దేశ దిమ్మరిలాగా తిరక్కూడదు.. ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లాడాలని.. | T Shanmukha Rao Anuvada Katha In Funday Magazine Sep 12 2021 | Sakshi
Sakshi News home page

కథ: మరణమూ+ ఉదయమూ.. కొత్త జీవితం మొదలు..

Published Mon, Sep 13 2021 1:18 PM | Last Updated on Mon, Sep 13 2021 1:44 PM

T Shanmukha Rao Anuvada Katha In Funday Magazine Sep 12 2021 - Sakshi

 ‘ఈ పేషెంట్‌ని ఉంచడానికి ఎక్కడా ఖాళీలేదు డాక్టర్‌ ! అన్ని వార్డులూ ఇప్పటికే నిండిపోయాయి’ అన్నది నర్స్‌.
‘అయితే ఒక ప్రైవేట్‌ గదిలోకి మార్చండి’ తన తెల్ల కోటుని విప్పుతూ అన్నాడు సర్జన్‌.
‘ప్రైవేట్‌ గదులూ నిండిపోయాయి. ఆ పెద్దాయన మెక్లియాడ్‌ వున్న సెమీ ప్రైవేట్‌  గదిలో మాత్రం ఒక్క బెడ్‌ ఖాళీగా వున్నది. అతడు కూడా ఆక్సిజన్‌ మీద వున్నాడు. బహుశా అతనికి ఈ రాత్రి  గడవక పోవచ్చు. ఆ కుటుంబం వారు ఆందోళన పడుతున్నారు’

‘ఆ బెడ్‌ మీదకే చేర్చు. ఇతడివల్ల ఆ ముసలాయనకు వచ్చే ఇబ్బందేమీ ఉండదు. ఈ రాత్రి ఇతడు తెలివిలోకి రాకపోవచ్చు’ అంటూ తన మామూలు కొటువేసుకొని బయటికి వచ్చేశాడు సర్జన్‌. ఈసరికి అర్ధరాత్రి అయింది. ఆ యువకుడికి సుమారు ఇరవై సంవత్సరాలుండొచ్చు. ఎముకల గూడులాగా పీలగా నిటారైన శరీరం. పలుచని ముఖం. జుట్టు పొడవుగానూ చింపిరిగానూ ఉన్నది. చూడ్డానికి పోకిరీలాగా కనపడుతున్నాడు.

జీవితంపట్ల బాధ్యతా లక్ష్యమూ లేనట్టున్నాడు. ప్రమాదాల్లో దెబ్బలు తగిలించుకోవడం కొత్తేమీ కాదు అన్నట్టున్నాడు. ఒంటినిండా బ్యాండేజీలతో నిరుత్సాహంగా కనపడుతున్నాడు. అతడెవరో ఎవరికీ తెలీదు. ఇతడ్ని గాయపరిచిన కారు యజమాని పరారయ్యాడు. రోడ్డుమీద అపస్మారకస్థితిలో పడివుంటే ఎవరో తెచ్చి ఈ ఆసుపత్రిలో చేర్చారు. ఈ చిన్న నగరంలో ఇదొక్కటే ఆసుపత్రి. మరీ చిన్నదీకాదు..పెద్దదీకాదు.

‘ఇతడ్ని ఇరవైమూడో గదిలో పెట్టండి’ అన్నది నర్స్‌ అక్కడి పనివాళ్ళతో.  వారు స్ట్రెచర్‌ని తీసుకెళ్లి అతడ్ని బెడ్‌ మీదకు చేర్చారు. ఈ సమయంలో ఆసుపత్రి వాతావరణం ప్రశాంతంగా ఉంది. ఒక్క పసివాడి ఏడుపుగానీ ఒక్క రోగి మూలుగుగానీ వినపడటం లేదు. ఆ రాత్రికి ఇవ్వాల్సిన చివరి ఇంజక్షన్‌ చేస్తూ ‘ఈ యువకుడికి మత్తుమందులు ఏమీ ఇవ్వొద్దు సుమా!’ అని నర్సుతో చెప్పి డాక్టరు బయటికి వెళ్ళాడు. హాల్లో టెలిఫోన్‌ మోగింది. నర్స్‌ వెళ్లి రిసీవర్‌ అందుకుంది. ‘హలో’ అంటూనే అవతలి వైపున్న స్పష్టమైన గొంతుని గుర్తించింది.. ‘చెప్పండి మిసెస్‌ మెక్లియాడ్‌ ?’ 

‘మాకు ఆందోళనగావుంది. నిద్ర పట్టడంలేదు. ఒక్కసారి ఆయన పరిస్థితి చూసి చెప్పగలవా?’
‘తప్పకుండా’ అంటూ రిసీవర్‌ పెట్టేసి, గదిలోనికి వెళ్ళింది. ఈ సరికి పక్క బెడ్‌ యువకుడి శ్వాస కాస్త మెరుగుపడింది. కానీ నర్స్‌ అతడ్ని గమనించ లేదు. మెక్లియాడ్‌ పల్స్‌ చూసింది. ఏమీ బాగాలేదు. వెంటనే టెలీఫోన్‌ వద్దకు పరుగెత్తింది.. ‘మిసెస్‌ మెక్లియాడ్‌! మీరింక రావడం మంచిది’ అని చెప్పింది.
‘వెంటనే వస్తున్నాం’ అవతలి గొంతు పైకే వినపడింది.
నర్స్‌.. డాక్టరుకి ఫోన్‌ చేసింది.. ‘డాక్టర్‌! మెక్లియాడ్‌ పరిస్థితి బాగాలేదు. వారి కుటుంబాన్ని రమ్మన్నాను’
‘నేనొస్తున్నాను’ 

పక్కబెడ్‌ యువకుడు కూడా కదల్లేదు. కానీ అతడి శ్వాస బాగా మెరుగు పడింది.  నర్స్‌ ముసలాయనకు ఆక్సిజన్‌ ప్రవాహాన్ని కొంచెం పెంచింది. గదిలో మరోబల్బుని వెలిగించి రెండు అదనపు కుర్చీలను తెచ్చింది. ఆయన మరొక్కరోజు మాత్రమే బతకగలడని నిన్ననే ఆ కుటుంబంవారికి వివరించారు. డ్యూటీ డాక్టరు వచ్చి పల్స్‌నీ, గుండెకొట్టుకునే రేట్‌నీ చూశాడు.
‘దాదాపుగా ఈ ముసలాయన జీవితం ముగిసి పోయింది. వాళ్ళొచ్చిన వెంటనే ఇంజక్షన్‌ చేస్తాను’ అన్నాడు.
‘అదికూడా సిద్ధంగానే వుంచాను డాక్టర్‌!’ అన్నది నర్స్‌.
‘ఈ ఇంజక్షన్‌ ఇతన్ని బతికిచేస్తుందని కాదు.. ఒక అరగంట, తప్పితే గంట.. బంధువులు తుది వీడ్కోలు చెప్పడానికి పనికొస్తుంది. అంతే. అదిసరే ఈ రెండో పేషెంట్‌ ఎవరు?’ అడిగాడు డ్యూటీ డాక్టర్‌. 

‘యాక్సిడెంట్‌ కేసు. స్పృహలో లేడు’
అంతలో మెక్లియాడ్‌ కుటుంబం వారొచ్చారు.
‘ఈయనకు నేనొక ఇంజక్షన్‌ చేస్తాను. కొద్దిసేపు మాత్రం స్పృహ లోనికి వస్తాడు’ అన్నాడు డాక్టరు.
నలుగురు లోనికొచ్చారు. మెక్లియాడ్‌ భార్యకు అరవై ఏళ్లకు పైగానే ఉంటాయి. విషాదంగా ఉన్నప్పటికీ నిబ్బరం కోల్పోలేదు. కుమారుడు జార్జి పొడవైన యువకుడు. తండ్రి స్థితిపట్ల బాధ కనపడుతున్నది. అతని భార్య రత్‌ సన్నంగా వున్నది. కుమార్తె మేరీ తండ్రిలాగే కాస్త చామనఛాయ.
 జార్జి పక్కబెడ్‌ వైపు చూపుతూ ‘అతడెవరు?’ అన్నాడు.

‘యాక్సిడెంట్‌ కేసు. స్పృహలో లేడు.. హాస్పిటల్లో ఎక్కడా ఖాళీలేక ఇక్కడ ఉంచాం. మీరతడ్ని పట్టించుకోనవసరం లేదు’ అన్నది నర్స్‌.
మెక్లియాడ్‌ వదులైన చర్మంకింద డాక్టరు ఒక ఇంజక్షన్‌ చేశాడు.. ‘మిసెస్‌ మెక్లియాడ్‌! సుమారు అరగంటవరకూ మీరు అతనితో మాట్లాడుకోవచ్చు. మేం బయటే ఉంటాం’ 
‘థాంక్యూ డాక్టర్‌!’ అన్నది మెక్లియాడ్‌ భార్య. 
డాక్టరూ, నర్సూ బయటకు వెళ్లే వరకూ ఆమె వేచి ఉన్నది. ఆ తరువాత మిగిలినవారికి సైగచేసి భర్త బెడ్‌ వద్దకు రప్పించింది. ఆమె ముసలాయన తలవద్ద కూర్చున్నది. జార్జీ, రత్‌ ఇంకా దగ్గరగా వచ్చారు. మేరీ తల్లి పక్కనే మోకాళ్ల మీద కూర్చున్నది. 

‘హాల్‌! మేమందరమూ నీ దగ్గరేవున్నాం’ అన్నది మెక్లియాడ్‌ భార్య.. భర్తతో. మెక్లియాడ్‌ రెప్పలు కదులుతున్నాయి. పక్క బెడ్‌ యువకుడు నెమ్మదిగా స్పృహలోకి వస్తున్నాడు.
‘హాల్‌! మనతోటలో మీకిష్టమైన సన్నజాజులు గుత్తులుగుత్తులుగా పూస్తున్నాయి. మధ్యాహ్నం మీ ఫేవరెట్‌.. క్యారెట్‌ కూర చేశాను.‘
‘డాడీ! రత్‌ కూడా మెల్లగా వంటచెయ్యడం నేర్చుకొంటున్నది’ అన్నాడు జార్జి.
‘మన పెళ్ళికాగానే నేను చేసిన చెర్రీ కలగూర మీకు గుర్తుందా హాల్‌! పైన ఉడకలేదు. కింద మాడిపోయింది. నాకు ఏడుపొచ్చినంత పనైంది. మీరేమో నవ్వారు. కలగూర చెయ్యడం కోసమే నిన్ను పెళ్లిచేసుకోలేదు అని బుజ్జగించారు..’

‘ఈ సంవత్సరం కూడా చెర్రీ చెట్టునిండా పళ్ళున్నాయి నాన్నా! అవి బాగా పక్వానికి వస్తే మీకోసం జార్జి వాటిమీద వలపరుస్తాడు.’
జార్జి నవ్వుతెచ్చుకుంటూ ‘వల వేసినందుకు పక్షులు మనల్ని తిట్టుకుంటాయని మీరనేవారు..’ అన్నాడు. మేరీ ఆర్ద్రత నిండిన కంఠంతో  ‘కలగూరతో వనభోజనాలు భలేగా వుంటాయి కదా నాన్నా!’ అంది. 

‘వయసు మీదపడినా వనభోజనాల్లో ఏదో మజా వున్నదని మీరు అంటూంటారు కదా..’   మెక్లియాడ్‌ భార్య.. అతనిచేతిని తన చేతిలోకి తీసుకుంటూ.
‘నాన్నా! గత జూలైలో మనం వెళ్లిన పిక్నిక్‌ గుర్తుచేసుకోండి. అక్కడే ఫిడేల్‌ శ్రుతి చెయ్యడం ఎలాగో నాకు నేర్పారు మీరు’జార్జి .
‘నాకు  వేసవి సెలవులంటే ఇష్టం. స్కూలన్నా ఇష్టమే. నావైపు చూడకు అన్నయ్యా! నీకే స్కూలంటే ఇష్టం ఉండేదికాదు’ ఏదో లోకంలో ఉన్నట్టు అన్నది మేరీ.
‘పోట్లాడుకోకండీ’ మెక్లియాడ్‌ భార్య నవ్వడానికి ప్రయత్నించింది. పక్కబెడ్‌ యువకుడి కనురెప్పలు కదుల్తున్నాయి. అతడ్ని ఎవరూ గుర్తించట్లేదు. మెదడు పొరల్లోంచి పక్కవారి మాటల్ని అస్పష్టంగా వినగలుగుతున్నాడు.

మేరీ అంటున్నది.. ‘నిజానికి నాకు  మళ్ళీ చిన్నదాన్నయిపోవాలనీ, మీతోనూ, అమ్మతోనూ ఆడుకోవాలనీ అనిపిస్తోంది నాన్నా!’ అని.
‘ఆగు .. ఆయనేదో చెబుతున్నాడు..’ అన్నది మెక్లియాడ్‌ భార్య. వారంతా ఆసక్తిగా ఆయన మీదకు వంగారు. ఆ చిరుకాంతిలో వారి దృష్టి ఆ వృద్ధుని ముఖం మీద నిశ్చలంగా వున్నది. వృద్ధుడి పెదవులు కదిలాయి. ఏదో సైగ చేయబోయాడు. నెమ్మదిగా కళ్ళూ తెరిచాడు. వరుసగా అందరివైపూ చూశాడు. వృద్ధుడు తన తలని భార్య వైపు తిప్పాడు. నీరసంగా పిలిచాడు ‘మార్తా!’ ఒక అస్పష్టమైన మూలుగు, ఒక నిట్టూర్పు కలగలుపుగా ఆ పిలుపు అధోలోకాల్లోంచి వెలికి వచ్చినట్టుంది.

‘హాల్‌! నేనిక్కడే వున్నాను. మిమ్మల్ని చూడాలని పిల్లలూ వచ్చారు’
‘మీ మనుమలు కూడా మిమ్మల్ని చూడాలనుకున్నారు. కానీ వాళ్లు ఈ టైమ్‌లో నిద్రపోతారు. చిట్టి హాల్‌ వాడి మూడుచక్రాల సైకిల్‌ని మీకు చూపించాలని తెగ ఆత్రపడ్డాడు’  అన్నది రత్‌.

‘తాతగారు ఒక హార్న్‌ కొని తెచ్చిస్తే  దాన్ని ఆ సైకిలుకు బిగించుకుంటాడట’ అన్నాడు జార్జి.
‘నాకు క్రిస్టమస్‌ అంటే చాలా ఇష్టం నాన్నా!’ మేరీ ఏదో స్వప్నలోకపు గొంతుతో అంటున్నది.. ‘ఆరోజు పరుపు మీంచి లేచేసరికే మధురమైన పాటలు వినపడుతుంటాయి’ అంటూ మంద్రంగా ఒక పాటనూ అందుకుంది.
పక్క బెడ్‌ యువకుడి కళ్ళు సగం తెరుచుకున్నాయి. వారి మాటలూ స్పష్టంగా వినపడుతున్నాయి. అయినా కళ్ళు మూసుకునే మేరీ పాటను విన్నాడు.
ముసలాయన ‘నాకన్నీ గుర్తున్నాయి’ అన్నాడు.  ‘మీరే మా సర్వస్వం నాన్నా!’ అన్నది మేరీ. 

‘నాన్నా! నేను కూడా మీలాగా మంచి నాన్ననౌతాను’ అన్నాడు జార్జి.
పక్క బెడ్‌ యువకుడికి పరిస్థితి బాగా అర్థమౌతోంది. తన పక్కనే వృద్ధుడొకాయన ఉన్నాడనీ అతని చుట్టూ కుటుంబసభ్యులున్నారనీ తెలుస్తున్నది.
‘మీరు చాలా మంచి పిల్లలు’ ముసలాయన మగతగా అన్నాడు.

‘నాకు పదిహేనేళ్లున్నప్పుడు  క్రిస్టమస్‌ చెట్టుమీద నాకోసం మీరు ఒక ఉంగరం పెట్టారు. నాకు ఎమరాల్డ్‌ మనసులో ఉన్నదని మీకెలా తెలిసిందో ఇప్పటికీ నాకు అర్థంకాదు నాన్నా!’ అన్నది మేరీ. ‘నాకప్పుడు పన్నేండేళ్లనుకుంటా..  మంచుమీద జారే స్టిక్స్‌.. ఖరీదు ఎక్కువని నేను అడగలేదు. కానీ నా మనసు తెలుసుకొని మీరే  కొనిచ్చారు’ అన్నాడు జార్జి.
‘మీ నాన్నకు ఇటువంటివన్నీ ఎవరూ చెప్పకపోయినా అడక్కపోయినా తెలుస్తూంటాయి, ముఖ్యంగా క్రిస్టమస్‌ రోజుల్లో’ అన్నది మెక్లియాడ్‌ భార్య. ‘పిల్లల మనసు తల్లిదండ్రులకు గాక ఇంకెవరికి తెలుస్తుంది!’ అన్నాడు వృద్ధుడు.

అతని గొంతు వెనక్కు పోతున్నది.. కనురెప్పలూ కొట్టుకొంటున్నాయి. పక్కబెడ్‌ యువకుడికి బాగా తెలివి వచ్చింది. ఆయా వ్యక్తుల్ని చూడాలనీ, వారి ముఖ కవళికల్ని పరిశీలించాలనీ అనిపించింది. పక్కకు తిరగబోతే మెడ నొప్పెట్టింది. ఇవి క్రిస్టమస్‌ రోజులని అతనికి గుర్తేలేదు. గుర్తుపెట్టుకొని కూడా చేసేదేమీ లేదు.

‘వచ్చే ఆదివారం ఈస్టర్‌ పండుగ. ఈ ఏడు ఆరు లిల్లీపువ్వులున్నాయి. ఇంతకుముందెప్పుడో మూడుపువ్వులు ఒక్కసారి పూసినట్లుగుర్తు. అంతేకదా హాల్‌!’ అన్నది మెక్లియాడ్‌ భార్య.  ‘ కాదు, అయిదు’ అన్నాడు వృద్ధుడు   ‘సరిగ్గా చెప్పారు’ అంటూ పిల్లల వైపు తిరిగి  ‘చూశారా.. మీ నాన్నకు అన్నీ గుర్తుంటాయి’ అంది. 
పక్కబెడ్‌ యువకుడి చెవిలో ఈస్టర్‌ అన్నమాట పడింది. అవును. జనం కొత్తదుస్తులు వేసుకొని చర్చికి వెళ్తారు. అతడికి కొత్త దుస్తులు కుట్టించేవారు లేరు, కొనుక్కోవడానికి డబ్బూ లేదు.

మెక్లియాడ్‌ కనురెప్పలు వాలిపోతున్నాయి. ఆయన భార్య కుమారుడికి సైగ చేసింది. జార్జి ద్వారం వద్దకు వెళ్లి డాక్టర్ని పిలిచాడు.  అతడు వచ్చి మెక్లియాడ్‌ పల్స్‌ చూసి.. పెదవి విరిచాడు. మెక్లియాడ్‌ భార్య ముఖం పాలిపోయింది. ‘పిల్లలూ మీరింక  ఇంటికి వెళ్ళండి. నేను మీనాన్నతో పాటు వుంటాను’ అన్నది. ఏదో అర్థమైనట్లు వారు ముఖాలు చూసుకున్నారు. 

‘గుడ్‌ నైట్‌ నాన్నా!’ అన్నాడు జార్జి. ‘నాన్నా! గుడ్‌ నైట్‌ ’ మేరీ తండ్రి పైకి వంగి అతని చెక్కిళ్ళను ముద్దాడింది. అందరూ బరువుగా.. విషాదంగా వెళ్లిపోయారు. వృద్ధులిద్దరూ మిగిలారు. మెక్లియాడ్‌ కళ్ళు మళ్ళీ నెమ్మదిగా తెరుచు కున్నాయి. కానీ అతడేమీ మాట్లాడలేదు.
పక్కబెడ్‌ యువకుడికి బాగా తెలివి వచ్చింది. ఇద్దరు వృద్ధుల్ని ఆసక్తిగా గమనిస్తున్నాడు. ఇప్పుడు వారు ఏం మాట్లాడుకుంటారు?

వృద్ధురాలు ముసలాయనతో ‘హాల్‌! ఇవన్నీ పాత జ్ఞాపకాలు. ఒకనాటి మధురస్మృతులు. పిల్లల సమక్షంలో కాకుండా కేవలం మనిద్దరం మాత్రమే నెమరు వేసుకోదగ్గవి. మీరొక అపురూపమైన భర్త హాల్‌! ఒక ఆదర్శ పురుషుడిగా నన్నొక ఆనందమయ ప్రపంచంలోనికి తోడుకెళ్లారు. ఒక బాధ్యతగల స్త్రీమూర్తిగా తీర్చిదిద్దారు. మనం సంతోషంగా గడిపాం. మన సంతానాన్ని మంచి పౌరులుగా తయారుచేశాం’ అంటూ  ఆమె ఆగింది.

తన గాద్గదిక స్వరాన్ని వినపడనివ్వకుండా  తమాయించుకుంది. ‘ఆనాడు ఆ తోటలో ఆ చెర్రీ చెట్టునీడలో నా చేతిని మీ చేతిలోకి  తీసుకొని.. ‘‘మనం పెళ్ళిచేసుందామ’’ని మీరు ప్రతిపాదించిన  మధుర క్షణాన్ని నేనెప్పటికీ మరిచిపోలేను హాల్‌! ఆక్షణమే నా జీవితానికి గతినీ గమ్యాన్నీ సమకూర్చిపెట్టింది. మీ వెనుకనే అడుగులో అడుగేసుకొంటూ ఆనందధామాలవైపు పయనించేటట్టు చేసింది.’ 

ఆమె అలా మాట్లాడుతుండగానే అతని చెయ్యి ఆమె చేతికోసం వెతికింది. ఆ చేతిని ఆమె తన రెండుచేతుల్లోనికీ తీసుకొని హృదయానికి హత్తుకుంది. ‘నేనిక్కడే వున్నాను ప్రియతమా!’ ఆమె గొంతు జీరబోయింది. ఒక్కసారిగా బిగ్గరగా ఏడవాలనిపించింది. కానీ పెదవుల్ని బిగబట్టుకున్నది. ‘మార్తా!’ ఆ పిలుపు ఏ దిగంతాలనుండో శూన్యాన్నీ గాలినీ మేఘాల్నీ చీల్చుకొని ప్రతిధ్వనించినట్టు అక్కడి నిశ్శబ్దాన్ని భగ్నం చేసింది. ‘అవును హాల్‌! నేనిక్కడే వున్నాను. మీ తోనే వున్నాను’

మెక్లియాడ్‌ హఠాత్తుగా కళ్ళు తెరిచాడు. ఆమెని చూసి చిరునవ్వు నవ్వాడు. ‘మార్తా... మార్తా.. నువ్వు.. నువ్వు.. నాకొక.. అద్భుతమైన జీవితాన్ని..’ అతని మాట, గది బయటి నిశీధిలోనికీ నిశ్శబ్దంలోనికీ శోషణ చెంది పోయింది. ఆమె చేతిలోంచి అతనిచెయ్యి కిందకు జారిపోయింది. కనురెప్పలు వాలిపోయాయి. ముసలాయన చనిపోతున్నాడు.

పక్కబెడ్‌ యువకుడికి ఏడుపొస్తున్నది. వ్యక్తులతో పరిచయంలేకపోయినా మరణానికి సాక్షిగా ఉండవలసివస్తే దుఃఖంకట్టలు తెంచుకొంటుంది. అతనిది నిర్లిప్తమైన జీవితం. తండ్రి ఎవరో తెలీదు. పసికందుగా ఉన్నప్పుడే తల్లి చనిపోయింది. అనాథాశ్రమంలో వందలమంది పిల్లలమధ్య ఒంటరిగా పెరిగాడు. అనురాగమూ ఆప్యాయతా మొదలైన స్పందనలు అసలే తెలీవు. ఎవరో తిండిపెడితే ఎందుకో పెరిగాడు. అంతే!

ఆమె మౌనంగా ఏడుస్తోంది. భర్త చేతిని నెమ్మదిగా కిందపెట్టి తన చేతిసంచి లోంచి చిన్నపుస్తకాన్ని తీసి చదవటంమొదలు పెట్టింది  ‘దేవుడే నా రక్షకుడు. నేనింకేమీ కోరను’
పక్కబెడ్‌ యువకుడు ఈమాటల్ని ఒకనాటి అనాథాశ్రమం సండే స్కూల్‌లో తరచుగా వినేవాడు. ఆనాడు అవి అర్థంతెలీని విడి విడి పదాలు మాత్రమే. ఇప్పుడు హఠాత్తుగా ఆ మాటలకు అర్థమూ అన్వయమూ అతడికి స్ఫురించింది .

‘మృత్యుగహ్వరపు నీడలో నడిచినా నేను భీతిల్లను. మేమంతా నిన్ను  ప్రేమిస్తున్నాం.. నువ్వు మాతోనే ఉంటావు.. మాలోనే ఉంటావు’  స్వర్గద్వారంలో ప్రవేశిస్తున్న భర్తకు భరోసా ఇస్తున్నది. అంతేకాదు  గతంలో ఇద్దరి జీవన గమనానికీ, మనసు లోతులకు మాత్రమే సంబంధించిన ఎన్నో అంశాల్ని స్మరించుకొంటున్నది. పంచుకొన్న కష్టసుఖాలనూ, భరించిన కలిమి లేములనూ తలచుకొని విలపిస్తున్నది. ఆమె గ్రంథాన్ని మూసివేసి, కొంతసేపు కనులు మూసుకొని మౌనంగా కూర్చున్నది.

పక్కబెడ్‌ యువకుడు దిండుపైన ఒత్తిగిల్లాడు. ఇప్పుడతనికి ఏడవాలనిపించడంలేదు.
ఆమె లేచి  భర్త శరీరంపై వొంగి, అతడి  పెదవుల్ని ముద్దాడింది.‘ప్రియతమా.. నీకు వీడ్కోలు.. మనం పైలోకంలో కలుసుకునే వరకూ..’ కనులు తుడుచుకొని ద్వారం వద్దకు వెళ్లి డాక్టర్ని పిలిచింది. డాక్టరు వచ్చిమరోసారి పల్స్‌ చూశాడు. ‘అంతా అయిపోయింది. మీరు చాలా ధైర్యవంతులు’ అన్నాడు.
‘దేవుడే ధైర్యాన్నిస్తాడు డాక్టర్‌’
‘అవును. నిజంగా అంతే!’ 

‘అంబులెన్సు వస్తే ఫోన్‌ చెయ్యండి. మాఇల్లు దగ్గరే’ అని చెప్పి ఆమె వదల్లేక వదల్లేక తడబడుతూ వెళ్ళిపోయింది.
పక్కబెడ్‌ యువకుడు వెల్లకిలాపడుకొని నిదానంగా పైకప్పు వైపు చూస్తున్నాడు. గతంలో అతనికెప్పుడూ జీవితమంటే ఏమిటో ఎందుకో ఎవరికోసమో తెలీలేదు. కానీ ఇప్పుడు స్పష్టంగా తెలుస్తున్నది. ఒకర్ని ప్రేమించి కలసి జీవించి ఒక కుటుంబాన్ని నిర్మించడమే జీవితానికి సార్థకత అనిపిస్తున్నది. ఆది మానవుడి గుహాంతర జీవనసరళి మొదలు ఈనాటి గ్రహాంతరవాసం వరకూ అదే మనిషికి గమ్యం. బంధాలూ అనుబంధాలూ ఆత్మీయతలూ ఒడిసి పట్టుకున్న సుదీర్ఘమైన జీవనయానంలో అనుభూతుల విలువలే వెలుగులు.

కన్నీళ్లూ చిరునవ్వులే మైలురాళ్లు. డ్యూటీ డాక్టరు వచ్చి యువకుడు తెలివిగా ఉండటాన్ని గమనించి ‘ఓయ్‌ అబ్బాయ్‌.. ఎంత సేపటి నుంచి మేలుకొని ఉన్నావ్‌?’ అని అడిగాడు. యువకుడు చిరునవ్వు నవ్వుతూ ‘ఒక అరగంట కావచ్చు’ అని బదులిచ్చాడు. డాక్టరు గాభరా పడ్డాడుతూ ‘నువ్వు ఇదంతా చూడటం ఏమీ బాగాలేదయ్యా!’ అంటూ వెంటనే కాలింగ్‌ బెల్‌ నొక్కాడు. నర్స్‌ వచ్చింది.

‘ఇక్కడొక తెర కట్టు’ అని పురమాయించాడు డాక్టర్‌.  ఆమె వెళ్లి తెర తెచ్చి కట్టింది. అంతలోనే ఇద్దరు మనుషులు స్ట్రెచర్‌ తెచ్చి వృద్ధుడి శవాన్ని వెలుపలికి తీసుకుపోయారు.
యువకుడి మెదడులో ఆలోచనల కల్లోలతరంగాలు కదలాడసాగాయి. ‘ఇంట్లో ఈసరికి జార్జి తల్లిని ఓదారుస్తుంటాడు. మేరీ తండ్రి లేని వెలితికి కుంగిపోతూ ఉంటుంది. ఎవరెన్ని చెప్పినా వృద్ధురాలు భర్తని మరచిపోలేదు. ఎన్నో దశాబ్దాల దాంపత్య బంధం.. అంత త్వరగా చెరిగిపోతుందా! అసలు ప్రేమే అమరమైంది..’ అలా..  అలా..  ఆలోచిస్తుండగా యువకుడికి నిద్రపట్టేసింది.  యువకుడు ఉదయం ఆలస్యంగాలేచాడు. గది పరిశుభ్రంగా ఉంది. తెరనీ తీసివేశారు. ఇప్పుడతని పక్కబెడ్‌ ఖాళీగా ఉన్నది. దానిమీద కొత్త బెడ్‌ షీట్లు పరచారు.

కొద్దిగంటల కిందట ఆ బెడ్‌ మీద తుదిశ్వాస విడిచిన ఒక ముసలాయన.. ఆయనచుట్టూ పెనవేసుకున్న బంధాలూ బాంధవ్యాలూ జ్ఞాపకాలూ.. చివరకు మిగిలేవి.. ఇవే! జీవితానికి గతినీ గమ్యాన్నీ ఇచ్చేవి.. ఇవే!  కిటికీలోంచి ఉదయకిరణాలు యువకుడి బెడ్‌ మీద పడుతున్నాయి. జీవితంలో తొలిసారిగా తాను ఒంటరి వాడిననే భావం తొలిగిపోయింది. ఇక సోమరిగా విచ్చలవిడిగా దేశ దిమ్మరిలాగా  తిరక్కూడదనే నిశ్చయానికి వచ్చాడు.. భవిష్యత్‌ మీద ఆశలు చిగురించాయి. తనొక ఉపాధిని సంపాదించుకోవాలి. ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలి.

కొత్త జీవితాన్ని మొదలుపెట్టాలి. అప్పుడెప్పుడో తనబాల్యంలో అనాథాశ్రమంలో ఉన్నప్పుడు ఒక మూడు చక్రాల సైకిలు కోసం అహోరాత్రాలూ పరితపించాడు. ఒక్కసారంటే ఒకే ఒక్కసారి దానిమీద కూర్చొని తొక్కాలనే కోరిక ఇప్పటికీ తీరనే లేదు. ఆ వెలితి, గుండె మీది వ్రణంలాగా ఇన్నేళ్ల తరువాత కూడా  నొప్పిగానే ఉంటుంది. అటువంటి చిరుకోరికలు తీరాలన్నా తీర్చాలన్నా ఆత్మీయులుండాలి.

ఒక కుటుంబంలో సభ్యుడై ఉండాలి. జీవితానికొక గమ్యమూ అర్థమూ పరమార్థమూ ఉండాలి. నర్స్‌లోని కొచ్చింది. రాత్రి డ్యూటీ చేసినప్పటికీ ఆమె ఉత్సాహంగా ఉంది. ‘అబ్బాయీ! అల్పాహారం తీసుకుంటావా?’ ఆప్యాయంగా అడిగింది. యువకుడు నవ్వాడు. ‘నాకిప్పుడు బాగానేవుంది సిస్టర్‌! దయచేసి మంచి భోజనమే తెప్పించండి. చాలా ఆకలిగావుంది’ అన్నాడు. అతనికళ్ళల్లో ఆమెకొక స్పష్టమైన కాంతిరేఖ కనపడింది.
 -మూలం : పెర్ల్‌  ఎస్‌ . బక్‌
- అనువాదం: టి . షణ్ముఖ రావు 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement