సుందరశాస్త్రి సత్యమూర్తి
తమిళ రాజకీయాలకి దేశంలోనే ఓ ప్రత్యేకత ఉంది. అది– రాజకీయాలకీ, సినిమా రంగానికీ మధ్య అవినాభావ సంబంధం. గడచిన ఐదు దశాబ్దాల తమిళనాడు చరిత్రలో ఒకటి రెండు సందర్భాలలో తప్ప సినీ రంగం నుంచి వచ్చినవారే ప్రధానంగా ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. ద్రవిడ పార్టీలు, వాటి నాయకులు దాదాపు అంతా సినీ కళాకారులు, రచయితలే. ఈ రకమైన సంస్కృతిని తరువాత కొన్ని పార్టీలు అలవరచుకున్నాయి కానీ, తమిళ రాజకీయాలను నేటికీ శాసిస్తున్న ఈ ధోరణికి ఆద్యుడు ఒక భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడు. ఆయనే సత్యమూర్తి.
రంగస్థల నటులు, గాయకుల సాయంతో ఆయన 1937లో జరిగిన ఎన్నికలలో తమిళనాడు అసెంబ్లీలో 215 స్థానాలకు 159 జాతీయ కాంగ్రెస్ ఖాతాలో వేయించగలిగారు. కళాకారుల సాయంతో సత్యమూర్తి సాధించిన విజయం చరిత్రాత్మకమైనది. ఎందుకంటే ఆయన నాయకత్వంలో ఆ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడించినది జస్టిస్ పార్టీని. నిజానికి సత్యమూర్తి తమిళనాట నటీనటులనీ, గాయకులనీ స్వాతంత్య్రోద్యమంలో భాగస్వాములను చేశారు. జాతీయ కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో వారు పాడినవన్నీ దేశభక్తి గీతాలే. అవన్నీ స్వాతంత్య్ర సాధన గురించి ప్రబోధించినవే.
సుందరశాస్త్రి సత్యమూర్తి (ఆగస్ట్ 19, 1887–మార్చి 28, 1943) పుదుక్కోటై సంస్థానంలో తిరుమయ్యమ్ అగ్రహారంలో జన్మించారు. పుదుక్కోటై మహారాజా కళాశాలలో చదివిన తరువాత, మద్రాస్ క్రైస్తవ కళాశాలలో చేరారు. ఆపై మద్రాస్ న్యాయ కళాశాలలో న్యాయశాస్త్రం చదివారు. 1916–1920 మధ్య మద్రాస్ ప్రెసిyð న్సీ అడ్వొకేట్ జనరల్‌గా పనిచేసిన ఎస్. శ్రీనివాస అయ్యంగార్ దగ్గర సహాయకునిగా పనిచేశారు. అయ్యంగార్ కూడా భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడే. గౌహతి కాంగ్రెస్ సభలకు అధ్యక్షత వహించిన ఉద్దండుడు కూడా. న్యాయశాస్త్రంలో మెలకువలు, జాతీయ స్పృహ కూడా ఆ సమయంలోనే సత్యమూర్తికి గురువు గారి దగ్గర నుంచి వరాలుగా వచ్చాయి.
సాధారణంగా రాజకీయవేత్తలలో, ఉద్యమ దిగ్గజాలలో కనిపించని అరుదైన లక్షణాలు సత్యమూర్తిలో మేళవించి ఉంటాయి. ఆయన విద్యార్థిగా ఎంతో ప్రతిభ చూపించారు. ఇది చాలామంది రాజకీయవేత్తలలో సహజమే. ఆంగ్లం, తమిళ భాషలలో నిష్ణాతుడు. ఆ రెండు భాషలలోనూ మహావక్త. ఇది కూడా రాజకీయనాయకులకి కొత్తకాదు. ఉద్యమంలో తలమునకలై ఉన్నా స్థానిక సమస్యల పరిష్కారానికి నిరంతరం పాటుపడడం ఒకటి కనిపిస్తుంది. కానీ కళల మీద ఆయన చూపించిన ఆసక్తి చిత్రంగా ఉంటుంది.సత్యమూర్తి రాజకీయ ప్రస్థానం విద్యార్థి సంఘ నాయకునిగా ఎన్నిక కావడంతో ఆరంభమైంది.
బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా తమిళనాడులో జరిగిన ఉద్యమంలో (1906) మూర్తి పాల్గొన్నారు. 1908లో మద్రాస్‌లో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశాలకు స్వచ్ఛంద సేవకునిగా హాజరయ్యారు. దీనితో చాలా చిన్న వయసులోనే ఆయన సామాజిక, రాజకీయ జీవితంలో ప్రవేశించినట్టయింది. శ్రీనివాస అయ్యంగార్ శిష్యరికంతో జాతీయ కాంగ్రెస్ దక్షిణాది నేతలలో ఒకరిగా గుర్తింపు పొందారు. పైగా గురువే రాజకీయాలలో ప్రవేశించమని చెప్పడంతో ద్విగుణీకృతోత్సాహంతో సత్యమూర్తి పనిచేశారు. 1919లో వచ్చిన రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా, ఆ తరువాత జరిగిన జలియన్‌వాలా బాగ్ దురంతానికి నిరసనగా దేశ వ్యాప్తంగా జరిగిన కార్యక్రమాలలో సత్యమూర్తి పాల్గొన్నారు.
అప్పుడే వచ్చిన మాంటేగ్ చేమ్స్‌ఫర్డ్ సంస్కరణల గురించి, రౌలట్ చట్టం గురించి సంయుక్త పార్లమెంటరీ కమిటీ (ఇంగ్లండ్) ఎదుట నిరసన వ్యక్తం చేయడానికి ఒక ప్రతినిధి బృందాన్ని పంపించాలని కాంగ్రెస్ నిశ్చయించింది. ఈ బృందంలో సత్యమూర్తి ఒకరు. అటు పార్లమెంటరీ కమిటీ ఎదుట వాదనలు వినిపిస్తూనే, మరొక క్లిష్టమైన పనిని కూడా సత్యమూర్తి చేశారు. సరిగ్గా అప్పుడే ‘ది హిందు’ పత్రిక ప్రతినిధి పదిరోజులు సెలవు పెట్టారు. ఆయన బాధ్యతలను సత్యమూర్తి స్వీకరించి, పత్రికా రచయిత అవతారం ఎత్తారు. అది అక్కడితో ఆగిపోలేదు. చాలా సందర్భాలలో ఆయన ‘ది హిందు’ పత్రికకు వ్యాసాలు రాసేవారు.
ఇంగ్లండ్‌లో చేసిన వాదనలను బట్టి, ఆయన వ్యక్తం చేసిన భావాలను బట్టి సత్యమూర్తి గొప్ప ఉదారవాద రాజకీయవేత్త అనిపిస్తారు. రాజ్యాంగ పరిధిలో, రాజ్యాంగబద్ధ విధానాలలో స్వరాజ్యం తెచ్చుకోవాలని ఆనాడు భావించిన ఉదారవాద నేతలలో ఆయన కూడా ప్రముఖంగా కనిపిస్తారు. నిజానికి విఎస్ శ్రీనివాసశాస్త్రి, తేజ్‌బహదూర్ సప్రూ వంటివారు ఈ వర్గానికి చెందుతారు. అందరికీ సమానావశాకాలు, మత సామరస్యం, సమానత్వం గురించి, ఈ ధోరణి స్వాతంత్య్రోద్యమంలో ప్రతిబింబించడానికి వీరు తమ వంతు కృషి చేశారు. అందుకే సంస్థల దృక్పథాలతో సరిపడనప్పడు నిస్సంకోచంగా విడిచిపెట్టేవారు.
సత్యమూర్తి హిందూధర్మంలోని కుల వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించారు కూడా. 1920 నుంచి గాంధీజీ భారతీయులు చట్టసభలను బహిష్కరించాలన్న అభిప్రాయంతో ఉండేవారు. 1919 భారత ప్రభుత్వ చట్ట ప్రకారం భారతీయులకు పరిమితంగానే అయినా ఆ అవకాశం బ్రిటిష్ వారు ఇచ్చారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నదే సత్యమూర్తి అభిప్రాయం. ఇటు ఉద్యమం, అటు చట్టసభలలో బలంగా వాణిని వినిపించడం రెండూ సమాంతరంగా జరగాలన్నదే సత్యమూర్తి వంటి వారి నిశ్చితాభిప్రాయంగా కనిపిస్తుంది. ఈ విషయంలో సత్యమూర్తి అనుభవం గాఢమైనది. మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ తొలి ఎన్నికలను కాంగ్రెస్ బహిష్కరించింది. జస్టిస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.
జస్టిస్ పార్టీ బ్రిటిష్ జాతీయుల తొత్తు. అంటే భారతీయులను తమ కన్ను తామే పొడుచుకునే వికృత క్రీడకు చట్టబద్ధత కల్పించారు. ఇందుకు అవకాశం గాంధీజీ వైఖరితోనే ఇంగ్లండ్‌కు వచ్చింది. అయినా సత్యమూర్తి కౌన్సిల్‌కు పోటీ చేశారు. అలా అని సత్యమూర్తి తిలక్ వలే సంపూర్ణ స్వాతంత్య్ర భావనను వ్యక్తం చేసినవారు కాదు. పాక్షిక స్వాతంత్య్రమే ఆయన లక్ష్యం. దీనినే డొమీనియన్ స్టేటస్ అనేవారు. 1925 వరకు కాంగ్రెస్‌లో ఈ ధోరణి బలంగానే ఉండేది. చట్టసభలకు దూరంగా ఉండాలన్న గాంధీజీ నిర్ణయాన్ని వ్యతిరేకించినట్టే, మొదటి ప్రపంచ యుద్ధంలో ఇంగ్లండ్‌ను సమర్ధించాలన్న అనీబిసెంట్ నిర్ణయంతో ఆమెతో కూడా సత్యమూర్తి విభేదించారు. ఆయన సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి (ఢిల్లీ)కి కూడా ఎన్నికయ్యారు.
ఉదారవాదుల వల్ల భారతదేశానికి జరిగిన గొప్ప మేలు– పార్లమెంటరీ విధానానికి పునాదులు పడ్డాయి. ఒక దశలో చిత్తరంజన్‌దాస్, మోతీలాల్ నాయకత్వంలో నడిచిన స్వరాజ్య పార్టీలో సత్యమూర్తి సభ్యునిగా ఉన్నారు. ఆ విధంగా గాంధీజీ వాదాన్నీ, ఉద్యమాన్నీ సత్యమూర్తి నిరాకరించారు. అప్పటికే గాంధీజీ ప్రభావం భారతదేశంలో విశేషంగా ఉంది. అందుకే ఆయనను ‘ధీర’ సత్యమూర్తి అని కూడా అంటూ ఉండేవారు. 1937 ఎన్నికలలో మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో కాంగ్రెస్‌కు ఆధిక్యం సంపాదించి పెట్టినవారు సత్యమూర్తి. అప్పటికి సి. రాజగోపాలాచారి, టంగుటూరి ప్రకాశం వంటివారు ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నారు.
కాంగ్రెస్ విజయం కోసం పాటు పడడానికి అనేక మంది కళాకారులు ముందుకు వచ్చారు. వీరిని సత్యమూర్తి సాదరంగా ఆహ్వానించారు. ‘మాకు పాడటమే తెలుసు. ఆ విధంగా కళ ద్వారా మేం కూడా జాతీయ కాంగ్రెస్ కోసం పనిచేస్తాం’ అని చెప్పారు వారు. ఎన్నో కాంగ్రెస్ ప్రచార సభలలో కళాకారులు పాల్గొన్నారు. అప్పుడు టీకేఎస్ సోదరుల నాటక బృందానికి చెందిన టీకే షణ్ముగం కళాకారులకు, కాంగ్రెస్‌కు మధ్య వారధిలా పనిచేశారు. ఎన్‌ఎస్ కృష్ణన్ అనే హాస్యనటుడు కూడా సత్యమూర్తి ప్రోద్బలంతో కాంగ్రెస్ కోసం శ్రమించారు. కేబీ సుందరంబాళ్ అనే గాయని, నటి ఉండేవారు. ఆమె భర్త కేజీ కిట్టప్ప, ఆయన అకాల మరణంతో విరక్తి చెంది కళలకు దూరంగా వెళ్లిపోయింది.
ఆమెను కూడా ఆ సమయంలో సత్యమూర్తి ఒప్పించి, నందనార్ చలనచిత్రంలో ఆమె కోసం వేచి ఉన్న పాత్ర ధరింపచేశారు. ఆ చలనచిత్రం ఇతివృత్తం పురాణమే అయినా, ఆ చిత్రం నిండా దేశభక్తి గీతాలు ఉన్నాయి. ఘన విజయం సాధించింది. ఇద కాంగ్రెస్‌కు ఎంతో ఉపయోగపడింది. కానీ కళాకారులతో కాంగ్రెస్ ప్రచార సభలు నిర్వహిచడం పార్టీకి నచ్చలేదు. అప్పుడు మద్రాస్ ప్రధానమంత్రి (ముఖ్యమంత్రి) రాజాజీ. ఆయన కూడా వ్యతిరేకించారు. కానీ సత్యమూర్తి ఆలోచనను అప్పటికి బలపడిన ద్రవిడ పార్టీలు సొంతం చేసుకున్నాయి. ద్రవిడ పార్టీల మాతృసంస్థ జస్టిస్ పార్టీయే. అంటే సత్యమూర్తిని నిలువెల్లా ద్వేషించిన సంస్థ కొమ్మలే ఆయన ఆలోచనను దివ్యంగా స్వీకరించాయి. సీఎన్ అన్నాదురై, కె. కరుణానిధి నాటి ద్రవిడ పార్టీలో ప్రముఖులు. ఆ ఇద్దరూ పేరుగాంచిన నాటకకర్తలే. రంగస్థల నటులు కూడా.
తరువాత సినీ రంగంలో ప్రవేశించారు. ద్రవిడ సిద్ధాంతాన్ని రాజ్యాధికారంగా మార్చేశారు (కళాకారుల అండతో ద్రవిడ పార్టీ సాధించిన విజయాన్ని చూసి కూడా కాంగ్రెస్ పార్టీ తన మంకు పట్టును వీడలేదు. రంగుపూసుకునే వాళ్లతో రాజకీయం ఏమిటన్నదే వారి వాదన. ఇది సత్యమూర్తి కన్నుమూసిన తరువాత కూడా కొనసాగింది. 1952 నాటి తొలి సాధారణ ఎన్నికలలో పైన పేర్కొన్న హాస్యనటుడు కృష్ణన్‌ను దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ ప్రోత్సహించి అభ్యర్థిత్వం ఇప్పించారు. కానీ రంగు పూసుకుని రోడ్ల మీద గంతులు వేసే వాళ్లు –కూతైడిగల్– చట్టసభలకు రానక్కరలేదు అని నాయకులు అన్నారు. మనస్తాపం చెందిన కృష్ణన్ అభ్యర్థిత్వం వదులుకున్నారు. తరువాత డీఎంకేలో ఆయన పనిచేశారు).
1939లో సత్యమూర్తి మద్రాస్ మేయర్‌గా ఎన్నికయ్యారు. అప్పటికి రెండో ప్రపంచ యుద్ధం ఆరంభమై కొద్దికాలమే అయింది. మద్రాస్ నగరానికి బాంబుల భయంతో పాటు, నీటి కటకట కూడా పట్టుకుంది. అలాంటి పరిస్థితిలో బ్రిటిష్ అధికారులను ఒప్పించి మద్రాస్‌కు యాభయ్ కిలోమీటర్ల దూరంలో పూండి రిజర్వాయిర్ నిర్మాణం కోసం పునాది రాయి వేయించారు. ఆ రోజులలో మేయర్ పదవీ కాలం సంవత్సరమే. అయినా ఇంత పెద్ద పథకానికి పదవి చేపట్టిన ఎనిమిది మాసాలలోనే పునాది రాయి వేయించారు. కానీ పూర్తయిన జలాశయం చూసేందుకు ఆయనకు అవకాశం లేకపోయింది. తరువాత దానికి సత్యమూర్తి జలాశయం అని పేరు పెట్టారు కూడా.
సత్యమూర్తిని మరొక కోణం నుంచి కూడా తమిళనాడు గుర్తుంచుకుంటుంది. మద్రాస్ మ్యూజిక్ అకాడెమీ వ్యవస్థాపకులు ఆయనే. అంతరించిపోయే దశకు చేరుకున్న భరతనాట్యానికి తిరిగి జీవం పోయడానికి ఇ. కృష్ణఅయ్యర్ నడుం కట్టినప్పుడు సత్యమూర్తి ఆయనకు అండదండలిచ్చారు. దీనిని పునరుద్ధరించేందుకు సహకరించి, 1935లో కా్రంగెస్ సభలు జరిగినప్పుడు అందులో ప్రదర్శన ఇప్పించారు. మద్రాస్ విశ్వవిద్యాలయం సెనేట్ సభ్యునిగా ఆయన ఎన్నో మంచి పనులు చేయించారు.
సత్యమూర్తి ఎన్నోసార్లు అరెస్టయ్యారు. 1930లో పార్థసార థి ఆలయం మీద జాతీయ పతాకాన్ని ఎగురవేసే యత్నంలో ఒకసారి అరెస్టయ్యారు. తరువాత 1942లో వ్యక్తి సత్యాగ్రహం చేసి కూడా అరెస్టయ్యారు. అప్పటికే ఆయన వెన్నుకు దెబ్బతో బాధపడుతున్నారు. ఆ స్థితిలో నాగపూర్‌లోని అమరావతి జైలులో ఉంచారు. పరిస్థితి విషమించడంతో మద్రాస్ తీసుకువచ్చి జనరల్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడే ఆయన కన్నుమూశారు. ‘ది హిందూ’ వ్యాఖ్యానించినట్టు సత్యమూర్తి ‘పుట్టుకతోనే స్వాతంత్య్ర సమరయోధుడు’.
- డా. గోపరాజు నారాయణరావు
Comments
Please login to add a commentAdd a comment