ప్రిక్వార్టర్స్‌లోకి టాప్ సీడ్
మూడో సీడ్ కోకో గాఫ్ కూడా
పారిస్: రెండో రౌండ్‌లో ఓటమి అంచుల్లో నుంచి గట్టెక్కిన పోలాండ్ టెన్నిస్ స్టార్ ఇగా స్వియాటెక్ మూడో రౌండ్‌లో మాత్రం అలవోకగా గెలిచింది. ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో వరుసగా ఆరో ఏడాది ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. ఇప్పటికే ఈ టోర్నీలో మూడుసార్లు విజేతగా నిలిచిన స్వియాటెక్ శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ మూడో రౌండ్‌లో 6–4, 6–2తో మేరీ బుజ్కోవా (చెక్ రిపబ్లిక్)పై గెలిచింది.
టాప్ సీడ్ హోదాలో బరిలోకి దిగిన ప్రపంచ నంబర్‌వన్ స్వియాటెక్ ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి సర్విస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. 34 విన్నర్స్ కొట్టిన ఆమె కేవలం ఎనిమిది అనవసర తప్పిదాలు చేసింది.
ఇతర మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో మూడో సీడ్ కోకో గాఫ్ (అమెరికా) 6–2, 6–4తో డయానా యెస్‌ట్రెమ్‌స్కా (ఉక్రెయిన్)పై, ఐదో సీడ్ వొండ్రుసోవా (చెక్ రిపబ్లిక్) 6–1, 6–3తో చోల్ పాక్వెట్ (ఫ్రాన్స్)పై, ఎనిమిదో సీడ్ ఆన్స్ జబర్ (ట్యునీషియా) 6–4, 7–6 (7/5)తో లేలా ఫెర్నాండెజ్ (కెనడా)పై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు.
సినెర్ ముందంజ...
పురుషుల సింగిల్స్ విభాగంలో ఈ ఏడాది ఆ్రస్టేలియన్ ఓపెన్ చాంపియన్, ప్రపంచ రెండో ర్యాంకర్ యానిక్ సినెర్ (ఇటలీ) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. సినెర్ మూడో రౌండ్‌లో 6–4, 6–4, 6–4తో కొటోవ్ (రష్యా)ను ఓడించాడు. ఆరో సీడ్ రుబ్లెవ్ (రష్యా) మాత్రం మూడో రౌండ్‌లోనే నిష్క్రమించాడు. అర్నాల్డి (ఇటలీ) 7–6 (8/6), 6–2, 6–4తో రుబ్లెవ్‌ను ఇంటిదారి పట్టించాడు.
బాలాజీ జోడీ గెలుపు
పురుషుల డబుల్స్‌లో శ్రీరామ్ బాలాజీ (భారత్)–మిగెల్ వరేలా (మెక్సికో) జోడీ రెండో రౌండ్‌కు చేరింది. తొలి రౌండ్‌లో బాలాజీ–వరేలా ద్వయం 6–3, 6–4తో రీస్ స్టాల్‌డెర్ (అమెరికా)–సెమ్ వీర్‌బీక్ (నెదర్లాండ్స్) జంటను ఓడించింది. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో యూకీ బాంబ్రీ (భారత్)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) జోడీ 3–6, 6–7 (5/7)తో జాన్ పీర్స్ (ఆ్రస్టేలియా)–సఫీయులిన్ (రష్యా) జంట చేతిలో ఓడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment