21 ఏళ్ల వయసు వచ్చే సరికే టెన్నిస్ చరిత్రలో దిగ్గజ ఆటగాళ్లలో ఒకడిగా అతను గుర్తింపు తెచ్చుకోగలిగాడు. 26 ఏళ్ల వయసు వచ్చేసరికి ఎందరికో సాధ్యం కాని ఘనతలను అతను సొంతం చేసుకున్నాడు. ఆధునిక టెన్నిస్ తరంలో ఏ ఆటగాడి కెరీర్ కూడా అంత తక్కువ సమయంలో అంత అద్భుతంగా లేదు. చాంపియన్‌షిప్ విజయాలు, ఫలితాలు మాత్రమే కాదు.. అతను వాటిని సాధించిన తీరు కూడా అబ్బురపరచాయి.
18 ఏళ్ల వయసుకే ప్రతిష్ఠాత్మక ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గి అప్పటికి అత్యంత పిన్న వయస్కుడిగా అతను గుర్తింపు తెచ్చుకున్నాడు. రెండు పూర్తిగా భిన్నమైన వేదికలపై వరుసగా మూడేసి సార్లు గ్రాండ్‌స్లామ్ గెలవడం అతనికి మాత్రమే సాధ్యమైన ఘనత. ఆ పొడవాటి జట్టు, హెడ్ బ్యాండ్ సుదీర్ఘ సమయం పాటు ప్రపంచ టెన్నిస్‌పై చెరగని ముద్ర వేశాయి. వరల్డ్ టెన్నిస్‌లో ఆల్‌టైమ్ గ్రేట్‌గా నిలిచిన ఆ స్వీడిష్ స్టార్ ప్లేయర్ బోర్న్ బోర్గ్. టీనేజ్ సంచలనంగా తన కెరీర్ మొదలు పెట్టిన బోర్గ్ తన ఆకర్షణీయమైన ఆటతో 70వ దశకపు టెన్నిస్ ప్రపంచాన్ని శాసించాడు.
'మేమందరం టెన్నిస్ ఆడుతున్నాం. అతను మాత్రం అంతకు మించి ఆడుతున్నాడు'.. 1976 వింబుల్డన్ ఫైనల్లో బోర్గ్ చేతిలో ఓడిన తర్వాత అతని ప్రత్యర్థి, అప్పటి ఫేవరెట్ ఎలీ నాస్టెస్ చేసిన వ్యాఖ్య అది. 20 ఏళ్ల బోర్గ్ ఆ మ్యాచ్‌లో చూపిన ప్రదర్శన అలాంటిది మరి. మంచి ఫిట్‌నెస్.. చక్కటి నైపుణ్యంతో పాటు వైవిధ్యమైన శైలి బోర్గ్‌ను ప్రత్యేకంగా నిలబెట్టాయి. అటు ఫోర్‌హ్యాండ్‌ను, ఇటు బ్యాక్‌హ్యాండ్‌ను కూడా సమర్థంగా వాడగల ప్రతిభ బోర్గ్ అద్భుతమైన కెరీర్‌కి బలాలుగా నిలిచాయి. హాకీలో స్లాప్ షాట్ తరహాలో రెండు చేతులతో అతను ఆడే బ్యాక్‌హ్యాండ్‌కు ప్రత్యర్థి ఎవరైనా సరే.. ఓటమిని ఒప్పుకోవాల్సిందే.
13 ఏళ్ల వయసులోనే స్వీడన్ లో 18 ఏళ్ల ఆటగాళ్లందరినీ ఓడించి వచ్చిన బోర్గ్ ఆటపై ఆ దేశపు అభిమానులు పెట్టుకున్న అంచనాలు ఎప్పుడూ తప్పు కాలేదు. బోర్గ్ తండ్రి తనకు స్థానిక పోటీల్లో బహుమతిగా వచ్చిన ఒక రాకెట్‌ను కొడుకు చేతుల్లో పెట్టినప్పుడు అతనికి తొలిసారి ఆటపై ఆసక్తి కలిగింది. ఆ తర్వాత మొదలైన అతని సాధన బోర్గ్‌ను ఉన్నత స్థాయికి తీసుకెళ్లింది. ఆటలో ఓనమాలు నేర్చుకున్నప్పుడు అతను బేస్‌లై¯Œ కే ప్రాధాన్యమిచ్చాడు. సుదీర్ఘ ర్యాలీలు ప్రాక్టీస్ చేయడంతో పాటు బ్యాక్‌హ్యాండ్‌పై దృష్టి పెట్టాడు.
ప్రొఫెషనల్‌గా మారిన తర్వాత కూడా బోర్గ్ సర్వీస్ కాస్త బలహీనంగానే ఉండేది. అయితే వింబుల్డ¯Œ లాంటి పెద్ద టోర్నీలు నెగ్గాలంటే సాధారణ ఆట సరిపోదని భావించి తన సర్వ్ అండ్ వ్యాలీని పటిష్ఠపరచుకున్నాడు. చివరకు అది గొప్ప విజయాలను అందించింది. ఆటలో ఎలాంటి కఠిన పరిస్థితుల్లోనూ ఒత్తిడిని దరి చేరనీయకుండా, ఓటమి తర్వాత కూడా ప్రశాంతంగా కనిపించగల అతని తత్వం బోర్గ్‌కు ‘ఐస్‌బర్గ్’ అనే పేరు తెచ్చి పెట్టింది.
ఫ్రెంచ్ ఓపెన్‌తో మొదలు..
స్వీడన్ తరఫున డేవిస్ కప్ టీమ్‌లో ఆడే అవకాశం బోర్గ్‌కు పదిహేనవ ఏటనే వచ్చింది. కెరీర్ తొలి మ్యాచ్‌లో అతను చక్కటి విజయంతో శుభారంభం చేసినా టీమ్ ముందుకు వెళ్లలేకపోయింది. మరో రెండేళ్ల పాటు అక్కడక్కడా కొన్ని ఆకట్టుకునే ప్రదర్శనలు చేసినా.. చెప్పుకోదక్క టైటిల్‌ను మాత్రం అందుకోలేదు. అయితే 1974.. అతని కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆక్లాండ్‌లో గ్రాస్‌కోర్టుపై తొలి టోర్నీ నెగ్గి సంబరాలు చేసుకున్న బోర్గ్ అదే ఏడాది గ్రాండ్‌స్లామ్ చాంప్‌గా కూడా అవతరించాడు.
రోమ్‌లో ఇటాలియన్ ఓపెన్ గెలవడంతో అతనిపై అంచనాలు పెరిగిపోయాయి. వాటిని నిలబెట్టుకుంటూ అతను మరికొద్ది రోజులకే రోలండ్‌గారోస్‌లో సత్తా చాటాడు. ఫైనల్లో ఐదు సెట్‌ల సమరంలో మ్యాన్యూల్ ఒరెంటెస్ (స్పెయిన్)ను ఓడించి 18 ఏళ్లకే ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ అయ్యాడు. ఆ ఏడాది మొత్తం 8 టోర్నీల్లో విజేతగా నిలిచి బోర్గ్ తన రాకను ఘనంగా చాటాడు.
తర్వాతి ఏడాది కూడా ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను నిలబెట్టుకున్న అతను మరో నాలుగు ట్రోఫీలతో తన జోరును కొనసాగించాడు. 1975.. అతనికి మరో మధురానుభూతిని మిగిల్చింది. 19 ఏళ్ల వయసులో అతను స్వీడన్‌ను తొలిసారి డేవిస్ కప్ విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. అదే సమయంలో డేవిస్ కప్‌లో 19 వరుస విజయాలు సాధించి ఆ ఘనత అందుకున్న తొలి ఆటగాడిగానూ కొత్త రికార్డు సృష్టించాడు.
ట్రిపుల్ ధమాకా..
రెండు ఫ్రెంచ్ టైటిల్స్ సాధించినా గ్రాస్ కోర్టుపై ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ గెలవని లోటు అప్పుడే బోర్గ్‌కు కనిపించింది. దాంతో తన ఆటలో స్వల్ప మార్పులతో ప్రత్యేక దృష్టి పెట్టాడు. చివరకు ఆ సాధన అద్భుతమైన ఫలితాలను అందించింది. 1976లో ఒక్క సెట్ కూడా కోల్పోకుండా తొలిసారి అతను వింబుల్డన్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ మెగా ఈవెంట్‌పై అతని హవా మరో నాలుగేళ్లు సాగడం విశేషం. 1976 నుంచి 1980 వరకు వరుసగా ఐదేళ్ల పాటు బోర్గ్ వింబుల్డన్ చాంపియన్గా నిలిచాడు. రెండో టైటిల్ సాధించిన సమయంలో మొదటిసారి ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ కూడా బోర్గ్ రాకెట్‌లో చిక్కింది. మరో వైపు రోలండ్ గారోస్ క్లే కోర్టుపై కూడా పట్టు కోల్పోలేదు.
రెండేళ్ల విరామం తర్వాత 1978లో మూడో ఫ్రెంచ్ ఓపెన్ గెలుచుకున్న అతను ఆ తర్వాత మరో మూడు టైటిల్స్‌ను తన కోర్ట్‌లో వేసుకున్నాడు. ఆ క్రమంలో బోర్గ్ ప్రపంచ టెన్నిస్ చరిత్రలో మరెవరికీ సాధ్యం కాని, ఈతరం ఆటగాళ్లు కూడా అందుకోలేని ఒక అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. గ్రాండ్‌స్లామ్‌లో తక్కువ వ్యవధిలో పూర్తిగా రెండు భిన్న సర్ఫేస్ (క్లే, గ్రాస్)లపై జరిగే ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ లను అతను వరుసగా మూడేళ్ల పాటు గెలిచాడు. 1979లో ఏకంగా 13 టైటిల్స్‌తో అతను సంచలనం సృష్టించాడు. 1980.. వింబుల్డన్ ఫైనల్ అయితే చరిత్రలోనే అత్యుత్తమ మ్యాచ్‌లలో ఒకటిగా నిలిచిపోయింది. అందులో బోర్గ్ .. తన చిరకాల ప్రత్యర్థి జాన్ మెకన్రోపై 16, 75, 63, 67 (16/18), 86తో విజయం సాధించాడు.
ముగింపు...పునరాగమనం...
బోర్గ్ తన ఇరవై ఆరవ ఏట.. ఒక రోజు.. అనూహ్యంగా తాను టెన్నిస్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. టెన్నిస్‌లో చక్కగా ఎదిగే వయసు.. ఎదుగుతున్న సమయంలో.. అతని ఆ ప్రకటన అందరికీ ఆశ్చర్యం కలిగించింది. 1982లో ఒకే ఒక టోర్నీ ఆడిన అతను సన్నిహితులు ఎందరు వారించినా తగిన కారణం కూడా లేకుండా రిటైర్మెంట్ ప్రకటించాడు. 1981లో గెలిచిన ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ అతని ఆఖరి గ్రాండ్‌స్లామ్. ఆ తర్వాత అతను తన బ్రాండ్‌ను వాడుకుంటూ వేర్వేరు వ్యాపారాల్లోకి వెళ్లిపోయాడు.
అయితే దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ ఆటపై మనసు మళ్లడంతో తన పాత ఫ్యాషన్ స్టయిల్‌లో, పాతతరం వుడెన్ రాకెట్‌తో మళ్లీ కోర్టులోకి అడుగు పెట్టాడు. ఊహించినట్లుగానే ఆ ప్రయత్నం సఫలం కాలేదు. ఆ టైమ్‌కి టెన్నిస్ పూర్తిగా మారిపోయిందని బోర్గ్‌కు అర్థమైంది. ఆడిన 12 మ్యాచ్‌లలో ఒక్కటి కూడా గెలవకుండా ఈసారి శాశ్వతంగా గుడ్‌బై చెప్పేశాడు. అయితే 11 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ సాధించిన ఘనత, 66 టైటిల్స్, 109 వారాల పాటు వరల్డ్ నంబర్‌వన్... వీటన్నింటితో పాటు ఎన్నో గొప్ప మ్యాచ్‌లను అందించిన శాశ్వత కీర్తితో అభిమానుల మదిలో నిలిచిపోవడంలో మాత్రం బోర్గ్ సఫలమయ్యాడు.
- మొహమ్మద్ అబ్దుల్ హాది
చదవండి: Ashes 2023: ఇంగ్లండ్ కోచ్ మెక్‌కల్లమ్‌కు చేదు అనుభవం..
Comments
Please login to add a commentAdd a comment