సదాశివా...చంద్రమౌళి! | Scene ours and title is yours | Sakshi
Sakshi News home page

సదాశివా...చంద్రమౌళి!

Published Sun, May 12 2019 12:19 AM | Last Updated on Sun, May 12 2019 12:19 AM

Scene ours and title is yours - Sakshi

ఎన్టీ రామారావు, ఎస్వీ రంగారావు, దేవిక, రాజశ్రీ...నటించిన, ఆరుద్ర పాటలు, మాటలు రాసిన చిత్రంలోని కొన్ని దృశ్యాలు ఇవి. సినిమా పేరేమిటో చెప్పుకోండి చూద్దాం...

‘‘మహాదేవా...మహాదేవా! దక్షప్రజాపతి ఉగ్రనేత్రుడై వస్తున్నాడు. పాల ముంచినా నీట ముంచినా మీదే భారం స్వామి’’ అంటూ మహాశివుడి శరణుజొచ్చాడు చంద్రుడు.
‘‘భయపడకు చంద్రా’’ అంటూ అభయమిచ్చాడు శంకరుడు.
ఇంతలో దక్షప్రజాపతి పట్టలేనంత ఆవేశంగా అక్కడికి దూసుకు వచ్చాడు.
‘‘ఇదేనా నీ వాగ్దానం నిలుపుకునే తీరు! ముల్లోకాలలో నీ మాటకు తిరుగుండదని బాస చేసి నీచాతి నీచమైన చంద్రుడికి ఆశ్రయం ఇస్తావా!’’ అంటూ కోపంతో ఊగిపోతున్నాడు దక్షప్రజాపతి.
‘‘దక్షా! ఆవేశం చెందకు. జరిగింది సావధానంగా విను. కూర్చో’’ అన్నాడు శంకరుడు.
‘‘కూర్చోవడానికి రాలేదు. ముందు ఆ శాపగ్రస్తుడిని విడిచిపెట్టు’’ చంద్రుడిని ఉద్దేశించి అన్నాడు దక్షప్రజాపతి.
‘‘నువ్వు శాపం ఇచ్చిన సంగతి తెలియక చంద్రుడికి అభయం ఇచ్చాను. శరణు ఒసంగిన పిమ్మట విడిచిపెట్టడం సముచితం కాదు’’ చెప్పాడు శంకరుడు.
శంకరుని మాటలు దక్షుడి ఆవేశానికి ఆజ్యం పోశాయి.
‘‘అల్పునికి ఆశ్రయమిచ్చి నావంటి అధికుడికి ఇచ్చిన మాట తప్పడం సముచితమా?’’ అడిగాడు దక్షుడు.
‘‘ఆర్తత్రాణ పరాయణత్వంలో అల్పుడు, అధికుడు అనే తారతమ్యాలు పాటించడం పాడి కాదు’’ అన్నాడు శివుడు.
‘‘ప్రజాపతులలో ప్రముఖుడైన నన్ను పరాభవించడం పాడియా?’’ అడిగాడు దక్షుడు.
‘‘దక్షా! నువ్వు నా భక్తుడివి. నిన్ను పరాభవించెదనా?’’ అన్నాడు శాంతస్వరంతో శివుడు.
‘‘పరాభవం కాక ఇంకేమిటి! అభిమానవంతుడిని అలక్ష్యం చేసింది చాలక అవమానిస్తావా?’’ అంటూ రుసరుసలాడాడు దక్షుడు.
‘‘దక్షా! యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఆవేశంలో ఏదో మాట్లాడుతున్నావు. భక్తులు పొరపాటు చేసినప్పుడు దిద్దుట నా కర్తవ్యం. నీవు నీ కుమార్తెల భావి సౌభాగ్యాన్ని ఆలోచించకుండా నీ అల్లుడికి శాపం ఇచ్చావు. నేను చంద్రునికి అభయమిచ్చి, నీకు నీ కుమార్తెలకు ఉపకారమే చేశాను’’ అన్నాడు శివుడు.
‘‘నా కుమార్తెల గురించి నీవు చింతించాల్సిన అవసరం లేదులే’’ అని శివుడు చెప్పినదాన్ని తోసిపుచ్చుతూ...
‘‘శుష్కవాదాలతో కాలయాపన చేయక తక్షణం చంద్రుడిని విడిచి పెట్టు లేదా నా శక్తిని ప్రదర్శించక తప్పదు’’ అని శివుడికి హెచ్చరిక చేశాడు దక్షుడు.
‘‘దక్షా! అహంకారం అనర్థదాయకం సుమా!’’ హితవు చెప్పాడు శివుడు.
‘‘ఇది అహంకారం కాదు ఆత్మవిశ్వాసం. నా శక్తిసామర్థ్యాలతో చంద్రుడిని ఎలా శిక్షిస్తానో నీవే చూడు’’ అన్నాడు దక్షుడు.
‘‘నీ చేతనైతే ప్రయత్నించు’’ అని దక్షుడి మాటల్ని తేలిగ్గా తీసుకున్నాడు శివుడు.
‘‘శంకరా! మరోసారి హెచ్చరిస్తున్నాను. మర్యాదగా చంద్రుడిని విడిచిపెట్టు. లేదా నా గదాదండంతో నిన్ను ఖండఖండలుగా చండాడగలను’’ కన్నూమిన్నూ కానకుండా అన్నాడు దక్షుడు.
శివుడి కోపం ఆకాశాన్ని అంటింది.
‘‘మదాంధా! కండకావరంతో కళ్లు మూసుకుపోయి... నాపైనే గదాదండం ఎత్తెదవా! ఈ ఫాలాక్షుడి త్రిశూల ధాటికి గురికాక ముందే క్షమాపణ వేడుకో’’  ఆగ్రహంతో ఊగిపోతూ అన్నాడు శివుడు.
‘‘ఛీ...ఈ దక్షప్రజాపతి నీవంటి నీచుణ్ణి క్షమాభిక్ష కోరేంత నీచుడు కాదు. నిన్నే పాదాక్రాంతం చేసుకోగల ప్రతిభావంతుడు’’ అన్నాడు దక్షుడు అహంకరిస్తూ.
 ఇరువైపుల ఆవేశాగ్నులు ప్రజ్వరిల్లుతున్న ఆ సమయంలో మహావిష్ణువు ప్రత్యక్షమై...
‘‘దక్షా! నీకు ఈ దురహంకారం తగదు. ఫాలక్షుడితో బాంధవ్యమే నీకు శ్రేయోదాయకం. కాని విరోధం సమంజసం కాదు’’ హితువు పలికాడు విష్ణువు.
శివుడి ఆగ్రహాన్ని చల్లర్చడానికి...
‘‘శాంతించు మహాదేవా! మీ ఇరువురి ప్రతిజ్ఞలకు భంగం వాటిల్లకుండా చేస్తాను. సమ్మతమేనా?’’ అని ఇరువురినీ అడిగాడు.
‘‘నేను ఇచ్చిన అభయం ఎట్టి పరిస్థితుల్లోనూ నిష్ఫలం కాకూడదు’’ అన్నాడు శివుడు పట్టుదలగా.
‘‘కాదు...కానే కాదు’’ అన్నాడు విష్ణువు.
‘‘ఆ శాపం అప్రతిహతం కావల్సిందే’’ అన్నాడు దక్షుడు గట్టి పట్టుదలతో.
‘‘అవుతుంది’’  అన్నాడు విష్ణువు.
ఆ తరువాత...
‘‘వినండి. నా ప్రభావంతో చంద్రుడిని రెండు భాగములుగా విభజిస్తాను. ఒక భాగం దక్షప్రజాపతి శాపఫలితం అనుభవించేదిగానూ, రెండో భాగం పరమేశ్వరుడి అభయఫలాన్ని అనుభవించేదిగానూ చేసెదను. ఇది మీకు సమ్మతమే కదా!’’ అడిగాడు విష్ణువు.
‘‘ఉభయతారకం నాకు అంగీకారమే’’ అన్నాడు శివుడు.
‘‘ఏం దక్షా!’’ అంటూ దక్షుడి అభిప్రాయం అడిగాడు విష్ణువు.
‘‘సరే’’ అన్నాడు దక్షప్రజాపతి.
అప్పుడు...
‘‘చంద్రా ఇటురా’’ అంటూ పిలిచాడు విష్ణువు.
‘‘నమస్కారం దేవా!’’ అంటూ భయభక్తులతో అక్కడికి వచ్చాడు చంద్రుడు.
అలా వచ్చిన చంద్రుడిని ఇద్దరిగా చేశాడు విష్ణువు.
‘‘చంద్రా మీ మామగారి ఆజ్ఞను మన్నించి దినమున ఒక నక్షత్రకాంతతో కాపురం చేస్తూ సుఖించు.
శాపగ్రస్తుడవై దినదినము క్షీణించి వెను వెంటనే దినదినాభివృద్ధి నొందుచుండగలవు. అదే శుక్లపక్షం–కృష్ణపక్షం పేరున నీయందు వర్తించును’’ ఆదేశించాడు విష్ణువు.
‘‘తమ ఆదేశం శిరసావహిస్తాను స్వామి’’ అన్నాడు చంద్రుడు.
‘‘దక్షా! నీ మాట చెల్లుబాటు అయినందుకు సంతోషమే కదా’’ అడిగాడు విష్ణువు.
‘సంతోషమే’ అన్నట్లుగా ఉన్నాయి అతడి హావభావాలు.
‘‘చంద్రా! బాలచంద్ర రూపమున నీవు సదా శివ సాన్నిధ్యంలో ఉందువుగాక’’ ఆజ్ఞ ఇచ్చాడు మహావిష్ణువు.
‘‘మహాప్రసాదం’’ అంటూ శివుడి కాళ్లకు నమస్కరించి కూర్చున్నాడు చంద్రుడు.
‘‘చంద్రా...నువ్వు ఉండాల్సిన చోటు అది కాదు’’ అంటూ నెలవంకగా మారిన చంద్రుడిని శిరస్సున ధరించాడు శివుడు.
అది చూసి...
‘‘సదాశివా! ఇప్పుడు నవ్వు చంద్రమౌళివై విలసిల్లు’’ ఆనందంగా అన్నాడు మహావిష్ణువు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement