ముద్గలుడు సకల సద్గుణ సంపన్నుడు. కురుక్షేత్రంలో భార్య, కుమారుడితో కలసి ఉండేవాడు. ఏడాదిలోని మూడువందల అరవై రోజులూ ఏదో ఒక వ్రతదీక్షలోనే ఉండేవాడు. జపతపాలు చేసుకుంటూ, భిక్షాటనతో కుటుంబ పోషణ చేసుకునేవాడు. అతిథులను ప్రాణప్రదంగా ఆదరించేవాడు. కొన్నాళ్లకు ముద్గలుడు పక్షోపవాస దీక్ష చేపట్టాడు. ఉభయ పక్షాల్లోనూ పాడ్యమి నుంచి పద్నాలుగు రోజులు యాచన ద్వారా సంపాదించిన గింజలతో దైవపూజ, పితృపూజ చేసేవాడు. ఆ పద్నాలుగు రోజులూ ఉపవాసం ఉండేవాడు. ఉపవాస దీక్ష ముగించే ముందు శుక్లపక్షంలో పౌర్ణమినాడు, కృష్ణపక్షంలో అమావాస్యనాడు అతిథులకు భోజనం పెట్టేవాడు. మిగిలినది భార్యా కొడుకులతో కలసి తాను ప్రసాదంగా స్వీకరించేవాడు.
ముద్గలుడు ఇలా కాలం గడుపుతుండగా, ఒక పర్వదినం రోజున దుర్వాసుడు అతిథిగా వచ్చాడు. దుర్వాసుడు స్నానాదికాలు చేసి ఎన్నాళ్లో అయినట్లుగా అతి అసహ్యకరంగా ఉన్నాడు. జుట్టు విరబోసుకుని, మురికి కౌపీనంతో పిచ్చివాడిలా ఉన్నాడు. నకనకలాడే ఆకలితో సోలిపోతూ ఉన్నాడు. అతణ్ణి చూసి ముద్గలుడు ఏమాత్రం అసహ్యపడలేదు. సాదరంగా ఎదురేగి స్వాగతం పలికాడు. అర్ఘ్యపాద్యాలు ఇచ్చాడు. స్నానానికి ఏర్పాట్లు చేశాడు. భక్తిశ్రద్ధలతో భోజనం పెట్టాడు. దుర్వాసుడు తిన్నంత తిని, మిగిలినది ఒళ్లంతా పూసుకుని, మాటా పలుకూ లేకుండా తన దారిన తాను వెళ్లిపోయాడు.
ముద్గలుడి ఇంటికి ఇలా ఆరుసార్లు వచ్చాడు దుర్వాసుడు. వచ్చిన ప్రతిసారీ ఇదే తంతు. చక్కగా విస్తరివేసి భోజనం పెడితే, తిన్నంత తినడం, మిగిలినదంతా ఒంటికి పూసుకుని వెళ్లిపోవడమే! దుర్వాసుడి చేష్టలకు ముద్గలుడు ఏమాత్రం కోప్పడలేదు. పరుషంగా మాట్లాడటం కాదు కదా, కనీసం మందలించనైనా లేదు. దుర్వాసుడు వచ్చిన ప్రతిసారీ ముద్గలుడు అతణ్ణి అత్యంత భక్తిశ్రద్ధలతో ఏ లోపమూ లేకుండా సేవించుకున్నాడు. ముద్గలుడి సహనానికి, భక్తిశ్రద్ధలకు ముగ్ధుడైపోయాడు దుర్వాసుడు.
‘ముద్గలా! నీ తపస్సుకు, సహనానికి, శాంతానికి, ధర్మనిష్ఠకు నేను ముగ్ధుణ్ణయ్యాను. ఇంతటి తపశ్శక్తి ఏ లోకంలోనూ నేను చూడలేదు. నీవంటి తాపసులు ముల్లోకాల్లో ఎక్కడా ఉండరు. దేవతలు కూడా నీ తపశ్శక్తిని పొగుడుతున్నారు. నీకోసం దివ్యవిమానం ఇప్పుడే వస్తుంది. స్వశరీరంతో స్వర్గానికి వెళ్లి సుఖించు’ అని చెప్పి వెళ్లిపోయాడు. దుర్వాసుడు చెప్పినట్లుగానే ముద్గలుడి ముందు దివ్యవిమానం వచ్చి నిలిచింది. అందులోంచి ఒక దేవదూత దిగివచ్చి, ముద్గలుడికి వినమ్రంగా ప్రణమిల్లాడు. ‘మహర్షీ! అనన్యమైన నీ తపశ్శక్తి ఫలితంగా స్వశరీరంతో స్వర్గ ప్రవేశం చేసే అర్హత నీకు లభించింది. దయచెయ్యి. నాతో కలసి విమానాన్ని అధిరోహించు. నిన్ను స్వర్గానికి తీసుకుపోతాను’ అన్నాడు.
‘మహాత్మా! స్వర్గం అంటే ఏమిటి? అదెక్కడ ఉంటుంది? అక్కడి మంచిచెడ్డలేమిటి? నాకు తెలుసుకోవాలని ఉంది. కుతూహలం కొద్ది అడుగుతున్నానే గాని, నిన్ను పరీక్షించడానికి కాదు. కాబట్టి ఏమీ అనుకోకుండా నా సందేహ నివృత్తి చేయవలసినదిగా ప్రార్థిస్తున్నాను’ అన్నాడు ముద్గలుడు. ‘ఈ మర్త్యలోకానికి పైన చాలా దూరాన ఊర్ధ్వదిశలో ఉంది స్వర్గలోకం. సర్వకాల సర్వావస్థలలోనూ సర్వాలంకార భూషితమై, దివ్యకాంతులతో దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది. గొప్ప తపస్సంపన్నులు, యజ్ఞాలు చేసేవాళ్లు, సత్యనిష్ఠతో జీవితం గడిపినవాళ్లు, ధర్మాత్ములు, దానశీలురు, రణశూరులు, ఇంద్రియాలను జయించిన ఉత్తములు మాత్రమే స్వర్గార్హత సాధించగలరు.
అలాంటి వాళ్లు అక్కడ హాయిగా సర్వసుఖ వైభోగాలతో ఆనందంగా గడుపుతారు. స్వర్గంలో అందమైన అప్సరసలు, సిద్ధులు, సాధ్యులు, దేవర్షులు, మరుత్తులు, వసువులు ఎవరెవరి నెలవుల్లో వారు నివసిస్తూ ఉంటారు. స్వర్గంలో జరా వ్యాధి మరణాలేవీ ఉండవు. ఆకలి దప్పులుండవు. వేడీ చలీ ఉండవు. ఎటు చూసినా మనోహరంగా ఉంటుంది. ఇంద్రియాలన్నీ నిరంతరం ఆనందాన్ని ఆస్వాదిస్తూనే ఉంటాయి’ చెప్పాడు దేవదూత.
‘అయినా, స్వర్గం మంచిచెడులు అడిగావు కదూ! ఇప్పటివరకు స్వర్గంలోని మంచివిషయాలన్నీ ఏకరువు పెట్టాను. ఇక స్వర్గానికీ పరిమితులు ఉన్నాయి. అవి కూడా చెబుతాను విను. భూలోకంలో చేసిన పుణ్యఫలాన్నే మనుషులు స్వర్గంలో అనుభవిస్తారు. అక్కడ మళ్లీ పుణ్యం చేయడానికి అవకాశం ఉండదు. భూమ్మీద చేసిన పుణ్యం చెల్లిపోగానే, స్వర్గం నుంచి తరిమేస్తారు. మళ్లీ భూమ్మీద జన్మించవలసిందే!
అలవాటైన సుఖాలను వదులుకోవడం ఎంత కష్టంగా ఉంటుందో ఆలోచించుకో! పుణ్యం నశించిన మనిషి ఆ దుఃఖంతోనే మళ్లీ భూమ్మీద పుడతాడు. బ్రహ్మలోకం తప్ప మిగిలిన పుణ్యలోకాలన్నింటిలోనూ ఇదే తంతు. పుణ్యలోకాల నుంచి తిరిగి భూమ్మీదకు తరిమివేయడబడ్డ మనిషి సుఖవంతుడిగానే పుడతాడనుకో! ఎందుకంటే భూలోకం కర్మభూమి, మిగిలిన పుణ్యలోకాలన్నీ ఫలభూములు. ఇదీ సంగతి. మంచివాడివని ఏదో నీ మీద ఆదరంతో ఇవన్నీ నీతో చెప్పాను. ఇప్పటికే ఆలస్యమవుతోంది. ఇక దయచెయ్యి. స్వర్గానికి బయల్దేరుదాం’ అన్నాడు దేవదూత.
అంతా విని కాసేపు ఆలోచించాడు ముద్గలుడు. ‘అలాగైతే, ఆ స్వర్గం నాకొద్దు. ఏదో రమ్మని ఆదరంగా పిలిచావు. అదే పదివేలు అనుకుంటాను. ఆ స్వర్గసౌఖ్యాలేవో దేవతలకే ఉండనీ. జపతపాలు చేసుకునే నాకెందుకవన్నీ? వెళ్లు. నీ విమానం తీసుకుని వచ్చినదారినే బయలుదేరు. ఎక్కడికి వెళితే మనిషి మళ్లీ తిరిగి భూమ్మీదకు రాకుండా ఉంటాడో అలాంటి ఉత్తమలోకం కావాలి నాకు. అంతేగాని, పుణ్యఫలాన్ని కొలతవేసి, అంతమేరకు మాత్రమే దక్కే తాత్కాలిక స్వర్గమెందుకు నాకు? శాశ్వతమైన ఉత్తమలోకమే కావాలి నాకు. అలాంటిదానికోసమే ఎంత కష్టమైనా ప్రయత్నిస్తాను’ అన్నాడు ముద్గలుడు. దేవదూత ఎంత బతిమాలినా పట్టించుకోకుండా, అతణ్ణి సాగనంపాడు.
దేవదూతను సాగనంపిన తర్వాత ముద్గలుడు యాచకవృత్తిని కూడా వదిలేశాడు. పరమశాంత మార్గం అవలంబించాడు. నిందాస్తుతులకు చలించడం మానేశాడు. మట్టినీ బంగారాన్నీ ఒకేలా చూసేటంతగా ద్వంద్వాతీత స్థితికి చేరుకున్నాడు. పూర్తిగా తపస్సులోనే మునిగిపోయాడు. నిర్వికల్ప జ్ఞనాయోగంతో తుదకు మోక్షం పొందాడు.
- సాంఖ్యాయన
Comments
Please login to add a commentAdd a comment