Shanmukha Rao
-
దేశ దిమ్మరిలాగా తిరక్కూడదు.. ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లాడాలని..
‘ఈ పేషెంట్‌ని ఉంచడానికి ఎక్కడా ఖాళీలేదు డాక్టర్ ! అన్ని వార్డులూ ఇప్పటికే నిండిపోయాయి’ అన్నది నర్స్. ‘అయితే ఒక ప్రైవేట్ గదిలోకి మార్చండి’ తన తెల్ల కోటుని విప్పుతూ అన్నాడు సర్జన్. ‘ప్రైవేట్ గదులూ నిండిపోయాయి. ఆ పెద్దాయన మెక్లియాడ్ వున్న సెమీ ప్రైవేట్ గదిలో మాత్రం ఒక్క బెడ్ ఖాళీగా వున్నది. అతడు కూడా ఆక్సిజన్ మీద వున్నాడు. బహుశా అతనికి ఈ రాత్రి గడవక పోవచ్చు. ఆ కుటుంబం వారు ఆందోళన పడుతున్నారు’ ‘ఆ బెడ్ మీదకే చేర్చు. ఇతడివల్ల ఆ ముసలాయనకు వచ్చే ఇబ్బందేమీ ఉండదు. ఈ రాత్రి ఇతడు తెలివిలోకి రాకపోవచ్చు’ అంటూ తన మామూలు కొటువేసుకొని బయటికి వచ్చేశాడు సర్జన్. ఈసరికి అర్ధరాత్రి అయింది. ఆ యువకుడికి సుమారు ఇరవై సంవత్సరాలుండొచ్చు. ఎముకల గూడులాగా పీలగా నిటారైన శరీరం. పలుచని ముఖం. జుట్టు పొడవుగానూ చింపిరిగానూ ఉన్నది. చూడ్డానికి పోకిరీలాగా కనపడుతున్నాడు. జీవితంపట్ల బాధ్యతా లక్ష్యమూ లేనట్టున్నాడు. ప్రమాదాల్లో దెబ్బలు తగిలించుకోవడం కొత్తేమీ కాదు అన్నట్టున్నాడు. ఒంటినిండా బ్యాండేజీలతో నిరుత్సాహంగా కనపడుతున్నాడు. అతడెవరో ఎవరికీ తెలీదు. ఇతడ్ని గాయపరిచిన కారు యజమాని పరారయ్యాడు. రోడ్డుమీద అపస్మారకస్థితిలో పడివుంటే ఎవరో తెచ్చి ఈ ఆసుపత్రిలో చేర్చారు. ఈ చిన్న నగరంలో ఇదొక్కటే ఆసుపత్రి. మరీ చిన్నదీకాదు..పెద్దదీకాదు. ‘ఇతడ్ని ఇరవైమూడో గదిలో పెట్టండి’ అన్నది నర్స్ అక్కడి పనివాళ్ళతో. వారు స్ట్రెచర్ని తీసుకెళ్లి అతడ్ని బెడ్ మీదకు చేర్చారు. ఈ సమయంలో ఆసుపత్రి వాతావరణం ప్రశాంతంగా ఉంది. ఒక్క పసివాడి ఏడుపుగానీ ఒక్క రోగి మూలుగుగానీ వినపడటం లేదు. ఆ రాత్రికి ఇవ్వాల్సిన చివరి ఇంజక్షన్ చేస్తూ ‘ఈ యువకుడికి మత్తుమందులు ఏమీ ఇవ్వొద్దు సుమా!’ అని నర్సుతో చెప్పి డాక్టరు బయటికి వెళ్ళాడు. హాల్లో టెలిఫోన్ మోగింది. నర్స్ వెళ్లి రిసీవర్ అందుకుంది. ‘హలో’ అంటూనే అవతలి వైపున్న స్పష్టమైన గొంతుని గుర్తించింది.. ‘చెప్పండి మిసెస్ మెక్లియాడ్ ?’ ‘మాకు ఆందోళనగావుంది. నిద్ర పట్టడంలేదు. ఒక్కసారి ఆయన పరిస్థితి చూసి చెప్పగలవా?’ ‘తప్పకుండా’ అంటూ రిసీవర్ పెట్టేసి, గదిలోనికి వెళ్ళింది. ఈ సరికి పక్క బెడ్ యువకుడి శ్వాస కాస్త మెరుగుపడింది. కానీ నర్స్ అతడ్ని గమనించ లేదు. మెక్లియాడ్ పల్స్ చూసింది. ఏమీ బాగాలేదు. వెంటనే టెలీఫోన్ వద్దకు పరుగెత్తింది.. ‘మిసెస్ మెక్లియాడ్! మీరింక రావడం మంచిది’ అని చెప్పింది. ‘వెంటనే వస్తున్నాం’ అవతలి గొంతు పైకే వినపడింది. నర్స్.. డాక్టరుకి ఫోన్ చేసింది.. ‘డాక్టర్! మెక్లియాడ్ పరిస్థితి బాగాలేదు. వారి కుటుంబాన్ని రమ్మన్నాను’ ‘నేనొస్తున్నాను’ పక్కబెడ్ యువకుడు కూడా కదల్లేదు. కానీ అతడి శ్వాస బాగా మెరుగు పడింది. నర్స్ ముసలాయనకు ఆక్సిజన్ ప్రవాహాన్ని కొంచెం పెంచింది. గదిలో మరోబల్బుని వెలిగించి రెండు అదనపు కుర్చీలను తెచ్చింది. ఆయన మరొక్కరోజు మాత్రమే బతకగలడని నిన్ననే ఆ కుటుంబంవారికి వివరించారు. డ్యూటీ డాక్టరు వచ్చి పల్స్నీ, గుండెకొట్టుకునే రేట్నీ చూశాడు. ‘దాదాపుగా ఈ ముసలాయన జీవితం ముగిసి పోయింది. వాళ్ళొచ్చిన వెంటనే ఇంజక్షన్ చేస్తాను’ అన్నాడు. ‘అదికూడా సిద్ధంగానే వుంచాను డాక్టర్!’ అన్నది నర్స్. ‘ఈ ఇంజక్షన్ ఇతన్ని బతికిచేస్తుందని కాదు.. ఒక అరగంట, తప్పితే గంట.. బంధువులు తుది వీడ్కోలు చెప్పడానికి పనికొస్తుంది. అంతే. అదిసరే ఈ రెండో పేషెంట్ ఎవరు?’ అడిగాడు డ్యూటీ డాక్టర్. ‘యాక్సిడెంట్ కేసు. స్పృహలో లేడు’ అంతలో మెక్లియాడ్ కుటుంబం వారొచ్చారు. ‘ఈయనకు నేనొక ఇంజక్షన్ చేస్తాను. కొద్దిసేపు మాత్రం స్పృహ లోనికి వస్తాడు’ అన్నాడు డాక్టరు. నలుగురు లోనికొచ్చారు. మెక్లియాడ్ భార్యకు అరవై ఏళ్లకు పైగానే ఉంటాయి. విషాదంగా ఉన్నప్పటికీ నిబ్బరం కోల్పోలేదు. కుమారుడు జార్జి పొడవైన యువకుడు. తండ్రి స్థితిపట్ల బాధ కనపడుతున్నది. అతని భార్య రత్ సన్నంగా వున్నది. కుమార్తె మేరీ తండ్రిలాగే కాస్త చామనఛాయ. జార్జి పక్కబెడ్ వైపు చూపుతూ ‘అతడెవరు?’ అన్నాడు. ‘యాక్సిడెంట్ కేసు. స్పృహలో లేడు.. హాస్పిటల్లో ఎక్కడా ఖాళీలేక ఇక్కడ ఉంచాం. మీరతడ్ని పట్టించుకోనవసరం లేదు’ అన్నది నర్స్. మెక్లియాడ్ వదులైన చర్మంకింద డాక్టరు ఒక ఇంజక్షన్ చేశాడు.. ‘మిసెస్ మెక్లియాడ్! సుమారు అరగంటవరకూ మీరు అతనితో మాట్లాడుకోవచ్చు. మేం బయటే ఉంటాం’ ‘థాంక్యూ డాక్టర్!’ అన్నది మెక్లియాడ్ భార్య. డాక్టరూ, నర్సూ బయటకు వెళ్లే వరకూ ఆమె వేచి ఉన్నది. ఆ తరువాత మిగిలినవారికి సైగచేసి భర్త బెడ్ వద్దకు రప్పించింది. ఆమె ముసలాయన తలవద్ద కూర్చున్నది. జార్జీ, రత్ ఇంకా దగ్గరగా వచ్చారు. మేరీ తల్లి పక్కనే మోకాళ్ల మీద కూర్చున్నది. ‘హాల్! మేమందరమూ నీ దగ్గరేవున్నాం’ అన్నది మెక్లియాడ్ భార్య.. భర్తతో. మెక్లియాడ్ రెప్పలు కదులుతున్నాయి. పక్క బెడ్ యువకుడు నెమ్మదిగా స్పృహలోకి వస్తున్నాడు. ‘హాల్! మనతోటలో మీకిష్టమైన సన్నజాజులు గుత్తులుగుత్తులుగా పూస్తున్నాయి. మధ్యాహ్నం మీ ఫేవరెట్.. క్యారెట్ కూర చేశాను.‘ ‘డాడీ! రత్ కూడా మెల్లగా వంటచెయ్యడం నేర్చుకొంటున్నది’ అన్నాడు జార్జి. ‘మన పెళ్ళికాగానే నేను చేసిన చెర్రీ కలగూర మీకు గుర్తుందా హాల్! పైన ఉడకలేదు. కింద మాడిపోయింది. నాకు ఏడుపొచ్చినంత పనైంది. మీరేమో నవ్వారు. కలగూర చెయ్యడం కోసమే నిన్ను పెళ్లిచేసుకోలేదు అని బుజ్జగించారు..’ ‘ఈ సంవత్సరం కూడా చెర్రీ చెట్టునిండా పళ్ళున్నాయి నాన్నా! అవి బాగా పక్వానికి వస్తే మీకోసం జార్జి వాటిమీద వలపరుస్తాడు.’ జార్జి నవ్వుతెచ్చుకుంటూ ‘వల వేసినందుకు పక్షులు మనల్ని తిట్టుకుంటాయని మీరనేవారు..’ అన్నాడు. మేరీ ఆర్ద్రత నిండిన కంఠంతో ‘కలగూరతో వనభోజనాలు భలేగా వుంటాయి కదా నాన్నా!’ అంది. ‘వయసు మీదపడినా వనభోజనాల్లో ఏదో మజా వున్నదని మీరు అంటూంటారు కదా..’ మెక్లియాడ్ భార్య.. అతనిచేతిని తన చేతిలోకి తీసుకుంటూ. ‘నాన్నా! గత జూలైలో మనం వెళ్లిన పిక్నిక్ గుర్తుచేసుకోండి. అక్కడే ఫిడేల్ శ్రుతి చెయ్యడం ఎలాగో నాకు నేర్పారు మీరు’జార్జి . ‘నాకు వేసవి సెలవులంటే ఇష్టం. స్కూలన్నా ఇష్టమే. నావైపు చూడకు అన్నయ్యా! నీకే స్కూలంటే ఇష్టం ఉండేదికాదు’ ఏదో లోకంలో ఉన్నట్టు అన్నది మేరీ. ‘పోట్లాడుకోకండీ’ మెక్లియాడ్ భార్య నవ్వడానికి ప్రయత్నించింది. పక్కబెడ్ యువకుడి కనురెప్పలు కదుల్తున్నాయి. అతడ్ని ఎవరూ గుర్తించట్లేదు. మెదడు పొరల్లోంచి పక్కవారి మాటల్ని అస్పష్టంగా వినగలుగుతున్నాడు. మేరీ అంటున్నది.. ‘నిజానికి నాకు మళ్ళీ చిన్నదాన్నయిపోవాలనీ, మీతోనూ, అమ్మతోనూ ఆడుకోవాలనీ అనిపిస్తోంది నాన్నా!’ అని. ‘ఆగు .. ఆయనేదో చెబుతున్నాడు..’ అన్నది మెక్లియాడ్ భార్య. వారంతా ఆసక్తిగా ఆయన మీదకు వంగారు. ఆ చిరుకాంతిలో వారి దృష్టి ఆ వృద్ధుని ముఖం మీద నిశ్చలంగా వున్నది. వృద్ధుడి పెదవులు కదిలాయి. ఏదో సైగ చేయబోయాడు. నెమ్మదిగా కళ్ళూ తెరిచాడు. వరుసగా అందరివైపూ చూశాడు. వృద్ధుడు తన తలని భార్య వైపు తిప్పాడు. నీరసంగా పిలిచాడు ‘మార్తా!’ ఒక అస్పష్టమైన మూలుగు, ఒక నిట్టూర్పు కలగలుపుగా ఆ పిలుపు అధోలోకాల్లోంచి వెలికి వచ్చినట్టుంది. ‘హాల్! నేనిక్కడే వున్నాను. మిమ్మల్ని చూడాలని పిల్లలూ వచ్చారు’ ‘మీ మనుమలు కూడా మిమ్మల్ని చూడాలనుకున్నారు. కానీ వాళ్లు ఈ టైమ్‌లో నిద్రపోతారు. చిట్టి హాల్ వాడి మూడుచక్రాల సైకిల్ని మీకు చూపించాలని తెగ ఆత్రపడ్డాడు’ అన్నది రత్. ‘తాతగారు ఒక హార్న్ కొని తెచ్చిస్తే దాన్ని ఆ సైకిలుకు బిగించుకుంటాడట’ అన్నాడు జార్జి. ‘నాకు క్రిస్టమస్ అంటే చాలా ఇష్టం నాన్నా!’ మేరీ ఏదో స్వప్నలోకపు గొంతుతో అంటున్నది.. ‘ఆరోజు పరుపు మీంచి లేచేసరికే మధురమైన పాటలు వినపడుతుంటాయి’ అంటూ మంద్రంగా ఒక పాటనూ అందుకుంది. పక్క బెడ్ యువకుడి కళ్ళు సగం తెరుచుకున్నాయి. వారి మాటలూ స్పష్టంగా వినపడుతున్నాయి. అయినా కళ్ళు మూసుకునే మేరీ పాటను విన్నాడు. ముసలాయన ‘నాకన్నీ గుర్తున్నాయి’ అన్నాడు. ‘మీరే మా సర్వస్వం నాన్నా!’ అన్నది మేరీ. ‘నాన్నా! నేను కూడా మీలాగా మంచి నాన్ననౌతాను’ అన్నాడు జార్జి. పక్క బెడ్ యువకుడికి పరిస్థితి బాగా అర్థమౌతోంది. తన పక్కనే వృద్ధుడొకాయన ఉన్నాడనీ అతని చుట్టూ కుటుంబసభ్యులున్నారనీ తెలుస్తున్నది. ‘మీరు చాలా మంచి పిల్లలు’ ముసలాయన మగతగా అన్నాడు. ‘నాకు పదిహేనేళ్లున్నప్పుడు క్రిస్టమస్ చెట్టుమీద నాకోసం మీరు ఒక ఉంగరం పెట్టారు. నాకు ఎమరాల్డ్ మనసులో ఉన్నదని మీకెలా తెలిసిందో ఇప్పటికీ నాకు అర్థంకాదు నాన్నా!’ అన్నది మేరీ. ‘నాకప్పుడు పన్నేండేళ్లనుకుంటా.. మంచుమీద జారే స్టిక్స్.. ఖరీదు ఎక్కువని నేను అడగలేదు. కానీ నా మనసు తెలుసుకొని మీరే కొనిచ్చారు’ అన్నాడు జార్జి. ‘మీ నాన్నకు ఇటువంటివన్నీ ఎవరూ చెప్పకపోయినా అడక్కపోయినా తెలుస్తూంటాయి, ముఖ్యంగా క్రిస్టమస్ రోజుల్లో’ అన్నది మెక్లియాడ్ భార్య. ‘పిల్లల మనసు తల్లిదండ్రులకు గాక ఇంకెవరికి తెలుస్తుంది!’ అన్నాడు వృద్ధుడు. అతని గొంతు వెనక్కు పోతున్నది.. కనురెప్పలూ కొట్టుకొంటున్నాయి. పక్కబెడ్ యువకుడికి బాగా తెలివి వచ్చింది. ఆయా వ్యక్తుల్ని చూడాలనీ, వారి ముఖ కవళికల్ని పరిశీలించాలనీ అనిపించింది. పక్కకు తిరగబోతే మెడ నొప్పెట్టింది. ఇవి క్రిస్టమస్ రోజులని అతనికి గుర్తేలేదు. గుర్తుపెట్టుకొని కూడా చేసేదేమీ లేదు. ‘వచ్చే ఆదివారం ఈస్టర్ పండుగ. ఈ ఏడు ఆరు లిల్లీపువ్వులున్నాయి. ఇంతకుముందెప్పుడో మూడుపువ్వులు ఒక్కసారి పూసినట్లుగుర్తు. అంతేకదా హాల్!’ అన్నది మెక్లియాడ్ భార్య. ‘ కాదు, అయిదు’ అన్నాడు వృద్ధుడు ‘సరిగ్గా చెప్పారు’ అంటూ పిల్లల వైపు తిరిగి ‘చూశారా.. మీ నాన్నకు అన్నీ గుర్తుంటాయి’ అంది. పక్కబెడ్ యువకుడి చెవిలో ఈస్టర్ అన్నమాట పడింది. అవును. జనం కొత్తదుస్తులు వేసుకొని చర్చికి వెళ్తారు. అతడికి కొత్త దుస్తులు కుట్టించేవారు లేరు, కొనుక్కోవడానికి డబ్బూ లేదు. మెక్లియాడ్ కనురెప్పలు వాలిపోతున్నాయి. ఆయన భార్య కుమారుడికి సైగ చేసింది. జార్జి ద్వారం వద్దకు వెళ్లి డాక్టర్ని పిలిచాడు. అతడు వచ్చి మెక్లియాడ్ పల్స్ చూసి.. పెదవి విరిచాడు. మెక్లియాడ్ భార్య ముఖం పాలిపోయింది. ‘పిల్లలూ మీరింక ఇంటికి వెళ్ళండి. నేను మీనాన్నతో పాటు వుంటాను’ అన్నది. ఏదో అర్థమైనట్లు వారు ముఖాలు చూసుకున్నారు. ‘గుడ్ నైట్ నాన్నా!’ అన్నాడు జార్జి. ‘నాన్నా! గుడ్ నైట్ ’ మేరీ తండ్రి పైకి వంగి అతని చెక్కిళ్ళను ముద్దాడింది. అందరూ బరువుగా.. విషాదంగా వెళ్లిపోయారు. వృద్ధులిద్దరూ మిగిలారు. మెక్లియాడ్ కళ్ళు మళ్ళీ నెమ్మదిగా తెరుచు కున్నాయి. కానీ అతడేమీ మాట్లాడలేదు. పక్కబెడ్ యువకుడికి బాగా తెలివి వచ్చింది. ఇద్దరు వృద్ధుల్ని ఆసక్తిగా గమనిస్తున్నాడు. ఇప్పుడు వారు ఏం మాట్లాడుకుంటారు? వృద్ధురాలు ముసలాయనతో ‘హాల్! ఇవన్నీ పాత జ్ఞాపకాలు. ఒకనాటి మధురస్మృతులు. పిల్లల సమక్షంలో కాకుండా కేవలం మనిద్దరం మాత్రమే నెమరు వేసుకోదగ్గవి. మీరొక అపురూపమైన భర్త హాల్! ఒక ఆదర్శ పురుషుడిగా నన్నొక ఆనందమయ ప్రపంచంలోనికి తోడుకెళ్లారు. ఒక బాధ్యతగల స్త్రీమూర్తిగా తీర్చిదిద్దారు. మనం సంతోషంగా గడిపాం. మన సంతానాన్ని మంచి పౌరులుగా తయారుచేశాం’ అంటూ ఆమె ఆగింది. తన గాద్గదిక స్వరాన్ని వినపడనివ్వకుండా తమాయించుకుంది. ‘ఆనాడు ఆ తోటలో ఆ చెర్రీ చెట్టునీడలో నా చేతిని మీ చేతిలోకి తీసుకొని.. ‘‘మనం పెళ్ళిచేసుందామ’’ని మీరు ప్రతిపాదించిన మధుర క్షణాన్ని నేనెప్పటికీ మరిచిపోలేను హాల్! ఆక్షణమే నా జీవితానికి గతినీ గమ్యాన్నీ సమకూర్చిపెట్టింది. మీ వెనుకనే అడుగులో అడుగేసుకొంటూ ఆనందధామాలవైపు పయనించేటట్టు చేసింది.’ ఆమె అలా మాట్లాడుతుండగానే అతని చెయ్యి ఆమె చేతికోసం వెతికింది. ఆ చేతిని ఆమె తన రెండుచేతుల్లోనికీ తీసుకొని హృదయానికి హత్తుకుంది. ‘నేనిక్కడే వున్నాను ప్రియతమా!’ ఆమె గొంతు జీరబోయింది. ఒక్కసారిగా బిగ్గరగా ఏడవాలనిపించింది. కానీ పెదవుల్ని బిగబట్టుకున్నది. ‘మార్తా!’ ఆ పిలుపు ఏ దిగంతాలనుండో శూన్యాన్నీ గాలినీ మేఘాల్నీ చీల్చుకొని ప్రతిధ్వనించినట్టు అక్కడి నిశ్శబ్దాన్ని భగ్నం చేసింది. ‘అవును హాల్! నేనిక్కడే వున్నాను. మీ తోనే వున్నాను’ మెక్లియాడ్ హఠాత్తుగా కళ్ళు తెరిచాడు. ఆమెని చూసి చిరునవ్వు నవ్వాడు. ‘మార్తా... మార్తా.. నువ్వు.. నువ్వు.. నాకొక.. అద్భుతమైన జీవితాన్ని..’ అతని మాట, గది బయటి నిశీధిలోనికీ నిశ్శబ్దంలోనికీ శోషణ చెంది పోయింది. ఆమె చేతిలోంచి అతనిచెయ్యి కిందకు జారిపోయింది. కనురెప్పలు వాలిపోయాయి. ముసలాయన చనిపోతున్నాడు. పక్కబెడ్ యువకుడికి ఏడుపొస్తున్నది. వ్యక్తులతో పరిచయంలేకపోయినా మరణానికి సాక్షిగా ఉండవలసివస్తే దుఃఖంకట్టలు తెంచుకొంటుంది. అతనిది నిర్లిప్తమైన జీవితం. తండ్రి ఎవరో తెలీదు. పసికందుగా ఉన్నప్పుడే తల్లి చనిపోయింది. అనాథాశ్రమంలో వందలమంది పిల్లలమధ్య ఒంటరిగా పెరిగాడు. అనురాగమూ ఆప్యాయతా మొదలైన స్పందనలు అసలే తెలీవు. ఎవరో తిండిపెడితే ఎందుకో పెరిగాడు. అంతే! ఆమె మౌనంగా ఏడుస్తోంది. భర్త చేతిని నెమ్మదిగా కిందపెట్టి తన చేతిసంచి లోంచి చిన్నపుస్తకాన్ని తీసి చదవటంమొదలు పెట్టింది ‘దేవుడే నా రక్షకుడు. నేనింకేమీ కోరను’ పక్కబెడ్ యువకుడు ఈమాటల్ని ఒకనాటి అనాథాశ్రమం సండే స్కూల్లో తరచుగా వినేవాడు. ఆనాడు అవి అర్థంతెలీని విడి విడి పదాలు మాత్రమే. ఇప్పుడు హఠాత్తుగా ఆ మాటలకు అర్థమూ అన్వయమూ అతడికి స్ఫురించింది . ‘మృత్యుగహ్వరపు నీడలో నడిచినా నేను భీతిల్లను. మేమంతా నిన్ను ప్రేమిస్తున్నాం.. నువ్వు మాతోనే ఉంటావు.. మాలోనే ఉంటావు’ స్వర్గద్వారంలో ప్రవేశిస్తున్న భర్తకు భరోసా ఇస్తున్నది. అంతేకాదు గతంలో ఇద్దరి జీవన గమనానికీ, మనసు లోతులకు మాత్రమే సంబంధించిన ఎన్నో అంశాల్ని స్మరించుకొంటున్నది. పంచుకొన్న కష్టసుఖాలనూ, భరించిన కలిమి లేములనూ తలచుకొని విలపిస్తున్నది. ఆమె గ్రంథాన్ని మూసివేసి, కొంతసేపు కనులు మూసుకొని మౌనంగా కూర్చున్నది. పక్కబెడ్ యువకుడు దిండుపైన ఒత్తిగిల్లాడు. ఇప్పుడతనికి ఏడవాలనిపించడంలేదు. ఆమె లేచి భర్త శరీరంపై వొంగి, అతడి పెదవుల్ని ముద్దాడింది.‘ప్రియతమా.. నీకు వీడ్కోలు.. మనం పైలోకంలో కలుసుకునే వరకూ..’ కనులు తుడుచుకొని ద్వారం వద్దకు వెళ్లి డాక్టర్ని పిలిచింది. డాక్టరు వచ్చిమరోసారి పల్స్ చూశాడు. ‘అంతా అయిపోయింది. మీరు చాలా ధైర్యవంతులు’ అన్నాడు. ‘దేవుడే ధైర్యాన్నిస్తాడు డాక్టర్’ ‘అవును. నిజంగా అంతే!’ ‘అంబులెన్సు వస్తే ఫోన్ చెయ్యండి. మాఇల్లు దగ్గరే’ అని చెప్పి ఆమె వదల్లేక వదల్లేక తడబడుతూ వెళ్ళిపోయింది. పక్కబెడ్ యువకుడు వెల్లకిలాపడుకొని నిదానంగా పైకప్పు వైపు చూస్తున్నాడు. గతంలో అతనికెప్పుడూ జీవితమంటే ఏమిటో ఎందుకో ఎవరికోసమో తెలీలేదు. కానీ ఇప్పుడు స్పష్టంగా తెలుస్తున్నది. ఒకర్ని ప్రేమించి కలసి జీవించి ఒక కుటుంబాన్ని నిర్మించడమే జీవితానికి సార్థకత అనిపిస్తున్నది. ఆది మానవుడి గుహాంతర జీవనసరళి మొదలు ఈనాటి గ్రహాంతరవాసం వరకూ అదే మనిషికి గమ్యం. బంధాలూ అనుబంధాలూ ఆత్మీయతలూ ఒడిసి పట్టుకున్న సుదీర్ఘమైన జీవనయానంలో అనుభూతుల విలువలే వెలుగులు. కన్నీళ్లూ చిరునవ్వులే మైలురాళ్లు. డ్యూటీ డాక్టరు వచ్చి యువకుడు తెలివిగా ఉండటాన్ని గమనించి ‘ఓయ్ అబ్బాయ్.. ఎంత సేపటి నుంచి మేలుకొని ఉన్నావ్?’ అని అడిగాడు. యువకుడు చిరునవ్వు నవ్వుతూ ‘ఒక అరగంట కావచ్చు’ అని బదులిచ్చాడు. డాక్టరు గాభరా పడ్డాడుతూ ‘నువ్వు ఇదంతా చూడటం ఏమీ బాగాలేదయ్యా!’ అంటూ వెంటనే కాలింగ్ బెల్ నొక్కాడు. నర్స్ వచ్చింది. ‘ఇక్కడొక తెర కట్టు’ అని పురమాయించాడు డాక్టర్. ఆమె వెళ్లి తెర తెచ్చి కట్టింది. అంతలోనే ఇద్దరు మనుషులు స్ట్రెచర్ తెచ్చి వృద్ధుడి శవాన్ని వెలుపలికి తీసుకుపోయారు. యువకుడి మెదడులో ఆలోచనల కల్లోలతరంగాలు కదలాడసాగాయి. ‘ఇంట్లో ఈసరికి జార్జి తల్లిని ఓదారుస్తుంటాడు. మేరీ తండ్రి లేని వెలితికి కుంగిపోతూ ఉంటుంది. ఎవరెన్ని చెప్పినా వృద్ధురాలు భర్తని మరచిపోలేదు. ఎన్నో దశాబ్దాల దాంపత్య బంధం.. అంత త్వరగా చెరిగిపోతుందా! అసలు ప్రేమే అమరమైంది..’ అలా.. అలా.. ఆలోచిస్తుండగా యువకుడికి నిద్రపట్టేసింది. యువకుడు ఉదయం ఆలస్యంగాలేచాడు. గది పరిశుభ్రంగా ఉంది. తెరనీ తీసివేశారు. ఇప్పుడతని పక్కబెడ్ ఖాళీగా ఉన్నది. దానిమీద కొత్త బెడ్ షీట్లు పరచారు. కొద్దిగంటల కిందట ఆ బెడ్ మీద తుదిశ్వాస విడిచిన ఒక ముసలాయన.. ఆయనచుట్టూ పెనవేసుకున్న బంధాలూ బాంధవ్యాలూ జ్ఞాపకాలూ.. చివరకు మిగిలేవి.. ఇవే! జీవితానికి గతినీ గమ్యాన్నీ ఇచ్చేవి.. ఇవే! కిటికీలోంచి ఉదయకిరణాలు యువకుడి బెడ్ మీద పడుతున్నాయి. జీవితంలో తొలిసారిగా తాను ఒంటరి వాడిననే భావం తొలిగిపోయింది. ఇక సోమరిగా విచ్చలవిడిగా దేశ దిమ్మరిలాగా తిరక్కూడదనే నిశ్చయానికి వచ్చాడు.. భవిష్యత్ మీద ఆశలు చిగురించాయి. తనొక ఉపాధిని సంపాదించుకోవాలి. ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలి. కొత్త జీవితాన్ని మొదలుపెట్టాలి. అప్పుడెప్పుడో తనబాల్యంలో అనాథాశ్రమంలో ఉన్నప్పుడు ఒక మూడు చక్రాల సైకిలు కోసం అహోరాత్రాలూ పరితపించాడు. ఒక్కసారంటే ఒకే ఒక్కసారి దానిమీద కూర్చొని తొక్కాలనే కోరిక ఇప్పటికీ తీరనే లేదు. ఆ వెలితి, గుండె మీది వ్రణంలాగా ఇన్నేళ్ల తరువాత కూడా నొప్పిగానే ఉంటుంది. అటువంటి చిరుకోరికలు తీరాలన్నా తీర్చాలన్నా ఆత్మీయులుండాలి. ఒక కుటుంబంలో సభ్యుడై ఉండాలి. జీవితానికొక గమ్యమూ అర్థమూ పరమార్థమూ ఉండాలి. నర్స్లోని కొచ్చింది. రాత్రి డ్యూటీ చేసినప్పటికీ ఆమె ఉత్సాహంగా ఉంది. ‘అబ్బాయీ! అల్పాహారం తీసుకుంటావా?’ ఆప్యాయంగా అడిగింది. యువకుడు నవ్వాడు. ‘నాకిప్పుడు బాగానేవుంది సిస్టర్! దయచేసి మంచి భోజనమే తెప్పించండి. చాలా ఆకలిగావుంది’ అన్నాడు. అతనికళ్ళల్లో ఆమెకొక స్పష్టమైన కాంతిరేఖ కనపడింది. -మూలం : పెర్ల్ ఎస్ . బక్ - అనువాదం: టి . షణ్ముఖ రావు -
అనుబంధం
రోజలీనా ఆ మూడు కొబ్బరిచెట్లకూ తన పిల్లల పేర్లు పెట్టుకుంది: ఏంజిలా, ఆంథోనీ, ఏబెల్. ఇప్పుడు మొదటి రెండు చెట్లకు నీరు పొయ్యడం పూర్తయింది. పైపు పట్టుకుని మూడో చెట్టు వద్దకు వచ్చింది. ఏబెల్ ఇంకా చిన్న చెట్టే. ఇప్పుడిప్పుడే కాపుకొస్తోంది. అంతలో ఇంటి ముందు కంచెకు ఆవల సైకిలు బెల్ మోత వినపడింది. రోజలీనా నీటిపైపును ఏబెల్ చెట్టు మొదట్లో పడవేసి గేటు వద్దకు పరుగు తీసింది. పోస్ట్‌మేన్ వాసు వచ్చాడు. ‘‘అమ్మా! మధ్యాహ్నం కావస్తోంది. నువ్వింకా చెట్లకు నీరు పెట్టడం పూర్తి కాలేదా?’’ అంటూ ప్రవేశించాడు. సైకిలును కంచె వెలుపల విడిచిపెట్టాడు. ‘‘రాత్రి నిద్ర పట్టలేదు నాయనా! వేకువనే కునుకు పట్టేసింది. తీరా లేచే సరికి బాగా పొద్దెక్కిపోయింది’’ అంది రోజలీనా. వాసు ఆ ఉత్తరాన్ని చేతికి అందివ్వకుండానే అది ఆంథోనీ నుంచేనని ఆమె గ్రహించింది. దాని కోసమే ఆమె కొద్ది రోజులుగా వెయ్యి కళ్లతో ఎదురు చూస్తోంది. ఆ భూసేకరణ తాఖీదును అందుకున్నప్పటి నుంచి రోజలీనా ఎంతో ఆందోళన చెందుతోంది. ‘‘అబ్బాయి ఆ ఉత్తరంలో ఏం రాశాడో? నా ఉత్తరం వాడికి అందే ఉంటుంది. రావాలని నిర్ణయించుకున్నాడో లేక రాలేనని చెప్పబోతున్నాడో?’’ ఇలా ఆలోచిస్తూ ఉత్తరం చదవడానికి ఆత్రపడుతోంది. కాని వయసు ప్రభావం వల్ల ఈ మధ్య ఆమె దృష్టి మందగించింది. తన భర్త ఉన్నంతకాలమూ ఇతరుల సహాయం అవసరమయ్యేది కాదు. కాని రెండేళ్ల కిందట అతడు హఠాత్తుగా గుండెపోటుతో చనిపోయాడు. ఇప్పుడామె ఒంటరిదైపోయింది. ఉత్తరం చదవడానికి బయటివారి మీద ఆధారపడటం తప్పనిసరి అవుతోంది. ఒక పెద్ద గ్లాసుతో పోస్ట్‌మేన్‌కు మంచినీరు అందించింది. ‘ఇతడినే ఉత్తరం చదివి పెట్టమని ఎందుకు అడక్కూడదు?’ అనుకుంది. ‘‘ఈ ఉత్తరం చదివి అందులో ఏముందో చెప్పు..’’ అని అడిగింది. ‘‘తప్పకుండా! రహస్యాలేమీ ఉండవు కదా!’’ ఛలోక్తిగా అంటూ కవరు అందుకుని తెరిచాడు. ఈ మధ్య ఆంథోనీ తను చదవడానికి వీలుగా ఉత్తరాన్ని టైప్ చేసి పంపుతున్నాడు. కాని భర్త చనిపోయిన తర్వాత ఆమె బాగా కుంగిపోయింది. ఆరోగ్యం కూడా క్షీణించసాగింది. ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతోంది. ఒక చిన్న ఉత్తరం చదవడానికి చాలాసేపు పడుతోంది. అయినప్పటికీ ఉత్తరంలోని అంశాలను నిర్ధారించుకోవడానికి పొరుగింటామెపై ఆధారపడక తప్పడంలేదు. ఉత్తరం చూస్తూ వాసు ఇలా చెప్పాడు: ‘‘అమ్మా! ఇది ఆంథోనీ నుంచి వచ్చింది. ఈ నెలాఖర్లో భార్యా పిల్లలతో ఇక్కడకు రావడానికి ప్రయత్నిస్తున్నట్లు రాశాడు. ఏబెల్ అతడికి ఉత్తరం రాశాడట. ఏబెల్ ఒక ఆస్ట్రేలియన్ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నాడట. అందుకోసం కువైట్ నుంచి ఆంథోనీ, బహ్రెయిన్ నుంచి అక్క ఏంజిలా ఆస్ట్రేలియా వెళుతున్నారట. వివాహం డిసెంబరులో జరుగుతుంది. ఆంథోనీ తిరిగి వచ్చి వివరాలన్నీ ఉత్తరం రాస్తాడట. ఇక పైకి చదవనా అమ్మా!’’ ఈ వార్తలను ఒకేసారి అవగాహన చేసుకునే స్థితిలో రోజలీనా లేదు. ఆమె మనస్సు పరిపరివిధాలుగా పోతోంది. ఒక్కసారిగా వర్తమానంలోకి వచ్చి ‘‘అవసరం లేదు నాయనా! విషయం అర్థమైపోయింది. సరే! దేవుడు నిన్ను దీవిస్తాడు. వెళ్లిరా!’’ వాసు తన సైకిలు తీసుకుని వెళ్లిపోయాడు. రోజలీనా వరండాలోనే ఒక కుర్చీలో కూలబడిపోయింది. ‘‘సరి.. ఇక చివరి పక్షి ఏబెల్ కూడా తన గూడు నిర్మించుకుంటున్నాడు. నిజానికి వాడు ఉద్యోగం కోసం ఆస్ట్రేలియా వెళ్లాడు. అక్కడి అమ్మాయినే పెళ్లి చేసుకుంటున్నాడు. అక్కడ స్థిరపడిపోతాడు. భార్యను తీసుకుని గోవా వస్తాడు. వస్తాడా? రాడా? తప్పకుండా వస్తాడు. తండ్రి చనిపోయినప్పుడూ అందరూ వచ్చి వెళ్లారు. అలాగే తల్లి చనిపోయినప్పుడూ అందరూ వస్తారు. అందరికన్నా చిన్నవాడు గోవాలోనే స్థిరపడి తనకు ఆసరాగా ఉంటాడనుకుంది. ఆ ఆశలు అడియాసలవుతున్నాయి. తను ఒంటరిగానే జీవిస్తుంది. ఒంటరిగానే కాలం చేస్తుంది.’’ ఇంతలో బయటి నుంచి ఎవరో పిలిచారు. ‘‘అమ్మా! ఇంట్లోనే ఉన్నారా? కుళాయి విప్పే ఉంది. కట్టడం మర్చిపోయినట్లున్నారు’’ తన ఆలోచనలను ఆపి పరుగెత్తుకుంటూ వెళ్లి కుళాయిని కట్టింది. చెట్లకు నీరు పోసే పైపుని వేరు చేసి దాన్ని చుట్టగా చుట్టి ఒక స్తంభానికి వేలాడదీసింది. ఇంటి లోపలికి వెళ్లింది. పొయ్యి మీద గంజి ఉడుకుతోంది. ఆమెకు ఇప్పుడు ఆకలిగా లేదు. తినాలనీ లేదు. మరింత దగ్గరగా మరిగించాలని నిర్ణయించుకుంది. అప్పుడు మరి కూర చేసే శ్రమ ఉండదు. కేవలం ఒక ఆవకాయ ముక్క ఉంటే చాలు. భర్త చనిపోయిన తర్వాత కూర అరుదుగా వండుతోంది. కొద్ది రోజుల కిందట భూసేకరణ తాఖీదు అందిన తర్వాత ఆకలి పూర్తిగా చచ్చిపోయింది. తన భర్త చనిపోయినప్పుడు అందరు పిల్లలూ ఇంటికి పరుగెత్తుకుని వచ్చారు. అందరికన్నా పెద్దది ఏంజిలా బహ్రెయిన్ నుంచి వచ్చింది. రెండోవాడు ఆంథోనీ కువైట్ నుంచి వచ్చాడు. ఏబెల్ చిన్నవాడు. అంత్యక్రియలకు హాజరు కాలేకపోయినా, ఆస్ట్రేలియా నుంచి వచ్చాడు. ఏంజిలా ఒక నెలరోజుల పాటు ఉంది. కాని అబ్బాయిలు ఇద్దరూ కార్యక్రమాలు పూర్తయిన రెండు వారాల లోపే తిరిగి వెళ్లిపోయారు. కువైట్ బయలుదేరుతూ ఆంథోనీ ఇలా అన్నాడు: ‘‘అమ్మా! మన ఇంటి పక్క నుంచి ఒక కొత్త రైల్వేలైను పడబోతోంది. మనకు చాలా సౌకర్యంగా ఉంటుంది. నువ్వు ఇక్కడ ఇంటి వద్ద ఉదయం రైలు ఎక్కితే సాయంత్రానికి బొంబాయి చేరుకుంటావు.’’ ఈ ఆలోచన ఏంజిలాకూ సంతోషం కలిగించింది. ఇంటికి తాకుతూనే రైల్వేలైను ప్రతిపాదన అందరిలోనూ ఒక ఉత్సాహాన్నీ ఉద్వేగాన్నీ నింపింది. కాని ఈ రైల్వే భూతం నేరుగా తమ ఇంటి కంచె లోనికే ప్రవేశిస్తుందని ఎవరూ ఊహించలేకపోయారు. భూసేకరణ ఆఫీసు నుంచి గుమస్తా తాఖీదు అందజెయ్యడానికి వచ్చినప్పుడు ఆ కాగితాన్ని అందుకోవడానికి రోజలీనా సందేహించింది. భర్త బతికి ఉండగా ఆమె ఏ అంశంలోనూ తలదూర్చి నిర్ణయం తీసుకోవలసిన అవసరం ఉండేది కాదు. అన్నీ ఆయనే చూసుకునేవాడు. నోటీసు వచ్చినప్పుడు తన సంతానంలో ఒక్కరైనా ఉండి ఉంటే బావుండేదని భావించింది. ఆమె వైఖరిని చూసి ఆ గుమస్తా ధైర్యం చెప్పాడు. ‘‘ఇటువంటి నోటీసులు మన ఊళ్లో చాలామందికి వచ్చాయి. మీరొక్కరే బాధపడనక్కర్లేదు. నిజానికి మీది చాలా చిన్న ముక్క. ఎంతోమంది తమ విశాలమైన పొలాలనూ తోటలనూ వదులుకోవలసి వస్తుంది’’ అన్నాడు. ‘‘మరి ఇంత భూమి వాళ్లేం చేస్తారు?’’ రోజలీనా అమాయకంగా ప్రశ్నించింది. ‘‘అమ్మా! అది వారి విధానం. ప్రతిపాదించిన రైల్వేలైనుకు ఇరువైపులా భూమిని సేకరిస్తున్నారు. అంతే.. మీకెందుకు విచారం? ఇక్కడ సంతకం పెట్టండి చాలు..’’ అన్నాడతను. సందేహిస్తూనే రోజలీనా సంతకం చేసింది. అప్పటికి ఆమెకు వివరాలేవీ తెలీవు. ఒకసారి పోస్ట్‌మేన్ అన్నాడు: ‘‘బహుశా మీ కంచెలో కొంత భాగం, దాంతోపాటు మరికొన్ని చెట్లు కూడా పోవచ్చు.’’ ‘‘సరిగ్గా కంచెలో ఎంత భాగం, ఏ చెట్లు పోతాయో చెప్పగలవా?’’ ఆమె ఆత్రంగా అడిగింది. ‘‘మా పంట పొలంతో కలసి ఉన్న భాగం పోవచ్చు. మావి ఇరవైనాలుగు కొబ్బరిచెట్లు, ఒక మామిడిచెట్టు, మర్రిచెట్టు, మా పశువులశాల కూడా పోతున్నాయి. కాబట్టి మీ కంచె ముందు భాగం దాంతో పాటు ఆ గేటూ, కొబ్బరిచెట్లూ, ఆ బోగన్విల్లా పొద పోవచ్చు.’’ పోస్ట్‌మేన్ కచ్చితంగా అంచనా వేసి చెప్పాడు. ఈ మాటతో రోజలీనా మనసు చెదిరిపోయింది. ముఖ్యంగా కొబ్బరిచెట్లు పోతాయనే విషయం ఆమె జీర్ణించుకోలేకపోతోంది. ఆ రోజు ఆమెకు పీడకల వంటిది. ఆమె ముగ్గురు పిల్లల పేరున నాటిన మూడు కొబ్బరి మొక్కలూ ఆరోగ్యవంతమైన చెట్లుగా ఎదిగాయి. ఆమె తల్లిప్రేమ సముద్రాలకావల ఉన్న వారికి నేరుగా చేరలేకున్నా ఈ కొబ్బరిచెట్లపై ప్రసరిస్తోంది. ఆమె ఒక విధమైన సంతోషాన్నీ, సాంత్వననీ పొందుతోంది. ఆమె దృష్టిలో అవి చెట్లు కావు. కడుపున పుట్టిన బిడ్డలే. వారి పేర్లతోనే ఆ చెట్లను పిలుస్తుంది. ఆమె భర్త అంటూ ఉండేవాడు: ‘‘ఆ చెట్లపైన అంత మమకారం పెంచుకోవద్దు సుమా! ఎందుకంటే అవి కేవలం చెట్లు మాత్రమే. రేప్పొద్దున్న గాలికీ తుఫానుకీ ఏ చెట్టయినా కూలిపోతే నీ గుండె బద్దలవుతుంది.’’ ఆ మాటకు రోజలీనాకు కోపం వచ్చేది. ‘‘ఇవి ఎందుకు పడిపోతాయి? పడితే నా మీదనే పడాలి. ఏ ఒక్కటైనా విరిగితే దాంతో పాటు నేను కూడా కూలిపోవాలి...’’ ‘‘నేనన్నదీ అదే!’’ పదహారేళ్ల కిందట ముగ్గురిలో పెద్దది ఏంజిలా బడి నుంచి ఒక కొబ్బరి మొక్కను తెచ్చింది: ‘‘అమ్మా! మన ఎమ్మెల్యేగారు కొబ్బరి మొక్కలను పెంచుతున్నారు. నేను కూడా ఒకటి తెచ్చాను. మన ఇంటి ఆవరణలో నాటుదాం...’’ అంది. అప్పటికి భర్త కువైట్‌లో పనిచేస్తూ సెలవు మీద వచ్చి ఉన్నాడు. రోజలీనా అతనితో అంది: ‘‘ఈ మొక్కను వాకిట్లో నాటుదాం. ఏంజిలా పెద్దదయి అత్తవారింటికి పోతుంది. కాని ఈ మొక్క ఇక్కడే ఉండి దాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది.’’ ఆ మాట అనగానే భర్త ఆ మొక్కని తన చేతుల్తో నాటి పెట్టాడు. చెట్టు పెరిగి కాయలు కాయక ముందే ఏంజిలా పెళ్లి చేసుకుని బహ్రెయిన్ వెళ్లిపోయింది. భర్త కువైట్ నుంచి ఆంథోనీకి వీసా పంపాడు. అప్పటికి వాడు కాలేజీలో చదువుతున్నాడు. అయినా వెళ్లిపోయాడు. ఈ మార్పులన్నీ త్వరగా జరిగిపోయాయి. ఏబెల్ ఇంకా బడిలోనే ఉన్నాడు. ఆంథోనీ అందుబాటులో లేకపోయినా చిన్నవాడు ఏబెల్ గోవాలోనే ఉంటాడనీ తనకు తోడుగా ఉంటాడనీ భావించింది. ఆంథోనీకి ఆమె భర్త పోలికలు ఉంటాయి. కచ్చితంగా వాడు ఇంటి బాధ్యతలను నెత్తికి ఎత్తుకుంటాడనీ తలచింది. ఆంథోనీ వెళ్లే ముందు అతడితో ఇలా అంది: ‘‘నాయనా! నువ్వు వెళ్లిపోతే నా జీవితంలో వెలితి ఏర్పడుతుంది. కానీ కేవలం నీ భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని నిన్ను నేను ఆపదలచుకోలేదు. కాని ఒక కొబ్బరిమొక్కను తెచ్చి ఈ అక్క మొక్క పక్కనే నాటు. అది నిన్ను గుర్తు చేస్తూ ఉంటుంది.’’ ఆ ప్రకారమే ఆంథోనీ బెనాలియా నర్సరీకి వెళ్లి ఒక కొబ్బరి మొక్కను తెచ్చాడు. దాన్ని రోజలీనా అతడి చేతనే నాటించింది. ఈరోజు అది బాగా పెద్దదయి కాయలు కాస్తోంది. భర్త రిటైరై కువైట్ నుంచి ఇంటికి రావడం, ఏబెల్కు ఉద్యోగం వచ్చి ఆస్ట్రేలియా వెళ్లిపోవడం ఒకేసారి జరిగాయి. ఈ రెండు మార్పులూ రోజలీనాలో మిశ్రమానుభూతులు కలిగించాయి. ఏబెల్ బయలుదేరే ముందురోజే ఎవరూ చెప్పకుండానే నర్సరీకి వెళ్లి ఒక కొబ్బరి మొక్కను తెచ్చి గత రెండింటి పక్కనే చేత్తో నాటాడు. తల్లి పట్ల కుమారుడికి గల తపనకూ బాధ్యతకూ రోజలీనా ఎంతో ముచ్చటపడింది. వార్ధక్యంలో భర్త ఇంటి వద్దనే ఉండటం ఆమెకు ఎంతో ధైర్యాన్నిచ్చింది. కానీ తన ముగ్గురు పిల్లల గురించి మాత్రం ఆందోళన చెందడం మానలేదు. భర్త సాయంత్రం వ్యాహ్యాళికి వెళ్లేవాడు. ఆ సమయంలో రోజలీనా ఒంటరిగా ఇంటి వద్ద మిగిలిపోయేది. పిల్లలను తలచుకుని దిగులుపడేది. నూతి వద్దకు వెళ్లి ఒక డజను బకెట్ల నీరు తెచ్చి పిల్లల పేర్లు గల చెట్ల మొదళ్లలో పోసేది. ‘‘ఇలా పెంచుకున్న చెట్లను ఇప్పుడు నరికివేస్తారా? ఇక నేను మాత్రం బతికి ప్రయోజనమేమిటి?’’ ఆమెకు కోపం వచ్చింది. భయమూ వేసింది. ఆ నిద్రలేని రాత్రి తర్వాత వేకువనే త్వరగా లేచింది. పొరుగామె ఇంటికి వెళ్లింది. ‘‘జాక్విమ్! అయితే నా కొబ్బరిచెట్లను కొట్టేస్తారంటావా?’’ ‘‘నేనూ ఆ మాటే విన్నాను. వచ్చి నష్టపరిహారం డబ్బు కూడా తీసుకొమ్మని కబురు చేస్తున్నారు. మన నేలను వారు ఉచితంగా తీసుకోవడం లేదు. పరిహారం కూడా బాగానే ఉందనిపిస్తోంది.’’ రోజలీనా చాలా చికాకుపడిపోయింది. ‘‘నాకు వారిచ్చే డబ్బు అవసరం లేదు. నా బాధ వారికేం తెలుసు? నా చెట్లకు ధర కట్టడానికి వారెవరు?’’ అంటూ భూసేకరణ చేసేవారిని తిట్టుకుంటూ ఇంటికి తిరిగి వచ్చింది. చాలామంది నష్టపరిహారం డబ్బు తీసుకున్నారు. కొంతమంది మరింత ధర కోరుతూ అప్పీలు చేసుకున్నారు. పొరుగామె తండ్రి కూడా తన మొత్తాన్ని అందుకున్నాడు. కాని రోజలీనా మాత్రం తీసుకోలేదు. ఆమె అసలు ఆ ఆఫీసుకే వెళ్లలేదు. కాని ఒక్క పని మాత్రం చేసింది. వెంటనే ఇంటికి రమ్మని ఆంథోనీకి ఉత్తరం రాసింది. అయినా వాడొస్తాడని ఆమెకు పూర్తి నమ్మకం కలగడంలేదు. ఈ మధ్య వారికి గోవా రావాలనే కోరిక తగ్గింద. ఎవరి జీవితాల్లో వారు మునిగిపోయారు. పెద్దది ఏంజిలా తన కుటుంబ వ్యవహారాల్లో తలమునకలై ఉంది. ఆంథోనీ కూడా దూరమైపోతున్నాడు. గతంలో ప్రతి రెండేళ్లకు ఒకసారి తప్పనిసరిగా వచ్చేవాడు. ఏడేళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అంతటితో అతడు ఇంటికి రావడం తగ్గిపోయింది. అతడా అమ్మాయిని కువైట్‌లోనే కలుసుకున్నాడు. ఆమె కూడా అక్కడే పనిచేస్తోంది. ఆమె కుటుంబమంతా బొంబాయిలోనే ఉంటారు. కాబట్టి వివాహం అక్కడే జరిగింది. తన భర్తకు సెలవు దొరక్క రాలేకపోయాడు. కాని ఆంథోనీ తల్లిని పెళ్లికి బొంబాయి తీసుకువెళ్లాడు. పెళ్లి తర్వాత ఆంథోనీ మూడేళ్లకు గోవా వచ్చాడు. అది కూడా భార్యనీ కుమారుడ్నీ తీసుకొచ్చాడు. ఆ తర్వాత తండ్రి అంత్యక్రియలకు వచ్చాడు. ఈసారి కుమార్తెనూ తీసుకొచ్చాడు. తన భార్యా ఇద్దరు పిల్లలతో పడితేనే అతడికి సరిపోయింది. తల్లిని ఓదారుస్తూ కూర్చోవడానికి సమయాన్ని కేటాయించలేకపోయాడు. ఇప్పుడు ఆంథోనీ నుంచి ఉత్తరం వచ్చింది. తప్పకుండా రాగలడని రోజలీనా నమ్ముతోంది. దాంతో కొంత ఉపశమనం కలిగింది. ఆంథోనీకి తండ్రి పోలికలు ఎక్కువ. ఏ విషయంలోనైనా కచ్చితంగా ఉంటాడు. ఒకసారి ఇంటికి వస్తే అన్ని వ్యవహారాలనూ చక్కబెట్టగలడు. భర్త మరణం వల్ల ఏర్పడిన శూన్యం, ఒంటరితనం ఆమెకు చాలా బాధాకరంగా ఉన్నాయి. మనసు విప్పి మాట్లాడుకోవడానికి ఎవరూ లేరు. ఆ చెట్లను చూస్తూ గంటల తరబడి కూర్చుండిపోతుంది. ఎదురుగా లేని పిల్లలతో సంభాషిస్తుంది. ‘‘ఏంజిలా! మీ నాన్న నీ పెళ్లి ఘనంగా చేశాడు. డ్రింకులు వరదనీటిలా ప్రవహించాయి. గుర్తుందా!’’ ‘‘నాన్నా! ఆంథోనీ! మీ కోసమే మీ నాన్న ఈ ఇంటిని చెమటోడ్చి కట్టారు. మీ అమ్మను మరచిపోవద్దు.’’ ‘‘నాన్నా! ఏబెల్! అందరికన్నా చిన్నవాడివి. నువ్వే నాకు అత్యంత ప్రీతిపాత్రుడివని గుర్తుపెట్టుకో!’’ ఆమె ఇలా ఉండగా పైపునీరు వృథా కావచ్చు. లేక పొయ్యి మీద వంటకం మాడిపోవచ్చు. మరో వారం తర్వాత ఏబెల్ నుంచి ఉత్తరం వచ్చింది. తన కాబోయే భార్య వివరాలు రాశాడు. పెళ్లికి రాగలవా అని రాశాడు. ఆమె దీర్ఘంగా నిట్టూర్చింది. ఏదో ఒకరోజు ఏబెల్ యాత్రికుడిలాగా తన భార్యాపిల్లలతో గోవా సందర్శిస్తాడు. ఆ దృశ్యం ఆమె కళ్లకు కట్టినట్టుగా ఉంది. ‘‘ఇది బేసిలికా చర్చి.. ఇది ప్రఖ్యాతమైన కాలంగూట్ బీచ్.. ఇది డోనా పౌలా.. ఇది మాండొవీ నది.. ఇది నా చిన్నప్పటి ఇల్లు.. ఈమె నా తల్లి..’’ ఇక్కడ ఫొటోలు తీసి తన ఆల్బమ్ కోసం ఆస్ట్రేలియా తీసుకెళ్తాడు. అంతే! మళ్లీ ఎన్నాళ్లకో! ఈలోగా తన జీవితమే ముగిసిపోవచ్చు. ఆరోజు ఆమె ఏబెల్ చెట్టు వద్ద సుమారు నాలుగు గంటల పాటు తన దిగులంతా ఒలకబోసుకుని వెక్కివెక్కి ఏడ్చింది. ఒక అభద్రతాభావంతో కుంగిపోయింది. ఆంథోనీ ఉత్తరం వచ్చి సుమారు నెల గడిచింది. అతడు బొంబాయి చేరుకున్నాడని, ఒక వారంలోగా గోవా రానున్నాడని ఎవరో సమాచారం ఇచ్చారు. అతడికి ఇష్టమైన పదార్థాలన్నీ చేస్తూ ఆ వారమంతా ఎదురు చూడసాగింది. ఆమె ఆలోచనలను భంగం చేస్తూ ఇరుగు పొరుగు పిల్లలు రోజలీనాను పిలిచారు. ‘‘అమ్మా! అమ్మా! బయటకు రా! మీ చెట్లు కొట్టడానికి వచ్చారు..’’ ఆమె ఒక్కసారిగా నిశ్చేష్టురాలైంది. ఎవరో తన తలపైకి గొడ్డలి ఎక్కుపెట్టినట్టుగా అనిపించింది. మరుక్షణం ఇంటి బయటకు పరుగెత్తింది. కొందరు కూలీలు గొడ్డళ్లతో సిద్ధంగా ఉన్నారు. గేటు వద్ద ఇద్దరు ఉద్యోగులు ఉన్నారు. ఒకతను చేతిలోని ఫైలును చూస్తూ.. ‘‘అమ్మా! మీరు రోజలీనా ఫెర్నాండెజ్ ఔనా?’’ అని అడిగాడు. ఆమె తల ఊపింది. ‘‘మేం మీ కంచె, ముందు భాగమూ తొలగించడానికి వచ్చాం. ఇక్కడున్న పొదలూ ఆ మూడు కొబ్బరిచెట్లూ తెగిపోతాయి. మీరింకా నష్టపరిహారపు మొత్తం తీసుకున్నట్లుగా లేదు.’’ రోజలీనా కోపంతో వణికింది. ‘‘ఆ కొబ్బరిచెట్లను తాకడానికి వీల్లేదు.’’ ‘‘అమ్మా! వినండి. మేం ప్రభుత్వోద్యోగులం. మా చేతిలో ఏమీ లేదు. మీవి మాత్రమే కాదు. చాలామంది చెట్లను ఈరోజు కొట్టాల్సి ఉంది. దయచేసి మా పనిని ఆపి మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు. కూలీలారా! రండి ముందు కంచె తొలగించండి’’ అధికారపూర్వకమైన అతడి స్వరానికి రోజలీనా జంకింది. ‘‘ఆ నేల తీసుకోండి. నాకేమీ అభ్యంతరం లేదు. కాని చెట్లను మాత్రం కొట్టకండి. మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను.’’ ఆమె ఉద్యోగి ముందు మోకరిల్లింది. ‘‘అమ్మా! మీ చెట్లు బాగానే ఉన్నాయి. వాటికి ఎక్కువ మొత్తమే మీరు పరిహారం కోరవచ్చు. కంచెను కూడా తిరిగి నిర్మించే మొత్తాన్నీ ఇస్తారు’’ అన్నాడతను. ‘‘అయ్యా! నా చెట్లకు వెలకట్టడానికి మీరెవరు? మీరు నా పిల్లల తలలకూ ధర నిర్ణయిస్తారా? రెండు రోజుల్లో అబ్బాయి వస్తున్నాడు. మాట్లాడతాడు. ఉద్యోగికి కోపం వచ్చింది. ‘‘మీ అబ్బాయి వచ్చే వరకు పని ఆపి కూర్చోవాలా? మాది కాలంతో ముడిపడిన కార్యక్రమం. మమ్మల్ని ఆపే హక్కు మీకు లేదు.’’ ఈలోగా పనివారు కంచెను తొలగలించి ఆంథోనీ చెట్టు వద్ద గొడ్డళ్లతో నిల్చున్నారు. రోజలీనా కోపంతో రెచ్చిపోయింది. మెరుపువేగంతో ఆ పనివారిపైన పడింది. ఈ హఠాత్పరిణామానికి వారు గొడ్డళ్లతో సహా కింద పడిపోయారు. ఆమె ఆంథోనీ చెట్టును ఆలింగనం చేసుకుంది. ‘‘రండి. ముందు నన్ను చంపి, ఆ తర్వాతే నా బిడ్డను నరకండి.’’ ఈ గొడవకు చుట్టుపక్కల జనం పోగయ్యారు. ‘‘అమ్మా! మీరు ప్రభుత్వం పనికి ఆటంకం కలిగిస్తున్నారు. ఇది నేరం. దయచేసి దూరంగా వెళ్లండి. మా పనిని మేం చేసుకోనివ్వండి.’’ అన్నాడు ఉద్యోగి. రోజలీనాకు కోపం తారస్థాయికి చేరింది. ‘‘నాకు మీ డబ్బు అవసరం లేదు. నా చెట్లను మీరు ముట్టడానికి వీల్లేదు.’’ కూలీలు రెండో చెట్టు వద్దకు చేరారు. రోజలీనా అక్కడకూ చేరింది. ఉద్యోగి పరుగెత్తుకొచ్చాడు. ‘‘అమ్మా! మీరు హద్దు మీరుతున్నారు’’ అన్నాడు. రోజలీనా ఉద్యోగి పైకి ఉరికింది. అతడ్ని నేలపై పడవేసింది. అతడి చేతిలోని కాగితాలు చెల్లాచెదురయ్యాయి. ‘‘మీరు నా బిడ్డల్ని చంపుతున్నారు’’ అంటూ తిట్లు మొదలుపెట్టింది. సరిగ్గా పొరుగింటామె తండ్రి సమయానికి వచ్చి కలగజేసుకున్నాడు. రోజలీనాను పట్టుకున్నాడు. సర్దిచెప్పబోయాడు. విపరీతమైన కోపంతో ఉద్యోగి చెదిరిపోయిన తన కాగితాలను పోగు చేసుకున్నాడు. ‘‘ఈమెకు గుణపాఠం చెబుతాను’’ అంటూ బయల్దేరాడు. జీపు స్టార్టయి వెళ్లిపోయిన శబ్దం వారికి వినపడింది. ‘‘నువ్వలా చెయ్యి చేసుకోకుండా ఉండాల్సింది. ఎంతయినా ప్రభుత్వోద్యోగి’’ పొరుగింటామె తండ్రి శాంతింపజేయబోయాడు. ‘‘అయితే మాత్రం ప్రభుత్వానికి నా బిడ్డలను చంపే హక్కుందా?’’ కావాలంటే ఆ నేలనీ నా ఇంటినీ తీసుకోనివ్వండి. నా చెట్లను మాత్రం తాకవద్దని చెప్పండి..’’ అంది రోజలీనా వగరుస్తూ. ఒక అరగంటలో ఒక పోలీసు వ్యాను వచ్చింది. ఇందాక వచ్చిన ఉద్యోగికి తోడుగా ఒక సబ్ ఇన్స్పెక్టర్, ఇద్దరు పోలీసులూ వచ్చారు. చుట్టూ ఉన్న జనవాహినిని చూసి ఇన్స్పెక్టర్ కాస్త మృదువైన స్వరంతో అన్నాడు: ‘‘చూడమ్మా! మీరు ప్రభుత్వోద్యోగిపై చెయ్యి చేసుకుని నేరం చేశారు. నీ మీద అభియోగాన్ని వెనక్కు తీసుకొమ్మని నేను వారికి నచ్చచెబుతాను. వారి పనిని వారు చేసుకోనివ్వండి...’’ రోజలీనాకు పరిస్థితి అర్థమైంది. ఇదే ఆమెకు చివరి అవకాశంగా భావించింది. ఆంథోనీ చెట్టు వద్దకు పరుగెత్తి దాన్ని కౌగలించుకుంది. ‘‘నేను నా చెట్లను కొట్టనివ్వను. ఇవి నా బిడ్డలు. నన్ను ముక్కలు చెయ్యండి. ఆ తర్వాతే చెట్ల జోలికి వెళ్లండి’’ అంది. ఆమె వెర్రి ఆవేశం జనసమూహం మధ్య గందరగోళానికి దారితీస్తుందని ఇన్స్పెక్టర్ గ్రహించాడు. తన కానిస్టేబుళ్లకు సంజ్ఞ చేశాడు. వారు చెట్టుకు చుట్టి ఉన్న ఆమె చేతులను జాగ్రత్తగా విడిపించారు. ఆమెను మోసుకుని వెళ్లి పోలీసు వ్యానులోకి ఎక్కించారు. పొరుగామె తండ్రి, మరికొందరు పెద్దలు ఇన్స్పెక్టరుతో వాదించబోయారు. కాని వారిని పట్టించుకోకుండా పోలీసు వ్యాను ముందుకెళ్లింది. చాలా దూరం వరకు వ్యానులోంచి ఆమె అరుపులు వినిపించసాగాయి. ఆ రోజే ఏంజెలా, ఆంథోనీ, ఏబెల్ పేర్లు గల కొబ్బరిచెట్లు నేల కూలిపోయాయి. ఆ ఊరి హెడ్మెన్తో కలసి ఒక యాభై మంది గ్రామపెద్దలు జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని చుట్టుముట్టారు. రోజలీనాను విడిపించమని అభ్యర్థించారు. మధ్యాహ్నానికల్లా ఆమెను విడిచిపెట్టి ఇంటికి పంపించారు. తిరిగి రాగానే కిందపడి ముక్కలైన చెట్లను చూసి రోజలీనా గుండెలు బాదుకుంది. అపస్మారక స్థితిలోకి పోయింది. ఇరుగు పొరుగులూ, వైద్యుల ప్రయత్నంతో మూడు రోజుల తర్వాత రోజలీనా ఈ లోకంలోకి వచ్చింది. ఆ రోజు ఆమె ఆంథోనీ నుంచి ఒక ఉత్తరాన్ని అందుకుంది. ‘‘అమ్మా! నేను గత వారమంతా వేర్వేరు పనులతో బొంబాయిలో చిక్కుకున్నాను. గోవా వచ్చి నిన్ను చూడాలనుకున్నాను. అంతలోనే మా ఆఫీసు నుంచి వెంటనే రమ్మని టెలెక్స్ వచ్చింది. తిరిగి కువైట్ వెళ్లిపోతున్నాను. వచ్చే సంవత్సరం వస్తాను. నువ్వేమీ దిగులుపడకు. భూసేకరణ గురించి, ఆ చెట్ల గురించి పట్టించుకుని ఆందోళన చెందవద్దు. నీకు కావలసిన డబ్బు పంపిస్తాను. ఆరోగ్యం జాగ్రత్త!’’ ఇట్లు నీ ప్రియమైన కుమారుడు ఆంథోనీ -
పరివర్తన
జేబులో షాపమ్మాయి పర్సు ఉంది. వెల్లావెట్టీలో మాదకద్రవ్యాల వ్యాపారులందరి పేర్లూ ఒకదాని తర్వాత ఒకటిగా అతడి మెదడులో తిరగసాగాయి. వాటి మధ్యలో హఠాత్తుగా పద్మావతి అన్న పేరు కూడా ప్రత్యక్షమైంది. ‘పద్మావతి!’ ఎంత చక్కని పేరు!! కొద్దిరోజుల కిందట ఇలాగే ఒక దొంగతనం చేశాడు. గోల్డ్లీఫ్ సిగరెట్ పీక అతడి చేతిలో నుంచి జారిపోయి కొన్ని గిరికీలు కొట్టిన తర్వాత మాత్రమే నేల మీద పడింది. అతడు దాన్ని చూస్తూ ఒక్క క్షణం ఆలోచనారహితంగా నిల్చుండిపోయాడు. సిగరెట్ కాసేపు ఎర్రగా మెరిసి ఆ తర్వాత తెల్లని బూడిదగా మిగిలిపోయింది.చివరిగుక్క పొగని కాసేపు నోట్లేనే ఉంచుకున్నాడు. ముందున్న రోడ్డు వైపు చూస్తూ ఒక్కసారిగా పొగని విడిచిపెట్టాడు. అతడి పెదవుల మధ్య నుంచి, నోట్లోంచి వచ్చిన పొగ గాలిలో సుడులు తిరిగింది. తర్వాత బాంబలిపట్టియా కూడలిలోని దుమ్మూ ధూళిలో కలిసిపోయింది. రెండు ప్రైవేట్ బస్సులు పోటీలు పడి పరుగెత్తుకుంటూ వచ్చాయి. జంక్షన్‌లోనే ఉన్న బస్టాపులో జాక్‌పాట్ యంత్రం వద్ద ఆగిన రేసు గుర్రాల్లా ఆగాయి. యూనిటీప్లాజా భవనం వెనుక సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఆ ఆకాశహర్మ్యం నీడ గాలెరోడ్డుపై పడుతోంది. అది కరకు కాంక్రీటు నిర్మాణమైనా, దాని నీడ మాత్రం చల్లగా ఉంది. సముద్రం పైనుంచి వీచిన చల్లని గాలులు అతని శరీరాన్ని గిలిగింతలు పెడుతున్నాయి.ఉదయం పీల్చిన హెరాయిన్ పట్టు అతడి మెదడు మీద ఇంకా పూర్తిగా చెదిరిపోలేదు. కాని ఇప్పుడు ఈ గాలికి ఎగిరిపోయినట్లు అనిపిస్తోంది. అప్పుడు ఎంతో సంతోషాన్నిచ్చిన తలలోని మత్తు ఇప్పుడు దిగిపోతూ చికాకు కలిగిస్తోంది. హెరాయిన్ తీసుకుని చాలాసేపైంది. కాని ఈ క్షణంలో నిటారుగా నిలబడలేకపోతున్నాడు. మోకాళ్ల పైనుంచి శరీరం రెండు ముక్కలుగా చీలిపోతున్నట్లుంది.సముద్రతీరంలో పద్నాలుగు అంతస్తుల భవనంపైన ‘కేసిన్ అండ్ రేసింగ్’ అనే పెద్ద అక్షరాలు పడమటి ఆకాశంలో ప్రకాశిస్తున్నాయి. అతడి దృష్టి అంతా అక్కడ బస్సు కోసం నిల్చుని ఉన్న యువతి మీదనే, కాదు ఆమె భుజంలోని బ్యాగు మీదనే ఉంది.ఆమె కురులను చిరుగాలి ప్రేమగా లాలిస్తూ నిమురుతోంది. మాటిమాటికీ తన చేతికి ఉన్న గిల్టు రిస్టువాచీ చూసుకుంటోంది.ముఖం మీద పడుతున్న ముంగురుల్ని మృదువైన వేళ్లతో పైకెత్తుకుంటోంది. ఆమె ఉంగరాల జుట్టు కింద కప్పబడిపోయిన చెవులకు చక్రాల్లాంటి బంగారు రింగులు వేలాడుతున్నాయి. దగ్గర్లో ఉన్న ఎలక్ట్రికల్ దీపపు కాంతి వాటి మీద పడి అవి మెరుస్తూ ఉన్నాయి. అతడికి అవి ఎంతో ఆకర్షణీయంగా కనబడుతున్నాయి. అతడి చెయ్యి ఒకటి డెనిమ్ ప్యాంటు జేబులో ఉంది. రెండో చేతిలో ఒక మడతపెట్టిన ఇంగ్లిష్ వార్తాపత్రిక ఉంది. ఆమె తన తలని గాలి తాకిడి నుంచి తప్పుకోవడానికి ఇటూ అటూ తిప్పుతున్నప్పుడు లిప్‌స్టిక్ పూసిన పెదవులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అప్రయత్నంగా అతడు కూడా తన పెదవులను నాలుకతో తడుపుకున్నాడు.అతడి చూపులు ఆమె శరీరాన్ని తడుముతున్నాయి. ఇది గ్రహించి అప్రమత్తం చెందాడు. తన దృష్టిని మరల్చుకున్నాడు. ప్యాంటు జేబు తడుముకున్నాడు. రెండు రూపాయల నాణెం తగిలింది. ‘ఇంత ఘోరంగా చేతిలో డబ్బులేని రోజు గతంలో ఎన్నడూ లేదు’ అనుకున్నాడు. ఒకప్పుడు తన తోటి వారందరికీ గంజాయిని ఒక్కొక్క గుక్క తేలిగ్గా ఉచితంగా సరఫరా చేసేవాడు. కాని ఏరోజూ నిద్రిస్తున్న తన చెల్లి మెడలోంచి బంగారు గొలుసును కాజేసి ఇంటి నుంచి వచ్చేశాడో అప్పుడే ఉజ్వలమైన జీవితం అకస్మాత్తుగా ఆగిపోయింది. రోడ్డున పడిపోయాడు. ఆ తర్వాత సిగ్గు విడిచి ఇంటికి వెళ్లినా, తనను చూడగానే విలువైన వస్తువులన్నీ రహస్య ప్రదేశాల్లోకి తరలిపోతున్నాయి. తనను ఎవ్వరూ నమ్మడం లేదు. తన చేతికి ఏమీ చిక్కడం లేదు. అప్పుడు బయటకు వచ్చేవి తన తల్లి కన్నీళ్లు మాత్రమే. వాటికి రూపాయి విలువ కూడా ఉండదు.కాని తల్లి కన్నీరు అత్యంత విలువైన రోజులు కూడా ఉన్నాయి. గతంలో తాగిన తండ్రి ఇంటికి వచ్చి ఆమెతో గొడవ పడేవాడు. అప్పుడామె కన్నీరు కార్చేది. ఆ కన్నీటితో పాటు తన కన్నీరు కూడా కలిసిపోయేది. ఇప్పుడామె గురించి ఆలోచనలు అతని కంటికి కన్నీరు తెప్పించడం లేదు. ఈరోజు ఆమాత్రం కన్నీరు కార్చాలంటే కనీసం రెండు ప్యాకెట్లు హెరాయిన్ కావాలి. ఆ యువతి ఎదురుచూస్తున్న బస్సు ఇంకా రాలేదు కాబోలు, లేదా ఆమె కోసం ఏదైనా సిబ్బంది బస్సు వస్తుందేమో! కాకపోవచ్చు. సిబ్బంది వాహనం కోసమైతే క్యూలో నిల్చోవలసిన అవసరం ఉండదు. ఆమె భుజానికి వేలాడుతున్న నల్లని బ్యాగు మీదనే అతడి కళ్లున్నాయి. అదే ప్రస్తుతం అతని లక్ష్యం. దాన్ని కాజెయ్యాలి. యవ్వనపు ఒంపు సొంపులతో నిగనిగలాడుతున్న ఆమె శరీరాకృతి అతనిలో ఒక విధమైన మదన వికారాన్ని మేల్కొలిపింది. ఆ హ్యాండ్‌బ్యాగును కొట్టేసే నెపంలో ఆమె శరీరపు మృదు స్పర్శ కూడా పొందవచ్చు. అతనిలో ఉప్పొంగుతున్న కోరికలను తీర్చుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఒక పదిమంది పడతుల వల్ల పొందే సుఖం కన్నా ఒక చిన్న ప్యాకెట్ మాదకద్రవ్యం ఎక్కువ సౌఖ్యాన్నిస్తుంది. ఒకసారి హెరాయిన్ వాడకం మొదలుపెట్టిన తర్వాత అతడి ప్రియురాలు దిస్నాని మరచేపోయాడు. డ్రగ్స్ తీసుకోవడం మానెయ్యమని ఆమె ఎంతగానో బతిమాలేది. ఒత్తిడి చేసేది. చివరకు ఆమే దూరమైపోయింది. ఇప్పుడామెని కలుసుకోవాలనే ఉత్ప్రేరణ కూడా పూర్తిగా లేకుండాపోయింది. గత ప్రేమకథ గురించి తలపోసి దిగులుపడటం వల్ల ప్రస్తుతం తలపెట్టిన కార్యం చెడిపోవచ్చని భయపడ్డాడు. ఏ పనికైనా లక్ష్యసాధనలో సెంటిమెంట్లకు తావు ఇవ్వకూడదు.యువతి హ్యాండ్‌బ్యాగును తెరిచి ఒక చిన్న నాణేల పర్సు తీసింది. తీస్తూనే ఆమె పేవ్మెంట్ పైనుంచి కిందకు దిగి వీధిలోకి వచ్చింది.సరిగ్గా ఆ సమయంలోనే ఒక బస్సు వచ్చి ఆగింది. కండక్టరు ఒక చేత్తో బస్సుని పట్టుకున్నాడు. ఇంచుమించు ఆమెను కౌగలించుకుని లోనికి లాక్కొన్నట్లే రెండోచెయ్యిని చాచి ఉన్నాడు. అతడు కూడా ఫుట్‌బోర్డు ఎక్కాడు. ఆమెను ముందుకు నెట్టుకుంటూ కండక్టరు మోచేతి కింది నుంచి బస్సులోనికి ప్రవేశించాడు. ‘‘ఇప్పుడు బస్సెక్కిన వాళ్లంతా టికెట్‌కు సరిపడా చిల్లర పట్టుకుని రెడీగా ఉండండి... బాంబల పట్టీ.. వెల్లా పట్టీ, దెహీవెలా.. గాల్కిస్స..’’ కండక్టర్ బిగ్గరగా అరిచాడు.‘గాల్ కిస్సా’ అన్నదా యువతి. ఆమె గొంతు శ్రావ్యంగా ఉంది. అతడు బస్సులోంచి ఎటో వీ«ధిలోనికి చూస్తున్నట్టు నటించాడు. అతడి జేబులో రెండు రూపాయలు మాత్రమే ఉన్నాయి. వాటిని టికెట్ కోసం కండక్టరుకి ముట్టజెప్పడం అతడికి ఇష్టం లేదు. ‘‘సర్! ఎక్కడికి?’’ ‘‘దెహీ వెలా..’’ టికెట్ తియ్యక తప్పలేదు. ఆమె దిగబోయిన స్టాప్ కంటే ఒక స్టాప్ ముందరే దిగడానికి వీలుగా టికెట్ తీసుకున్నాడు. రెండోది అతని వద్ద అందుకు సరిపడా రెండు రూపాయాలే ఉన్నాయి.బ్యాగ్‌ని ఎంత వేగంగా కొట్టేస్తే అంత వేగంగా దిగిపోవాలి. త్వరగానే పని పూర్తి చెయ్యాలి.అతడు కండక్టరుకు నాణెం ఆమె చేతి కింద నుంచి అందజేశాడు. ఆ క్రమంలో శరీరాన్ని స్పృశించి ఒక మెత్తని అనుభూతిని పొందాడు. ఆ రద్దీలో ఆమె పట్టించుకోలేదు. దూరంగా జరిగే ప్రయత్నమూ చెయ్యలేదు. దాంతో అతడు తన చేతిని మరికొంతసేపు అలాగే ఉంచి ఆనందించాలనుకున్నాడు. కాని ఉంచలేదు. తీసేశాడు. ఆమెతో పాటు బస్సెక్కిన లక్ష్యం అది కానే కాదు. ఆ రద్దీలో కూడా బహుశ ఆమెకు పరిచయస్తులెవరో అడిగారు: ‘ఏం చేస్తున్నావమ్మా!’ ‘‘దెహీవెరాలో ఒక షాపులో పనిచేస్తున్నాను’’ చెప్పింది. ఆమె తన నాణేల పర్సును తిరిగి హ్యాండ్‌బ్యాగులో పెట్టుకుంది. ఆమె శరీరం మీంచి మత్తెక్కించే పరిమళం వస్తోంది. అంటే బ్యాగులో కూడా మంచి మొత్తమే ఉండవచ్చని నమ్మకం కలిగింది. ఆమె నోరు చిన్నదిగా ఉంది. కాని అనర్గళంగా ఇంగ్లిష్ మాట్లాడగలదని ఊహించాడు.దెహీవెలా వరకు టికెట్ తీసుకున్నాడు. ఈలోగానే ఆ షాపమ్మాయి బ్యాగ్ కొట్టెయ్యాలి. ఒక కొత్త బ్లేడుని చొక్కా జేబులోంచి తీశాడు. తన తొడని ఆమె తుంటిభాగానికి నొక్కి పట్టాడు. బ్యాగ్‌ని ఒక పక్కగా కత్తిరించాడు. సరిగ్గా ఆ సమయంలో యాదృచ్ఛికంగానే ప్రయాణికుల చూపులన్నీ కిటికీలోంచి బయటికే ప్రసరిస్తున్నాయి. కుడిచేతిలోని ఇంగ్లిష్ వార్తాపత్రికని పైకి తీసి రెండు వేళ్ల మధ్య పెట్టుకున్నాడు. మిగిలిన మూడు వేళ్లనీ బ్యాగులోకి చొప్పించాడు. ఈ దశలో ఎవరైనా అటువైపు చూసినా వార్తాపత్రిక మాత్రమే కనబడుతుంది. మొదటగా అతడి వేళ్లకి మూత తెరిచి ఉన్న ప్లాస్టిక్ పెట్టె దొరికింది. అది ఆమె లంచ్ బాక్స్ కావచ్చు. అందులోనే చిన్న స్పూనూ, ఫోర్కు తగిలాయి. పోట్లాటకు దిగిన కోడి తన పెట్టని వెంబడిస్తున్నట్టు అతడి వేళ్లు బ్యాగులోనే పర్సు కోసం తడుముతున్నాయి. బస్సు వెల్లాలెట్టీ బ్రిడ్జి పైనుంచి పోతుండగా అతడి పని పూర్తయింది. ఆ రద్దీలో ఆ షాపమ్మాయిని ఆనుకుని నిల్చున్న ఆనందాన్ని అనుభవిస్తూ దెహీవెలా వరకు ప్రయాణించవచ్చు. కాని అతడి ధ్యేయం అది కాదు. ఆ తర్వాత స్టాప్‌లోనే చల్లగా దిగిపోయాడు. ఆమె మనీ పర్సు అతడి జేబులో సురక్షితంగా ఉంది. సన్నగా ఈల వేసుకుంటూ ఉత్సాహంగా ముందుకు నడిచాడు. జేబులో షాపమ్మాయి పర్సు ఉంది. వెల్లావెట్టీలో మాదకద్రవ్యాల వ్యాపారులందరి పేర్లూ ఒకదాని తర్వాత ఒకటిగా అతడి మెదడులో తిరగసాగాయి. వాటి మధ్యలో హఠాత్తుగా పద్మావతి అన్న పేరు కూడా ప్రత్యక్షమైంది. ‘పద్మావతి!’ ఎంత చక్కని పేరు!! కొద్దిరోజుల కిందట ఇలాగే ఒక దొంగతనం చేశాడు. ఆ రోజు ఆమె పర్సులో పదమూడువందల రూపాయలు దొరికాయి. ‘ఇలాంటి అదృష్టం సాధారణంగా రాదు’ అనుకున్నాడు. అంతేకాదు, ఆమె గురించి సమాచారం దొరికింది. చిరునామా దొరికింది. ‘‘పద్మావతి! షైనింగ్ స్టార్ గార్మెంట్ ఫ్యాక్టరీ, గాలే రోడ్, రత్మలానా’’. అంతేకాదు, ఆమె హరిబన్ తోటకు చెందింది. పద్మావతి చెల్లెలు ఒక ఉత్తరం అక్కకు రాసి ఉంది. అదింకా అతడి జేబులోనే ఉంది. దాని మీదనే ఈ చిరునామా ఉంది. ఆ ఉత్తరంలో చెల్లెలు అక్క పద్మావతిని డబ్బు పంపమని కాబోలు కోరింది. అయితే ఆ పదమూడువందలతో ఆ రోజు జల్సా చేశాడు. మంచి భోజనం చేశాడు. హెరాయిన్ కొనుక్కుని నిల్వ చేసుకున్నాడు. డబ్బు ఖర్చయిపోయింది గాని, ఆనాటి పర్సు, ఆ ఉత్తరం అతడి వద్ద మిగిలే ఉన్నాయి. ఆ రోజు పద్మావతి గార్మెంట్ ఫ్యాక్టరీ పిట్ట. ఈ రోజు ఈ అమ్మాయి షాపు పిట్ట. నిజానికి ఈ షాపమ్మాయి మంచి కుటుంబం నుంచే వచ్చినట్టుంది. పర్సు నుంచి కూడా సువాసనలు వస్తున్నాయి. డబ్బు బాగా ఎక్కువగానే ఉండొచ్చు. దాన్ని తెరిచి చూడాలనే కుతూహలం ఎక్కువవుతోంది. రోడ్డు జనంతో కిటకిటలాడుతోంది. పర్స్ పైకి తీసి చూడాలనే కోరికను ఆపుకున్నాడు. గాలే రోడ్డు దాటి బీచ్‌కు దారితీసే చిన్న సందులోనికి ప్రవేశించాడు. పర్స్ తెరిచాడు. చిన్న పెర్ఫ్యూమ్ బాటిల్ దొరికింది. అది అమ్మకానికి పనికిరాదు. పోనీ ఉపయోగించడానికి అది ఆడ పెర్ఫ్యూమ్. ప్యాంటు ఎడమ జేబులో పెట్టుకున్నాడు. మరో చిన్న పెట్టె దొరికింది. అది కనుబొమల మేకప్ పెట్టె. దాన్నీ ఎడమ జేబులోనే పెట్టుకున్నాడు. మరి డబ్బు కోసం తడిమాడు. ఒక్క రూపాయి నాణెం మాత్రమే దొరికింది. ఛస్ ఈ రోజు బాగాలేదు. ఒక కాగితం కూడా దొరికింది. తెరిచి చూశాడు. అది ఆమెరికన్ పాప్ సింగర్ ప్రసిద్ధ గీతం: ‘‘ది లవర్స్ ప్యారడైజ్’’ పర్స్‌తో పాటు పనికిరానివన్నీ మురికి కాలువలో పారెయ్యాలనుకున్నాడు. ఎందుకో ఆ షాపమ్మాయి అందమైన రూపం ఆమెని తాకిన అనుభూతి గుర్తు వచ్చి ఆగాడు. డబ్బు దొరక్కపోయినా ఇవన్నీ ఆమె జ్ఞాపకాన్ని మిగులుస్తాయి. డబ్బుపరంగా ఈ రోజు నష్టమే. వృథా ప్రయత్నం. ఆ రోజు పద్మావతి పర్సు దొరికిన రోజు ఎంతో అదృష్టం.హఠాత్తుగా గత జీవితాన్ని బాల్యం నుంచి ఒకసారి పునరావలోకనం చేసుకోవాలనే బలమైన కోరిక అతడి మెదడులో తొలచివేస్తోంది. ఆ స్థితిలోనే అతడు బీచ్‌ని చేరుకున్నాడు. కొలంబో బీచ్ ప్రపంచంలోనే అతి సుందరమైనది. తీరం వెంబడి పాలవంటి మృదువైన తరంగాలు వచ్చి విస్తరించి వెనక్కి తిరిగిపోతున్నాయి. ఆ సరికే సూర్యుడు అస్తమించాడు. చల్లని చిరుగాలి తనతో పాటు సూక్ష్మమైన నీటి బిందువుల్ని మోసుకొస్తోంది. ఉదయం నుంచి నగరపు ఉష్ణోగ్రతలో ఉక్కిరిబిక్కిరి అయిన అతడి శరీరం ఒక సౌఖ్యాన్నీ సాంత్వననీ పొందింది. ఆ క్షణంలో ఒక్క హెరాయిన్ గుక్క కూడా లేని కష్టాన్ని మరచిపోయాడు.అతడు చదువుకునే రోజుల్లో ఒక ప్రసిద్ధ స్కూల్ క్రికెట్ టీములో కెప్టెన్‌గా ఉండేవాడు. ఉపాధ్యాయులూ సహచరులూ అతణ్ణి అభిమానించేవారు. నిత్యమూ మిత్రులతో సంతోషంగా సంచరించేవాడు. కాని పరీక్ష తప్పాడు. చెడు స్నేహాలు మరిగి పుస్తకాలు పట్టుకోకపోవడమే కారణం.వ్యసనాల వల్ల ఇప్పుడు సంఘవ్యతిరేక శక్తిగా మారిపోయాడు. తన ముఖం సభ్య సమాజానికి చూపనేలేడు. అతని తండ్రి ప్రభుత్వోద్యోగిగా ఉండేవాడు. ఒక సమ్మెలో పాల్గొన్నందున ఉద్యోగం పోయింది. ఇప్పుడు పాత కార్ల కంపెనీలో ఒక చిరుద్యోగిగా చేరాడు.అతడు కుటుంబానికీ నిష్ప్రయోజకుడైపోయాడు.అతడి తల్లి సంసారాన్ని నెట్టుకు రావడానికి పెళ్లిళ్లకు పుట్టినరోజులకు కేకులు చేసుకుంటూ తృణమో పణమో సంపాదిస్తోంది.అతడు సంపాదనలేక బలాదూరుగా తిరుగుతూ దొంగతనాలు చేస్తూ కాలం వెళ్లబుచ్చుతున్నాడు. అతని చెల్లెలు కొలంబోలోని ఒక మంచి బడిలో చదివేది. కాని కుటుంబ పరిస్థితుల వల్లల పరీక్ష తప్పింది. ఇప్పుడు ఒక షాపులో సేల్స్‌గర్ల్‌గా చేరింది. కుటుంబ పోషణలో పాలు పంచుకుంటోంది. అతడి వల్ల కుటుంబానికి నష్టమే కాని లాభం లేదు. పొరపాట్న ఇంటికి వెళ్తే విలువైన వస్తువులన్నీ దాచుకుంటున్నారు. ‘ఛీ! నాదీ ఒక బతుకేనా?’ తీరంలో పెద్ద గ్రానైట్ రాతి అంచున కూర్చున్నాడు. ఈరోజు తన బాధితురాలైన యువతిని మరచిపోలేకపోతున్నాడు. దొంగతనం చేసిన ఆమె పెర్ఫ్యూమ్ బాటిల్, మేకప్ పెట్టె, ఆ కాగితం మీది ఇంగ్లిష్ పాటలోని మాటలూ అతణ్ణి వెంటాడుతున్నాయి. ఖాళీ పర్సూ, టిఫిన్ బాక్సులోని స్పూనూ ఫోర్కూ.. వీటినే తిప్పి తిరగేస్తున్నాడు. ‘ఛీ! నాదీ ఒక జీవితమేనా?’ ఆరోజు పద్మావతి పర్సులో హృదయవిదారకమైన ఉత్తరం దొరికినప్పటికీ అది అతణ్ణి కదిలించలేకపోయింది. దాన్ని పట్టించుకోనే లేదు. ఆమె పట్ల కాస్తంత జాలి కూడా కలగలేదు. కాని ఈ రోజు అంతా నేరమే అనిపిస్తోంది.ఇప్పుడతనికి తన చెల్లెలి ముఖం గుర్తు వచ్చింది. ఆమె కూడా ఒక షాపులో పని చేస్తోంది. ఆమె ఆకృతి తరంగాలపైన తేలి తన వైపే వస్తున్నట్లుంది. సాధారణంగా అతడు తన ఇంటి గురించి, అక్కడి వాతావరణం గురించి, కుటుంబ సభ్యుల గురించి ఆలోచించడు. ఏదైనా దొంగిలించాలంటేనే ఇల్లు గుర్తు వస్తుంది. తన తల్లి అష్టకష్టాలూ పడి పొదుపు చేసి చెల్లెలి కోసం కొన్న బంగారు నెక్లెస్ దొంగిలించిన వైనం అతడికి గుర్తు వచ్చింది. చెప్పలేని విషాదం ఆవరించింది. కాని ఒక గుక్క హెరాయిన్ కోసం తల్లడిల్లిపోతూ మరి గత్యంతరం లేక ఆ పని చేశాడు.అప్పటి నుంచి అందరూ చీదరించుకుంటున్నారు. ఈరోజు ఇంటి గురించి తలంపులు వరుసగా గుచ్చి గుచ్చి వేధిస్తున్నాయి. హెరాయిన్ కోసం కూడా తాపంగా ఉంది. అయినా ఈ రోజు షాపమ్మాయి, తన చెల్లెలు ఏకకాలంలో ఆలోచనలలోకి చొచ్చుకొస్తున్నారు. ఈ స్థితి అతనికి అర్థంకావడం లేదు. ఇప్పుడు అతనిలో ఏదో అయింది. మెదడులో ఒక తేనెతుట్టె కదిలింది. హృదయంలో ఏదో చెదిరింది.నిజానికి ఈ రోజు కొట్టేసింది ఒక్క రూపాయే. పద్మావతికి కలిగిన నష్టం పదమూడువందలతో పోలిస్తే ఇది ఏమీ కాదు. కాని ఈ షాపమ్మాయికీ అతడి చెల్లెలికీ మధ్య పోలికలు అతనికిప్పుడు స్ఫురిస్తున్నాయి. మనసు వికలమైపోతోంది.ఇంకా జేబులోనే దాచుకున్న పద్మావతి ఉత్తరాన్ని మరోసారి చదవాలనిపించింది. చేతిలో ఉన్న వాటిని రాతి మీద పెట్టి ఆ ఉత్తరాన్ని పైకి తీశాడు. ‘‘ప్రియమైన అక్కా! నిన్ను ఇబ్బంది పెడుతున్నందుకు ఏమీ అనుకోవద్దు. తల్లిదండ్రులు లేకపోవడమంటే ఏమిటో ఇప్పుడు తెలుస్తోంది. అయినా నువ్వు మమ్మల్ని అంతకన్నా ఎక్కువగా చూసుకుంటున్నావు. అక్కా! మా పరీక్షలు వచ్చే నెలలో జరగబోతున్నాయి. నా బడి యూనిఫామ్‌లన్నీ ఒక్కసారే చిరుగుపట్టాయి. రోజూ బడికి వెళ్లి రావడానికీ డబ్బు చేతిలో లేదు. చదువుకోవడానికే కాలం సరిపోవడం లేదు. కొబ్బరి కమ్మలు అల్లి వాటిని అమ్మి డబ్బు సంపాదించే అవకాశమూ లేదు. ఈ స్థితిలో అక్కా! నువ్వే నా ధైర్యం.. నువ్వే నా బలం. దయచేసి కొంత డబ్బు.. వీలైనంత త్వరగా..’’ అతడికి సంబంధించినంత వరకు ఈ ఉత్తరంలోని అంశం అర్థంలేనిదీ అప్రస్తుతమైనదీ! కాని అప్పుడే అక్కడే చించిపారెయ్యకుండా ఎందుకు అట్టేపెట్టుకుని తిరుగుతున్నాడో అతడికే తెలీదు. ఆ ఉత్తరాన్ని బట్టి పద్మావతికి తల్లీ తండ్రీ లేరని తెలుస్తోంది. ఒక చెల్లి ఉంది. ఇంకా అన్నదమ్ములు ఉన్నారేమో తెలీదు. వారి ఆర్థిక పరిస్థితీ అవగతమవుతోంది. ఆమె ఆ డబ్బు తన చెల్లెలికి పంపడానికి ఉంచుకున్నది కాబోలు. అది ఆమె నెల జీతం కూడా కావచ్చు. ఆ మొత్తాన్ని తను దొంగిలించాడు.తనూ పరీక్ష తప్పాడు. ఆర్థిక ఇబ్బందుల వల్ల తన చెల్లీ పరీక్ష తప్పింది. ఇప్పుడు పద్మావతి చెల్లెలు కూడా సరిగ్గా చదవలేక పరీక్ష తప్పితే? అందుకు తనే బాధ్యుడవుతాడు. తన దొంగతనమూ, తన వ్యసనాలూ కారణమవుతాయి. వారి నాశనానికి తనే పునాది వేసినవాడవుతాడు.ఇంతకుముందు ఆ ఉత్తరాన్ని మనసుపెట్టి చదవలేదు. ఇప్పుడు విషయం అర్థమైంది. ఇక చేసేదేముంది? చెదిరిపోయిన మనసుతో, చేతగాని అనుభూతితో ఆ ఉత్తరాన్ని చిన్న చిన్న ముక్కలుగా చించేశాడు. అతడి గుండె కూడా శకలాల పర్యంతమైంది. అనంతమైన మహాసముద్రం వైపు చూస్తూ కూర్చున్నాడు. చేతిలోని ఉత్తరం ముక్కల్ని సముద్రంలోకి విసిరేశాడు. సముద్రం మీద నుంచి నేల మీదకు బలంగా వీస్తున్న గాలి ఆ ముక్కల్ని తిరిగి అతని వైపే తెచ్చింది. కొన్ని అతనికే అంటుకున్నాయి. ఎక్కువభాగం సుదూరంగా ఎగిరిపోయాయి. అతడి ఆలోచనలూ ఆవిరైపోయాయి. ఎన్నడూ లేనిది అతడి మనస్సు మాదకద్రవ్యం లేకుండానే కుంగిపోయింది. తన మీద తనకే అసహ్యం వేసింది. ‘కుటుంబాన్ని మోసం చేస్తున్నాను. దొంగతనాలు చేసి ఎన్నో జీవితాలను నాశనం చేస్తున్నాను. ఇలా ఎంతకాలం? ఎందుకోసం? చివరికి ఏమవుతాను?’ ఇటువంటి అంతర్మథనం అతనిలో చోటుచేసుకుంది. ఉత్తరాన్ని తీసేసిన పద్మావతి పర్సును ఇందాక రాతి మీద ఉంచాడు. ఇప్పుడు దాన్ని మళ్లీ పైకి తీశాడు. తన జీవితంలో చేసిన ఘోరాలన్నింటిలోకీ అతి క్రూరమైన అత్యంత హేయమైన నేరానికి సాక్ష్యంగా ఈ పర్సు చేతిలోనే ఉంది. అది ఇప్పుడు నిప్పుల కుంపటి పట్టుకున్నట్లుంది.గడచిన జీవితం వద్దనుకున్నా కళ్ల ముందు కరాళ నాట్యం చేస్తోంది. ‘అయిన వాళ్లకి దూరమయ్యాను. ప్రియురాలికి అప్రియుడనయ్యాను. మంచి మిత్రులకీ శత్రువునయ్యాను. అందరి అభిమానాన్నీ పోగొట్టుకున్నాను. ఇక మిగిలిందేముంది? సాధించేదేముంది? ఎవరికోసం? దేని కోసం?.. నాకిక నిష్కృతి లేదు’ హెరాయిన్ తీసుకోకుండానే ఒక్కసారిగా కన్నీళ్లు పెల్లుబికి వచ్చాయి. అతడి మెదడులో ఒక తీవ్రమైన రసాయనిక చర్య మొదలైంది. అలాగే స్థాణువులా చలనం లేకుండా నిల్చుండిపోయాడు. చూస్తుండగానే గాఢాంధకారం మహాసముద్రాన్ని కబళించేస్తోంది. మరోవైపు చంద్రుడు తన చల్లనికాంతితో చీకటిపై సమరానికి సమాయత్తమవుతున్నాడు. జేబులో షాపమ్మాయి పర్సు ఉంది. వెల్లావెట్టీలో మాదకద్రవ్యాల వ్యాపారులందరి పేర్లూ ఒకదాని తర్వాత ఒకటిగా అతడి మెదడులో తిరగసాగాయి. వాటి మధ్యలో హఠాత్తుగా పద్మావతి అన్న పేరు కూడా ప్రత్యక్షమైంది.‘పద్మావతి!’ ఎంత చక్కని పేరు!! తీరంలో పెద్ద గ్రానైట్ రాతి అంచున కూర్చున్నాడు. ఈరోజు తన బాధితురాలైన యువతిని మరచిపోలేకపోతున్నాడు. దొంగతనం చేసిన ఆమె పెర్ఫ్యూమ్ బాటిల్, మేకప్ పెట్టె, ఆ కాగితం మీది ఇంగ్లిష్ పాటలోని మాటలూ అతణ్ణి వెంటాడుతున్నాయి. సింహళ మూలం : లియనగే అమరకీర్తి అనువాదం : టి షణ్ముఖరావు -
వాసన లేని పువ్వు
స్నానానికి వెళ్లబోతూ ఎనిమిదేళ్ల గోకుల్ వారి పెరటి అరటి తోటలో నిలుచున్నాడు. వాడు గత కొద్ది నెలలుగా ఈ అలవాటు చేసుకున్నాడు. అకస్మాత్తుగా వాడి దృష్టి పలకబారిన ఒక అరటిగెల పైన పడింది. మెడను వంచి మళ్లీ చూశాడు. తడి ఆరిపోయిన పెదవులను చప్పరించాడు. వాడి కళ్లు ఆనందంతో మెరిశాయి. చప్పట్లు కొట్టుకుంటూ ఇంటి లోపలికి పరుగెత్తాడు. తన అక్క పదేళ్ల కుసుమ్‌ని చేరుకుని ఆమె చెవిలో ఇలా అన్నాడు: ‘‘అక్కా! మన పెరట్లో ఒక అరటి గెల పండుతోంది.’’ ‘‘నిజంగానా!’’ కుసుమ్ కళ్లు పెద్దవి చేస్తూ అడిగింది. గోకుల్ ఆమె చేతిని పట్టుకుని తోటలోనికి తీసుకుపోయాడు. చూపుడు వేలుతో పండబోతున్న అరటిగెలను చూపించాడు. ‘‘చూశావా? ఆ గెల పసుపు పచ్చగా లేదూ! అంటే పండబోతోంది.’’ ‘‘ఔను సుమా!’’ అంది కుసుమ్. ‘‘ఆ గెల ఇంచుమించు ఆకుల్లో దాక్కొని ఉంది. నీకెలా కనపడిందబ్బా?’’ ఆమె మాటను పట్టించుకోకుండా గోకుల్ అరటి గెలవైపే చూస్తున్నాడు. వాడికి నోరూరుతోంది. ఆ తీక్షణమైన చూపులకు తట్టుకోలేక పండిన అరటిపండొకటి నోట్లో పడినట్లూ, దాన్ని నెమ్మదిగా మెత్తగా మింగుతున్నట్లూ అనుభూతి పొందుతున్నాడు. మొత్తం మీద ఆ అక్కా తమ్ముళ్లిద్దరూ ఆ అరటిపళ్లు తినడం కోసం ఉవ్విళ్లూరడం, కలలు కనడం ప్రారంభించారు. ప్రధాన ద్వారం గుండా తమ తండ్రి తోట వైపు వస్తూ ఉండటం కుసుమ్ చూసింది. ‘‘నాన్న వస్తున్నారు చూడు’’ అంది తమ్ముడితో. ‘‘ఏరీ ఎక్కడ?’’ అంటూనే గోకుల్ అయిష్టంగానే అరటిగెల నుంచి దృష్టి మరల్చాడు. నిజంగానే నాన్న వస్తున్నాడు. పిల్లలిద్దరూ ఒకేసారి తండ్రి వైపు పరుగెత్తారు. పండుతున్న అరటిగెల గురించి అతడికి సమాచారం ఇవ్వడానికి ఇద్దరూ పోటీ పడుతున్నారు. అక్క తమ్ముడి కంటే ముందుంది. గోకుల్ తండ్రిని చేరుకోకుండానే బిగ్గరగా అరిచాడు. ‘‘నాన్నా! నాన్నా! అరటిగెల పంటకొచ్చింది.’’ గొలాప్సేనా రాజకుమార్ ఇద్దరు పిల్లల్నీ చెరో చేత్తో పట్టుకున్నాడు. మనసులోనే చిరునవ్వు నవ్వుకున్నాడు. అరటిగెల గురించి తండ్రి సూక్ష్మ వివరాలు అందివ్వడంలో ఇద్దరూ నిమగ్నమయ్యారు. ఏ చెట్టు? ఏ గెలలో? ఎన్ని పళ్లు? వాటి రంగు.. గెల ఏ వైపు వంగింది మొదలైనవి విశదీకరించి చెబుతున్నారు. రాజకుమార్! అంటే రాకుమారుడు. అతడి తాత ముత్తాతలు ఎటువంటి రాజులో వారి రాజ్యం ఎంతటిదో ఇప్పటి రాజకుమార్‌కు తెలీదు. కాని తన తండ్రి ఎటువంటి రాజో అతడు కళ్లారా చూశాడు. ఒక సింహాసనంలాంటి పెద్ద కుర్చీలో కూర్చునేవాడు. అదే పనిగా హుక్కా పీలుస్తుండేవాడు. బహుశ అదే అతని అధికారిక చిహ్నమేమో! భుక్తి కోసం ఏ వృత్తీ చేపట్టి ఎరుగడు. కాని ఆశ్చర్యకరంగా రాత్రీ పగలూ వంటపొయ్యి వెలుగుతూనే ఉండేది. అతిథులు వస్తూ పోతూ ఉండేవారు. డబ్బు ఎక్కడి నుంచి వచ్చేదో తెలుసుకునే వయస్సూ జ్ఞానమూ ఆనాటికి గొలాప్సేనాకు లేవు. బహుశ రాజభరణాలు కామధేనువుల్లా ఉండేవేమో! అవి ఆగిపోగానే తండ్రి స్తబ్దుడైపోయాడు. అతిథులూ తగ్గిపోయారు. ఐశ్వర్యంతో పాటు విలాసాలూ పోయాయి. అంతిమ దశలో అప్పుల కుప్పగా మిగిలిపోయాడు. చేతిలో హుక్కాతోనే తుదిశ్వాస విడిచాడు. తల్లి కూడా చనిపోయింది. ఆ దశలోనే గొలప్సేనాకు పెళ్లయింది. కుటుంబ భారమంతా అతడిపైనే పడింది. ఆస్తులను తగులబెట్టి తండ్రి చేసిన అప్పులు తీర్చాడు. ఏమీ లేనివాడయ్యాడు. దుబారా తండ్రి నుంచి అతడికి సంక్రమించిన భోగభాగ్యాలు రెండే రెండు: ఒకనాటి నివాసస్థలంలో సగభాగం, లేమిని వెక్కిరించే గుర్తుగా రాజకుమార్ అనే పేరు. ఆ ఘన నామధేయం వారసత్వంగా లభించి ఉండకపోతే వ్యవసాయమో, కాయకష్టమో, కూలీనాలీనో చేసుకుని అతడు దారిద్య్రం నుంచి విముక్తుడయ్యేవాడు. సంసారమూ నెట్టుకు రాగలిగేవాడు. ఉజ్వలమైన సాంప్రదాయపు అవశేషంగా బలిపశువైపోయాడు. తండ్రి విలాసాల మీద పెట్టిన శ్రద్ధ కొడుకు విద్యాబుద్ధుల మీద పెట్టలేదు. కీర్తిప్రతిష్ఠలకూ హోదాకూ, ఈనాటి జీవికకూ పొంతన కుదరలేదు. ఖర్చులకూ రాబడికీ సమతూకం లేకుండా పోయింది. జీవితం దినదిన గండంగా మారింది. ఒకనాడు నిత్యాగ్నిహోత్రంగా వెలిగిన పొయ్యిలో ఇప్పుడు పిల్లి నిద్రపోతోంది. చాలా సైనిక రిక్రూట్మెంట్లకు వెళ్లాడు. ఫలితం లేకపోయింది. ఉద్యోగాలకు విద్యార్హతలు అవసరమయ్యాయి. కాని రాచరికపు వాసనలు ఎందుకూ కొరగాలేదు. అన్ని కోణాలనూ పరిగణించి అతడొక కిరాణా కొట్టు పెట్టాడు. రాచబిడ్డ ఈ పని చేయడం సమాజం హర్షించలేదు. అయినా అందరినీ నమ్మి, ఎగ్గొట్టే వాళ్లకు అరువులిచ్చి, తిరిగి వసూలు చేసుకోలేని, గట్టిగా అడగలేని మెతకతనం వల్ల కొద్ది నెలల్లోనే ఆ వ్యాపారం మూతపడింది. ఆ తర్వాత ఎన్నో పనుల్లో ప్రవేశించి చేతులు కాల్చుకున్నాడు. బిష్ణుప్రియ మణిపురి ప్రజల్లో అచ్చిరాని అంశాలు రెండు ఉన్నాయని ప్రతీతి. అవి: దుకాణాలు నడపడం, సాంఘిక సంస్థల కార్యకలాపాలు నిర్వహించడం. వీటి ప్రామాణికతను గొలాప్సేనా నిరూపించినట్లయింది. సుమారు ఎనిమిదేళ్ల పాటు అతడు ఒంటరిగానే పేదరికపు భారాన్ని మోశాడు. అతడికి సహాయపడేవారు ఎవరూ లేకపోయారు. భార్య కమలిని ప్రోద్బలం మీద గ్రామంలో దళారీ పనిచేసే బలదేవ్ దగ్గరకు వెళ్లాడు. ‘‘అయ్యా! నేను ఈ సంసారభారాన్ని మొయ్యలేకపోతున్నాను. పూట గడవడం కష్టంగా ఉంది. మీరే నాకు ఎలాగైనా సహాయం చెయ్యాలి. నాకొక మూడు బీగాల భూమి ఇప్పించండి. కౌలు రైతు పని చేసుకుంటూ బతుకుతాను. లేకపోతే పిల్లలు పస్తులుండాల్సి వస్తుంది.’’ బలదేవ్ నిర్ఘాంతపోయాడు. ‘‘ఏమిటీ? మీరు కౌలురైతు పని అంటే వ్యవసాయం చేస్తారా? మీకేమైంది?’’ ‘‘ఔను! నేనన్నది వ్యవసాయమే. నేను కొత్త జీవితం ప్రారంభించాలనుకుంటున్నాను. ఈ రాచరికపు కుహనా హోదాల నుంచి నేను విముక్తుణ్ణి కావాలి. లేకపోతే పిల్లలు ఆకలితో మాడిపోతారు.’’ ‘‘ఏంటి మాట్లాడుతున్నావు? నువ్వొక రాచబిడ్డవు. నాగలి పట్టుకుంటావా? అసలు అటువంటి నిర్ణయం నువ్వెలా తీసుకున్నావు? ఆ మాట నీ నుంచి వినడానికే నామోషీగా ఉంది. మన బిష్ణుప్రియ మణిపురి ప్రజల పరువు ప్రతిష్ఠలను, నాగరికతా సంస్కృతులనూ మంటగలిపేస్తావా? రాచరికపు విలువలను మట్టిపాలు చేస్తావా?’’ బలదేవ్ అభిమానపు చిరుకోపంతో అన్నాడు. ‘‘నిజమేనయ్యా! కాని ఈ రాచరికం నాకు గుదిబండలా తయారైంది. తిండీ కరువైంది.’’ బాధపడ్డాడు గొలాప్సేనా. ‘‘కృష్ణ! కృష్ణ! ఇవన్నీ భగవంతుడి నిగూఢమైన లీలలు. ఈరోజు నీకు కష్టంగా ఉండొచ్చు. రేపు నీకో చక్కని సంపద ఏర్పడవచ్చు. ఆ సర్వంతర్యామి నీతో దోబూచులాడుతున్నాడు. ఇప్పుడు నిరాశతో ఉన్నావు. నీకు మేమందరమూ లేమా?’’ బలదేవ్ ఓదార్చడానికి ప్రయత్నించాడు. ‘‘నా ఉద్దేశం అది కాదు. కాని నాకు వ్యవసాయం తప్ప మరో మార్గం కనపడటం లేదు.’’ ‘‘మరో మార్గం లేదన్న మాట నేనొప్పుకోను.’’ బలదేవ్ కొంచెం చనువుగా అన్నాడు. ‘‘మీ నాన్న గొంటాగిరీ, మీ తాత సెనరిగిరి సేద్యం అంటే ఏమిటో తెలియకుండానే అషై్టశ్వర్యాలతో తులతూగి బతికారు. మరి నువ్వెందుకు బతకలేవు?’’ ‘‘నేను వాసనలేని పువ్వుని. జీవితంలో చితికిపోయాను. చతికిలబడిపోయాను. రేపటికి పొయ్యి ముట్టించే పరిస్థితి లేదు.’’ బలదేవ్ ఈ మాట విననట్లే నటించాడు. తన ధోరణిలో ఉపన్యాసమే కొనసాగించాడు. ‘‘మన బిష్ణుప్రియ మణిపురి సమాజమే పాతాళానికి దిగజారిపోతోంది. అగ్రకులాలూ పతనమైపోతున్నాయి. మన సంఘాలను తిరిగి వెలిగించగలిగేవారు మీ రాజకుమారులే. మీరు కూడా దుక్కి దున్నడం ప్రారంభిస్తే ఈ జాతిని భగవంతుడే రక్షించాలి. ఇతరుల ముందు ఎలా తలెత్తుకోగలం? నువ్వే చెప్పు!’’ ‘‘నాలాంటి రాచరికపు వారసులు ఎందుకూ కొరగానివారు. సరే! నేను దుక్కి దున్నను. కాని నా మాట పూర్తిగా వినండి. పిల్లలు పస్తులుండటం చూడలేకపోతున్నాను.’’ అంటూ గొలాప్సేనా ఇలా మొరపెట్టుకున్నాడు: ‘‘అయ్యా! పిల్లల కోసం కొన్ని కాధీల (వెదురు కొలపాత్రలు) వడ్లగింజలు అప్పుగా ఇవ్వండి. రానున్న పంట కాలంలో ఏదో చేసి తిరిగి ఇచ్చేస్తాను.’’ బలదేవ్ గొంతు తగ్గించి ఇలా అన్నాడు: ‘‘మహారాజా! నీకు అప్పుగా ఇచ్చే అర్హత మాకెక్కడిది? కావలసినన్ని గింజలు నువ్వు ఊరికే తీసుకెళ్లొచ్చు. కాకపోతే రానున్న ఆదివారం విష్ణుమూర్తి పండుగ ఒకటి ఉంది. వీటన్నిటి వల్లా..’’ గొలాప్సేనాకు మనుషుల నైజం తెలీదు. తెల్లనివన్నీ పాలేనని నమ్ముతాడు. కాని కొద్ది క్షణాల తర్వాత బలదేవ్ అంతరంగంలోని కపటం అర్థమైంది. ‘‘అలాగా’’ అంటూ తన ముఖ కవళికలు కనపడకుండా తలదించుకుని గొలాప్సేనా తిరిగి వచ్చేశాడు. వీధిలో కనపడిన తన ఇద్దరు పిల్లలనూ తనతో పాటే ఇంటి ఆవరణలోనికి తీసుకొచ్చేశాడు. కమలిని వరండాలో ఒక స్తంభానికి ఆనుకుని భర్త రాక కోసం ఆశగా ఎదురు చూస్తోంది. గొలాప్సేనా ఒకసారి ఆమె వైపు చూసి లోతుకుపోయిన తన కళ్లను దించుకున్నాడు. అతడి చిన్నప్పటి పౌష్టికాహారం చెక్కిళ్ల మీద కాంతినైతే మిగిల్చింది. కాని ఆ కళ్లు.. కమలిని అతని ముఖాన్ని చక్కగా చదవగలదు. ఒక దీర్ఘనిశ్వాసం విడిచి ఆమె స్తంభానికి దూరంగా వచ్చింది. ‘‘వెళ్లండి. మీ నాన్నగారితో స్నానాలు చేసి రండి. భోంచేద్దురుగాని..’’ అంది కమలిని పిల్లలిద్దరితోనూ. గొలాప్సేనా స్నానం చేసి వచ్చి భోజనానికి ఒక పీట మీద కూర్చున్నాడు. వడ్డిస్తూ ఆమె అడిగింది: ‘‘బలదేవ్ ఏమంటాడు?’’ ‘‘ఏమీ ప్రయోజనం లేదు’’ క్లుప్తంగా సమాధానం చెప్పాడు. ఇద్దరి మధ్యా నిశ్శబ్దం నెలకొంది. కమలిని నెమ్మదిగా అంది: ‘‘రేపేం చెయ్యడం? ఇంట్లో ఒక్క బియ్యపు గింజ కూడా లేదు.’’ ‘‘ఇంటికి తిరిగి వస్తూ గౌర్హరీ తాత దుకాణం వద్ద ఆగాను.’’ ‘‘మళ్లీనా?..’’ ‘‘మరేం చెయ్యను చెప్పు? నేను.. నేను..’’ వాక్యం పూర్తి కాకుండానే పిల్లలిద్దరూ లోనికి వచ్చారు. వడ్డించిన కంచం వైపు చూసి కుసుమ్ అంది: ‘‘అమ్మా! మళ్లీ ఆ కందగడ్డల కూరే చేశావా?’’ ‘‘ఔను. ఇది మంచి పోషకాహారం. విటమిన్లు మెండుగా ఉంటాయి’’ అంది కమలిని నచ్చచెప్పే ధోరణిలో. ‘‘విటమిన్లున్నాయి అని చెబుతూ నువ్వు రోజూ కందగడ్డలే వండుతున్నావు. చాలా కొంచం అన్నం పెడుతున్నావు. నాకు ఈ రుచీ పచీ లేని తిండే వద్దు..’’ అంటూ కుసుమ్ కంచం వద్ద నుంచి లేచిపోయింది. అక్క బాటనే ఆమె తమ్ముడు కూడా లేచిపోయాడు. ‘‘మీకు అన్నం కావాలంటే ఇంకా ఎక్కువ పెడతాను. రండి. కూర్చోండి.’’ అంటూ నచ్చచెప్పి కూర్చోబెట్టింది. అక్కతో పాటే గోకుల్ కూడా తిరిగి కూర్చున్నాడు. కొంతసేపటికి కుసుమ్ అంది: ‘‘అమ్మా! నాకు మరికొంచెం అన్నం వడ్డించు.’’ గోకుల్ కూడా అడిగాడు. కమలిని పాత్ర నుంచి పట్టెడన్నం తీసి ఆ ఇద్దరికీ చెరి సగం పంచిపెట్టింది. నిజానికి ఆ అన్నం ఆమె తన కోసం ఉంచుకుంది. గొలాప్సేనా తానూ మరికొద్దిగా వడ్డించుకోవాలని అనుకుని, కమలిని పరిస్థితి చూసి ఆగిపోయాడు. కంచంలో సగం అన్నం విడిచిపెట్టి, మంచినీళ్ల గ్లాసు పట్టుకుని నిల్చుండిపోయాడు. ‘‘ఏమైంది?’’ అని గాభరాపడుతూ అడిగింది కమలిని. ‘‘నా పొట్టలో బాగాలేదు. ఎక్కువగా తినకూడదనుకుంటున్నాను.’’ అంటూ బయటకు నడిచాడు. కమలినికి అర్థమైపోయింది. అతడి వైపు విషాదంగా చూసి, నీరు నిండిన తన కళ్లను శాలువా అంచుతో ఒత్తుకుంది. ఆ కంచం తను తీసుకుంది. గొలాప్సేనా వచ్చి పరుపు మీద చేరగిల్లాడు. అక్కడి నుంచి భోజనం చేస్తున్న కమలిని కనపడింది. ఆమె తను వదిలిన అన్నం తింటోంది. ఆమె చేతులూ, చెవులూ, మెడా బోసిగా ఉన్నాయి. ఒక్క నగ కూడా లేదు. ఆమె ప్రఖ్యాత విద్వాంసుడు ధనాపండిత్ కుమార్తె. వారు ఆగర్భ శ్రీమంతులు. కేవలం వంశగౌరవం చూసి తనకిచ్చి పెళ్లి చేశారు. పెళ్లి అయిన తర్వాత ఆమెకు ఒక జత గాజులు కూడా చేయించలేకపోయాడు. ఆమె పేదరికాన్ని మొదటగా చూసింది తన ఇంటి వద్దనే. అయినా ఆమె ఊరుకోలేదు. కుట్లూ అల్లికలూ చేసుకుంటూ వేడినీళ్లకు చన్నీళ్లుగా ఎంతో కొంత సంపాదించేది. కాని ఒక నెలరోజులుగా ఆ రాబడి కూడా పడిపోయింది. దారాలూ ఇతర వస్తువులూ కొనడానికి డబ్బు లేదు. అయినా జీవితం పట్ల ఆశ చావలేదు. పిల్లలిద్దరూ రోజుకు ఒకటి రెండు సార్లయినా అరటితోటలోకెళ్లి పళ్లు ఎంత వరకు ముగ్గాయో చూస్తున్నారు. ‘‘అక్కా! అరటిపళ్లు ఎప్పుడు తిందాం?’’ గోకుల్ అడుగుతూనే ఉన్నాడు. ‘‘తిందాం.. ఆగు మరి.’’ అంటోంది కుసుమ్. వ్యవసాయం వృత్తిగా స్వీకరించమని కమలిని అతణ్ణి పోరుపెడుతోంది. ఆమె తనదైన వాదనను వినిపించసాగింది: ‘‘జనక మహారాజు వ్యవసాయదారుడే కదా! మన రాచరికం జనకుడి కన్నా గొప్పదా?’’ అంటూ ఉండేది. ‘‘నిజంగా ఇది నమ్మదగ్గ అంశమే’’ అని ఆలోచిస్తూనే గొలాప్సేనా నిద్రలోకి జారుకునేవాడు. ఆ సాయంకాలం అరటిపళ్ల గెలను కోసి ఖాళీగా ఉన్న కొట్టంలో పెట్టాడు. గోవర్ధన పూజ రానే వచ్చింది. ఉదయాన్నే లేచి, పల్లె పిల్లలందరూ ఒక్కొక్క చెరువు నుంచి మట్టి సేకరించడంలో తలమునకలైపోయారు. కుసుమ్, గోకుల్ కూడా అందరిలాగే ఇంటి ఆరుబయట కూర్చొని మట్టి విగ్రహాలను చేసే పనిలో పడ్డారు. కుసుమ్ ఒక ఎద్దుని చేసింది. గోకుల్ రెండు వెదురు కర్రలను తీసుకుని, వాటిని ఒక దారంతో కట్టి నాగలి రూపం వచ్చేట్లు తయారు చేశాడు. ఒక మనిషి బొమ్మని కూడా చేసి, దాన్ని నాగలి వెనుక కట్టి, మనిషి దుక్కి దున్నుతున్న నమూనా తయారు చేశాడు. ఇద్దరు పిల్లలూ సామాజిక మండపం దగ్గరకు ఈ బొమ్మను పట్టుకుని వెళ్లారు. బలదేవ్ మరి ఇద్దరు దళారీలు గోకుల్‌ని సరదాగా ప్రశ్నించారు: ‘‘అయితే అబ్బాయీ! నాగలితో దున్నుతున్నదెవరు?’’ గోకుల్ తన చేత్తో మలచిన మట్టి నమూనాను ఒక విధమైన సంతృప్తితో చూస్తూ కళ్లెగరేసి ఇలా బదులిచ్చాడు: ‘‘ఇంకెవరు? నేనే.’’ ఆ సమాధానం విని బలదేవ్‌తో పాటు మిగిలిన ఇద్దరూ ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. గొలాప్సేనా అరటిపళ్ల గెలను తీసుకుని తన ఇంటి వరండాపై కూర్చున్నాడు. చెట్టు మీదనే పళ్లు పక్వానికి రావడం ప్రారంభమైంది కనుక పైనున్న రెండు పెడలూ వాటికవే ముందుగా ముగ్గిపోయాయి. ‘‘అరటి గెలను బజారుకు తీసుకెళ్తున్నప్పుడు మన పిల్లలు కంటపడకుండా జాగ్రత్తపడండి’’ అంది కమలిని. ఒక గుడ్డతో ముఖం తుడుచుకుంటూ అతణ్ణి తొందరపెట్టసాగింది. ‘‘ఇప్పుడే వెళ్లు. పిల్లలొచ్చేస్తారు. వాళ్లొస్తే మాత్రం గెలను బయటకు తీసుకెళ్లనివ్వరు’’ అని మరీ మరీ హెచ్చరించింది. ‘‘అలాగే’’ అంటూ గొలాప్సేనా నిట్టూర్చాడు. బయల్దేరబోయాడు. ‘‘వీలైతే ఒక పళ్ల పెడను పిల్లల కోసం అట్టే పెట్టకూడదా!’’ అంది. ‘‘ఎలా కుదురుతుంది?’’ గెలను పట్టుకుని మెట్లు దిగుతూ అన్నాడు. ‘‘ఎన్నో బేరసారాల తర్వాత గౌర్హరీతాత మొత్తం గెలను ఆరు రూపాయలకు కొనడానికి నిశ్చయమైంది. అందులో మళ్లీ ఒక పెడ మనం తీసి ఉంచేస్తే ఊరుకుంటాడా? బియ్యం పప్పులూ కొనడానికి డబ్బు చాలదు.’’ ఇంతలో పిల్లలిద్దరూ ‘‘వ్వావ్... అరటి పళ్లు’’ అనుకుంటూ రానే వచ్చారు. వెదురు గేటుకు చెరోవైపు నుంచి పరుగెత్తుకుంటూ వచ్చి తండ్రిని చేరుకున్నారు. అతడి వెనుక నుంచి కుసుమ్ అరటిగెలను చుట్టుకుని ఇలా అంది: ‘‘నాన్నా! వొద్దు! గెలను ఎక్కడికీ తీసుకెళ్లకు. వొద్దు నాన్నా!’’ గోకుల్ కూడా ‘‘పళ్లు మనమే తిందాం నాన్నా!’’ కుసుమ్‌తో పాటే గెలను పట్టుకుని వేలాడాడు. కమలిని కన్నీరు ఆగలేదు. తన ముఖాన్ని శాలువతో కప్పుకుంటూ ఇంటిలోనికి పరుగెత్తింది. గొలాప్సేనా కోపంగా వెనక్కు తిరిగాడు. ‘‘ఈ పళ్లు మనం తినడానికి కాదు. వొదలండి. చెప్తున్నాను కదా! వొదలండి.’’ పళ్ల గెలను పిల్లల పట్టు నుంచి గుంజుకోవడానికి ప్రయత్నించాడు. పిల్లలు ఇంకా గట్టిగా పట్టుకున్నారు. గొలాప్సేనాకు కోపం తారస్థాయికి చేరింది. చాచిపెట్టి ఇద్దరికీ చెరో లెంపకాయ కొట్టాడు. వారి లేత బుగ్గలు కందిపోయాయి. పిల్లలు ఒక్కసారిగా గొల్లుమన్నారు. వారి నుంచి గెలను బలవంతంగా తీసుకున్నాడు. గొలాప్సేనా పిల్లలను ఎన్నడూ చెయ్యి చేసుకోవడం ఎరుగడు. అప్రయత్నంగా అతడి కళ్లలో కూడా నీళ్లు తిరిగాయి. అరటిపళ్ల ఉత్సాహం పిల్లల్లో నీరుగారిపోయింది. కమలిని వంటగదిలోనికి వెళ్లి గుడ్లనీరు కుక్కుకుంది. ఎప్పుడూ లాలించే నాన్న ఈరోజు ఎందుకు కొట్టాడో పిల్లలకు తెలీదు. వారి చెంపలపై కన్నీరు ప్రవహించసాగింది. గొలాప్సేనా బలవంతంగా గేటువైపు అడుగులు వేశాడు. అతడిలో వికలమైన మనస్సు బరువుగా ఉంది. ఒక చేతిలో అరటిగెల భారంగా ఉంది. అమాయకులైన పిల్లలను కొట్టిన రెండో చెయ్యి అపరాధ భావనతో కిందకు వేలాడుతూ ఉంది. తండ్రి వీధి మలుపు తిరిగి కనుమరుగయ్యేంత వరకు పిల్లలు నిశ్చేష్టులై స్థాణువుల్లా నిలుచున్నారు. బిష్ణుప్రియ మణిపురి మూలం : స్మృతికుమార్ సిన్హా అనువాదం: టి.షణ్ముఖరావు -
ప్రపంచంలోనే అత్యంత పొడగరి తెలుగోడే!
-
ప్రపంచంలోనే అత్యంత పొడగరి తెలుగోడే!
⇒ శ్రీకాకుళం జిల్లావాసి షణ్ముఖరావు ⇒ కామెర్లకు మందు వాడటంతో ఎత్తు పెరిగిపోయిన వైనం రాజాం: ఎవరైనా పొడవుగా కనిపిస్తే ఆసక్తిగా చూస్తాం. ఏడడుగులు ఉంటే ఔరా అని ఆశ్చర్య పోతాం. ఇక్కడ ఈ ఫొటోలో కనిపిస్తున్న యువకుడు ఏకంగా 8 అడుగుల 3 అంగుళాలు ఉన్నాడు. పేరు ఇజ్జాడ షణ్ముఖరావు. వయసు 24 ఏళ్లు. శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం బిళ్లాని అతని స్వగ్రామం. సాధారణంగా కుటుంబ సభ్యులు, తల్లిదండ్రుల నుంచి వంశపారంపర్యంగా వచ్చే జీన్స్ ప్రభావంతో కొంత మంది పొడవుగా పెరుగుతారు. షణ్ముఖరావు తల్లిదండ్రులు రామలక్ష్మి, సూర్యనారాయణ.. ఇద్దరు సోదరులు ఐదున్నర అడుగుల పొడవు ఉన్నారు. షన్ముఖరావు ఆరేళ్ల క్రితం వరకు ఐదున్నర అడుగులే ఉండేవాడు. ఆ తర్వాత పచ్చ కామెర్ల వ్యాధి రావడంతో మందులు వాడాడు. అప్పటి నుంచి పెరగడం ప్రారంభమైంది. ఆరు.. ఏడు.. ఎనిమిది.. ఇపుడు ఏకంగా 8 అడుగుల 3 అంగుళాల ఎత్తు ఉన్నాడు. అమాంతంగా పొడవు పెరగడంతో ఇబ్బందులు పడుతున్నానని షణ్ముఖరావు ఆవేదన చెందుతున్నాడు. పదో తరగతి వరకు చదివిన తాను ఉపాధి పనులకెళ్తున్నానని చెప్పాడు. పొడవుగా ఉన్నందున ఇతర పనులకు పిలవడం లేదని, ఆటో.. కారులో ప్రయాణించాలంటే ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోయాడు. పాదాలకు సరిపడా చెప్పులు కూడా లభ్యం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశాడు. రోడ్లో వెళ్తుంటే వింతగా చూస్తున్నారని, అందువల్ల ప్రస్తుతం ఇంటికే పరిమితం అయ్యానని ‘సాక్షి’తో తన గోడు వెల్లబోసుకున్నాడు. పెళ్లి చేసుకోవాలని ఆసక్తి ఉన్నా.. పిల్లను ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రపంచంలో ప్రస్తుతం జీవించి ఉన్న వాళ్లలో అత్యంత పొడగరిగా టర్కీకి చెందిన సుల్తాన్ కోసెన్(34) 8 అడుగుల 2.8 అంగుళాలతో ఉన్నాడు. షణ్ముఖరావు ఇటీవలే సుల్తాన్‌ను అధిగమించి 8 అడుగుల 3 అంగుళాలకు చేరుకున్నాడు. అయితే ఈ విషయం ఇంకా రికార్డుల్లోకి ఎక్కలేదు. మృతి చెందిన వారిలో యూఎస్ఏకు చెందిన రాబర్ట్ పర్షింగ్ వాడ్లో 8 అడుగుల 11.1 అంగుళాలు ఉండేవాడు.