తెగల మధ్య ఆరని సెగ | Nagaland killings: Five of nine dead identified as Karbi tribals | Sakshi
Sakshi News home page

తెగల మధ్య ఆరని సెగ

Published Sat, Jan 11 2014 5:58 AM | Last Updated on Sat, Sep 2 2017 2:29 AM

తెగల మధ్య ఆరని సెగ

తెగల మధ్య ఆరని సెగ

1953 నుంచి ఈశాన్య భారతం ఉద్యమాలతో మండుతూనే ఉంది. ఆ ఏడు జిల్లాలలో కనిపించే అన్ని రకాల తెగల వారు ఈ ప్రాంతంలో ఉన్నారు. దీనితో మొత్తం ఈశాన్య భారతం వేడి ఈ కొండ మీద కేంద్రీకరించి ఉంటుంది.
 
 వేర్పాటువాదం, తెగల మధ్య రక్తపాతం ఈశాన్య భారతానికి కొత్త కాదు. దూరంగా విసిరేసినట్టు ఉండే ‘సెవెన్ సిస్టర్స్’ వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైనప్పటికీ ఢిల్లీ పాలకులు అక్కడి వ్యవహారాల పట్ల చూపవలసిన శ్రద్ధ ఎప్పుడూ చూపించలేదు. మొన్న డిసెంబర్ 27 నుంచి అసోం-నాగాలాండ్ సరిహద్దులలోని కర్బీ అంగ్లాంగ్ కొం డలలో సాగుతున్న హింస దేశం దృష్టిని ఆకర్షించింది. ఈ హింసాకాండలో ఇంతవరకు 20 మంది గిరిజనులు చని పోయారు. కనిపిస్తే కాల్చివేతకు ఆదేశించారు. 3 వేలకు పైగా ప్రజలు ప్రత్యేక శిబిరాలకు చేరుకున్నారు.
 
 డిసెంబర్ 27న తాజా ఘర్షణలు మొదలయ్యాయి. పదిహేను మంది కర్బీ పీపుల్స్ లిబరేషన్ టైగర్స్ (కేపీఎల్‌టీ) ఉగ్రవాదులు ఖొవానిగావ్ అనే గ్రామం మీద దాడి చేయగా ముగ్గురు ఉగ్రవాదులు సహా, ఏడుగురు చనిపోయారు. తరువాత గృహదహనాలు జరిగాయి. ఈ గ్రామం లో నాగా రెంగ్మా తెగ ప్రజలు ఎక్కువ. ఇది కేపీఎల్‌టీ దళాలకూ, నాగా రెంగ్మాహిల్స్ ప్రొటెక్షన్ ఫోర్సుకూ మధ్య ఘర్షణ అని పోలీసులు చెబుతున్నారు.
 
 కేపీఎల్‌టీ గెరి ల్లాలు దాడికి దిగిన తరువాత, నాగా రెంగ్మా ఫోర్సు ప్రతిచర్యకు దిగింది. అప్పటి నుంచి ఆ కొండ ప్రాంతమంతా ఉద్రిక్తంగా మారిపోయింది. ఈ నెల ఆరున నాగాలాండ్‌లోని దిమాపూర్ దగ్గర తొమ్మిది శవాలు బయటపడడంతో ఆ ఉద్రిక్తతలు మరింత తీవ్రమైనాయి. ఇందులో ఒకటి కర్బీ విద్యార్థి సంఘం నాయకుడి శవం. డిసెంబర్ 27 నాటి ఘర్షణల తరువాత అపహరణకు గురైన యువకుడు ఇతడేనని పోలీసులు గుర్తించారు. మిగిలిన మృతులు కూలీలు. అంతా కర్బీ తెగ వారే. చేతులు వెనక్కి బిగించి, గంతలు కట్టి, దగ్గర నుంచి తుపాకీతో కాల్చారు. అసలే మండుతున్న పరిస్థితికి ఇది ఆజ్యం పోసింది. ఈ హింస ప్రతిహింసలలో మొత్తం ఇరవై మంది బలయ్యారు.
 
 కేపీఎల్‌టీ ప్రత్యేక రాష్ట్రం నినాదంతో పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ. కర్బీ అంగ్లాంగ్, దిమా హసావా గిరిజన జిల్లాలతో కర్బీ తెగ కోసం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలంటూ 2010 నుంచి ఇది ఉద్యమిస్తున్నది. నాగా రెంగ్మా హిల్స్ ప్రొటెక్షన్ ఫోర్సు 2012లో ప్రారంభమైంది. కేపీఎల్‌టీ దాడుల నుంచి నాగా రెంగ్మాలను రక్షించడమే దీని ధ్యేయం. దీనితో పాటు కర్బీ అంగ్లాంగ్‌లోనే రెంగ్మా నాగా తెగ వారి కోసం ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేయాలని కూడా కోరుతోంది. కర్బీ అంగ్లాం గ్, దిమా హసావా జిల్లాలలో పట్టుసాధించి, అక్కడ ఉన్న నాగా రెంగ్మా ప్రజల మద్దతు సాధించాలని నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలిమ్ (ఐజాక్ ముయివా) ఎప్పటి నుంచో చేస్తున్న ప్రయత్నాలను సాగనివ్వరాదన్న ఉద్దేశంతోనే కేపీఎల్‌టీ ఈ దాడులు చేసిందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. అంటే కేపీఎల్‌టీ, నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలిమ్ (ఐజాక్ ముయివా) ఆధిపత్య పోరులో నాగా రెంగ్మాలు నలిగిపోతున్నారు.
 
 కర్బీ అంగ్లాంగ్ అలజడికి ఉన్న భూమిక విస్తృతమైనది. 1953 నుంచి ఈశాన్య భారతం ఉద్యమాలతో మం డుతూనే ఉంది. ఆ ఏడు జిల్లాలలో కనిపించే అన్ని రకాల తెగల వారు ఈ ప్రాంతంలో ఉన్నారు. దీనితో మొత్తం ఈశాన్య భారతం వేడి ఈ కొండ మీద కేంద్రీకరించి ఉంటుంది. బ్రిటిష్ కాలంలో కర్బీ అంగ్లాంగ్ కొండలను మికిర్ హిల్స్ అనేవారు. మికిర్లు అంటే కర్బీలే. ఉత్తర కచార్ జిల్లాతో పాటు, కర్బీ అంగ్లాంగ్ చారిత్రక, సాంస్కృతిక పరిస్థితులు కూడా ప్రత్యేకమైనవి. ఇక్కడ కర్బీ తెగవారే ఎక్కువ. ఇంకా దిమాసా, జెమే నాగా, కుకీ, హమర్, లుషాయి, రంగ్‌ఖోల్, ఖాసీ, జైంతియా, బోడో, తివా తెగల వారూ ఉన్నారు. ఈ తెగలన్నీ ఈశాన్య భారత రాష్ట్రాలంతటా కనిపిస్తాయి. వీరందరి ప్రధాన పోరాటం బెంగాల్ నుంచి వలస వచ్చిన వారి మీదే. ఆయా తెగల మధ్య ఉన్న విభేదాలు ఇక్కడ కూడా ప్రతిఫలిస్తూ ఉంటాయి.
 
 అన్ని తెగలలోనూ గెరిల్లా ఉద్యమాలు ఉన్నాయి. అందుకే కర్బీ అంగ్లాంగ్ జిల్లాకు ఎంతో ప్రత్యేకత ఉంది. చొరబాటుదారుల సమస్యతో పాటు, నీటి సమస్య కూడా వీరి మధ్య చిచ్చురేపింది. ఆధిపత్యం కోసం వివిధ వర్గాలు చేసిన ప్రయత్నాలు హింసకు దారి తీస్తున్నాయి. 2003లో కుకీలకు చెందిన కుకీ రివల్యూషనరీ ఆర్మీకీ, యునెటైడ్ పీపుల్స్ డెమాక్రటిక్ సాలిడారిటీ (దీని నుంచి విడవడిన ముక్కే కేపీఎల్‌టీ) మధ్య ఘర్షణలు జరిగి యాభయ్ మంది వరకు చనిపోయారు. సింఘ్సన్ కొండలలో జరిగిన ఈ రక్తపాతానికి కారణం, ఎరువులతో అల్లం పంట పండించడాన్ని సాలిడారిటీ సంస్థ ‘పర్యావరణ పరిరక్షణ’ కోసం నిషేధించింది. ఈ రకం సేద్యం కుకీలు చేసేవారు. ఈశాన్యంలో వేర్పాటువాద హింసకు తోడు ఆధిపత్యం కోసం సాగే హింస కూడా ఉంది.
 - డా॥గోపరాజు నారాయణరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement