Wimbledon 2023: Elina Svitolina stuns World No 1 Iga Swiatek to enter semi-finals - Sakshi
Sakshi News home page

Wimbledon 2023: సంచలనం.. నెంబర్‌ వన్‌ స్వియాటెకు షాకిచ్చిన స్వితోలినా

Published Wed, Jul 12 2023 7:03 AM | Last Updated on Wed, Jul 12 2023 10:10 AM

Wimbledon 2023: Elina Svitolina Stuns World-No-1-IGA Swiatek Enter-Semis - Sakshi

లండన్‌: గత ఏడాది అక్టోబర్‌లో పాపకు జన్మనిచ్చి... ఏప్రిల్‌లో మళ్లీ రాకెట్‌ పట్టిన ఉక్రెయిన్‌ టెన్నిస్‌ స్టార్‌ ఎలీనా స్వితోలినా వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో పెను సంచలనం సృష్టించింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో స్వితోలినా 7–5, 6–7 (5/7), 6–2తో ప్రపంచ నంబర్‌వన్, టాప్‌ సీడ్‌ ఇగా స్వియాటెక్‌ (పోలాండ్‌)ను బోల్తా కొట్టించింది.

2019 తర్వాత మళ్లీ వింబుల్డన్‌ టోర్నీలో సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ఫ్రెంచ్‌ ఓపెన్‌లో క్వార్టర్‌ ఫైనల్‌ చేరిన స్వితోలినాకు వింబుల్డన్‌ నిర్వాహకులు ‘వైల్డ్‌ కార్డు’ కేటాయించారు. స్వియాటెక్‌తో 2 గంటల 51 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో స్వితోలినా ఐదు ఏస్‌లు సంధించింది. తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పో యి, స్వియాటెక్‌ సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్‌ చేసింది. నెట్‌ వద్దకు 14 సార్లు దూసుకొచ్చి తొమ్మిదిసార్లు పాయింట్లు నెగ్గిన స్వితోలినా 25 విన్నర్స్‌ కొట్టింది. నాలుగు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ నెగ్గి, తొలిసారి వింబుల్డన్‌ టోర్నీలో క్వార్టర్‌ ఫైనల్‌ చేరిన స్వియాటెక్‌ 41 అనవసర తప్పిదాలు చేసింది.

ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 76వ స్థానంలో ఉన్న స్వితోలినా సెమీఫైనల్‌ చేరిన క్రమంలో నలుగురు గ్రాండ్‌స్లామ్‌ చాంపియన్స్‌ను ఓడించడం విశేషం. తొలి రౌండ్‌లో వీనస్‌ విలియమ్స్‌ (అమెరికా)పై, రెండో రౌండ్‌లో సోఫియా కెనిన్‌ (అమెరికా)పై, నాలుగో రౌండ్‌లో విక్టోరియా అజరెంకా (బెలారస్‌)లపై స్వితోలినా గెలిచింది. సెమీఫైనల్లో చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన మర్కెటా వొండ్రుసోవాతో స్వితోలినా తలపడుతుంది. మరో క్వార్టర్‌ ఫైనల్లో 42వ ర్యాంకర్‌ వొండ్రుసోవా 6–4, 2–6, 6–4తో ప్రపంచ నాలుగో ర్యాంకర్, నాలుగో సీడ్‌ జెస్సికా పెగూలా (అమెరికా)పై సంచలన విజయం సాధించింది.  

క్వార్టర్‌ ఫైనల్లో బోపన్న జోడీ 
పురుషుల డబుల్స్‌ మూడో రౌండ్‌లో రోహన్‌ బోపన్న (భారత్‌)–మాథ్యూ ఎబ్డెన్‌ (ఆస్ట్రేలియా) ద్వయం 7–5, 4–6, 7–6 (10/7) తో డేవిడ్‌ పెల్‌ (నెదర్లాండ్స్‌)–రీస్‌ స్టాడ్లెర్‌ (అమెరికా) జంటను ఓడించింది. జూనియర్‌ బాలుర సింగిల్స్‌ రెండో రౌండ్‌లో మానస్‌ ధామ్నె (భారత్‌) 1–6, 4–6తో సియర్లీ (బ్రిటన్‌) చేతిలో ఓడిపోయాడు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement