కనిపించని కరెన్సీ గురించి తెలుసా..! | Brief History Of Cryptocurrency In Telugu | Sakshi
Sakshi News home page

కనిపించని కరెన్సీ గురించి తెలుసా..!

Published Sun, Dec 12 2021 8:41 AM | Last Updated on Sun, Dec 12 2021 10:00 AM

Brief History Of Cryptocurrency In Telugu - Sakshi

‘ధనమేరా అన్నిటికీ మూలం...ఆ ధనము విలువ తెలుసుకొనుటె మానవ ధర్మం’ అంటాడు ఓ సినీకవి. అక్షర సత్యమే. కానీ ఇప్పుడంటే బ్యాంకులు ప్రభుత్వాలు ఇన్ని నోట్లు ముద్రించి.. వాటికి విలువను నిర్దేశిస్తున్నాయి కానీ.. ఒకప్పుడు ఇవేవీ లేవు. వస్తువులకు, సేవలకు విలువ కట్టి అంతకు సమానమైన విలువ అని భావించి మార్పిడి చేసుకున్న దశ నుంచి... బంగారం తదితరాలను విలువకు ప్రమాణంగా చేసుకోవడం.. తరువాతి కాలంలో బ్యాంకు నోట్లు.. క్రెడిట్‌/డెబిట్‌ కార్డుల వరకూ ధనం అనేక విధాలుగా రూపాంతరం చెందుతూ వచ్చింది. ఈ పరిణామక్రమంలో తాజా మజిలీ క్రిప్టో కరెన్సీ!!  బిట్‌కాయిన్‌ అనండి.. ఎరిథ్రియం అనండి.. లేదా ఇంకోటి అని పిలవండి... అన్నీ హైటెక్‌ యుగపు డిజిటల్‌ టెక్నాలజీ ప్రతిరూపాలే!  పలుదేశాల్లో ఇప్పటివకే విస్తృత వాడకంలో ఉన్న ఈ క్రిప్టో కరెన్సీ.. దాంతో చేసే వ్యవహారాలపై దేశాద్యంతం చర్చలు జరుగుతున్న తరుణంలో ఒక్కసారి.. దీని గతం.. వర్తమానం.. భవిష్యత్తులను సమీక్షిస్తే...

ఈమధ్యకాలంలో క్రిప్టో కరెన్సీ గురించి బోలెడన్ని వార్తలు వస్తున్నాయి. తక్కువకాలంలో ఎక్కువ లాభాలకు ఇవి మేలు మార్గాలన్న ప్రచారం జరుగుతోంది. స్టాక్‌ మార్కెట్‌లో కంపెనీల షేర్ల మాదిరిగానే క్రిప్టో వ్యవహారాల కోసం ఎక్సే్చంజీలూ పుట్టుకొచ్చాయి. బోలెడన్ని టీవీ, న్యూస్‌ పేపర్‌ ప్రకటనలూ కనిపిస్తున్నాయి. అంతా బాగానే ఉంది కానీ.. క్రిప్టో కరెన్సీ అంటే ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం మాత్రం అతితక్కువ మందికి మాత్రమే తెలుసు. అబ్బే.. అదంతా హైటెక్‌ వ్యవహారం. మనకర్థం కాదులే అనే వాళ్ల మాటేమో కానీ.. ఈ కథనం పూర్తయ్యేలోపు ఈ ఆధునిక ఆర్థిక వ్యవస్థను మీరు ఎంతో కొంత అర్థం చేసుకోవడం గ్యారెంటీ. ఇంకెందుకు ఆలస్యం? చదివేయండి మరి.. 



చిన్నప్పుడు కాగితపు నోట్లతో ఆడుకున్న గుర్తుందా మీకు? క్రిప్టో కరెన్సీ కూడా దాదాపు ఇలాంటిదే. కాకపోతే డిజిటల్‌ ప్రపంచంలో మాత్రమే ఉంటుంది. పైగా ఈ కరెన్సీని చూడవచ్చు. వాడుకోవచ్చు కానీ.. అసలు నోట్లు, నాణేల మాదిరిగా ముట్టుకోలేము. పర్సుల్లో దాచుకోలేము. అన్నీ ఇంటర్నెట్‌లోనే! ఇంకో సంగతి. వంద రూపాయల నోటు విలువ... ప్రభుత్వం రద్దు చేయనంత వరకూ అంతే ఉంటుంది. కానీ క్రిప్టో కరెన్సీకి ఉండే విలువ మాత్రం.. చెల్లించే వారిపై ఆధారపడి హెచ్చుతగ్గులకు లోనవుతూంటుంది. ఫలానా క్రిప్టో కరెన్సీకి డిమాండ్‌ బాగా ఉంది.. కానీ సరఫరా తక్కువ ఉందీ అంటే విలువ పెరుగుతుంది. అలాగే మైనింగ్‌ పద్ధతి ద్వారా ఒక క్రిప్టో నాణేన్ని ఉత్పత్తి చేసేందుకు ఎంత ఖర్చవుతుందన్న అంశంపై కూడా దాని విలువ ఆధారపడి ఉంటుంది. మార్కెట్‌లో ఉన్న ఇతర క్రిప్టో కరెన్సీలు కూడా ఒక్కోదాని విలువను నిర్ణయిస్తూంటాయి. డాలర్, యూరో... ఎన్‌, యాన్‌, రూపాయిల మాదిరిగానే క్రిప్టో ప్రపంచంలో బిట్‌కాయిన్‌, ఎరిథ్రియం, రిపుల్, లైట్‌కాయిన్‌, కార్డానో బిట్‌కాయిన్‌ క్యాష్‌ అని బోలెడన్ని వేర్వేరు కరెన్సీలు ఉన్నాయి!

ప్రహేళికలు పరిష్కరిస్తే.. కాయిన్‌ బహుమతులు!
రూపాయిలు, డాలర్లంటే.. ఉద్యోగం, వ్యాపారం ఏదో ఒకటి చేసి సంపాదించుకుంటాం. మరి డిజిటల్‌ కరెన్సీ క్రిప్టో రూకల మాటేమిటి? ఇందుకోసం ప్రస్తుతం అనేక మార్గాలున్నాయి. కొన్ని కంపెనీలు ఈ–కామర్స్‌ వ్యవహారాలకు సాధారణ నగదును స్వీకరించి అందులో కొంత భాగాన్ని మనకు క్రిప్టో కరెన్సీ రూపంలో ఇస్తున్నాయి కూడా. ఇంకో పద్ధతి ఏమిటంటే.. అత్యంత శక్తిమంతమైన కంప్యూటర్‌ అల్గారిథమ్‌ ద్వారా సృష్టించిన ఒక గణితశాస్త్రపు చిక్కుముడిని విప్పడం. దీన్నే మైనింగ్‌ అంటారు. ఇక మూడో పద్ధతి.

ఎవరో మైనింగ్‌ ద్వారా సంపాదించుకున్న కరెన్సీని ఎక్సే్చంజీల్లో డబ్బులు పెట్టి కొనుక్కోవడం. దాని విలువ పెరిగితే మనకూ లాభాలొస్తాయని వేచిచూడటం. అచ్చం స్టాక్‌ ఎక్సే్చంజీల మాదిరిగా అన్నమాట. మైనింగ్‌ వ్యవహారం మొత్తం బిట్‌కాయిన్‌తో మొదలైనప్పటికీ ఇప్పుడు దాదాపు అన్ని క్రిప్టో కరెన్సీలూ ఈ పద్ధతిని ఉపయోగిస్తున్నాయి. క్రిప్టో కరెన్సీలు మొత్తం పనిచేసేది బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీ ఆధారంగానే. సమాచారం అత్యంత భద్రంగా ఉంచేందుకు ఉపయోగపడే ఈ బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీని క్రిప్టో కరెన్సీలను తవ్వి తీసుకునేందుకు మాత్రమే కాకుండా.. ఇతర అవసరాలకూ వాడుకోవచ్చు. 

క్రిప్టో కరెన్సీతో లాభాలేమిటి?
మోసాలకు తావే లేదు: క్రిప్టో కరెన్సీ మొత్తం డిజిటల్‌ వ్యవహారం. పైగా బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీ సాయంతో నడుస్తుంది. కాబట్టి ఇందులో మోసాలకు అస్సలు తావు ఉండదు. చెల్లింపులైనా, ఒప్పందాలైనా డిజిటల్‌ ప్రపంచపు నెట్‌వర్క్‌లో అందరికీ అందుబాటులోనే ఉంటాయి కానీ.. ఏ ఒక్కరు కూడా అందులో మార్పులు చేసేందుకు అవకాశం ఉండదు. ఒకవేళ చేస్తే ఆ మార్పుకు నెట్‌వర్క్‌లోని మిగిలిన వారందరూ ఓకే అనాలి కాబట్టి మోసం చేయాలని ఎవరైనా అనుకున్నా సాధ్యం కాదు. పైగా మార్పులు చేసేందుకు చేసిన ప్రయత్నం కూడా డిజిటల్‌ రూపంలో భద్రంగా నిక్షిప్తమవుతుంది కాబట్టి.. దొంగ ఇట్టే దొరికిపోతాడు!!



వ్యక్తిగత వివరాలు భద్రం
క్రెడిట్‌/డెబిట్‌ కార్డుతో ఏం చేసినా మన కొనుగోళ్ల వ్యవహారాలు మొత్తం అవతలివైపు వారికి అందుబాటులోకి వచ్చేస్తాయి. క్రిప్టో కరెన్సీతో ఈ సమస్య ఉండదు. కార్డు ద్వారా డబ్బు తీసుకునేందుకు బ్యాంకులు, ఇతర సంస్థలు ‘పుల్‌’ అంటే డబ్బు కావాలని అడగడం.. అకౌంట్‌ నుంచి లాక్కోవడం జరగుతుంది. క్రిప్టో వ్యవహారం దీనికి భిన్నం. డబ్బు కావల్సిన వ్యక్తి/సంస్థకు ‘పుష్‌’ పద్ధతిలో మన అకౌంట్‌ నుంచి తగిన విలువ మాత్రమే అందుతుంది. మిగిలిన వివరాలేవీ ఉండవు.



మధ్యవర్తుల్లేకుండా
ఇల్లు, పొలం లేదా ఇంకేదైనా స్థిరాస్తి కొన్నప్పుడు సహజంగా డీలర్లు, బ్రోకర్లు, న్యాయవాదులు (ఒప్పందం రాసుకునేందుకు) వంటి మధ్యవర్తుల ప్రమేయం వచ్చేస్తుంది. క్రిప్టో వ్యవహారాల్లో వీరి అవసరం ఏమాత్రం ఉండదు. అమ్మే, కొనేవాళ్లు ఇద్దరి మధ్య మాత్రమే వ్యవహారం ఉండిపోతుంది. అదే సమయంలో సాక్షుల మాదిరిగా నెట్‌వర్క్‌లోని వారందరూ ఒప్పందాన్ని ఓకే చేయాల్సి ఉంటుంది. 



అందరికీ అందుబాటులో 
క్రిప్టో వ్యవహారాలకు ఇంటర్నెట్‌ సౌకర్యం ఒక్కటి ఉంటే సరిపోతుంది. ఈ లెక్కన ప్రపంచవ్యాప్తంగా దాదాపు 466 కోట్ల మంది ఈ వ్యవహారాలను నడపవచ్చునన్నమాట. బ్యాంక్‌ అకౌంట్, క్రెడిట్‌/డెబిట్‌ కార్డులు వంటివేవీ లేకుండానే! 

అంతా ఉచితమే 
ప్రస్తుతానికి క్రిప్టో వ్యవహారాలకు సంబంధించినంత వరకూ ఎలాంటి ఛార్జీలూ లేవు. ప్రాథమికంగా ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే వ్యవహారం కావడం దీనికి కారణం. అయితే క్రిప్టో కరెన్సీలను మార్చుకోవడం వంటి విషయాల్లో ఇటీవలే మొదలైన కొన్ని ఎక్సే్చంజీల్లో మాత్రం కమిషన్ల రూపంలో కొంత విలువను చెల్లించుకోవాల్సి ఉంటుంది.ఇబ్బందులేవీ లేవా? బోలెడు. ముందుగా చెప్పుకున్నట్లు క్రిప్టో కరెన్సీ వ్యవహారాలన్నీ ప్రైవేట్‌ వ్యక్తులతో కూడిన నెట్‌వర్క్‌లలోనే జరుగుతూంటాయి. పర్యవేక్షించేందుకు, నియంత్రించేందుకు అధికారిక సంస్థలంటూ ఏవీ ఉండవు. దీనివల్ల లాభాలెన్నో... నష్టాలూ అన్నే ఉన్నాయి. ముందుగా చెప్పుకోవాల్సింది హెచ్చుతగ్గుల గురించి...

బిట్‌కాయిన్‌ కానివ్వండి, ఇంకో క్రిప్టోకరెన్సీ ఏదైనా కానివ్వండి.. ప్రతిరోజూ విపరీతమైన హెచ్చుతగ్గులకు లోనవుతూంటుంది. ఒక రోజు లక్షల్లో పలికిన క్రిప్టో విలువ మరుసటి రోజే రూపాయిల్లోకి పడిపోవచ్చు. కాబట్టి క్రిప్టోలో పెట్టుబడులతో లక్షలు, కోట్లు ఆర్జించేయవచ్చు అనుకునేవారు కొంచెం జాగ్రత్త వహించడం మేలు. ఈ స్థాయిలో లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ అందరికీ మాత్రం కాదు. వందలో 90 శాతం మంది నష్టపోయేందుకే అవకాశాలు ఎక్కువని కొంతమంది నిపుణులు చెబుతూండటం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం.

బోలెడన్ని కట్టుబాట్లు, నిబంధనలు ఉన్న స్టాక్‌మార్కెట్‌లోనూ స్కామ్‌లు జరుగుతున్నట్లే క్రిప్టో వాణిజ్య ప్రపంచం లోనూ మోసగాళ్లు తమ స్వార్థ ప్రయోజనాలను నెరవేర్చుకునే అవకాశాలు ఉన్నాయి. 2019లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం బిట్‌కాయిన్‌ వ్యవహారాలు నడిపేవారిలో 25 శాతం మంది అక్రమ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. అలాగే 46 శాతం వ్యవహారాలు అక్రమాలకు సంబంధించినవి. మత్తుపదార్థాలు, ఆయుధాల విక్రయం వంటివన్నమాట. 

అన్ని రకాల క్రిప్టో కరెన్సీలను పరిమిత సంఖ్యలోనే అందుబాటులో ఉంచుతారన్నది ఇప్పటివరకూ ఉన్న అంచనా. బిట్‌కాయిన్ల సంఖ్య 2.1 కోట్లు మించదని ఇందుకు తగ్గ పద్ధతులు బ్లాక్‌చెయిన్‌ అల్గారిథమ్‌లోనే ఉన్నాయని చెబుతారు. అయితే మఖలో పుట్టి పుబ్బలో చచ్చినట్లు ఇప్పటికే ప్రతిరోజూ కొన్ని కొత్త కరెన్సీలు పుట్టుకొస్తూండగా.. మరికొన్ని గిట్టిపోతున్నాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో అపరిమిత కాయిన్లు అందుబాటులోకి వస్తే వాటి విలువ పడిపోతుందన్న అంచనాలు ఉన్నాయి. ఆర్‌బీఐ వంటి ప్రభుత్వ సంస్థలు తమదైన క్రిప్టో కరెన్సీలు అందుబాటులోకి తెస్తే ప్రైవేటు రంగంలో ఉన్న బిట్‌కాయిన్‌, లైట్‌కాయిన్‌, డాగే కాయిన్‌ వంటి వాటి విలువ పడిపోయే అవకాశం ఉంది.  

పుట్టిందిలా...
ఇప్పుడంటే బోలెడన్ని క్రిప్టో కరెన్సీలు ఉన్నాయి కానీ.. ఇదంతా మొదలైంది బిట్‌కాయిన్‌తో. 2008 ఆగస్టులో బిట్‌కాయిన్‌.ఓఆర్‌జీ పేరుతో ఓ డొమైన్‌ నమోదుతో క్రిప్టో వ్యవహారాలకు శ్రీకారం పడింది. అదే ఏడాది అక్టోబరులో సతోషి నకమోటో పేరుతో ఈ వెబ్‌సైట్‌లో ఒక లింక్‌ ప్రత్యక్షమైంది. ‘‘బిట్‌కాయిన్‌: ఈ పీర్‌ టు పీర్‌ ఎలక్ట్రానిక్‌ క్యాష్‌ సిస్టమ్‌’’ శీర్షికతో బ్యాంకుల్లాంటి కేంద్రీకృత వ్యవస్థలేవీ లేకుండా ఇంటర్నెట్, బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీల ఆధారంగా డబ్బు ఎలా పంపిణీ చేయవచ్చో వివరించారు. నకమోటో బిట్‌కాయిన్‌ సాఫ్ట్‌వేర్‌ను అందరికీ అందుబాటులో ఉండే ఓపెన్‌ సోర్స్‌కోడ్‌గా 2009లో విడుదల చేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ నకమోటో ఎవరో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. కొంతమంది ఒక వ్యక్తి అంటూంటే.. కొందరు వ్యక్తుల బృందమన్నది మరికొందరి అంచనా.  2009 జనవరి మూడున నకమోటో తన సాఫ్ట్‌వేర్‌ అల్గారిథమ్‌ మైనింగ్‌ ద్వారా బ్లాక్‌చెయిన్‌లోని తొలి బ్లాక్‌ను సిద్ధం చేశారు. ఈ బ్లాక్‌ను జెనిసిస్‌ బ్లాక్‌ అంటారు. ‘ద టైమ్స్‌’ మ్యాగజైన్‌లో ప్రచురితమైన ఒక శీర్షికను ఈ బ్లాక్‌ తాలూకు కాయిన్‌బేస్‌లో పొందుపరచారు. 

తొలి బిట్‌కాయిన్‌ వ్యవహారం.. 
రెండు పిజ్జాల కొనుగోలు
2010లో ఓ కంప్యూటర్‌ ప్రోగ్రామర్‌ పదివేల బిట్‌కాయిన్లతో రెండు పిజ్జాలు కొనుగోలు చేయడం ప్రపంచంలో తొలి క్రిప్టో వ్యవహారంగా నమోదైంది. ఈ రోజుల్లో పదివేల బిట్‌కాయిన్ల విలువ కొంచెం అటు ఇటుగా నలభై లక్షల రూపాయలు!! అప్పట్లో బిట్‌కాయిన్‌ విలువ లక్షల్లోకి చేరుతుందని ఎవరూ ఊహించలేదు. ఈ చిత్రమైన ఘటనను గుర్తుంచుకునేందుకు ఇప్పటికీ ఏటా మే 22వ తేదీని ‘బిట్‌కాయిన్‌ పిజ్జా డే’ గా జరుపుకుంటూంటారు.

  •      మైక్రోసాఫ్ట్, హోండిపో, నేమ్‌చీప్, హోల్‌ఫుడ్స్, న్యూఎగ్స్, స్టార్‌బక్స్‌ వంటి కంపెనీలు, కొన్ని దేశాల బ్యాంకులు కూడా క్రిప్టో కరెన్సీని వస్తు/సేవల కొనుగోళ్లకు అంగీకరిస్తున్నాయి.
  • బిట్‌కాయిన్‌కు చట్టబద్ధత కల్పించిన తొలి దేశం ఎల్‌ సాల్వడార్‌. ఈ ఏడాది జూన్‌ తొమ్మిదిన బిట్‌కాయిన్‌ను దేశంలో అన్ని రకాల వ్యవహారాలకూ వాడవచ్చునని ఆ దేశం ప్రకటించింది. ప్రధాన కరెన్సీ ఇప్పటికీ అమెరికన్‌ డాలరే! 
  • బిట్‌కాయిన్లను వాడుకునేందుకు, నిల్వ చేసుకునేందుకు ‘వ్యాలెట్లు’ ఉపయోగపడతాయి. యూపీఐ ఆధారిత డిజిటల్‌ వాలెట్లు గూగుల్‌పే, ఫోన్‌ పే, పేటీఎం మాదిరిగా అన్నమాట.  




నిషేధమా? నియంత్రణా?
క్రిప్టో కరెన్సీలపై భారత్‌లో కొన్నేళ్లుగా తర్జనభర్జనలు నడుస్తున్నాయి. 2016లో వీటిపై పూర్తి నిషేధం విధించగా ఆ తరువాత సుప్రీంకోర్టు జోక్యంతో పరిమిత స్థాయిలో లావాదేవీలు నడిచాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల ప్రైవేట్‌ క్రిప్టో కరెన్సీలను నిషేధించే దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లోనే ‘ద క్రిప్టో కరెన్సీ అండ్‌ రెగ్యులేషన్‌ ఆఫ్‌ అఫీషియల్‌ డిజిటల్‌ కరెన్సీ బిల్‌’ పేరుతో బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఈ బిల్లుపై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బిట్, లైట్‌ ఎరిథ్రియం వంటి ప్రైవేట్‌ క్రిప్టో కరెన్సీలపై నిషేధం ఉంటుందని, సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీపై నిషేధం ఉండదని ఒక వర్గం వాదిస్తూండగా... ఇంకోవర్గం వ్యవహారాలను గుర్తించేందుకు వీలైన పబ్లిక్‌ లెడ్జర్‌ (పద్దు) లేని క్రిప్టో కరెన్సీలపై మాత్రమే నిషేధం ఉంటుందని వ్యాఖ్యానిస్తున్నారు. బిల్లు వివరాలు పూర్తిగా తెలిస్తేగానీ అసలు విషయం ఏమిటన్నది స్పష్టం కాదు. దేశ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇటీవలే ఒక ప్రకటన చేస్తూ క్రిప్టో కరెన్సీని చట్టబద్ధమైన కరెన్సీగా గుర్తించే అవకాశం లేదని చెప్పడం గమనార్హం.

భారత్‌లో టాప్‌–10 క్రిప్టో కరెన్సీలు...

  • బిట్‌కాయిన్‌ 
  • ఎరిథ్రియం 
  • కార్డానో
  • రిపుల్‌
  • యూఎస్‌డీ కాయిన్‌ 
  • పోల్కాడాట్‌
  • డాగే కాయిన్‌ 
  • షిబా ఇనూ
  • లైట్‌కాయిన్‌ 
  • యునీస్వాప్‌


నవంబరు 2021 నాటికి 7557ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రిప్టో కరెన్సీలు
20,000 + పైగా 2021 జనవరి నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిట్‌కాయిన్‌ ఏటీఎంల సంఖ్య
10.7 కోట్లుభారత్‌లో క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడులు పెట్టిన వారి సంఖ్య
రూ. 75,000 కోట్లు భారతీయుల క్రిప్టో పెట్టుబడుల మొత్తం
నవంబరు 24నాటికి ప్రపంచ క్రిప్టోకరెన్సీ మార్కెట్‌ విలువ! 2.4 లక్షల కోట్ల డాలర్లు

– గిళియార్‌ గోపాలకృష్ణ మయ్యా 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement