమాపణలు కోరారు. ఆయన చేసిన వ్యాఖ్యలు వాస్తవమైనవని, గాంధీ మొదటి నుంచి జిన్నాను ప్రధాని చేయాలని ప్రయత్నించారని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి పేర్కొన్నారు. నెహ్రూ కేవలం తన సొంత ప్రయోజనాల కోసమే ఆలోచిస్తారన్న వ్యాఖ్యలు నిజమైనవని, ఇలాంటి చారిత్రాత్మక విషాయాలపై మరింత లోతుగా చర్చ జరగాల్సిన అవసరముందని స్వామి తెలిపారు. My statement has created controversy, if I said something wrong I apologise: Dalai Lama on his statement, "Mahatma Gandhi ji was very much willing to give Prime Ministership to Jinnah but Pandit Nehru refused." pic.twitter.com/jjIEmc280E — ANI (@ANI) August 10, 2018 -
దలైలామాను కలిసిన ఎంపీ మల్లారెడ్డి
సాక్షి, హైదరాబాద్ : గౌతమ బుద్ధుని బోధనలు సర్వదా ఆచరణీయమని ఎంపీ మల్లారెడ్డి అన్నారు. సామాజిక న్యాయం, సాధికారిత శాఖ పార్లమెంటరీ స్థాయిసంఘం సమావేశంలో పాల్గొనేందుకు ధర్మశాలకు వెళ్లిన ఆయన...బౌద్ధ గురువు దలైలామాను కలిశారు. ఆధ్యాత్మిక అంశాలతో పాటు సామాజిక రుగ్మతలను రూపుమాపడంపై పార్లమెంటరీ స్థాయి సంఘం చేపడుతున్న చర్యల గురించి దలైలామాతో ప్రత్యేకంగా చర్చించినట్లు ఎంపీ ఒక ప్రకటనలతో తెలిపారు. ఈ పర్యటనలో ఎంపీ మల్లారెడ్డి వెంట సామాజిక న్యాయం, సాధికారత శాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం చైర్మన్ రమేశ్ బేయాస్, ఇతర కమిటీ సభ్యులున్నారు. -
చైనా అవాక్కులు!
దౌత్యపరమైన సమస్యలెన్ని ఉన్నా దాదాపు మర్యాదస్తుల్లా మాట్లాడుకునే అలవాటున్న భారత్–చైనాల మధ్య ఇప్పుడు వాగ్యుద్ధం నడుస్తోంది. బౌద్ధ ఆధ్యాత్మిక వేత్త దలైలామా అరుణాచల్ ప్రదేశ్ పర్యటన చుట్టూ ఈ వివాదం రాజుకుంది. దలైలామా అరుణాచల్ పర్యటననూ, మరీ ముఖ్యంగా తవాంగ్ వెళ్లడాన్నీ చైనా జీర్ణించుకోలేకపోతోంది. బీజింగ్‌లో భారత రాయబారి వీకే గోఖలేను విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయానికి పిలిచి నిరసనను వ్యక్తం చేసింది. అంతేకాదు... తమ అసంతృప్తిని పట్టించుకోకుండా ‘మొండిగా’ దలైలామా పర్యటనకు ఏర్పాట్లు చేసిందని మన దేశంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తన సార్వభౌమత్వాన్నీ, న్యాయ బద్ధమైన హక్కుల్ని, ప్రయోజనాలనూ పరిరక్షించుకోవడానికి ‘అవసరమైన’ చర్య లన్నీ తీసుకుంటామని హెచ్చరించింది. చైనా ప్రభుత్వం ఇలా మాట్లాడుతుంటే అక్కడి మీడియా ఇంకో అడుగు ముందుకేసింది. దెబ్బకు దెబ్బ తీయాలని ఒక పత్రిక, చైనా అంతరంగాన్ని భారత్ తక్కువ అంచనా వేస్తున్నదని మరో పత్రిక వ్యాఖ్యానించాయి. మన దేశం మాత్రం ఈ పర్యటనకు రాజకీయ రంగు పులిమి కృత్రిమ వివాదాలను సృష్టించవద్దని చైనాకు హితవు పలికింది. అరుణాచల్ ‘వివాదాస్పద’ ప్రాంతమని అనడం చైనాకు కొత్తేమీ కాదు. అప్పు డప్పుడు అది తమ దేశంలో అంతర్భాగమని చెప్పడం కూడా రివాజే. అలాగని ఆ రాష్ట్రానికీ, ప్రత్యేకించి తవాంగ్‌కు వెళ్లడం దలైలామాకు కొత్తగాదు. ఇప్పటికి అరడజనుసార్లు ఆయన పర్యటించారు. అప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడెందు కొచ్చాయో... గతానికీ, ఇప్పటికీ అది గమనించిన తేడా ఏమిటో చైనా చెప్పాలి. ఆ సంగతి వదిలిపెట్టి అది హెచ్చరికలకు దిగుతున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. 1962లో చైనాతో యుద్ధం వచ్చాక ఆ దేశంతో మన సంబంధాలు అంతంత మాత్రమే. జనతా పార్టీ హయాంలో అప్పటి విదేశాంగమంత్రి వాజపేయి చొరవ కారణంగా ఆ స్థితి మారింది. ఇరు దేశాల నేతలూ పరస్పరం పర్యటించడం మొద లైంది. 1988 తర్వాత అవి మరింత పెరిగాయి. ఇరుదేశాల మధ్యా శిఖరాగ్ర సమావేశాలు జరిగాయి. ద్వైపాక్షిక ఒప్పందాలు కుదిరాయి. సరిహద్దు వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తూనే పారిశ్రామిక, వాణిజ్య రంగాల్లో సహకరించుకుందామని కూడా ఇరుదేశాలూ నిర్ణయించుకున్నాయి. ఇవన్నీ కొనసాగుతుండగా చైనా అప్పుడప్పుడు సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు దిగుతూనే ఉంది. అరుణాచల్‌ప్రదేశ్ ప్రాంతం విషయంలో ఇరు దేశాల మధ్యా భిన్నాభిప్రాయాలున్న మాట నిజమే. తమ భూభాగం సుమారు 90,000 చదరపు కిలోమీటర్లు భారత్ స్వాధీనంలో ఉన్నదని చైనా ఆరోపిస్తుండగా... 38,000 చద రపు కిలోమీటర్ల ప్రాంతం చైనా దురాక్రమించిందన్నది మన వాదన. పరస్పర చర్చల ద్వారా ఈ వివాదాన్ని పరిష్కరించుకుందామని, ఈలోగా యథాతథ స్థితిని కొనసాగిద్దామని రెండు దేశాలూ ఎన్నడో అవగాహనకొచ్చాయి. అయినా అప్పుడప్పుడు సరిహద్దుల్లో గిల్లికజ్జాలు పెట్టుకోవడం చైనా మానుకోలేదు. ఏదో పొర పాటున మన గగనతలంలోకి వచ్చినట్టుగా చైనా హెలికాప్టర్లు, విమానాలు అరుణాచల్ ప్రాంతంలోకి చొచ్చుకురావడం రివాజు. అప్పుడప్పుడు చైనా సైన్యం కూడా మన భూభాగంలోకి ఏదో పని ఉన్నట్టు జొరబడుతుంటాయి. అరుణాచల్‌కు మన ప్రధానులు వెళ్లినప్పుడల్లా ‘వివాదాస్పద ప్రాంతం’లోకి ఎందుకెళ్తున్నారని నిరసన వ్యక్తం చేయడం, అసంతృప్తిని, అభ్యంతరాన్ని వ్యక్తం చేయడం చైనాకు అలవాటు. కానీ ఈసారి మాటలు మీరింది. సరిహద్దుల్లో ‘అవసరమైన’ చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరిస్తోంది. చైనా ఇలా గొంతు పెంచడంలోని మర్మం ఏమిటి? భారత్‌తో స్నేహానికి ప్రాధా న్యమిస్తున్నామంటూనే దౌత్య సంప్రదాయానికి భిన్నమైన రీతిలో స్పందించడానికి, తన మీడియా ద్వారా బెదిరింపు ధోరణులను ప్రదర్శించడానికి కారణమేమిటి? దక్షిణ చైనా సముద్రం వివాదంలో మనం అమెరికా వాదనకు సన్నిహితమవు తున్నామన్న అభిప్రాయం చైనాకు ఎప్పటినుంచో ఉంది. ప్రస్తుతం చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ అమెరికాలో పర్యటిస్తున్నారు. ట్రంప్ వచ్చాక ఆ రెండు దేశాల మధ్యా సంబంధాలు ఏమంత సజావుగా లేవు. వాణిజ్య రంగంలో ఇరు దేశాలూ పరస్పరం కలహించుకుంటున్నాయి. దౌత్య మర్యాదల్లో భాగంగా జిన్‌పింగ్‌కు ట్రంప్ ఇవ్వా ల్సిన విందు కార్యక్రమం లేదు. ఇరు దేశాలమధ్యా ఉద్రిక్తతలు ఏర్పడితే మన అడు గులు ఎటువైపు ఉంటాయో అంచనా వేసుకోవడం వల్లనే చైనా అతిగా స్పందించి ఉండొచ్చు. వాస్తవానికి భారత్–చైనాల మధ్య వాణిజ్యం సంబంధాలు బాగానే ఉన్నాయి. నిరుడు అది 6,500 కోట్ల డాలర్లకు చేరుకుంది. ఇది రాగలకాలంలో 10,000 కోట్ల డాలర్లకు పెంచాలన్నది లక్ష్యం. అంటే చైనా ఆర్థిక వ్యవస్థ కళకళలాడటంలో మన వంతు భాగం కూడా ఉంది. అటు పాకిస్తాన్‌తో ఆ దేశం చేసే వాణిజ్యం దాదాపు 1,100 కోట్ల డాలర్లు. అయినా చైనా ఆ దేశానికి అధిక ప్రాధాన్యమిస్తున్నది. పాకిస్తాన్ భూభాగం మీదుగా చైనా నిర్మించబోయే ఆర్థిక కారిడార్‌లో ఆక్రమిత కశ్మీర్ ప్రాంతంలోని గిల్గిత్, బాలిస్తాన్లున్నాయని మన దేశం చెప్పిన అభ్యంతరాలను అది బేఖాతరు చేసింది. బ్రెగ్జిట్ అనంతర పరిణామాల నేపథ్యంలో యూరప్ యూనియన్ అనిశ్చితిలో పడటం, విశాల పసిఫిక్ భాగస్వామ్య ఒప్పందం(టీపీపీ) నుంచి అమెరికా వైదొలగుతున్నట్టు ప్రకటించడం లాంటి పరిణామాలతో ఆస్ట్రేలియా, బ్రూనే, కెనడా, మలేసియా, సింగపూర్ వంటి దేశాలు చైనా వైపు చూడటం మొదలుపెట్టాయి. సహజంగానే ఈ పరిణామాలన్నీ తనకు అనుకూలంగా మారతాయని... ఆసియా ప్రాంతంలోనూ, ప్రపంచ వేదికల్లోనూ తన పలుకుబడి పెరుగుతుందని ఆ దేశం అంచనా వేస్తోంది. అందుకే కయ్యానికి కాలు దువ్వే రీతిలో చైనా ప్రకటనలున్నాయని భావించవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో అరుణాచల్ విషయంలో మన వైఖరిని దృఢంగా చెబుతూనే సరిహద్దు సమస్యకు సామరస్యపూర్వక పరిష్కారానికే కట్టుబడి ఉన్నామని చాటవలసిన అవసరం ఉంది. -
నాగార్జున కొండను సందర్శించిన శ్రీలంక బౌద్ధులు
గుంటూరు: శ్రీలంకకి చెందిన 48మంది, కాశ్మీర్‌లోని లడాక్‌కు చెందిన 8మంది బౌద్ధుల బృందం నాగార్జునకొండను శనివారం సందర్శించింది. వీరు కొండపై ఉన్న మ్యూజియంలోని పురాతన శిలాఫలకాలను, లోహపు పాత్రలను, బుద్ధుని కాలం నాటి పాలరాతి విగ్రహాన్ని ఆసక్తిగా తిలకించారు. వివిధ విభాగాల్లోని మ్యూజియంలో రాతిబండలపై చెక్కి ఉన్న కళారూపాలను ఆసక్తిగా వీక్షించారు. కొండపై దలైలామా నాటిన బోధి మొక్క వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత పునర్నిర్మిత మహాస్థూపం, స్నానఘట్టం, ఆశ్వమేధ యజ్ఞశాలను చూశారు. -
టిబెటన్ల పయనం ఎటువైపు?
దలైలామా ఒకవైపు చైనా ఆధిపత్యంలోనే ఉండాలనుకుంటున్నట్టు చెబుతున్నారు. మరోవైపు కమ్యూనిస్టు పార్టీని తప్పు పడుతున్నారు. చైనా ప్రభుత్వం-చైనా కమ్యూనిస్టుపార్టీ వేర్వేరు కాదు. అందుకే దలైలామా పోకడ టిబెట్ స్వాతంత్య్ర పోరాటయోధులకు మింగుడుపడదు. టిబెట్ ఆధ్యాత్మిక గురుపీఠం తన తరువాత ఒక మహిళకు దక్కే అవకాశం ఉందని పద్నాలుగో దలైలామా ఆ మధ్య ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. డెబ్భై ఎనిమిదేళ్ల దలైలామా ఈ ఫిబ్రవరి రెండున మన గౌహతిలో చేసిన ప్రకటన ప్రపంచం చేత, ముఖ్యంగా భారత్ చేత కనుబొమలు ముడివేయించేదే. చైనా నుంచి టిబెట్ స్వాతంత్య్రాన్ని కోరుకోవడం లేదన్నదే ఆ ప్రకటన సారాంశం. చైనా నుంచి టిబెట్‌కు రాజకీయ స్వాతంత్య్రం కావా లంటూ ప్రవాసం నుంచి, టిబెట్‌లోనూ పోరాడుతున్న వారికి ఈ ప్రకటన బాధ కలిగించక మానదు. 1950లో ఆధ్యాత్మిక గురుపీఠం అధిరోహించిన నాటి నుంచి దలైలామా సంపూర్ణ స్వాతంత్య్రం కోసం జరుగుతున్న ఉద్యమాన్ని సమర్ధించడంలేదు. అయినా చైనాకు వ్యతిరేకంగా టిబెల్‌లో పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతూనే ఉంది. ఈ ప్రకటనతో పాటు అహిం సా విధానం గురించి దలైలామా చేసిన వ్యా ఖ్య కూడా ప్రశ్నలు రేకెత్తించేదిగా ఉంది. ‘వ్యక్తి,శాంతి- మానవాళి దృష్టి’ అన్న అంశంపై ఏర్పాటైన గోష్టిలో ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా ఆధిపత్యం నుంచి స్వాతంత్య్రం కోరుకోవడంలేదని దలైలామా చెప్పినా, కమ్యూనిస్టు పార్టీని మాత్రం ఆయన విడిచి పెట్టలేదు. చైనా కమ్యూనిస్టు పార్టీలోని కొం దరు అతివాదుల వల్ల టిబెట్ సంస్కృతికి తీవ్ర నష్టం జరుగుతోందనీ, వాళ్ల వల్ల బౌద్ధం పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నదనీ కూడా ఆరోపించారు. దలైలామా ఒకవైపు చైనా ఆధిపత్యంలోనే ఉండాలనుకుంటున్న ట్టు చెబుతున్నారు. మరోవైపు కమ్యూనిస్టు పార్టీని తప్పు పడుతున్నారు. చైనా ప్రభుత్వం - చైనా కమ్యూనిస్టుపార్టీ వేర్వేరు కాదు. అందుకే దలైలామా పోక డ టిబెట్ స్వాతంత్య్ర పోరాటయోధులకు మింగుడుపడదు. మూడురోజుల తరువాత ధర్మశాలలోని టిబెట్ ప్రవాస ప్రభుత్వ ప్రధా ని డాక్టర్ లోబ్సంగ్ సాంగే దలైలామా ప్రకట నను సమర్ధించారు కూడా. చైనా నుంచి వేరు కావాలని టిబెట్ భావించడం లేదని, భవిష్యత్తులో తగిన రీతిలో స్వయం ప్రతిపత్తి ఇవ్వడానికి చైనా సుముఖంగా ఉంటే చర్చల ప్రక్రియ ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చునని కూడా లోబ్సంగ్ అభిప్రాయపడ్డారు. తమ దేశం చైనా నీడలోనే ఉండాలని టిబెటన్లందరూ భావిస్తున్నారా? జరిగిన, జరుగుతున్న పరిణామాలను బట్టి చైనా ఆధిపత్యంలోనే మనుగడ సాగించడానికి ఆ హిమాలయ రాజ్యవాసులు ఇప్పటికీ సిద్ధంగా లేరనే చెప్పాలి. 2002 నుంచి దలైలామా ప్రతినిధులకీ, చైనా ప్రభుత్వ ప్రతినిధులకీ మధ్య తొమ్మిది దఫాలు చర్చలు జరిగా యి. కానీ 2012లో దలైలామా ప్రతినిధులంతా రాజీనామాలు చేశారు. టిబెట్‌లో పరిస్థితులు తీవ్రరూపం దాల్చడం, చైనా నుంచి సానుకూల స్పందన లేకపోవడమే ఇందుకు కారణం. చర్చలు సఫల మైతే దలైలామా టిబెట్‌లో తిరిగి ప్రవేశిస్తారని ప్రధాని లోబ్సంగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. మంచిదే. కానీ పరిస్థితులు ఇందుకు అనుకూలిస్తాయా అన్నదే ప్రశ్న. టిబెట్ చైనా అంతర్భాగమని వాదించేవారు, చైనాది దురాక్రమణ అని చెప్పేవారు సమానంగా ఉంటారు. దలైలామా తిరిగి టిబెట్ రావాలనీ, దేశానికి స్వాతంత్య్రం కావాలని 2009లో 124 మంది టిబెటన్లు ఆత్మాహుతికి పాల్పడ్డారు. అక్కడి చైనా ఆధిపత్యంలో దుర్లభంగా మారిన పౌరహక్కుల గురించి కూడా ఎన్నో విమర్శలు ఉన్నాయి. నిజానికి ఇప్పుడు చైనా ఆధిపత్యంలోనే టిబెట్ ఉన్నా, ఒకప్పుడు రష్యా, 1950 దశకంలో సీఐయే కూడా ఆ చిన్న రాజ్యంలో చక్రం తిప్పడానికి తమ వంతు ప్రయత్నాలు చేశాయి. టిబెట్‌లోని ఖంపా ప్రాంతంలో 1956 ప్రాంతంలో తిరుగుబాట్లు జరిగినపుడు సీఐయే ప్రవేశించిందని సాక్షాత్తు దలైలామాయే ఒకసారి ప్రకటించారు. అయి తే అది టిబెటన్ల మీద ప్రేమతో కాదనీ, చైనా విస్తరణ, కమ్యూనిస్టు వ్యతిరేకతతోనే అమెరికా రంగ ప్రవేశం చేసిందని వాస్తవం చెప్పా రు. 1959లో కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకుంటున్న టిబెన్ల మీద జన చైనా సైన్యం దాడి చేసినపుడు పద్నాలుగో దలైలామా భారతదేశానికి వలస వచ్చారు. అందుకు ఆయనకు సీఐయే సహాయం చేసింది. నిక్సన్ వచ్చి న తరువాత చైనాతో అమెరికా విదేశాంగ విధానంలో మార్పులు వచ్చాయి. టిబెట్‌పై బిగించిన తన పట్టును సడలించకుండా కొనసాగించేందుకు యాభై ఏళ్ల క్రితం కంటె ఇప్పుడు చైనాకు మరిన్ని అనుకూల పరిస్థితులు ఉన్నాయి. చైనా ప్రపంచం లో బలీయ శక్తి. చైనా సృష్టిస్తున్న సమస్యలతో భారత్ పడుతున్న తిప్పలు అన్నీ ఇన్నీ కావు. ఈ అంశాలు ఎంతో శక్తిమంతమైనవే అయి నా, వాటితోనే దలైలామా పూర్తిగా చైనా వైపు మొగ్గుతున్నారని అనుకోలేం. కానీ టిబెట్ డ్రాగన్ నాలుకకు అందితే, రెండు పెద్ద దేశాల మధ్య ఉన్న బఫర్ స్టేట్ అంతర్థానమవుతుంది. అప్పుడు రష్యా నుంచో, అమెరికా నుంచో ప్రమాదం ఉండదు. కానీ డ్రాగన్‌తో పేచీ అనివార్యం. ‘ఆసియాలోని రెండు దిగ్గజాలు (చైనా, భారత్) ఏదో ఒకరోజు డీకొనే పరిస్థితి వస్తుంది’ అని ప్రథమ ప్రధాని నెహ్రూ చెప్పేవారు. టిబెట్‌లో పెద్ద పరిణామాలు చోటు చేసుకుంటున్న ప్రతి పర్యాయం నెహ్రూ వ్యాఖ్య గుర్తుకు వస్తూనే ఉంటుంది. డా. గోపరాజు నారాయణరావు