చపాతీ వెజ్ రోల్స్
కావలసినవి: చపాతీలు – 4, క్యాప్సికమ్ – 2, టమాటోలు –2, బంగాళదుంపలు – 2(మెత్తగా ఉడికించి ముక్కలుగా కట్ చేసుకోవాలి), పచ్చి బటానీలు – 2 టేబుల్ స్పూన్లు(నానబెట్టి, ఉడికించుకోవాలి), ఉల్లిపాయ – 2(ముక్కలు కట్ చేసుకోవాలి), పచ్చిమిర్చి – 3(ముక్కలు కట్ చేసుకోవాలి), మిరియాల పొడి – 1 టీ స్పూన్, జీలకర్ర పొడి – 1 టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, టమాటో కెచప్ – 1 టీ స్పూన్, ఉప్పు – సరిపడా, నూనె – తగినంత
తయారీ: కళాయిలో నూనె వేసి వేడెక్కాక తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత క్యాప్సికమ్, టమాటోలను సన్నగా తరిగి వాటిని కూడా వేయించాలి. తర్వాత బంగాళదుంప ముక్కలు, బటానీలు వేసుకుని కూరలా చేసుకోవాలి. అవసరం అనిపిస్తే కాస్త నీళ్లు పోసి ఉడికించాలి. దించడానికి కొన్ని నిమిషాల ముందు జీలకర్ర పొడి, ఉప్పు, టమాటా కెచప్ వేసి ఉడికించాలి. అనంతరం చపాతీలను పెనంపై ఇరువైపులా కాల్చి.. కర్రీ వేడిగా ఉన్నప్పుడే చపాతీపై ఒకవైపు వేసుకుని రోల్స్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి.
డేట్స్ హల్వా
కావలసినవి: ఖర్జూరం – 2 కప్పులు(గింజలు తొలగించి, శుభ్రం చేసుకోవాలి), నెయ్యి – 1 కప్పు, మొక్కజొన్న పిండి – 2 టేబుల్ స్పూన్లు(1 కప్పు నీళ్లలో బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి), నీళ్లు – సరిపడినన్ని, నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు – 10(ముక్కలు కట్ చేసుకుని నేతిలో దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి), ఏలకుల పొడి – పావు టీ స్పూన్
తయారీ: ముందుగా ఖర్జూరంలో ఒక కప్పు వేడి నీళ్లు వేసుకుని 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత మిక్సీ పెట్టుకుని మెత్తటి పేస్ట్‌లా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని.. ఆ మిశ్రమాన్ని మొత్తం బౌల్లో వేసుకుని, అందులో పావు కప్పు నెయ్యి వేసుకుని గరిటెతో తిప్పుతూ చిన్న మంటపైన ఉడికించుకోవాలి. దగ్గర పడేసరికి మళ్లీ 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని తిప్పుతూ ఉండాలి. తర్వాత మొక్కజొన్న మిశ్రమాన్ని వేసుకుని తిప్పుతూ ఉండాలి. మళ్లీ 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుని, వేయించి పక్కన నెట్టుకున్న జీడిపప్పు ముక్కలు, ఏలకుల పొడి వేసుకుని బాగా దగ్గర
పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని.. ఒక బౌల్‌లోకి తీసుకుని 30 నిమిషాలు చల్లారిన తర్వాత నచ్చిన షేప్‌లో కట్ చేసుకుంటే సరిపోతుంది.
బ్రింజాల్ రోల్స్
కావలసినవి: వంకాయలు (బ్రింజాల్) – 3 లేదా 4 (పొడవైనవి), ఆలివ్ నూనె – 2 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి – అర టీ స్పూన్, నీళ్లు – 2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం – 4 టేబుల్ స్పూన్లు, ఉడికించిన బియ్యం రవ్వ – ముప్పావు కప్పు, అవకాడో – 1, నూనె – డీప్ ప్రైకి సరిపడా, టమాటా ముక్కలు – పావు కప్పు, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు, ఉల్లికాడ ముక్కలు – 2 టేబుల్ స్పూన్లు, బీట్ రూట్ తురుము – 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర తరుగు – 2 టీ స్పూన్లు, పుదీనా తరుగు – 1 టేబుల్ స్పూన్లు, క్యారెట్ – 3, వేరుశనగలు – పావు కప్పు (రవ్వలా మిక్సీ పట్టుకోవాలి), ఉప్పు – తగినంత
తయారీ: ముందుగా వంకాయలను శుభ్రం చేసుకుని, కాడలు తొలగించి పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో ఆలీవ్ నూనె, ఉప్పు, మిరియాల పొడి, రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం, నీళ్లు వేసుకుని బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. అనంతరం ఓ పాన్‌లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని వేడి కాగానే వేరుశనగ రవ్వ, బీట్‌రూట్ తురుము, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఉల్లికాడ ముక్కలు, పుదీనా తరుగు, కొత్తిమీర తరుగు, జీలకర్ర పొడి ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ గరిటెతో తిప్పుతూ దోరగా వేయించుకోవాలి.
ఇప్పుడు అందులో ఉడికించిన బియ్యం రవ్వను కూడా వేసుకుని గరిటెతో తిప్పుతూ ఉండాలి. అందులో ఆలివ్ మిశ్రమం కూడా వేసుకుని, చివరిగా సరిపడా ఉప్పు వేసుకుని, బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత మెత్తగా ఉడికిన వంకాయలను పొడవుగా (థిన్ స్లైస్‌లా) కట్ చేసుకుని, నూనెలో దోరగా వేయించుకుని, అందులో కొద్దికొద్దిగా ఈ మిశ్రమాన్ని ఉంచుతూ రోల్స్‌లా చుట్టుకుని కొత్తిమీర లేదా పుదీనాతో గార్నిష్ చేసుకుని, టమాటా సాస్‌తో సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి.
సేకరణ: సంహిత నిమ్మ
Comments
Please login to add a commentAdd a comment