లండన్: టాప్‌స్టార్లు నొవాక్ జొకోవిచ్, ఇగా స్వియాటెక్ వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో సెర్బియన్ దిగ్గజం, రెండో సీడ్ జొకోవిచ్ తనదైన శైలిలో స్విట్జర్లాండ్ ఆటగాడు స్టాన్ వావ్రింకాకు ఇంటిదారి చూపాడు. ఇప్పటికే ఈ సీజన్‌లో జరిగిన రెండు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను చేజిక్కించుకున్న జొకోవిచ్ 6–3, 6–1, 7–6 (7/5)తో వరుస సెట్లలో స్విస్ ఆటగాడిని ఓడించాడు. కేవలం 2 గంటల 7 నిమిషాల్లో మ్యాచ్‌ను ముగించాడు.
11 ఏస్‌లతో రెచ్చిపోయిన జొకో ఒక డబుల్‌ఫాల్ట్ చేశాడు. 26 అనవసర తప్పిదాలు చేసిన సెర్బియన్ 38 విన్నర్లు కొట్టాడు. ప్రపంచ నంబర్‌వన్ అల్‌కరాజ్ (స్పెయిన్) 6–3, 6–7 (6/8), 6–3, 7–5తో నికోలస్ జెర్రి (చీలి)పై గెలిచేందుకు కష్టపడ్డాడు. రష్యా స్టార్, మూడో సీడ్ మెద్వెదెవ్ 4–6, 6–3, 6–4, 6–4తో మార్టన్ ఫుక్సొవిక్స్ (హంగేరి)పై, ఐదో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్) 6–4, 7–6 (7/5), 6–4తో లాస్లొ జేర్ (సెర్బియా)పై నెగ్గారు.
ఇతర మ్యాచ్‌ల్లో 19వ సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 6–4, 5–7, 6–2, 6–2తో యోసుకె వాతనుకి (జపాన్)పై గెలుపొందగా, ఎనిమిదో సీడ్ జన్నిక్ సిన్నెర్ (ఇటలీ) 3–6, 6–2, 6–3, 6–4తో క్వెంటిన్ హేలిస్ (ఫ్రాన్స్)ను ఓడించాడు. మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్, ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ స్వియాటెక్ (పోలాండ్)తో పాటు ఎలినా స్వితోలినా (ఉక్రెయిన్), బెలిండా బెన్సిక్ (స్విట్జర్లాండ్) ప్రిక్వార్టర్స్ చేరారు.
స్వియాటెక్ 6–2, 7–5తో పెట్ర మార్టిచ్ (క్రొయేషియా)ను వరుస సెట్లలో ఓడించగా, స్వితోలినా 7–6 (7/3), 6–2తో మాజీ ఆ్రస్టేలియా చాంప్ సోఫియా కెనిన్ (అమెరికా)ను కంగుతినిపించింది. మారి బౌజ్కొవా (చెక్ రిపబ్లిక్) ఐదో సీడ్ కరోలిన్ గార్సియా (ఫ్రాన్స్)కు షాకిచ్చింది. చెక్ అమ్మాయి 7–6 (7/0), 4–6, 7–5తో సీడెడ్ ప్లేయర్ గార్సియాను మూడో రౌండ్లోనే ఇంటిదారి పట్టించింది. 14వ సీడ్ బెన్సిక్ 6–3, 6–1తో మగ్ద లినెటి (పోలాండ్)పై సునాయాస విజయంతో ముందంజ వేసింది.
బోపన్న జోడీ శుభారంభం
భారత వెటరన్ స్టార్ రోహన్ బోపన్న పురుషుల డబుల్స్‌లో శుభారంభం చేశాడు. ఆస్ట్రేలియన్ మాథ్యూ ఎబ్డెన్‌తో జోడీకట్టిన బోపన్న ఆరో సీడ్ జంటగా బరిలోకి దిగింది. తొలిరౌండ్లో భారత్–ఆసీస్ జోడీ 6–2, 6–7 (5/7), 7–6 (10/8)తో గులెర్మో డ్యురన్– థామస్ ఎచెవెరీ (అర్జెంటీనా) జంటపై చెమటోడ్చి గెలిచింది.
Comments
Please login to add a commentAdd a comment